
డివిలియర్స్ వీరవిహారం
ముంబై:దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు ఏబీ డివిలియర్స్ వీరవిహారం చేశాడు. వరల్డ్ టీ 20లో భాగంగా ఆదివారం వాంఖేడే స్టేడియంలో అఫ్ఘాన్స్తాన్తో జరుగుతున్న మ్యాచ్లో డివిలియర్స్ (64; 29 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లు) తన సహజసిద్ధమైన ఆటతో విరుచుకుపడ్డాడు. తద్వారా దక్షిణాఫ్రికా 210 పరుగుల విజయలక్ష్యాన్ని అఫ్ఘాన్కు నిర్దేశించింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నదక్షిణాఫ్రికాకు ఓపెనర్ హషీమ్ ఆమ్లా(5) నిరాశపరిచినా, మరో ఓపెనర్ డీ కాక్(45; 31 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు) దాటిగా ఆడాడు. అనంతరం కెప్టెన్ డు ప్లెసిస్(41; 27 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) మరింత దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. అతనికి సాయంగా డివిలియర్స్ కూడా రెచ్చిపోవడంతో దక్షిణాఫ్రికా స్కోరు బోర్డు వేగంగా కదిలింది. అఫ్ఘాన్ స్సిన్నర్ రషిద్ వేసిన ఇన్నింగ్స్ 17.0 ఓవర్లో డివిలియర్స్ 29 పరుగులు సాధించాడు. తొలి బంతిని సిక్సర్గా మలచిన డివిలియర్స్, రెండో బంతికి ఫోర్ సాధించాడు. ఆ తరువాత మూడు బంతులను వరుస సిక్సర్ల మోత మోగించాడు. ఈ క్రమంలోనే దాదాపు 200 పైగా స్ట్రైక్ రేట్ తో డివిలియర్స్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఇక చివరి బంతికి సింగిల్ తీయడంతో మొత్తంగా ఆ ఓవర్లో 29 పరుగులను డివిలియర్స్ పిండుకున్నాడు.
ఇక చివర్లో డేవిడ్ మిల్లర్(19; 8 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్), జేపీ డుమినీ(29 నాటౌట్; 20 బంతుల్లో 2 ఫోర్లు, 1సిక్స్)లు అఫ్ఘాన్ బౌలర్లకు చుక్కలు చూపెట్టడంతో దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 209 పరుగులు నమోదు చేసింది. అఫ్ఘాన్ బౌలర్లలో అమిర్ హమ్జా, దావ్లాత్ జద్రాన్, షాపూర్ జాద్రాన్, మహ్మద్ నబీలకు తలో వికెట్ దక్కింది. ఈ టోర్నీలో దక్షిణాఫ్రికా వరుసగా రెండోసారి రెండొందలకు పైగా స్కోరు నమోదు చేసింది. గత మ్యాచ్లో ఇంగ్లండ్పై దక్షిణాఫ్రికా 229 పరుగులు నమోదు చేసినా ఓటమి పాలైన సంగతి తెలిసిందే.