‘ఇట్స్ కమింగ్ హోమ్’...! ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ ఒక్కో విజయం సాధిస్తున్న కొద్దీ కప్పు తమదేనంటూ ఆ దేశంలో మార్మోగుతున్నదీ పాట. వారికిదో జాతీయ గీతమైపోయింది కూడా. జట్టు ఫైనల్‌కు చేరకముందే దేశ వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. జనం టీవీలకు అతుక్కుపోయారు. ఆ దేశ టెస్టు క్రికెట్ జట్టు కెప్టెన్ జో రూట్ అయితే... తమ దృష్టంతా భారత్‌తో వన్డే సిరీస్ మీద కాక ఫుట్‌బాల్ సెమీఫైనల్ పైనే ఉందన్నాడు. అభిమానులు మరింత ముందడుగేసి ఆదివారం వింబుల్డన్ టెన్నిస్ టోర్నీ వేళలు మార్చాలని, సంబరాలు జరుపుకోవడానికి సోమవారం ఏకంగా సెలవు ప్రకటించాలని డిమాండ్ చేసేశారు. కానీ ఈ కలంతా చెదిరింది. కలతే మిగిలింది.
తమ చిన్న దేశానికీ ఒక జట్టుందని, అది ఈ స్థాయిలో ఆడుతుందని ఊహించని సగటు అభిమానికి క్రొయేషియా మాంచి కిక్ ఇచ్చింది. గోల్ మీద గోల్ కొట్టి లీగ్ దశలో అర్జెంటీనాను మట్టికరిపించి... ఒత్తిడిని ఓడించి డెన్మార్క్, రష్యాలను వరుసపెట్టి ‘పెనాల్టీ నాకౌట్’ చేసి... సెమీస్‌లో ఇంగ్లండ్‌పై శక్తికి మించి పోరాడి అద్భుతమే చేసింది. తమ చరిత్రలోనే గొప్పదనదగ్గ విజయంతో ప్రపంచ కప్‌లో తొలిసారి ఫైనల్ చేరింది. ఆదివారం టైటిల్ పోరులో ఫ్రాన్స్‌కు సవాల్ విసిరింది.
మాస్కో :అంచనాలు లేకుండా వచ్చి, ఉత్కంఠను అధిగమిస్తూ ఒక్కో మ్యాచ్ నెగ్గుతూ వస్తున్న క్రొయేషియా... అంతే సంచలన రీతిలో ఇంగ్లండ్‌కు షాకిచ్చిం ది. బుధవారం అర్ధరాత్రి ఇక్కడి లుజ్నికి స్టేడియంలో జరిగిన ఫుట్‌బాల్ ప్రపంచ కప్ రెండో సెమీఫైనల్లో ఆ జట్టు 2–1 తేడాతో మాజీ చాంపియన్‌ను ఓడించి ఇంటికి పంపింది. అంతకుముందు రెండు పెనాల్టీ షూటౌట్ మ్యాచ్‌లు ఆడినా, ఈసారి యువకులతో నిండిన ప్రత్యర్థితో తలపడుతున్నా, కనీసం సబ్‌స్టిట్యూట్‌ను కూడా దింపకుండా ఏకబిగిన 90 నిమిషాల పాటు ఒకే జట్టును కొనసాగించిన క్రొయేషియా తమ శ్రమకు తగ్గ ఫలితం పొందింది. పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలిచిన కీరన్ ట్రిప్పియర్ (5వ నిమిషం) ఇంగ్లండ్ ఖాతా తెరవగా..., ఇవాన్ పెరిసిచ్ (68వ ని.), మాన్‌జుకిచ్ (109వ ని.) గోల్స్ కొట్టి క్రొయేషియాకు విజయం అందించారు.
ఆరంభంలోనే ఆధిక్యం ఇచ్చినా...
వేలాదిగా హాజరైన అభిమానుల మద్దతు మధ్య మైదానంలో దిగిన ఇంగ్లండ్‌కు... అందుకు తగ్గట్లే ఆరంభంలోనే గోల్ దక్కింది. క్రొయేషియా కెప్టెన్ మోడ్రిచ్ ఫౌల్ చేయడంతో లభించిన ఫ్రీ కిక్‌ను ట్రిప్పియర్ 20 గజాల దూరం నుంచి నెట్‌లోకి పంపి ఆధిక్యం అందించాడు. దీన్నుంచి తేరుకున్న క్రొయేషియా ప్రతి దాడులకు దిగింది. ఓ దశలో గోల్ చేసినంత పనిచేసింది. అయితే రక్షణ శ్రేణి లోపాలతో పదేపదే తప్పులు చేసింది. ఈ క్రమంలో ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ కేన్ చక్కటి అవకాశాన్ని జారవిడిచాడు. సరిగ్గా గోల్‌పోస్ట్ ముందున్న అతడు బంతిని నేర్పుగా నెట్‌లోకి కొట్టలేకపోయాడు.
ఖాతా తెరిచి... విరుచుకుపడి
ఇరు జట్ల ఆటగాళ్లు వెంటవెంటనే ఎల్లో కార్డులు ఎదుర్కొనడంతో రెండో భాగం పోటాపోటీగా ప్రారంభమైంది. గోల్‌పోస్ట్ ముందు కేన్‌కు దక్కిన మరో అవకాశాన్ని బంతిని పక్కకునెట్టి లోవ్రెన్ నిర్వీర్యం చేశాడు. బాక్స్ ఏరియా ఆవల చాలా చాన్స్‌లు దొరికినా వ్యూహంతో కదలక చేజార్చుకున్న క్రొయేషియా... ఎట్టకేలకు 68వ నిమిషంలో సఫలమైంది. సైమ్ వాల్జ్‌కో అందించిన క్రాస్‌ను పెరిసిచ్ పొరపాటు లేకుండా హెడర్‌తో నెట్‌లోకి చేర్చాడు. తర్వాత ఒక్కసారిగా ఆ జట్టు విజృంభించడంతో ఆటే మారిపోయింది. పదేపదే దాడులతో ఇంగ్లండ్‌ను బెంబేలెత్తించింది. పెరిసిచ్ కొట్టిన ఓ షాట్ చివరి క్షణంలో గోల్ బార్‌ను తగిలి పక్కకు పోయింది. నిర్ణీత సమయం ముగిసేసరికి స్కోరు సమం కావడంతో అదనపు అరగంట తప్పలేదు. టోర్నీలో జట్టుకు వెన్నెముకలా నిలిచిన కీపర్ జోర్డాన్ పిక్‌ఫోర్డే ఈసారి ఉదాసీనతతో ఇంగ్లండ్ కొంపముంచాడు. సాధారణ పాస్‌తో బంతిని అందుకుని 109వ నిమిషంలో గోల్‌పోస్ట్ ముందుకు వచ్చిన మాన్‌జుకిచ్ కొట్టిన షాట్... పిక్‌ఫోర్డ్ నిర్లిప్తతతో నెట్‌లోకి వెళ్లిపోయింది. సబ్‌స్టిట్యూట్ అవకాశాలు అయిపోయి, గాయంతో ట్రిప్పర్ మైదానం వీడటంతో చివర్లో ఇంగ్లండ్ 10 మందితోనే ఆడాల్సి వచ్చింది. మరో గోల్‌కు కూడా వీలు చిక్కకపోవడంతో ఆ జట్టు పరాజయ భారంతో మైదానం వీడింది.
►వరల్డ్‌కప్ చరిత్రలో ఇప్పటివరకు ఫైనల్ చేరిన జట్లలో క్రొయేషియా (20)దే పెద్ద ర్యాంకు. ఈ టోర్నీ మరో ఫైనలిస్టు ఫ్రాన్స్ 1998 వరల్డ్ కప్‌లో 18వ ర్యాంకుతో బరిలో దిగి టైటిల్ నెగ్గడం విశేషం.
►‘ఇట్స్ కమింగ్ హోమ్’ ఉంటూ ఉర్రూతలూగిన ఇంగ్లండ్ అభిమానులపై ప్రపంచ వ్యాప్తంగా వ్యంగ్య బాణాలు మొదలయ్యాయి. ‘ఎస్...ఇంగ్లండ్ కమింగ్ హోమ్’ అంటూ అన్ని వైపులనుంచి జనం విసుర్లతో విరుచుకు పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment