ఆస్ట్రేలియా కెప్టెన్ పై జోకులు
ధర్మశాల: ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్ ను టీమిండియా 2-1తో గెల్చుకుంది. ధర్మశాలలో జరిగిన చివరి టెస్టులో ఎనిమిది వికెట్ల తేడాతో ఆసీస్ ను చిత్తు చేసి బోర్డర్-గవాస్కర్ ట్రోఫిని భారత్ కైవశం చేసుకుంది. ఆసీస్ ఓటమిపై నెటిజన్లు ట్విటర్ లో జోకులు పేల్చారు. టిబెట్ బౌద్ధ గురువు దలైలామా, ఆసీస్ కెప్టెన్ స్టీవెన్ స్మిత్ ఫొటోలకు సరదా కామెంట్లు పెట్టారు. తమదైన శైలిలో వ్యంగ్యస్త్రాలు సంధించారు. గాయం కారణంగా మ్యాచ్ ఆడలేకపోయిన విరాట్ కోహ్లి, చివరి టెస్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన అజింక్య రహానేపై సరదా వ్యాఖ్యలు చేశారు.
రహానే వరుసగా సిక్సర్లు కొట్టడంపై స్పందిస్తూ.. మీనాకుమారిని బికినీలో చూసినట్టుగా ఉందని నెటిజన్ ఒకరు కామెంట్ చేశారు. 'రాహుల్ మ్యాచ్ గెలిచాడు. పార్టీ అతడి కోసం ఎదురు చూస్తోంది. మీరు అనుకున్నట్టు ఇది రాజకీయ పార్టీ కాదు. ఇది క్రికెట్' అంటూ మరొకరు ట్వీటారు. 'భారత్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, న్యూజిలాండ్ బాగా ఆడాయి. ఇప్పుడు పోటీపడడం ఆపండి. అందరూ కలిపోండి. మీకు మీరుగా జట్లుగా విడిపోండి. ఐపీఎల్ ఆడండి' అంటూ ఇంకొరు ట్వీట్ చేశారు.
దలైలామాను స్మిత్ కలిసిన ఫొటోలు పోస్ట్ చేసి జోకులేశారు. 'ఇండియాకు మళ్లీ రాకు' అని కామెంట్ చేసి.. స్మిత్ ను దలైలామా గడ్డం పట్టుకుని మాట్లాడుతున్న ఫొటో పెట్టారు.
స్మిత్: మీరు అన్ని విషయాలు తెలిసిన వారు. నాకు సరైన దారి చూపించండి
దలైలామా: ఇది ఎయిర్ పోర్టుకు వెళ్లే దారి. అదే మీకు సరైంది.
దలైలామా: నీకెప్పుడైనా సందేహం కలిగితే ఎటువైపు చూస్తావు?
స్మిత్: డ్రెస్సింగ్ రూము వైపు చూస్తాను
దలైలామా: దేవుడా...