భారత్‌కు అవమానం
ప్రపంచ ప్రఖ్యాత క్రీడల్లో ఏ దేశ ఆటగాడైనా తమ జాతీయ పతాకం రెపరెపలాడాలని భావిస్తాడు. సోచిలో అట్టహాసంగా ప్రారంభమైన వింటర్ ఒలింపిక్స్‌లో భారత ఆటగాళ్లకు ఆ అదృష్టం లేకుండా పోయింది. భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)పై ఉన్న నిషేధం కారణంగా శుక్రవారంనాటి ఈ వేడుకల్లో ఓరకంగా భారత ఆటగాళ్లు అవమానకర పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది.
నిషేధం కారణంగా వీరు భారతదేశం తరఫున కాకుండా ఒలింపిక్ పతాకం తరఫున ప్రాతినిథ్యం వహిస్తుండడంతో అక్కడ మువ్వన్నెల పతాకం కనిపించలేదు. అలాగే జాతీయ గీతాలాపనకూడా వినిపించలేదు. లూగర్ పిస్టల్ విభాగంలో పోటీ పడుతున్న శివ కేశవన్, అల్ఫైన్ స్కీయర్ హిమాన్షు ఠాకూర్, క్రాస్ కంట్రీ స్కీయర్ నదీమ్ ఇక్బాల్ ప్రారంభ కార్యక్రమంలో ఒలింపిక్ పతాకం చేతబట్టుకుని ముందుకు సాగారు.
వైభవంగా వింటర్ ఒలింపిక్స్ ప్రారంభం
సోచి: చరిత్రలో అతి ఖరీదైన వింటర్ ఒలింపిక్స్ రష్యాలోని సోచిలో శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో పాటు పలు దేశాల అధ్యక్షులు, ప్రధానులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో బాణాసంచా వెలుగులు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. ఈ నెల 23 వరకు వింటర్ ఒలింపిక్స్ జరుగుతాయి.