
ముంబై: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు జట్టులో చోటు దక్కకపోవడం కాస్త బాధ కలిగించిందని భారత క్రికెటర్ శిఖర్ ధవన్ పేర్కొన్నాడు. ‘ఈ విషయంలో నిరాశగానే ఉంది. అయినప్పటికీ ఆటను ఆస్వాదిస్తూ ముందుకు సాగటమే నా లక్ష్యం. ప్రస్తుత సమయాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకొని ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాల నుకుంటున్నా’ అని గబ్బర్ చెప్పుకొచ్చాడు. ఇటీవల ఆసీస్‌తో టీ20 సిరీస్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకొన్న ధవన్ ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా, ఆసీస్‌తో టెస్టు సిరీస్‌లో భారత్ మెరుగైన ప్రదర్శన చేస్తుందని ధవన్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
‘ప్రస్తుతం భారత్ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్నింటా నిలకడైన ప్రదర్శనతో ముందుకు సాగుతోంది. టెస్టు సిరీస్‌లోనూ ఇదే ప్రదర్శన కొనసాగిస్తే కచ్చితంగా ఆసీస్ గడ్డపై తొలి సిరీస్ విజయం నమోదు చేస్తుంది’ అని పేర్కొన్నాడు. మరోవైపు ఇంగ్లండ్ వేదికగా వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్‌పై దృష్టి సారించినట్లు వెల్లడించాడు. ‘ఇంగ్లండ్ పిచ్‌లపై నాకు మెరుగైన రికార్డే ఉంది. గత చాంపియన్స్ ట్రోఫీల్లో మంచి ప్రదర్శనే చేశా. ఒక్కసారి కుదురుకుంటే చాలు.. ఫలితం దానంతట అదే మన దారిలోకి వస్తుందనడాన్ని నమ్ముతా. కచ్చితంగా అదే జోరు కొనసాగించి ఈసారి ప్రపంచకప్‌తో తిరిగివస్తాం’ అని ధవన్ చెప్పుకొచ్చాడు.