సాక్షి క్రీడా విభాగం: మీకు తెలిసిన 16 ఏళ్ల వయసు ఉన్న అమ్మాయి ఏం చేస్తూ ఉంటుంది? శ్రద్ధగా చదువుకుంటూనో లేక సరదాగా ఆటపాటల్లోనో, ఇంకా చెప్పాలంటే ఏ టిక్‌టాక్‌లోనో బిజీగా ఉంటుంది. కానీ షఫాలీ వర్మ దేశం మొత్తం ఆశలను మోస్తూ 86 వేలకు పైగా జనం మధ్యలో మైదానంలోకి దిగి ‘గార్డ్’ తీసుకుంది. గత మ్యాచ్‌ల తరహాలో ఈసారి ఆమె సఫలం కాలేదు. అంతకుముందు సునాయాస క్యాచ్‌ను వదిలేసి ప్రత్యర్థికి అవకాశం ఇచ్చిన అపరాధ భావం కూడా వెంటాడి ఉంటుంది. అందుకే ఆట ముగిశాక ఆ టీనేజర్ ఓటమి బాధను తట్టుకోలేకపోయింది. కన్నీళ్లపర్యంతమైన షఫాలీని ఓదార్చడం సహచరుల వల్ల కాలేదు. అయితే ఈ పరాజయం ఆమె ఒక్కదానిది కాదు. అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఈ ఆరు నెలల్లో షఫాలీ ఆశించిన దానికంటే అసాధారణ ప్రదర్శన కనబర్చింది. అసలు షఫాలీ ఆట లేకుండా మన టీమ్ తుది పోరు వరకు చేరేదా అనేది కూడా సందేహమే! ఎందుకంటే 5 ఇన్నింగ్స్‌లలో కలిపి షఫాలీ 163 పరుగులు చేస్తే... జట్టులో టాప్–3 బ్యాటర్లు అనదగ్గ స్మృతి, హర్మన్ కౌర్, జెమీమా కలిసి 14 ఇన్నింగ్స్‌లలో చేసిన పరుగులు 164 మాత్రమే.
►ముఖ్యంగా గత కొంత కాలంగా హర్మన్, స్మృతి ఈ ఫార్మాట్‌లో అన్నీ తామే అయి జట్టును నడిపిస్తూ వచ్చారు. మిథాలీ రాజ్‌ను అసాధారణ పరిస్థితుల్లో పక్కకు నెట్టేసిన తర్వాత వీరిద్దరే కీలకంగా మారారు. పైగా బిగ్‌బాష్ లీగ్, కియా సూపర్ లీగ్‌లలో ఆడిన అనుభవంతో వరల్డ్‌కప్‌లో వీరిపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఐదు ఇన్నింగ్స్‌లలో నాలుగు సార్లు ‘సింగిల్ డిజిట్’కే పరిమితమైన హర్మన్‌కు పుట్టిన రోజు చేదు అనుభవాన్ని మిగిల్చింది. స్మృతి ఒక్క మ్యాచ్‌లోనూ 20 దాటలేకపోయింది. (చదవండి: మన వనిత... పరాజిత)
►షఫాలీకి ముందు సంచలన టీనేజర్‌గా వెలుగులోకి వచ్చిన జెమీమాకు ఆటపై శ్రద్ధ తగ్గినట్లుంది! బంగ్లాదేశ్‌పై మాత్రమే ఫర్వాలేదనిపించిన ఆమె ఫైనల్లో ఆడిన నిర్లక్ష్యపు షాట్ చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఈ ముగ్గురూ విఫలమైన చోట విశ్వ విజేతగా నిలవాలనుకోవడం అత్యాశే అవుతుందేమో.
►బౌలింగ్‌లో భారత్ పూర్తిగా స్పిన్ బలగాన్నే నమ్ముకుంది. ప్లాన్ ‘బి’ లేకుండా మెగా టోర్నీలో ఒకే తరహా వ్యూహానికి కట్టుబడటం ఫైనల్లో నష్టం కలిగించింది. ఎంసీజీలాంటి ఫ్లాట్‌పిచ్‌పై అది పని చేయలేదు. మన పేస్ మరీ బలహీనంగా ఉండటం కూడా సమస్యగా మారింది.
►మ్యాచ్ ఫీజుల పెంపు, కాంట్రాక్ట్‌లు, అలవెన్స్‌లు, ఇతర సౌకర్యాలు అత్యుత్తమ ప్రదర్శనకు హామీ ఇవ్వలేవు. ఇకపై సీరియస్‌గా మహిళల జట్టు ఆటను కూడా సమీక్షించాల్సిన అవసరం ఉంది. మహిళల క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లాలంటే ఫైనల్లో తప్పనిసరి గెలవాలని ఏమీ లేదు. ఇప్పుడు ఉన్న జోష్‌ను, జోరును కొనసాగించేందుకు బీసీసీఐకి ఇదే సరైన సమయం. ఎన్నో కష్టాలు దాటి ఇక్కడి వరకు వచ్చాననే కథలకు ఇక గుడ్‌బై చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు మహిళల క్రికెట్‌కు కూడా ప్రపంచ స్థాయి అత్యుత్తమ సౌకర్యాలు ఉన్నాయి. ఆసీస్ విజయానికి కారణంగా చెబుతున్న బిగ్‌బాష్ లీగ్ తరహాలో ఐపీఎల్‌ను నిర్వహించడం అంత సులువు కాదు. సీనియర్ స్థాయిలో కనీసం 40 మంది అగ్రశ్రేణి ప్లేయర్లు కూడా మనకు అందుబాటులో లేరు. అయితే ఇకపై ఎక్కువ విరామం లేకుండా దేశవాళీలో కూడా వీలైనన్ని ఎక్కువ టోర్నీలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. షఫాలీ, రిచా ఘోష్‌లాంటి ప్లేయర్లు చాలెంజర్ ట్రోఫీ నుంచే వెలుగులోకి వచ్చారు.
చివరగా... తాజా పరాజయం బాధించవచ్చు. కానీ భవిష్యత్తులో మరింత ఎదిగేందుకు ఈ టోర్నీ ప్రదర్శన స్ఫూర్తిగా నిలవాలి తప్ప నిరాశగా మారిపోకూడదు. ఫైనల్ తర్వాత దిగ్గజ క్రికెటర్ బిషన్ సింగ్ బేడి చెప్పినట్లు... ‘కన్నీళ్లను ఎక్కడా బయటపడనీయవద్దు. ఓడినప్పుడైతే అసలే వద్దు’!
Comments
Please login to add a commentAdd a comment