న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్ర దాడి నేపథ్యంలో ప్రపంచ కప్‌లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌ను బహిష్కరించాలన్న డిమాండ్లపై క్రికెట్ పాలకుల మండలి (సీఓఏ) ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. శుక్రవారం సమావేశమైన సీఓఏ ఈ అంశంపై చర్చకే పరిమితమైంది. మరోవైపు పాక్‌తో మ్యాచ్ ప్రస్తావన లేకుండానే... ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశాలతో సంబంధాలను తెంచుకోవాలని కోరుతూ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కి లేఖ రాసింది. ‘మ్యాచ్‌కు ఇంకా చాలా సమయం ఉంది. దీనిపై ప్రభుత్వంతో సంప్రదించిన తర్వాత నిర్ణయం ప్రకటిస్తాం. ఐసీసీకి పంపిన మెయిల్‌లో ఉగ్ర దాడి పరిణామాలు పొందుపర్చాం. ఆటగాళ్లు, అధికారులకు మరింత భద్రత కోరాం. ఉగ్రవాదానికి దన్నుగా నిలుస్తున్న దేశాలపై సరైన వేదికలో మాట్లాడతాం’ అని సీఓఏ చీఫ్ వినోద్ రాయ్ ప్రకటించారు. పాక్‌తో మ్యాచ్ బహిష్కరణకు సిద్ధం చేశారంటున్న ముసాయిదా లేఖ, ఇదే డిమాండ్‌తో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు రాయ్ నిరాకరించారు. ‘దయచేసి అర్థం చేసుకోండి. ఇంకా మూడు నెలల సమయం ఉంది. ప్రభుత్వం ఏం చెబితే అది చేస్తాం. ఊహాజనిత పరిస్థితిపై స్పందించలేం. మేం ఇంకా ఏ నిర్ణయానికీ రాలేదు’ అని ఆయన పేర్కొన్నారు.
ఐపీఎల్ ప్రారంభోత్సవం రద్దు...
పుల్వామా ఉగ్ర దాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు బాసటగా నిలిచేందుకు బీసీసీఐ ముందుకొచ్చింది. ఈ ఏడాది ఐపీఎల్ ప్రారంభ వేడుకలను రద్దు చేసి, తద్వారా మిగిలే మొత్తాన్ని విరాళంగా ఇవ్వాలని నిర్ణయించింది.
ఆడాలి... మళ్లీ ఓడించాలి: సచిన్
పాకిస్తాన్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తే రెండు పాయింట్లు ఉదారంగా ఇచ్చి పరోక్షంగా మేలు చేసిన వారమవుతామని, దీనికి తాను వ్యతిరేకమని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అన్నాడు. ‘ప్రపంచ కప్‌లో పాకిస్తాన్‌పై ప్రతిసారీ మనం గెలిచాం. ఈసారి కూడా ఓడించాలి. మనం మ్యాచ్ ఆడకుంటే పాయింట్లు దక్కి వారే గెలిచినట్లవుతుంది. దీనిని వ్యక్తిగతంగా నేను ఇష్టపడను’ అని సచిన్ పేర్కొన్నాడు.
ప్రభుత్వ నిర్ణయమే శిరోధార్యం
Published Sat, Feb 23 2019 12:47 AM | Last Updated on Sat, Feb 23 2019 12:47 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment