
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై టీమిండియా మాజీ సారథి, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తాజాగా స్పందించాడు. తను సీఏఏకు సంబంధించిన బిల్లు పూర్తిగా చదవలేదని.. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతీ ఒక్కరూ సంయమనం పాటించాలని విఙ్ఞప్తి చేశాడు. సీఏఏకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా తీవ్రస్థాయిలో ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. చట్టానికి సంబంధించి సోషల్ మీడియాలో సైతం పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో గంగూలీ కుమార్తె సనా.. సీఏఏను వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాలో సందేశాన్ని పోస్ట్ చేసిందంటూ వార్తలు ప్రచారమయ్యాయి. దీంతో సనా ట్రోల్స్ బారిన పడింది. అయితే ఆ పోస్టు నిజం కాదని, సనా చిన్నపిల్ల కాబట్టి తనను రాజకీయాల్లోకి లాగొద్దని గంగూలీ ట్వీట్ చేశాడు. ఈ క్రమంలో సీసీఏపై అభిప్రాయాన్ని చెప్పకుండా గంగూలీ ఎందుకు మౌనంగా ఉన్నారంటూ నెటిజన్లు ఆయనను ప్రశ్నించారు.(పౌరసత్వ సవరణ చట్టం నిబంధనలపై కేంద్రం వివరణ)
ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా ఓ జాతీయ మీడియాతో గంగూలీ మాట్లాడుతూ.. ‘ ప్రతీ ఒక్కరు శాంతి కలిగి ఉండాలని కోరుకుంటున్నా. రాజకీయాల గురించి నేను మాట్లాడదలచుకోలేదు. నిజానికి పౌరసత్వ సవరణ బిల్లును నేను చదవలేదు. కాబట్టి పూర్తి అవగాహన లేకుండా ఆ విషయం గురించి మాట్లాడటం సరికాదు. అయితే అందరూ ప్రశాంతంగా ఉండాలి. ఈ చట్టంతో ఎవరికి ఎటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి, ఎవరు నష్టపోతారు అనే విషయాల గురించి చర్చ జరగాలి. అయితే నాకు ప్రతీ ఒక్కరి సంతోషమే ముఖ్యం’ అని పేర్కొన్నాడు.(‘పౌర’ ఆందోళనలు హింసాత్మకం)
Comments
Please login to add a commentAdd a comment