suchi
-
మా పిల్లల నుంచి నేర్చుకున్నాను..
సూచీ ముఖర్జీ... లైమ్‌రోడ్ ఆన్లైన్ బిజినెస్ దిగ్గజం.. గృహిణిగా, సిఈవోగా... రెండు రకాల జీవితాలను బ్యాలెన్స్ చేసుకోవటంలో విజయం సాధించారు. సూచీ ఇద్దరు పిల్లలకు తల్లి, ఎంతో మందికి స్నేహితురాలు, ఇప్పుడు ఔత్సాహిక పారిశ్రామికవేత్త... ‘కొత్తగా వ్యాపారం ప్రారంభిస్తున్నామంటే మన మీద మనం ఒత్తిడి తెచ్చిపెట్టుకున్నట్లే’ అంటారు సూచీ ముఖర్జీ. ఇంటిని, వ్యాపారాన్ని బ్యాలెన్స్ చేసుకోవటం చాలా కష్టమే అయినప్పటికీ, కుటుంబంతోనే ఎక్కువసేపు ఉండటానికి ప్రయత్నిస్తుంటారు. పిల్లలతో ఉదయాన్నే కొద్దిసేపు గడిపి, వాళ్లని స్కూల్ దగ్గర దింపి, ఆ తరవాత తన వ్యాపార పనుల్లోకి ప్రవేశిస్తారు సూచీ ముఖర్జీ. ‘‘మంచి జీవిత భాగస్వామి, నన్ను అర్థం చేసుకునే అత్తమామలు దొరకటం నిజంగా నా అదృష్టం. అందుకు నేను వారికి ఋణపడి ఉంటాను’’ అంటారు లైమ్‌రోడ్.కామ్ వ్యవస్థాపకురాలు, సిఈవో అయిన సూచీ ముఖర్జీ. హర్యానాకు చెందిన సూచీ ముఖర్జీ 2012లో ఈ సంస్థను స్థాపించారు. 40 సంవత్సరాల లోపు వయసున్న, అత్యున్నత స్థాయి కొత్త వ్యాపారవేత్త ల జాబితాలో ఆమె మొదటిస్థానం పొందారు. ‘‘మా అబ్బాయి పుట్టినప్పుడు నేను ఖాళీ సమయంలో ఒక మ్యాగజీన్ చదువుతుంటే, నాకు కావలసిన జ్యూయలరీ కనిపించింది. వెంటనే నేను ఒకే ఒక్క క్లిక్‌తో బుక్ చేసి తెప్పించుకున్నాను. అప్పుడే నాకు కూడా ఇటువంటి సైట్ ఒకటి స్థాపించాలనే ఆలోచన వచ్చింది. లక్కీగా వెంటనే దానిని అమలు చేయ గలిగాను’’ అని చెప్పారామె. ఫిట్నెస్ బావుండాలి.. ‘‘వ్యాపారంలో రాణించాలంటే ఫిట్నెస్ చాలా అవసరం. అందుకోసం కొంత సమయం తప్పనిసరిగా కేటాయించాలి... వ్యాపారంలో విజయం సాధిస్తే సెలబ్రేట్ చేసుకోవాలి. ఓటమి సాధించినప్పుడు అధైర్యపడకూడదు. విజయం సాధించేవరకు పోరాడాలి. అందుకు పట్టుదల ఉండాలి. ధైర్యంగా దీక్షతో పనిచేయాలి. ఎంత సంక్షోభంలో ఉన్నప్పటికీ సృజనను విడిచిపెట్టకూడదు’’ అంటారు సూచీ ముఖర్జీ. మహిళల కోసం... లైమ్‌రోడ్.కామ్ మహిళల కోసం ప్రారంభించబడిన ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్. ‘‘మా లైమ్‌రోడ్ స్క్రాప్‌బుక్‌ను ప్రతి నెల సుమారు పది లక్షల మంది చూస్తున్నారు. ఈ సంవత్సరం మా వ్యాపారం 600 శాతం పెరిగింది. వ్యాపారంలో నిరంతరం సృజన ఉండాలి. వ్యాపారం ప్రారంభించే ముందు నేను చేయగలనా లేదా అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. చేయగలనని నా మనసు సమాధానం చెప్పింది. నేను ఒక స్థాయికి ఎదగడానికి ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్నాను. అయినప్పటికీ విలక్షణమైన ఉత్పత్తులు అందించాలనే లక్ష్యంతోనే ముందుకు సాగుతున్నాను’’ అంటున్న సూచీ ముఖర్జీ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తారు. ఈ కామర్స్ లైఫ్‌స్టయిల్ అండ్ యాక్సెసరీస్ వెబ్‌సైట్‌ను ఫ్యాషన్ మాగజీన్ విధానంలో రూపొందించారు. 50 మందితో ప్రారంభమైన ఈ సంస్థలో ఇప్పుడు 400 మంది ఉన్నారు. సూచీ ముఖర్జీకి ఇద్దరు పిల్లలు అమ్మాయి మైరా, అబ్బాయి అదితి. ఢిల్లీ, సెయింట్ స్టీఫెన్ కాలేజీ నుంచి ఎకనామిక్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ నుంచి ఫైనాన్స్ అండ్ ఎకనమిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పొందారు. స్కైప్, ఈబే, గమ్‌ట్రీ వంటి వివిధ సంస్థలలో సుమారు 16 సంవత్సరాలు పనిచేశారు. తాను కలగన్న సంస్థను స్థాపించటం కోసం 2011లో భారతదేశానికి వచ్చి, 2012లో లైమ్‌రోడ్.కామ్‌ను స్థాపించారు. 16వ శతాబ్దం నాటి గ్రాండ్ ట్రంక్ రోడ్డు వల్ల పెద్ద ఎత్తున వ్యాపారం జరిగినట్లే, తాను స్థాపించబోయే సంస్థ కూడా అంత వ్యాపారం చేయాలనుకున్నారు. గ్రాండ్ ట్రంక్ రోడ్డుని ప్రేరణగా తీసుకుని లైమ్‌రోడ్. అని పేరుపెట్టారు. – సూచీ ముఖర్జీ, సిఈవో, ఫౌండర్, లైమ్‌రోడ్.కామ్ -
ముగిసిన వింటర్ ఒలింపిక్స్
సోచి: చరిత్రలో అతి ఖరీదైన వింటర్ ఒలింపిక్స్ ఆదివారం ముగిశాయి. పదిహేడు రోజులపాటు జరిగిన ఈ పోటీల్లో ఆతిథ్య రష్యా అత్యధికంగా 13 స్వర్ణాలతోపాటు మొత్తం 33 పతకాలు గెలుచుకొని అగ్రస్థానంలో నిలిచింది. 11 స్వర్ణాలతో నార్వే, 10 స్వర్ణాలతో కెనడా వరుసగా ఆ తరువాతి స్థానాల్లో నిలిచాయి. భారత్ తరపున ముగ్గురు అథ్లెట్లు పాల్గొన్నా ఒక్క పతకమూ నెగ్గని సంగతి తెలిసిందే. 2018 వింటర్ ఒలింపిక్స్‌కు దక్షిణ కొరియాలోని ప్యాంగ్‌చాంగ్ నగరం ఆతిథ్యమిస్తుంది. త్రివర్ణ రెపరెపలు: భారత్‌పై ఐఓసీ నిషేధం ఎత్తివేయడంతో వింటర్ ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో భారత అథ్లెట్లు త్రివర్ణ పతాకంతో పాల్గొన్నారు. ప్రారంభోత్సవంలో భారత అథ్లెట్లు ఐఓసీ పతాకంతో పాల్గొన్న సంగతి తెలిసిందే. -
‘సోచి’లో మువ్వన్నెల రెపరెపలు...
వింటర్ ఒలింపిక్స్ క్రీడాగ్రామంలో జాతీయ పతాకం ఆవిష్కరణ సోచి (రష్యా): వింటర్ ఒలింపిక్స్‌లో ఎట్టకేలకు భారత జాతీయ పతాకం రెపరెపలాడింది. భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)పై 14 నెలలపాటు కమ్మిన నిషేధపు మబ్బులు ఐదు రోజుల క్రితం తొలగిపోవడంతో ఆదివారం సోచిలోని ఒలింపిక్స్ క్రీడాగ్రామంలో మూడు రంగుల జెండాను ఆవిష్కరించారు. ఐఓఏ నూతన అధ్యక్షుడు ఎన్.రామచంద్రన్, వింటర్ ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న అథ్లెట్లు శివ కేశవన్, హిమాంశు ఠాకూర్, నదీమ్ ఇక్బాల్, వారి కోచ్‌లు హాజరు కాగా, 45 నిమిషాలపాటు జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో త్రివర్ణ పతాక ఆవిష్కరణ జరిగింది. అథ్లెట్లు భారత్ పేరు రాసిన దుస్తుల్ని ధరించగా, తొలుత ఐఓసీ జెండాను ఎగురవేసిన అధికారులు ఆ తరువాత జాతీయ గీతాన్ని ఆలపిస్తూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అంతకుముందు ఉదయమే ఐఓసీ అధ్యక్షుడు థామస్ బ్యాచ్ పర్వత గ్రామానికి విచ్చేసి భారత అథ్లెట్లను కలిసి శుభాకాంక్షలు తెలపడంతోపాటు వారితో కలిసి అల్పాహారం కూడా చేశారు. ఐఓసీ అధ్యక్షుడి రాక తమకెంతో ఉత్సాహాన్నిచ్చిందని భారత కోచ్‌లలో ఒకరైన రోషన్‌లాల్ ఠాకూర్ తెలిపారు. కాగా, ఐఓఏపై నిషేధం అమల్లో ఉన్నందున ఈ నెల 7న జరిగిన వింటర్ ఒలింపిక్స్ ప్రారంభ కార్యక్రమంలో కానరాని భారత పతాకం, ఈ నెల 23న జరగనున్న ముగింపు వేడుకల్లో కనిపించనుంది. -
భారత్‌కు అవమానం
ప్రపంచ ప్రఖ్యాత క్రీడల్లో ఏ దేశ ఆటగాడైనా తమ జాతీయ పతాకం రెపరెపలాడాలని భావిస్తాడు. సోచిలో అట్టహాసంగా ప్రారంభమైన వింటర్ ఒలింపిక్స్‌లో భారత ఆటగాళ్లకు ఆ అదృష్టం లేకుండా పోయింది. భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)పై ఉన్న నిషేధం కారణంగా శుక్రవారంనాటి ఈ వేడుకల్లో ఓరకంగా భారత ఆటగాళ్లు అవమానకర పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది. నిషేధం కారణంగా వీరు భారతదేశం తరఫున కాకుండా ఒలింపిక్ పతాకం తరఫున ప్రాతినిథ్యం వహిస్తుండడంతో అక్కడ మువ్వన్నెల పతాకం కనిపించలేదు. అలాగే జాతీయ గీతాలాపనకూడా వినిపించలేదు. లూగర్ పిస్టల్ విభాగంలో పోటీ పడుతున్న శివ కేశవన్, అల్ఫైన్ స్కీయర్ హిమాన్షు ఠాకూర్, క్రాస్ కంట్రీ స్కీయర్ నదీమ్ ఇక్బాల్ ప్రారంభ కార్యక్రమంలో ఒలింపిక్ పతాకం చేతబట్టుకుని ముందుకు సాగారు. వైభవంగా వింటర్ ఒలింపిక్స్ ప్రారంభం సోచి: చరిత్రలో అతి ఖరీదైన వింటర్ ఒలింపిక్స్ రష్యాలోని సోచిలో శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో పాటు పలు దేశాల అధ్యక్షులు, ప్రధానులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో బాణాసంచా వెలుగులు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. ఈ నెల 23 వరకు వింటర్ ఒలింపిక్స్ జరుగుతాయి.