బెంగళూరు: భారత్ ‘ఎ’తో జరుగుతోన్న రెండో అనధికారిక టెస్టులో దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టు పుంజుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు దిశగా సాగుతున్న టీమిండియాను కట్టడి చేయడంతో పాటు బ్యాటింగ్‌లో అదరగొట్టింది. దీంతో శనివారం ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 59.5 ఓవర్లలో 3 వికెట్లకు 219 పరుగులు చేసింది. జుబైర్ హమ్జా (93; 15 ఫోర్లు) త్రుటిలో సెంచరీని చేజార్చుకోగా... ఇర్వీ (58; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించాడు. ప్రస్తుతం డసెన్ (18 బ్యాటింగ్), రూడీ సెకండ్ (35 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
భారత బౌలర్లలో చహల్ 2, హైదరాబాదీ పేసర్ సిరాజ్ ఒక వికెట్ పడగొట్టారు. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉన్న ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 126 పరుగులు వెనుకబడి ఉంది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 322/4తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ మరో 23 పరుగులు మాత్రమే జతచేసి మిగతా 6 వికెట్లు కోల్పోయి 345 పరుగులకు పరిమితమైంది. ఆంధ్ర రంజీ క్రికెటర్ హనుమ విహారి (148; 14 ఫోర్లు) క్రితం రోజు స్కోరుకు 10 పరుగులు జోడించి ఔటయ్యాడు. ఆంధ్రకే చెందిన వికెట్ కీపర్ కోన శ్రీకర్ భరత్ 34 పరుగులు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment