చరిత్రకు చేరువలో... | Serena Williams a Win Away from All-Time Grand Slam Glory | Sakshi
Sakshi News home page

చరిత్రకు చేరువలో...

Published Sat, Sep 8 2018 12:48 AM | Last Updated on Sat, Sep 8 2018 4:56 AM

Serena Williams a Win Away from All-Time Grand Slam Glory - Sakshi

ఒకరేమో దిగ్గజం... మరొకరేమో అనామకురాలు... ఒకరి ఖాతాలో 23 గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్స్‌ ఉంటే... మరొకరికి కెరీర్‌లోనే తొలి గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌. ఒకరు గెలిస్తే అత్యధిక సింగిల్స్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ నెగ్గిన ప్లేయర్‌గా రికార్డు సమమవుతుంది... మరొకరు నెగ్గితే తమ దేశం తరఫున తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ గెలిచిన క్రీడాకారిణిగా కొత్త చరిత్ర లిఖిస్తుంది. ఎవరు విజయం సాధించినా నయా చరిత్ర నమోదయ్యే నేపథ్యంలో... అపార అనుభవజ్ఞురాలు సెరెనా విలియమ్స్‌... జపాన్‌ యువ సంచలనం నయోమి ఒసాకా మధ్య యూఎస్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ ఫైనల్‌కు రంగం సిద్ధమైంది.   

న్యూయార్క్‌: ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకుండా పట్టుదలతో ఆడిన అమెరికా టెన్నిస్‌ స్టార్‌ సెరెనా విలియమ్స్‌ తొమ్మిదోసారి యూఎస్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో 17వ సీడ్‌ సెరెనా 6–3, 6–0తో 19వ సీడ్‌ అనస్తాసియా సెవస్తోవా (లాత్వియా)ను ఓడించి జపాన్‌ అమ్మాయి నయోమి ఒసాకాతో నేడు జరిగే టైటిల్‌ పోరుకు సిద్ధమైంది. 66 నిమిషాలపాటు జరిగిన సెమీస్‌లో సెరెనాకు ఆరంభంలో కాస్త పోటీ లభించింది. కానీ ఒక్కసారి సెరెనా లయలోకి వచ్చాక ప్రత్యర్థి చేతులెత్తేసింది. తొలి సెట్‌ తొలి గేమ్‌లోనే సెరెనా సర్వీస్‌ను బ్రేక్‌ చేసి... తన సర్వీస్‌నూ కాపాడుకున్న సెవస్తోవా 2–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే వెంటనే పుంజుకున్న సెరెనా మూడో గేమ్‌లో సర్వీస్‌ నిలబెట్టుకొని, నాలుగో గేమ్‌లో సెవస్తోవా సర్వీస్‌ను బ్రేక్‌ చేసి స్కోరును 2–2తో సమం చేసింది. ఆ తర్వాత మరోసారి సెవస్తోవా సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన సెరెనా తన సర్వీస్‌లను నిలబెట్టుకొని తొలి సెట్‌ను సొంతం చేసుకుంది. రెండో సెట్‌లో సెరెనా మరింత జోరు పెంచగా... సెవస్తోవా డీలా పడిపోయింది. నెట్‌ వద్దకు 14సార్లు దూసుకొచ్చిన సెరెనా 11సార్లు పాయింట్లు సాధించింది. 16 విన్నర్స్‌ కొట్టిన ఆమె 13 అనవసర తప్పిదాలు చేసింది.  

ఈ గెలుపుతో 36 ఏళ్ల సెరెనా 31వసారి గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. తుది పోరులో గెలిస్తే అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్స్‌ నెగ్గిన మార్గరెట్‌ కోర్ట్‌ (ఆస్ట్రేలియా–24) పేరిట ఉన్న రికార్డును సెరెనా సమం చేస్తుంది. దాంతోపాటు ఓపెన్‌ శకంలో (1968 తర్వాత) అత్యధికంగా ఏడుసార్లు యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ నెగ్గిన ఏకైక క్రీడాకారిణిగా కొత్త చరిత్ర లిఖిస్తుంది. ప్రస్తుతం క్రిస్‌ ఎవర్ట్‌ (6 సార్లు)తో సెరెనా సమఉజ్జీగా ఉంది.  ‘ఇదంతా అద్భుతంలా అనిపిస్తోంది. ఏడాది క్రితం పాపకు జన్మనిచ్చే సమయంలో మృత్యువుతో పోరాడాను. సంవత్సరం తిరిగేలోపే వరుసగా రెండో గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌ ఆడుబోతున్నాను.ఈ ఏడాది మార్చిలో ఒసాకాతో ఆడిన ఏకైక మ్యాచ్‌లో ఆమె చేతిలో ఓడిపోయాను. కానీ నేనప్పుడు పూర్తి ఫామ్‌లో లేను’’ అని సెరెనా వ్యాఖ్యానించింది.  

13 బ్రేక్‌ పాయింట్లు కాపాడుకొని... 
మరో సెమీఫైనల్లో 20 ఏళ్ల నయోమి ఒసాకా 6–2, 6–4తో 14వ సీడ్‌ మాడిసన్‌ కీస్‌ (అమెరికా)పై విజయం సాధించింది. ఈ విజయంతో ఒసాకా తన కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో ఫైనల్‌కు చేరింది. అంతేకాకుండా ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో ఫైనల్‌కు అర్హత సాధించిన తొలి జపాన్‌ క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. గతేడాది యూఎస్‌ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన కీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒసాకా ఏకంగా 13 సార్లు బ్రేక్‌ పాయింట్స్‌ను కాపాడుకోవడం విశేషం. గంటా 25 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఒసాకా తన ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్‌ చేసింది. 13 బ్రేక్‌ పాయింట్లు ఎలా కాపాడుకున్నారని విజయానంతరం ఒసాకాను ప్రశ్నించగా... సెరెనాతో ఎలాగైనా ఫైనల్‌ ఆడాలనే ఆలోచనే వాటిని కాపాడుకునేలా చేసిందని సమాధానం ఇచ్చింది. 1997 అక్టోబర్‌ 16న జపాన్‌లో జన్మించిన నయోమి ఒసాకా మూడేళ్ల వయసులో వారి కుటుంబం అమెరికాకు వలస వెళ్లి అక్కడే స్థిరపడింది.  

► రాత్రి గం. 1.30 నుంచి  స్టార్‌ స్పోర్ట్స్‌ సెలెక్ట్‌–1లో ప్రత్యక్ష ప్రసారం 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement