తొలి పోరుకు దక్షిణాఫ్రికా సిద్ధం
నేడు బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్‌తో వార్మప్ మ్యాచ్
న్యూఢిల్లీ: భారత పర్యటనను విజయంతో ఆరంభించాలని భావిస్తున్న దక్షిణాఫ్రికా జట్టు తొలి పోరుకు సన్నద్ధమైంది. ఇక్కడి పాలం మైదానంలో మంగళవారం జరిగే టి20 వార్మప్ మ్యాచ్‌లో సఫారీలు, బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్‌తో తలపడనున్నారు. శుక్రవారం భారత్‌తో తొలి టి20 మ్యాచ్ ఆడనున్న నేపథ్యంలో ఈ ప్రాక్టీస్ గేమ్‌లో పూర్తి స్థాయి జట్టును బరిలోకి దించాలని దక్షిణాఫ్రికా భావి స్తోంది. ముఖ్యంగా ప్రధాన బ్యాట్స్‌మెన్ డివిలి యర్స్, కెప్టెన్ డు ప్లెసిస్, డుమిని, మిల్లర్ హిట్టింగ్ ప్రాక్టీస్‌కు ఈ మ్యాచ్ ఉపయోగపడుతుంది.
సాధారణ గ్రౌండ్‌లతో పోలిస్తే పాలం మైదానం చిన్నది కావడం వల్ల భారీ షాట్ల మోత మోగవచ్చు. టి20 లకు స్టెయిన్, మోర్నీ మోర్కెల్ దూరమైనా... కైల్ అబాట్, మోరిస్, తాహిర్‌లు కీలక బౌలర్లు. మరోవైపు బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ మరీ కుర్రాళ్లతో నిండి ఉంది. సీనియర్ జట్టు తర్వాత ప్రధాన టీమ్ అయిన ఇండియా ‘ఎ’, బంగ్లాదేశ్‌తో టెస్టులు ఆడుతుండటంతో ఈ మ్యాచ్‌లో ఐపీఎల్ ఆటగాళ్లే ఎక్కువ మంది ఉన్నారు.
వీరు ప్రత్యర్థికి అంత పోటీ ఇచ్చే అవకాశమైతే లేదు. అయితే తమ ప్రతిభను నిరూపించుకునేందుకు కెప్టెన్ మన్‌దీప్, చహల్, కుల్దీప్, రిషి ధావన్‌లాంటి ఆటగాళ్లకు ఇది మంచి అవకాశం. ఇప్పటికే భారత్‌కు ఆడిన సంజూ శామ్సన్, మనీష్ పాండే కూడా బరిలో ఉన్నారు.