సింధు, సిక్కి, రుత్విక
అలోర్ సెటార్ (మలేసియా): స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్ గైర్హాజరీ ప్రభావం చూపిన వేళ... తెలుగు తేజాలు పీవీ సింధు, సిక్కి రెడ్డి, గద్దె రుత్విక శివాని బాధ్యతాయుతంగా ఆడి భారత్‌ను గట్టెక్కించారు. ఫలితంగా మంగళవారం మొదలైన ఆసియా టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. హాంకాంగ్‌తో జరిగిన గ్రూప్ ‘డబ్ల్యూ’ తొలి లీగ్ మ్యాచ్‌లో భారత్ 3–2తో విజయం సాధించి దాదాపు క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది.
ఆదివారం సాయంత్రం న్యూఢిల్లీలో ఇండియా ఓపెన్ ఫైనల్ ఆడి సోమవారమే ఇక్కడకు చేరుకున్న సింధు ప్రయాణ బడలిక నుంచి తేరుకొని అద్భుత ప్రదర్శన చేసింది. తొలి సింగిల్స్‌లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ సింధు 21–12, 21–18తో 33 నిమిషాల్లో ప్రపంచ 34వ ర్యాంకర్ యిప్ పుయ్ యిన్‌ను ఓడించి భారత్‌కు 1–0 ఆధిక్యం అందించింది. డబుల్స్ మ్యాచ్‌లో అశ్విని పొన్నప్ప–ప్రజక్తా సావంత్ ద్వయం 22–20, 20–22, 12–21తో ఎన్జీ యింగ్ యుంగ్–యెయుంగ్ ఎన్గా టింగ్ జంట చేతిలో ఓడిపోవడంతో స్కోరు 1–1తో సమమైంది. మూడో మ్యాచ్‌లో తెలుగు అమ్మాయి శ్రీకృష్ణప్రియ 19–21, 21–18, 20–22తో చెయుంగ్ యింగ్ మె చేతిలో ఓటమి చెందడంతో భారత్ 1–2తో వెనుకబడింది. విజయావకాశాలు సజీవంగా ఉండాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన డబుల్స్ మ్యాచ్‌లో స్పెషలిస్ట్ సిక్కి రెడ్డికి జతగా సింధు బరిలోకి దిగింది. ఈ జంట 21–15, 15–21, 21–14తో ఎన్జీ సాజ్ యవు–యుయెన్ సిన్ యింగ్‌పై నెగ్గడంతో భారత్ స్కోరును 2–2తో సమం చేసింది. నిర్ణాయక ఐదో మ్యాచ్‌గా జరిగిన మహిళల సింగిల్స్‌లో రుత్విక శివాని 16–21, 21–16, 21–13తో యెయుంగ్ సమ్ యీపై గెలుపొందడంతో భారత్‌కు 3–2తో విజయం ఖాయమైంది. గురువారం జరిగే రెండో లీగ్ మ్యాచ్‌లో జపాన్‌తో భారత్ ఆడుతుంది. బుధవారం జరిగే మ్యాచ్‌లో హాంకాంగ్‌తో జపాన్ తలపడుతుంది.
పురుషుల జట్టు క్లీన్‌స్వీప్
ఇదే వేదికపై జరిగిన పురుషుల విభాగం గ్రూప్ ‘డి’ మ్యాచ్‌లో భారత్ 5–0తో ఫిలిప్పీన్స్‌ను చిత్తుగా ఓడించింది. పురుషుల సింగిల్స్ మ్యాచ్‌ల్లో కిడాంబి శ్రీకాంత్ 21–11, 21–12తో పెడ్రోసాపై... సాయిప్రణీత్ 21–6, 21–10తో సాల్వాడోపై... సమీర్ వర్మ 21–15, 21–12తో జాఫ్రాపై గెలుపొందారు. డబుల్స్ మ్యాచ్‌ల్లో సుమీత్ రెడ్డి–మనూ అత్రి జంట 21–15, 21–13తో కయానాన్–ఎస్కుయెటా జోడీపై.., శ్లోక్ రామచంద్రన్–అర్జున్ ద్వయం 21–18, 21–17తో మగ్నాయె–మొరాదా జంటపై గెలిచాయి. బుధవారం జరిగే మ్యాచ్‌లోమాల్దీవులుతో ఆడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment