టీమిండియాకు భారీలక్ష్యం
కాన్పూర్:ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా ఆదివారం ఇక్కడ గ్రీన్ పార్క్ స్టేడియంలో టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డేలో దక్షిణాఫ్రికా 304 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు డీ కాక్(29), హషీమ్ ఆమ్లా(37) ఫర్వాలేదనిపించినా.. డు ప్లెసిస్(62) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అనంతరం కెప్టెన్ ఏబీ డివిలియర్స్ తనదైన శైలిలోదూకుడుగా ఆడాడు. డివిలియర్స్ (104; 73 బంతుల్లో 5ఫోర్లు, 6 సిక్స్ లు)) అజేయ సెంచరీతో పాటు బెహర్దియాన్(35 నాటౌట్;19 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించడంతో సఫారీలు నిర్ణీత ఓవరల్లో ఐదు వికెట్లు కోల్పోయి 303 పరుగులు చేశారు. ట్వంటీ 20 సిరీస్ హీరో డుమిని(15), డేవిడ్ మిల్లర్(13) లు నిరాశపరిచారు.40 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్లను కోల్పోయి 194 పరుగులు చేసిన దక్షిణాఫ్రికా ఆపై దూకుడుగా ఆడింది. చివరి పది ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయిన దక్షిణాఫ్రికా 109 పరుగులు చేసింది.
నిరాశపరిచిన టీమిండియా బౌలింగ్
ట్వంటీ 20 సిరీస్ తరహాలోనే టీమిండియా బౌలింగ్ మరోసారి నిరాశపరిచింది. పూర్తి కోటా వేసిన భువనేశ్వర్ కుమార్, ఉమేష్ యాదవ్ లు ఆకట్టుకోలేదు. 71 పరుగులను సమర్పించుకున్నఉమేష్ రెండు వికెట్లు మాత్రమే తీయగా, భువనేశ్వర్ 67 పరుగులిచ్చి వికెట్ కూడా తీయలేదు. ఇక స్టువర్ట్ బిన్నీ దక్షిణాఫ్రికా ఆటగాళ్లను ఏమాత్రం ఇబ్బందుకు గురిచేయలేదు. ఎనిమిది ఓవర్ల వేసిన బిన్నీ 63 పరుగులిచ్చాడు. ఇక స్పిన్నర్లు కాస్తలో కాస్త మెరుగనిపించారు. రవిచంద్రన్ అశ్విన్ 4.4 ఓవర్లలో వికెట్ తీసి 14 పరుగులివ్వగా, అమిత్ మిశ్రా 10 ఓవర్లలో రెండు వికెట్లు తీసి 47 పరుగులిచ్చాడు.పార్ట్ టైం బౌలర్ సురేష్ రైనా ఏడు ఓవర్లలో 37 పరుగులిచ్చాడు.