‘భారత్‌ కెప్టెన్‌గా కోహ్లి పనికిరాడు’ | Smith Doubts Virat Kohli Captaincy Skills | Sakshi
Sakshi News home page

‘భారత్‌ కెప్టెన్‌గా కోహ్లి పనికిరాడు’

Published Tue, Jan 23 2018 5:45 PM | Last Updated on Tue, Jan 23 2018 5:45 PM

Smith Doubts Virat Kohli Captaincy Skills - Sakshi

భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కొహ్లీ

కేప్‌టౌన్‌, దక్షిణాఫ్రికా : భారత క్రికెట్‌ జట్టును ఎక్కువ కాలం ముందుకు నడిపే శక్తి సామర్ధ్యాలు విరాట్‌ కొహ్లీకి లేవని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌ గ్రేమ్‌ స్మిత్‌ అభిప్రాయపడ్డారు. వాండరర్స్‌ మైదానంలో దక్షిణాఫ్రికా భారత్‌ల మధ్య చివరి టెస్టుకు ముందు మీడియాతో ఆయన మాట్లాడారు. కొహ్లీ క్రికెట్‌ ప్రపంచంలో గొప్ప ఆటగాడే కావొచ్చని, జట్టు సభ్యుల గురించి పట్టించుకోని గొప్ప ఆటగాడు నాయకుడు ఎన్నటికీ కాలేడని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

22 ఏళ్ల వయసులో దక్షిణాఫ్రికా జట్టు కెప్టెన్‌గా పగ్గాలు అందుకున్న స్మిత్‌.. కెప్టెన్‌ అనే వ్యక్తితో జట్టులోని ఆటగాళ్లందరూ కలసి నడవాలని చెప్పారు. అందుకు నాయకుడు నిరంతరం వారి అభిప్రాయాలను తెలుసుకుంటూ ఉండటం మంచిదని చెప్పారు. భారత జట్టు డ్రెస్సింగ్‌ రూమ్‌లో కొహ్లీ మాటే వేదంలా భావిస్తున్నట్లు అనిపిస్తోందని చెప్పారు.

విరాట్‌ నిర్ణయాన్ని ఎవరూ ప్రశ్నించడం లేదని, ఒక నిర్ణయంపై డిబేట్‌ జరిగితేనే సరైన జవాబు దొరుకుతుందని అన్నారు. కొహ్లీకి చుట్టు పక్కల ఉండే వ్యక్తుల్లో ఎవరైనా ఈ పని చేయాలని చెప్పారు. అప్పుడే నిర్మాణాత్మక దిశగా సాగే ఆలోచన కొహ్లీని మచ్చలేని నాయకుడిగా తీర్చిదిద్దుతుందని అభిప్రాయపడ్డారు. ఫీల్డింగ్‌ సమయంలో కొహ్లీ రియాక్షన్స్‌ జట్టులోని ఇతర ఆటగాళ్లను నెగటివ్‌ ఆలోచనలను రేకెత్తించే ప్రమాదం ఉందని చెప్పారు.

ఈ ఏడాది విదేశీ గడ్డలపై భారత్‌ ఆడాల్సిన మ్యాచ్‌ల సంఖ్య ఎక్కువగా ఉందని, ఇది విరాట్‌పై ఒకింత ఒత్తిడిని పెంచుతుందని అన్నారు. భారత టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఎక్కువగా విరాట్‌పై ఆధారపడుతున్నామా? అనే అంశంపై ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. భారత్‌, దక్షిణాఫ్రికాల మధ్య చివరిదైన మూడో టెస్టు బుధవారం ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement