ఏప్రిల్ 11, 2000.. క్రికెట్ చరిత్రలో ఈ తేదిని ఒక చీకటి రోజుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే జెంటిల్‌మెన్ గేమ్‌గా ఉన్న క్రికెట్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణం ఒక్కసారిగా క్రికెట్ ప్రపంచాన్ని కుదుపేసింది. దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ హన్సీ క్రోన్జే మ్యాచ్ ఫిక్సింగ్‌లో ప్రధాన పాత్ర పోషించడంతో తన కెరీర్‌ను అర్థంతరంగా ముగించాల్సి వచ్చింది. అలాంటి చీకటిరోజు జరిగి నేటికి 20 సంవత్సరాలు పూర్తయింది. ఈ నేపథ్యంలో ఆరోజు ఏం జరిగిందనేది ఒకసారి చూద్దాం.. ఏప్రిల్ 2000వ సంవత్సరంలో దక్షిణాప్రికా జట్టు భారత్‌లో పర్యటించింది. ఆ సమయంలో దక్షిణాఫ్రికా జట్టుకు హన్సీ క్రోన్జే, టీమిండియా జట్టుకు మహ్మద్ అజారుద్దీన్‌లు కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు. భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ చేసినట్లు క్రోన్జేపై అభియోగాలు రావడంతో క్రికెట్ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కాగా ఇండియన్ బూకీ సంజయ్ చావ్లాతో కలిసి క్రోన్జే చర్చలు జరిపినట్లు తేలడంతో ఢిల్లీ పోలీసులు క్రోన్జేను అదుపులోకి తీసుకొని విచారించారు.(అలా వార్నర్‌ను హడలెత్తించా..!)
ఈ నేపథ్యంలో వారి విచారణలో క్రోన్జే పలు ఆసక్తికర విషయాలు పేర్కొన్నాడు. వన్డే సిరీస్‌లో భాగంగా మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడింది నిజమేనని ఒప్పుకొన్నాడు. అయితే అంతకుముందే భారత్ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ తనను సంజయ్ చావ్లా అనే ఇండియన్ బూకీకి పరిచయం చేశాడంటూ క్రోన్జే పెద్ద బాంబ్ పేల్చాడు. 1996లో టెస్టు సిరీస్ ఆడడానికి ఇండియాలో పర్యటించినప్పుడే సంజయ్ చావ్లా తనను కలిసి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుందామంటూ తన దగ్గర ప్రపోజల్ తెచ్చాడని క్రోన్జే పేర్కొన్నాడు. కాగా మ్యాచ్ ఫిక్సింగ్‌లో మీరు భాగమవ్వాలంటూ క్రోన్జే మాపై ఒత్తిడి తెచ్చాడని అప్పటి దక్షిణాఫ్రికా క్రికెటర్లు హర్షలే గిబ్స్, నికీ బోజే, పాట్ సిమ్‌కాక్స్ కమీషన్ ముందు వాపోవడంతో క్రోన్జే కెరీర్ ప్రమాదంలో పడింది.
దీంతో ఐసీసీ కల్పించుకొని క్రోన్జేను జీవితకాలం క్రికెట్ నుంచి నిషేదిస్తున్నట్లు పేర్కొంది. దీంతో అప్పటివరకు విజయవంతమైన కెప్టెన్‌గా ఒక వెలుగు వెలిగిన హన్సీ క్రోన్జే కెరీర్ చివరకు మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతంతో అర్థంతరంగా ముగిసింది. ఇది జరిగిన రెండు సంవత్సరాలకు జూన్ నెలలో క్రోన్జే ప్రయాణం చేస్తున్న విమానం క్రాష్‌కు గురవ్వడంతో అతను మరణించినట్లు దక్షిణాఫ్రికా మీడియా ప్రకటించింది. మ్యాచ్ ఫిక్సింగ్‌కు సహకరించినందుకు మహ్మద్ అజారుద్దీన్‌పై జీవితకాలం నిషేధం విధిస్తున్నట్లు బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. అంతేగాక బూకీలతో సంబంధాలు నెరిపారన్న కారణంతో అజయ్ జడేజాపై ఐదేళ్లు, మనోజ్ ప్రభాకర్, అజయ్ శర్మలపై జీవితకాల నిషేధం విధిస్తున్నట్లు అప్పట్లో బీసీసీఐ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment