‘శభాష్‌’ నదీమ్‌.. క్రికెట్‌లో సరికొత్త రికార్డు | Shahbaz Nadeem Breaks List A Bowling World Record  | Sakshi
Sakshi News home page

Published Thu, Sep 20 2018 8:13 PM | Last Updated on Thu, Sep 20 2018 8:24 PM

Shahbaz Nadeem Breaks List A Bowling World Record  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జార్ఖండ్‌ లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ షాబాజ్‌ నదీమ్‌ లిస్ట్‌ ఏ క్రికెట్‌ చరిత్రలో సరికొత్త రికార్డును లిఖించాడు. విజయ్‌ హజారే ట్రోఫీలో భాగంగా గురువారం రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ స్పిన్నర్‌ సంచలన స్పెల్‌తో చెలరేగాడు. దీంతో రెండు దశాబ్దాల రికార్డును తిరగరాశాడు.  పది ఓవర్లు వేసి కేవలం పదిపరుగులిచ్చి ఏకంగా ఎనిమిది వికెట్లు పడగొట్టేశాడు. నదీమ్‌ దెబ్బకు రాజస్తాన్‌ 73 పరుగులకే ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో జార్ఖండ్‌ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అతి తక్కువ పరుగులిచ్చి ఎనిమిది వికెట్లు తీసిన ఆటగాడిగా ఢిల్లీకి చెందిన రాహుల్‌ సాంగ్వి(8/15)పేరిట ఉన్న రికార్డును తాజాగా నదీమ్‌ సవరించాడు.

రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ బౌలర్‌ ఊపు చూస్తుంటే పది వికెట్లు తీసేలా కనిపించాడు కానీ మరో స్పిన్నర్‌ వికెట్‌ తీయడంతో కుదరలేదు. నదీమ్‌ తీసిన ఎనిమిది వికెట్లలో ఒక హ్యాట్రిక్‌ కూడా ఉండటం విశేషం. లిస్ట్‌ ఏ క్రికెట్‌లో ఒక మ్యాచ్‌లో ఎనిమిది వికెట్లు తీసిన జాబితాలో చమింద వాస్‌, హోల్డింగ్‌, అండర్‌వుడ్‌ లాంటి దిగ్గజాలు ఉన్నారు.  ‘చాలా సంతోషంగా ఉంది. సరికొత్త రికార్డును సృష్టించినందుకు. మ్యాచ్‌ అయ్యాక చెప్పారు. రెండు దశాబ్దాల రికార్డును తిరగరాశావని చెప్పినప్పుడు సంతోషంగా అనిపించింది.

హ్యాట్రిక్‌ కూడా సాధించడం డబుల్‌ హ్యాపీ. ఈ ప్రదర్శనతో జాతీయ జట్టులో చోటు దక్కించుకుంటానే నమ్మకం ఏర్పడింది. కానీ ఈ ప్రదర్శన సరిపోతుందని అనుకోవటం లేదు. ఆసియాకప్‌ సందర్బంగా జాతీయ ఆటగాళ్లకు బౌలింగ్‌ చేసే అవకాశం లభించింది. అది ఎంతగానో ఉపయోగపడింది. జాతీయ జట్టులో చోటు దక్కించుకోవడమే నా తదుపరి లక్ష్యం. దానికోసం కష్టపడుతున్నా’ అంటూ నదీమ్‌ పేర్కొన్నాడు. 29 ఏళ్ల లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ 99 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌ల్లో 375 వికెట్లు పడగొట్టాడు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement