
న్యూఢిల్లీ : వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓటమి చెందడం పట్ల ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ విచారం వ్యక్తం చేశాడు. సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్‌లను చేజార్చుకోవడం తనను నిరాశకు గురిచేసిందని వ్యాఖ్యానించాడు. ఐపీఎల్ 12 సీజన్‌లో భాగంగా సొంత గడ్డపై సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 5 వికెట్ల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. గురువారం నాటి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 129 పరుగులు చేయగా.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (41 బంతుల్లో 43; 3 ఫోర్లు, 1 సిక్స్) ఒక్కడు మాత్రమే కాస్త మెరుగ్గా ఆడాడు. ఇక ఈ మ్యాచ్‌లో రైజర్స్ బౌలర్లు అందరూ వికెట్లు పడగొట్టి తమ జట్టుకు హ్యాట్రిక్ విజయాన్ని అందించారు.
ఈ నేపథ్యంలో ఓటమిపై స్పందించిన ఢిల్లీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. ‘గత రెండు మ్యాచ్‌ల ఫలితాలు నన్ను నిరాశకు గురిచేశాయి. ముందుగా బౌలింగ్ చేయడం వల్ల వికెట్‌ను ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు పూర్తిగా అర్థం చేసుకోగలిగారు. బ్యాటింగ్‌లో వైఫల్యమే మా ఓటమికి కారణమైంది. కనీసం 150 పరుగులైనా చేసి ఉంటే ముగ్గురు స్పిన్నర్లలతో బరిలోకి దిగినందుకు కాస్తైనా పోరాడే అవకాశం ఉండేది. కానీ దురదృష్టవశాత్తు స్వల్ప వ్యవధిలోనే చాలా వికెట్లు కోల్పోయాం. టాప్ ఆర్డర్ విఫలమైంది. నాకు ఒక్కరైనా సపోర్టుగా నిలిచి ఉంటే ఫలితం వేరేలా ఉండేది. బాధ్యతగా ఆడుతున్న నన్ను..రషీద్ పెవిలియన్‌కు చేర్చాడు. రానున్న మ్యాచ్‌లలో మెరుగ్గా ఆడేందుకు ప్రయత్నిస్తాం’ అని చెప్పుకొచ్చాడు.
కాగా మంగళవారం పంజాబ్ కింగ్స్‌తో గెలవాల్సిన మ్యాచ్‌ను కూడా ఢిల్లీ చేజార్చుకోవడంతో..‘ కింగ్స్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో మళ్లీ ఢిల్లీ డేర్ డెవిల్స్‌ను చూసినట్టుంది’ దిగ్గజ ఆటగాళ్లు సహా నెటిజన్లు ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఢిల్లీ మాత్రమే ఫైనల్‌కు చేరలేదు. అయితే ఈ సీజన్‌లో కొత్త జెర్సీ.. జట్టు పేరు మార్పు తో ఎంట్రీ ఇచ్చిన ఢిల్లీ ఆట తీరు మారడం లేదంటూ విశ్లేషకులు విమర్శిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment