
సిల్హెట్ (బంగ్లాదేశ్): వెస్టిండీస్ ఓపెనర్ షై హోప్ (23 బంతుల్లో 55; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) బంగ్లాదేశ్ బౌలర్లపై భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. దీంతో సోమవారం ఇక్కడ జరిగిన తొలి టి20లో విండీస్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 19 ఓవర్లలో 129 పరుగులు చేసి ఆలౌటైంది. పేసర్ షెల్డన్ కాట్రెల్ (4/28) ధాటికి విలవిల్లాడిన ఆతిథ్య జట్టును కెప్టెన్ షకీబుల్ హసన్ (43 బంతుల్లో 61; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఆదుకున్నాడు.
తర్వాత 130 పరుగుల లక్ష్యాన్ని విండీస్ కేవలం 10.5 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి ఛేదించింది. హోప్ ప్రతాపంతో విండీస్ 3.1 ఓవర్లలోనే 50 పరుగులు చేసింది. 98 పరుగుల వద్ద హోప్ నిష్క్రమించాక... మిగతా లాంఛనాన్ని నికోలస్ పూరన్ (23 నాటౌట్), కీమో పాల్ (14 బంతుల్లో 28 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్సర్లు) అంతే వేగంతో పూర్తి చేశారు. దీంతో సగం ఓవర్లు (9.1) మిగిలుండగానే మ్యాచ్ ముగిసింది. రెండో టి20 గురువారం ఢాకాలో జరుగుతుంది.