
న్యూఢిల్లీ: భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ స్వీయచరిత్ర పుస్తక రూపం దాల్చనుంది. బ్యాట్ పట్టి పరుగుల వరద సృష్టించే ఈ సీనియర్ క్రికెటర్ ఇప్పుడు ఆత్మకథ రాసేందుకు కలం పట్టింది. ఇందులో ఆమె తన వ్యక్తిగత, వృత్తిగత (కెరీర్) విషయాలను వెల్లడించనుంది.
తన జీవిత చరిత్రను అభిమానులతో పంచుకోవడం ఆనందంగా ఉందని మిథాలీ రాజ్ తెలిపింది. ప్రచురణ హక్కులను పెంగున్ ర్యాండమ్ హౌజ్ అనే పబ్లికేషన్ సంస్థ చేజిక్కించుకుంది. వచ్చే ఏడాది ఈ పుస్తకం అందుబాటులోకి రానుందని ఆ సంస్థ వర్గాలు వెల్లడించాయి.