
కేప్‌టౌన్: భారత్-దక్షిణాఫ్రికాలతో జరుగుతున్న తొలి టెస్టు రసవత్తరంగా సాగుతోంది. సఫారీలు తొలి ఇన్నింగ్స్‌లో 286 పరుగులకు ఆలౌటైతే, టీమిండియా తన మొదటి ఇన్నింగ్స్‌లో 209 పరుగులకు ఆలౌటైంది. అటు తరువాత రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన దక్షిణాఫ్రికా రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 65 పరుగులు చేసింది. దాంతో మూడో రోజు ప్రత్యర్థిని సాధ్యమైనంత తక్కువకు కట్టడి చేయడంపైనే భారత్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయనేది వాస్తవం.
ఇదిలా ఉంచితే, శనివారం ఆటలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా 46 ఓవర్‌ను మోర్నీ మోర్కెల్ వేశాడు. ఆ సమయంలో క్రీజ్‌లో హార్దిక్ పాండ్యా-భువనేశ్వర్ కుమార్‌లున్నారు. అయితే ఆ ఓవర్ రెండో బంతిని మోర్కెల్ ఆఫ్ స్టంప్‌పై సంధించాడు. దాన్ని వదిలి పెట్టిన హార్దిక్.. అదే సమయంలో నాన్ స్టైకింగ్ ఎండ్‌లో ఉన్న భువనేశ్వర్‌తో చేసిన ఒక సంభాషణ ఆకట్టుకుంది. 'ఏంటి..మోర్నీని దంచి కొట్టానా..చెప్పు?' అని భువీని హిందీలో అడిగాడు. దీన్ని కామెంటరీ బ్యాక్స్‌లో ఉన్న హర్షా బోగ్గే ఇంగ్లిష్‌లో అనువదించి సహచర కామెంటేటర్లకు తెలియజేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం హార్దిక్-భువీలకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.