న్యూఢిల్లీ: టీనేజ్‌లో శ్రేయస్ అయ్యర్ ఆట ఆటకెక్కుతుంటే అతని తండ్రి పసిగట్టేశారు. అతన్ని ఓ మేటి ఆటగాడిగా చూడాలనుకున్న తండ్రి సంతోష్ అయ్యర్ వెంటనే కుమారుడిని గాడినపెట్టే పనిలో పడ్డారు. ఈ విషయాన్ని ఓ ఇంటర్వూ్యలో ఆయన వెల్లడించారు. ‘శ్రేయస్ 4 ఏళ్ల వయసులోనే బంతిని చక్కగా బాదేవాడు. అది చూసిన నాకు వాడి బ్యాటింగ్ ప్రతిభ అర్థమైంది. అందుకే వాణ్ని ఆ దిశగా తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నాం. అయితే అండర్–16 క్రికెట్ ఆడే రోజుల్లో అతని బ్యాటింగ్ గతి తప్పింది. దీన్ని ఓ కోచ్ గమనించి నా చెవిన వేశాడు. మీ అబ్బాయికి ప్రతిభ ఉంది కానీ... ఏకాగ్రతే లేకుండా పోతోంది. ఆటపై ఏమాత్రం దృష్టి సారించలేకపోతున్నాడని చెప్పాడు. నేను ఆలస్యం చేయకుండా సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్లాక అంతా సర్దుకుంది’ అని సంతోష్ అయ్యర్ తెలిపారు. అప్పట్లో తన కుమారుడు ప్రేమ మాయలో పడ్డాడో లేక సహచర దోషమోనని బెంగపట్టుకుందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు శ్రేయస్ బ్యాటింగ్ ఆర్డర్‌లో నాలుగో స్థానం ప్రశ్నార్థకానికి సమాధానంగా నిలిచాడు. 18 వన్డేల్లో 748 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 8 అర్ధసెంచరీలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment