రాంచీ: టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్టులో భాగంగా దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ టాస్‌కు వెళ్లే క్రమంలో బావుమాను వెంట తీసుకురావడంపై ఆ దేశ మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. ఇంతకంటే దయనీయ పరిస్థితి మరొకటి ఉంటుందా అంటు చురకలంటించాడు. ఇలా టాస్‌కు కెప్టెన్ హోదాలో ఉన్న మరొక క్రికెటర్‌ను తీసుకురావడం తమ ఆటగాళ్ల మైండ్‌సెట్‌కు అర్థం పడుతోందన్నాడు. ‘ మీ మైండ్ సెట్ సరిగా లేకనే టాస్‌కు వేరొక క్రికెటర్‌ను తీసుకెళ్లాల్సి వచ్చింది. ఇది చాలా దయనీయమైన, కొద్దిపాటి విషాదకరమైన అంశం. ఈ విషయం నన్ను తీవ్ర నిరూత్సాహానికి గురి చేసింది. గేమ్ ఓడిపోయినందుకు తప్పుడు కారణాలు వెతుక్కుంటున్నారు.
మీ దురదృష్టం కొద్ది సరిగా ఆడలేదు. దాంతో సిరీస్ కోల్పోయారు. ఉపఖండలో టాస్‌ది కీలక పాత్రే.. అది ఒప్పుకోవాల్సిన విషయం. కానీ నువ్వు బాగా ఆడినప్పుడు ఈ తరహా సెంటిమెంట్‌తో అవసరం లేదు. పూర్తిస్థాయిలో ఆడండి.. అంతేకానీ టాస్‌లకు కెప్టెన్ల కాకుండా వేరే వాళ్లు వెళ్లడం నాకు అసహ్యంగా అనిపించింది’ అని స్మిత్ పేర్కొన్నాడు. వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో డుప్లెసిస్ టాస్ కోల్పోవడంతో అందుకు ప్రత్యామ్నాయం ఆలోచించాడు. టాస్‌కు తాను కాకుండా వేరే వాళ్లను తీసుకెళ్లాలని భావించి బావుమాను వెంటబెట్టుకెళ్లాడు. కాకపోతే టాస్‌ను టీమిండియానే గెలవడంతో డుప్లెసిస్ టాస్ రాత మారలేదు. కాగా, ఆసియా ఖండంలో దక్షిణాఫ్రికా జట్టు టాస్ ఓడిపోవడం వరుసగా 10వసారి కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment