మరోసారి తడబడిన సఫారీలు!
బెంగళూరు: టీమిండియాతో నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇక్కడ శుక్రవారం ఆరంభమైన తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా తడబడింది. టీమిండియా బౌలర్లు రాణించడంతో సఫారీలు 214 పరుగులకే పరిమితమయ్యారు. టాస్ గెలిచి తొలుత దక్షిణాఫ్రికాను బ్యాటింగ్ కు ఆహ్వానించిన టీమిండియా మరోసారి స్పిన్ మంత్రంతో అదరగొట్టింది. భారత స్పిన్నర్లు రవీంద్ర జడేజా, రవి చంద్రన్ అశ్విన్ లు తలో నాలుగు వికెట్లు తీసి సఫారీల పతనాన్ని శాసించారు. పేస్ విభాగంలో వరుణ్ ఆరోన్ ఒక వికెట్ దక్కింది.
దక్షిణాఫ్రికా ఆటగాళ్లలో ఏబీ డివిలియర్స్(85) మినహా ఎవరూ ఆకట్టుకోలేదు. వేన్ జిల్(10), ఎల్గర్(38),డుమనీ (15), ఆమ్లా (7), డుప్లెసిస్ (0), విలాస్(15)లు నిరాశపరిచినా.. వందో టెస్టు ఆడుతున్నడివిలియర్స్ మాత్రం ఒంటరి పోరు సాగించాడు. దీంతో ఈ సిరీస్ లో మరో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. కాగా, టీ విరామానికి ముందు డివిలియర్స్ అవుట్ కావడంతో టీమిండియా శిబిరంలో ఆనందం వెల్లివిరిచింది.
ఆ తరువాత రబడా వెంటనే ఎనిమిదో వికెట్ గా పెవిలియన్ కు చేరడంతో దక్షిణాఫ్రికా రెండొందల మార్కును చేరడం కూడా కష్టంగానే అనిపించింది. అయితే కేల్ అబాట్ తో కలిసి మోర్నీ మోర్కెల్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దే యత్నం చేశాడు. 214 పరుగుల వద్ద మోర్కెల్(22) తొమ్మిదో వికెట్ గా అవుట్ కావడం.. ఆపై వెంటనే అబాట్(14) రనౌట్ గా పెవిలియన్ చేరడంతో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో సాధారణ స్కోరును మాత్రమే నమోదు చేసింది.