సెరెనా...ఈసారైనా! | Serena Williams reaches US Open final and will face Bianca Andreescu | Sakshi
Sakshi News home page

సెరెనా...ఈసారైనా!

Published Sat, Sep 7 2019 4:36 AM | Last Updated on Wed, Sep 18 2019 2:58 PM

 Serena Williams reaches US Open final and will face Bianca Andreescu - Sakshi

సెరెనా విలియమ్స్‌, బియాంకా ఆండ్రీస్కూ

2017 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌... అమెరికా టెన్నిస్‌ దిగ్గజం సెరెనా విలియమ్స్‌ గెలిచిన 23వ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ. ఆ తర్వాత అమ్మగా మారిన ఆమె మరో గ్రాండ్‌స్లామ్‌ గెలిచి ఆల్‌టైమ్‌ గ్రేట్‌గా నిలిచే ప్రయత్నంలో పోరాటం ఆపలేదు. ఈ క్రమంలో మూడు సార్లు గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో ఫైనల్‌ చేరినా సెరెనాకు వరుస సెట్‌లలో ఓటమి తప్పలేదు. ఇప్పుడు సొంతగడ్డపై మరోసారి తుది పోరుకు అర్హత సాధించిన ఈ స్టార్‌ గెలుపు గీత దాటుతుందా? 24 టైటిల్స్‌తో మార్గరెట్‌ కోర్ట్‌ సరసన నిలుస్తుందా? సెరెనాకు, రికార్డుకు మధ్యలో కెనడా టీనేజర్‌ బియాంకా ఆండ్రీస్కూ నిలిచింది. ఆటలోనూ, అనుభవంలోనూ సెరెనాతో పోలికే లేని ఆండ్రీస్కూ సంచలనం సాధించగలదా? వీరిద్దరి మధ్య నేడు ఫైనల్‌ పోరుకు రంగం సిద్ధమైంది. అంతకుముందు సెమీఫైనల్స్‌లో సెరెనా అలవోకగా స్వితోలినాను చిత్తు చేయగా... బియాంక కొంత పోరాడి బెలిండా బెన్సిచ్‌ను మట్టికరిపించింది.
 

సెరెనా, ఆండ్రీస్కూ మధ్య ఒకే ఒక మ్యాచ్‌ జరిగింది. గత నెలలో టొరంటోలో జరిగిన రోజర్స్‌ కప్‌ ఫైనల్లో వీరిద్దరు తలపడ్డారు. ఆండ్రీస్కూ 3–1తో ఆధిక్యంలో ఉన్న దశలో సెరెనా వెన్నునొప్పితో తప్పుకోవడంతో సొంతగడ్డపై ఆండ్రీస్కూను విజయం వరించింది.  

న్యూయార్క్‌: మాజీ వరల్డ్‌ నంబర్‌వన్, అమెరికా స్టార్‌ సెరెనా విలియమ్స్‌ 10వ సారి యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్లోకి అడుగు పెట్టింది. గతంలో ఆరు సార్లు ఇక్కడ విజేతగా నిలిచిన ఆమె ఏడో టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచింది. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన సెమీఫైనల్లో సెరెనా 6–3, 6–1తో ఐదో సీడ్‌ ఎలీనా స్వితోలినా (ఉక్రెయిన్‌)ను చిత్తు చేసింది.

నేడు జరిగే ఫైనల్లో సెరెనా... కెనడా టీనేజర్, 15వ సీడ్‌ బియాంకా ఆండ్రీస్కూతో తలపడుతుంది. రెండో సెమీస్‌లో ఆండ్రీస్కూ 7–6 (7/3), 7–5తో 13వ సీడ్‌ బెలిండా బెన్సిచ్‌ (స్విట్జర్లాండ్‌)పై విజయం సాధించింది. గతంలో ఆడిన రెండు గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలలో (2019 ఆస్ట్రేలియన్‌ ఓపెన్, వింబుల్డన్‌) రెండో రౌండ్‌ కూడా దాటని ఆండ్రీస్కూ తొలిసారి గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌ ఆడబోతుండటం విశేషం.  

70 నిమిషాల్లో ముగిసె...
క్వార్టర్స్‌లో కియాంగ్‌ వాంగ్‌ను 44 నిమిషాల్లోనే చిత్తు చేసిన సెరెనా సెమీస్‌లో మాత్రం మరికొంత సమయం తీసుకుంది. తొలి సెట్‌ మొదటి గేమ్‌లో స్వితోలినా మూడు బ్రేక్‌ పాయింట్లు సాధించి జోరుగా మొదలు పెట్టినట్లు కనిపించింది. అయితే వెంటనే కోలుకున్న సెరెనా చెలరేగి 3–0తో ముందంజ వేసింది. తర్వాతి గేమ్‌ను ప్రత్యర్థి గెలుచుకున్నా సెరెనా తన సర్వీస్‌ను నిలబెట్టుకొని 4–1తో ఆధిక్యం ప్రదర్శించింది. పదే పదే నెట్‌పైకి దూసుకొచ్చి (6 నెట్‌ పాయింట్లు) ప్రత్యర్థిపై చెలరేగిన సెరెనా 41 నిమిషాల్లో సెట్‌ గెలుచుకుంది.

రెండో సెట్‌ లో స్వితోలినా ఆట ముగించేందుకు సెరెనాకు 29 నిమిషాలు సరిపోయాయి. డబుల్‌ బ్రేక్‌తో 5–1కి దూ సుకుపోయిన అమెరికా ప్లేయర్‌ చివ రకు బ్యాక్‌హ్యాండ్‌ విన్నర్‌తో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. మొత్తం 34 విన్నర్లు కొట్టిన సెరెనా 6 ఏస్‌లతో తన పదును చూపించింది. ఆమె 20 అనవసర తప్పిదాలు చేసినా చివరకు ఫలితంపై ప్రభావం పడలేదు. తాజా విజయంతో యూఎస్‌ ఓపెన్‌లో అత్యధిక విజయాల (101) క్రిస్‌ ఎవర్ట్‌ రికార్డును సెరెనా సమం చేసింది.  

హోరాహోరీగా...
బియాంకా ఆండ్రీస్కూ, బెన్సిచ్‌ మధ్య పోరు ఆసక్తికరంగా సాగింది. ఇద్దరూ దూకుడుగా ఆడుతూ తమ సర్వీస్‌లను నిలబెట్టుకోవడంతో గేమ్‌లు సమమవుతూ వచ్చి స్కోరు 4–4కు చేరింది. తొమ్మిదో గేమ్‌ను గెలిచి 5–4తో ఆధిక్యంలో నిలిచిన బెన్సిచ్‌ వరుస తప్పిదాలతో సెట్‌ గెలిచే అవకాశాన్ని చేజార్చుకుంది. టైబ్రేక్‌లో ఆండ్రీస్కూ 5–0తో దూసుకుపోయింది. బెన్సిచ్‌ వరుసగా మూడు పాయింట్లు గెలిచి ప్రత్యర్థి ఆధిక్యాన్ని 5–3కు తగ్గించినా కెనడా యువతార మళ్లీ అవకాశం ఇవ్వకుండా సెట్‌ను ముగించింది.

రెండో సెట్‌లోనైతే ఒక దశలో 4–1తో, ఆ తర్వాత 5–2తో ఆధిక్యంలో నిలిచినా... చివరకు బెన్సిచ్‌ ఓటమిపాలవ్వడం గమనార్హం. ఈ దశలో కోలుకున్న ఆండ్రీస్కూ ఒక్కసారిగా పదునైన బ్యాక్‌హ్యాండ్‌ షాట్‌లతో విరుచుకుపడింది. ఒత్తిడికి లోనై వరుసగా డబుల్‌ ఫాల్ట్‌లు, అనవసర తప్పిదాలతో ప్రత్యర్థికి తన వైపు నుంచి ఉపకారం చేసి స్విస్‌ క్రీడాకారిణి ఓటమిని ఆహ్వానించింది. వరుసగా ఐదు గేమ్‌లు గెలుచుకొని ఆండ్రీస్కూ ఫైనల్‌ చేరింది. 2 గంటల 12 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో బియాంకా 40 విన్నర్స్‌ కొట్టగా,
బెన్సిచ్‌ 16 విన్నర్లకే పరిమితమైంది.   

మరోసారి ఫైనల్‌కు చేరడం సంతోషంగా ఉంది. నేను నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వకపోయినా మ్యాచ్‌ గెలవగలిగాను. నెట్‌పైకి పదే పదే ఎందుకు వెళ్లానో నాకే అర్థం కాలేదు. ఇకపై అలా జరగదు. అసలు బేస్‌లైన్‌ నుంచే ఆడాల్సింది. క్రిస్‌ ఎవర్ట్‌తో ఏ రూపంలోనైనా సమంగా నిలవడం గర్వపడే విషయం. అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ గెలిచిన రికార్డు అందుకున్నా సరే నేను ఆటను కొనసాగించేదాన్ని. అందుకోసం నాకు గతంలో అవకాశాలు వచ్చాయి. ఇకపై కూడా వస్తాయి. కాబట్టి అతిగా ఆలోచించను. నా సుదీర్ఘ కెరీర్‌ను చూస్తే తరం మారిపోయినట్లనిపిస్తోంది. ఇన్నేళ్లలో నేను ఆడిన, ఓడించిన వారిని చూస్తే ఒక అద్భుతంలా కనిపించింది. ఈ ఏడాదిలోని తొలి మూడు గ్రాండ్‌స్లామ్‌లతో పోలిస్తే ఈ టోర్నీకి బాగా సన్నద్ధమై వచ్చాను. నా ప్రత్యర్థి ఆండ్రీస్కూకు వేర్వేరు షాట్‌లను వేర్వేరు రకాలుగా ఆడగల సత్తా ఉంది. వ్యక్తిగతంగా కూడా ఆమె చాలా మంచి అమ్మాయి. ఫైనల్‌ కోసం సిద్ధంగా ఉన్నా.     
–సెరెనా విలియమ్స్‌  

సంవత్సరం క్రితం ఎవరైనా నేను యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్‌ చేరతానని చెబితే వారిని పిచ్చోళ్లుగా భావించేదానిని. నా ఈ విజయాన్ని నమ్మలేకపోతున్నాను. అంతా కలలా ఉంది. ఈ దశకు చేరేందుకు చాలా కష్టపడ్డాను. సెమీస్‌లో కూడా చాలా బాగా ఆడిన నాకు ఫైనల్‌ చేరే అర్హత ఉందని నమ్ముతున్నా. సెరెనా రిటైర్‌ అయ్యేలోగా ఆమెతో గ్రాండ్‌స్లామ్‌లలో తలపడాలని ఉందంటూ నా సన్నిహితులతో ఎప్పుడూ చెబుతుండేదానిని. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. నేను ఎంతో ఉత్సాహంగా ఫైనల్‌ కోసం ఎదురు చూస్తున్నా. ఆమె తన అత్యుత్తమ ఆటతీరు కనబరుస్తుందని నాకు తెలుసు. నేనూ అదే విధంగా పోరాడతా. మేమిద్దరం తలపడిన గత మ్యాచ్‌లో ఆడిన నాలుగు గేమ్‌లు ఇప్పుడు స్ఫూర్తినిస్తాయని అనుకుంటున్నా.
–బియాంకా ఆండ్రీస్కూ  

► సెరెనా టైటిల్‌ గెలిస్తే అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్స్‌తో మార్గరెట్‌ కోర్ట్‌ (24–ఆస్ట్రేలియా) పేరిట ఉన్న రికార్డు సమమవుతుంది. యూఎస్‌ ఓపెన్‌ను ఎక్కువసార్లు గెలుచుకున్న క్రీడాకారిణిగా క్రిస్‌ ఎవర్ట్‌ (7)తో కూడా సమంగా నిలుస్తుంది.  

► ఆండ్రీస్కూ ఇప్పటి వరకు టాప్‌–10లోపు క్రీడాకారిణులతో  ఏడుసార్లు తలపడితే ఏడు సార్లూ ఆమెనే విజయం వరిచండం విశేషం. సెరెనా ప్రస్తుత ర్యాంక్‌ 8.

► సెరెనా 23వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ నెగ్గిన తర్వాత మూడుసార్లు ‘గ్రాండ్‌’ ఫైనల్స్‌కు చేరింది. 2018 వింబుల్డన్‌ ఫైనల్లో కెర్బర్‌ (జర్మనీ) చేతిలో... 2018 యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్లో నయోమి ఒసాకా (జపాన్‌) చేతిలో.. 2019 వింబుల్డన్‌ ఫైనల్లో సిమోనా హలెప్‌ (రొమేనియా) చేతిలో సెరెనా వరుస సెట్‌లలో ఓడిపోయింది.  

► 1997లో వీనస్‌ విలియమ్స్‌ తొలిసారి యూఎస్‌ ఓపెన్‌ బరిలోకి దిగినప్పుడే ఫైనల్‌ వరకు చేరింది. ఇప్పుడు బియాంకా కూడా అదే ఘనత సాధించింది.  ఏడాది క్రితం ఇదే సమయంలో 200లోపు ర్యాంక్‌లో కూడా లేని ఆండ్రీస్కూ గతేడాది యూఎస్‌ ఓపెన్‌ క్వాలిఫయింగ్‌ తొలిరౌండ్‌లోనే ఓడింది.  

► యూజిన్‌ బుషార్డ్‌ (2014 వింబుల్డన్‌) తర్వాత గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌ చేరిన రెండో కెనడా ప్లేయర్‌ ఆండ్రీస్కూ.

► ఆండ్రీస్కూ పుట్టిన తేదీ 16 జూన్‌ 2000. ఆండ్రీస్కూ పుట్టకముందే సెరెనా ఒకసారి యూఎస్‌ ఓపెన్‌ (1999లో) టైటిల్‌ కూడా సాధించేయడం విశేషం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement