‘సోచి’లో మువ్వన్నెల రెపరెపలు...
వింటర్ ఒలింపిక్స్ క్రీడాగ్రామంలో జాతీయ పతాకం ఆవిష్కరణ
సోచి (రష్యా): వింటర్ ఒలింపిక్స్‌లో ఎట్టకేలకు భారత జాతీయ పతాకం రెపరెపలాడింది. భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)పై 14 నెలలపాటు కమ్మిన నిషేధపు మబ్బులు ఐదు రోజుల క్రితం తొలగిపోవడంతో ఆదివారం సోచిలోని ఒలింపిక్స్ క్రీడాగ్రామంలో మూడు రంగుల జెండాను ఆవిష్కరించారు.
ఐఓఏ నూతన అధ్యక్షుడు ఎన్.రామచంద్రన్, వింటర్ ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న అథ్లెట్లు శివ కేశవన్, హిమాంశు ఠాకూర్, నదీమ్ ఇక్బాల్, వారి కోచ్‌లు హాజరు కాగా, 45 నిమిషాలపాటు జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో త్రివర్ణ పతాక ఆవిష్కరణ జరిగింది. అథ్లెట్లు భారత్ పేరు రాసిన దుస్తుల్ని ధరించగా, తొలుత ఐఓసీ జెండాను ఎగురవేసిన అధికారులు ఆ తరువాత జాతీయ గీతాన్ని ఆలపిస్తూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.
అంతకుముందు ఉదయమే ఐఓసీ అధ్యక్షుడు థామస్ బ్యాచ్ పర్వత గ్రామానికి విచ్చేసి భారత అథ్లెట్లను కలిసి శుభాకాంక్షలు తెలపడంతోపాటు వారితో కలిసి అల్పాహారం కూడా చేశారు. ఐఓసీ అధ్యక్షుడి రాక తమకెంతో ఉత్సాహాన్నిచ్చిందని భారత కోచ్‌లలో ఒకరైన రోషన్‌లాల్ ఠాకూర్ తెలిపారు. కాగా, ఐఓఏపై నిషేధం అమల్లో ఉన్నందున ఈ నెల 7న జరిగిన వింటర్ ఒలింపిక్స్ ప్రారంభ కార్యక్రమంలో కానరాని భారత పతాకం, ఈ నెల 23న జరగనున్న ముగింపు వేడుకల్లో కనిపించనుంది.