ఐపీఎల్ మన దగ్గరే జరగాలి: సూపర్ స్టార్
తీవ్ర కరువు పరిస్థితులు వల్ల ఈసారి భారత్‌లో ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణకు పలు అడ్డంకులు ఎదురయ్యాయి. నీటి కటకట వల్ల మహారాష్ట్రలో నిర్వహించే ఐపీఎల్ మ్యాచ్‌లను వేరే రాష్ట్రాలకు తరలించాలని బొంబాయి హైకోర్టు ఆదేశాలు కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఐపీఎల్ ను విదేశాల్లో నిర్వహిస్తామని బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ సంకేతాలు ఇచ్చారు.
దీంతో ఐపీఎల్ భారత్‌లోనే నిర్వహించాలా? లేక విదేశాలకు తరలించాలా? అన్న చర్చ నడుస్తోంది. దీనిపై తాజాగా బాలీవుడ్ సూపర్ స్టార్, కోల్‌కతా నైట్‌రైడర్ షారుఖ్ ఖాన్ స్పందించాడు. ఐపీఎల్‌ను విదేశాల్లో నిర్వహించడానికి తాను వ్యతిరేకమని ఆయన తేల్చిచెప్పాడు. 'వ్యాపారపరంగా, వీక్షకుల పరంగా భారత్‌లోనే క్రికెట్‌కు ఎక్కువ ఆదరణ ఉంది. కాబట్టి ఐపీఎల్‌ను ఇక్కడే నిర్వహించాలి. ఈ టీ-20 టోర్నమెంటును భారత్‌లో మొదలైంది. భారత్‌లోనే కొనసాగాలి' అని ఆయన అన్నాడు. కరువు, ఎన్నికలు, నీటి కటకట వంటి సమస్యలను దృష్టిలో పెట్టుకొని, అందరికీ సౌకర్యకరంగా ఉండేలా దేశంలోనే ఎక్కడోచోట ఐపీఎల్ మ్యాచ్‌లను నిర్వహించవచ్చునని ఆయన చెప్పాడు.