ఆస్ట్రేలియా క్రికెటర్లకు జరిమానా
క్రైస్ట్చర్చ్: న్యూజిలాండ్తో రెండు టెస్టుల సిరీస్ను క్లీన్ స్వీప్ చేసి, టెస్టు ర్యాంకింగ్స్లో నెంబర్ స్థానాన్ని సాధించినందుకు ఆస్ట్రేలియా జట్టు సంబరాలు చేసుకోగా.. అంపైర్ను దూషించినందుకు ఆ జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్, బౌలర్ హాజెల్వుడ్కు జరిమానా పడింది. ఐసీసీ ఈ ఇద్దరు క్రికెటర్లను మందలించడంతో పాటు జరిమానా విధించింది. స్మిత్కు మ్యాచ్ ఫీజులో 30 శాతం, హాజెల్వుడ్కు మ్యాచ్ ఫీజులో 15 శాతం చొప్పున జరిమానా వేసింది.
న్యూజిలాండ్తో రెండో టెస్టు నాలుగో రోజు ఆట మంగళవారం హాజెల్వుడ్ అంపైర్ మార్టినెస్ను దూషించాడు. హాజెల్వుడ్కు మద్దతుగా కెప్టెన్ స్మిత్ కూడా అంపైర్తో వాగ్వాదానికి దిగాడు. న్యూజిలాండ్ బ్యాట్స్మన్ విలియమ్సన్ 88 పరుగులు వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్నప్పుడు ఈ ఘటన జరిగింది. తన బౌలింగ్లో విలియమ్సన్ అవుటయినట్టు హాజెల్వుడ్ అప్పీలు చేయగా, అంపైర్ తిరస్కరించాడు. స్మిత్ సమీక్ష కోరినా ఫలితం అనుకూలంగా రాలేదు. దీంతో అసహనానికి లోనైన స్మిత్ అంపైర్తో వాగ్వాదానికి దిగగా, హాజెల్వుడ్ తిట్లపురాణం అందుకున్నాడు. కాగా తాను అంపైర్తో వాగ్వాదానికి దిగలేదని, కేవలం వివరణ అడిగానని స్మిత్ చెప్పాడు. హాజెల్వుడ్, స్మిత్ క్రమశిక్షణ నియమావళిని ఉల్లంఘించినట్టు ఐసీసీ నిర్ధారించింది. వీరిద్దరినీ మందలిస్తూ జరిమానా విధించింది.