
సెరెనా అరుదైన మైలురాయి
గతేడాది క్యాలెండర్ గ్రాండ్ స్లామ్ను సాధించడంలో తృటిలో కోల్పోయిన టాప్ సీడ్ క్రీడాకారిణి, నల్ల కలువ సెరెనా విలియమ్స్ తాజాగా అరుదైన మైలురాయిని సొంతం చేసుకుంది.
లండన్: గతేడాది క్యాలెండర్ గ్రాండ్ స్లామ్ను సాధించడంలో తృటిలో కోల్పోయిన టాప్ సీడ్ క్రీడాకారిణి, నల్ల కలువ సెరెనా విలియమ్స్ తాజాగా అరుదైన మైలురాయిని సొంతం చేసుకుంది. వింబుల్డన్ గ్రాండ్ స్లామ్లో భాగంగా ఆదివారం జరిగిన మూడో రౌండ్లో విజయం సాధించి మూడు వందల గ్రాండ్ స్లామ్ విజయాలను తన ఖాతాలో వేసుకుంది. తద్వారా ఆల్ టైమ్ గ్రాండ్ స్లామ్ జాబితాలో అత్యధిక విజయాలు సాధించిన రెండో క్రీడాకారిణిగా నిలిచింది. దీంతో ఓపెన్ ఎరాలో అత్యధిక విజయాలతో తొలిస్థానంలో ఉన్న మార్టినా నవ్రతిలోవా(306)ను చేరేందుకు కొద్ది దూరంలో నిలిచింది
ఇదిలా ఉండగా తాజా విజయంతో 82 వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ విజయాలను సెరెనా ఖాతాలో వేసుకుంది. సరిగ్గా ఏడాది క్రితం వింబుల్డన్ గెలిచాక తన గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సంఖ్యను 21కు పెంచుకున్న సెరెనా.. మరో టైటిల్ గెలిస్తే ఆల్‌టైమ్ రికార్డు స్టెఫీగ్రాఫ్‌ను సమం చేస్తుంది.
ఈరోజు జరిగిన మూడో రౌండ్లో సెరెనా 6-3, 6-0 తేడాతో అన్నికా బెక్(జర్మనీ)పై గెలిచి ప్రిక్వార్టర్స్కు చేరింది. ఆద్యంత ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో సెరెనా ఏడు ఏస్లు సంధించింది. ఈ పోరును కేవలం 51 నిమిషాల్లో ముగించిన సెరెనా.. తన తదుపరి పోరులో 13వ సీడ్ స్వెత్లెనా కుజ్నెత్సోవా (రష్యా)తో తలపడనుంది. గతేడాది వరుసగా ఆస్ట్రేలియా, ఫ్రెంచ్, వింబుల్డన్ లను గెలిచిన సెరెనా, యూఎస్ ఓపెన్ లో చతికిలబడింది. దీంతో క్యాలండర్ గ్రాండ్ స్లామ్ సాధించే అవకాశాన్ని కోల్పోయింది. అయితే ఈ ఏడాది జరిగిన రెండు గ్రాండ్ స్లామ్ ల్లో సెరెనా ఆకట్టుకున్నా, టైటిల్ సాధించడంలో విఫలమైంది.