మరో భారీ సైబర్ దాడి..
► భారత్ సహా పలు దేశాల్లో ప్రభావం
► బాధిత జాబితాలో ప్రముఖ విదేశీ కంపెనీలు
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికించిన రాన్సమ్‌వేర్ ‘వాన్నాక్రై’ని మరవక ముందే మరో సైబర్‌దాడి మంగళవారం వెలుగుచూసింది. ఈసారి రష్యా, ఉక్రెయిన్, ఫ్రాన్స్,అమెరికా బ్రిటన్‌లతో పాటు భారత్‌లోనూ దాని ప్రభావం కనిపించింది. ఉక్రెయిన్‌లో బ్యాంకింగ్ కార్యకలాపాలు స్తంభించగా, బ్రిటన్‌లో పలు కంపెనీలు కూడా వీటి బారినపడ్డాయి.
రష్యాలో అతిపెద్ద ఇంధన కంపెనీ రాస్‌నెఫ్ట్, ఉక్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయం, సముద్ర రవాణా సంస్థ ఏపీ మోలర్–మయిరెస్క్‌ల(ఏపీఎం), అమెరికాలోని డ్రగ్ దిగ్గజం మెర్క్‌పై సైబర్ దాడులు జరిగినట్లు తెలిసింది. ముంబైలోని జేఎన్‌పీటీ పోర్టులో మూడు టర్మినళ్లలో ఒకదానిలో కూడా కార్యకలాపాలకు అడ్డంకులు ఏర్పడ్డాయి. ఇవి కూడా రాన్సమ్‌వేర్ వాన్నాక్రై లాంటివే అని, కంప్యూటర్లపై పూర్తి ఆధిపత్యం చేజిక్కించుకొని, పరిహారం ఇచ్చిన తరువాతే సమాచారాన్ని విడుదల చేస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు.
ఉక్రెయిన్‌లో బ్యాంకులే లక్ష్యంగా..
తమ దేశంలోని పలు బ్యాంకుల వెబ్‌సైట్లపై సైబర్ దాడులు జరిగినట్లు ఉక్రెయిన్ కేంద్ర బ్యాంకు ప్రకటించింది. దీంతో బ్యాంకింగ్ కార్యకలాపాలకు అంతరాయాలు కలిగాయని పేర్కొంది. బాహ్య హ్యాకర్లు తమ దేశంలోని బ్యాంకు వెబ్‌సైట్లపై సైబర్ దాడులకు పాల్పడ్డారని తెలిపింది. ఫలితంగా వినియోగదారులకు సేవలందించడంలో బ్యాంకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొంది. సైబర్ దాడులను ఎదుర్కొనేలా అన్ని బ్యాంకులు భద్రతా చర్యలను ముమ్మరం చేశాయని వెల్లడించింది.
జేఎన్‌పీటీ టర్మినల్‌పై దాడి
భారత్‌లో ప్రభావానికి గురైన జేఎన్‌పీటీలోని జీటీఐ టర్మినల్‌ని ఏపీ మోలర్ నిర్వహిస్తోంది. మాల్‌వేర్ దాడితో ఏపీ మోలార్‌లో కంప్యూటర్లు స్తంభించడంతోనే జీటీఐ ప్రభావితమైందని జేఎన్‌పీటీ అధికారి తెలిపారు. హేగ్ కేంద్రంగా పనిచేస్తున్న ఏపీఎం గుజరాత్‌లోని పిపావావ్ టర్మిన్‌ల్‌ను ఆపరేట్ చేస్తోంది.
‘పెట్యా’గా గుర్తింపు
అంతకు ముందు కీవ్ విద్యుత్ కంపెనీ క్యీవెనెర్గోలో కూడా సైబర్ దాడి జరిగినట్లు వార్తలు వెలువడ్డాయి. తమ కంప్యూటర్లను తాకిన వైరస్‌ను ‘పెట్యా’గా గుర్తించినట్లు ఉక్రెయిన్ డెలివరీ సేవల కంపెనీ నోవా పోష్టా పేర్కొంది. సైబర్ దాడులు తమనే లక్ష్యంగా చేసుకున్నాయని పారిస్‌లోని పలు బహుళ జాతీయ కంపెనీలు పేర్కొన్నాయి. బ్రిటిష్ అడ్వర్టైజింగ్ దిగ్గజం డబ్ల్యూపీపీ, ఫ్రెంచ్ కంపెనీ సెయింట్ గోబైన్‌లు తమపై దాడులు జరిగాయని, డేటా చౌర్యాన్ని అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపాయి.