
వాషింగ్టన్ : రష్యాపై అగ్రరాజ్యం అమెరికా సంచలన ఆరోపణలకు దిగింది. వింటర్ ఒలంపిక్స్‌లో అధికారులు ఉపయోగించే కంప్యూటర్లను రష్యా హ్యాక్ చేసిందని చెబుతోంది. వందలాది కంప్యూటర్ల నుంచి విలువైన సమాచారాన్ని దొంగిలించిందని అంటోంది.
దక్షిణ కొరియాలోని ప్యాంగ్ చాంగ్ వేదికగా వింటర్ ఒలంపిక్స్ క్రీడలు జరిగిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 9న ప్రారంభమైన ఈ క్రీడా సమరం నేటితో (ఫిబ్రవరి 25) ముగియనుంది. అయితే రష్యన్ మిలిటరీ గూఢాచారులు ఒలంపిక్స్‌కు సంబంధించిన కీలక సమాచారాన్ని దొంగిలించారంటూ అమెరికా ఆరోపిస్తోంది. ఫిబ్రవరి 9న ప్రారంభ వేడుకల సందర్భంగా సైబర్ దాడులు జరిగినట్లు నిర్వాహకులు ప్రకటించారు. కానీ, అది రష్యా పనేనా అన్న విషయం మాత్రం వాళ్లు ధృవీకరించలేదు. దీంతో అమెరికా చేస్తున్న ఆరోపణలు వాస్తవమేనన్న అనుమానాలు మొదలయ్యాయి.
డోపింగ్ ఆరోపణల కారణంగా రష్యన్ బృందంలోని సభ్యులపై అంతర్జాతీయ ఒలంపిక్ కమిటీ(ఐవోసీ) నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ కారణంతో రష్యా నుంచి ఎక్కువ సంఖ్యలో ఆటగాళ్లు హాజరుకాలేకపోయారు. ఈ నేపథ్యంలోనే ఐవోసీపై ప్రతీకారం తీర్చుకునేందుకు రష్యా ఈ దాడులకు పాల్పడిందని అమెరికా చెబుతోంది. ముగింపు వేడుకలకు కూడా రష్యా అంతరాయం కలిగించే ఆస్కారం ఉందన్న ఆరోపణలతో దగ్గరుండి పర్యవేక్షించబోతున్నట్లు అమెరికా ప్రకటించగా.. అందుకు దక్షిణ కొరియా అంగీకరించింది. మరోవైపు రష్యా మాత్రం అమెరికా ప్రకటనను ఖండించింది.
Comments
Please login to add a commentAdd a comment