పోరాడి ఓడిన టీమిండియా
కాన్పూర్: ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా పోరాడి ఓడింది. దక్షిణాఫ్రికా విసిరిన 304 పరుగుల లక్ష్యాన్ని చేరే క్రమంలో టీమిండియా ఐదు పరుగుల తేడాతో ఓటమి పాలైంది. వన్డేలో శుభారంభం చేసి ట్వంటీ 20 సిరీస్ లో ఘోర ఓటమికి ముగింపు పలకాలన్న ధోనిసేన ఆశలు నెరవేరలేదు. టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ (150; 133 బంతుల్లో 13 ఫోర్లు, 6 సిక్సర్లు) భారీ శతకం నమోదు చేసినా అతని పోరాటం వృథాగానే మిగిలింది.
రోహిత్ కు తోడు అజింక్యా రహానే(60; 82 బంతుల్లో 5 ఫోర్లు) మినహా ఎవరూ ఆకట్టుకోలేదు. రెండో వికెట్ కు రహానే-రోహిత్ ల జోడి 149 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసినా చివర్లో టీమిండియా పూర్తిగా చతికిలబడి ఓటమిని మూటగట్టుకుంది. రోహిత్ అవుటైన వెంటేనే సురేష్ రైనా(3) , మహేంద్ర సింగ్ ధోని(31 ), స్టువర్ట్ బిన్నీ(2) లు వరుసగా పెవిలియన్ కు చేరడంతో భారత్ నిర్ణీత ఓవరల్లో ఏడు వికెట్లు కోల్పోయి 298 పరుగులకే పరిమితమైంది. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఇమ్రాన్ తాహీర్, రబడాలకు చెరో రెండు వికెట్లు లభించగా, స్టెయిన్, బెహర్దియన్, మోర్నీ మోర్కెల్ కు తలోవికెట్ దక్కింది.
మలుపు తిప్పిన తాహీర్
టీమిండియా 46 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్ల నష్టానికి 269 పరుగులతో విజయం దిశగా కొనసాగుతున్నట్లు కనిపించినా.. . 47 ఓవర్ లో రోహిత్, రైనాలను స్పిన్నర్ ఇమ్రాన్ తాహీర్ బోల్తా కొట్టించి దక్షిణాఫ్రికా జట్టు విజయావకాశాలను మెరుగుపరిచాడు. అనంతరం రబడా వేసిన ఓవర్ లో తొమ్మిది పరుగులు రావడంతో టీమిండియా విజయంపై మళ్లీ ఆశలు చిగురించాయి. అప్పటికి టీమిండియాకు 22 పరుగులు అవసరం, కాగా ఇంకా రెండు ఓవర్లు మిగిలి ఉన్నాయి. ఈ క్రమంలో బంతిని అందుకున్న స్టెయిన్ 11 పరుగులు ఇవ్వడంతో చివరి ఓవర్ కు 11 పరుగులు అవసరమయ్యాయి. చివరి ఓవర్ ను వేసిన రబడా తొలి మూడు బంతుల్లో నాలుగు పరుగులివ్వడంతో టీమిండియాపై ఒత్తిడి పడింది. దీంతో మరుసటి బంతికి బ్యాట్ ఝుళిపించిన ధోని పెవిలియన్ కు చేరాడు. ఆ తరువాతి బంతికి బిన్నీ అవుట్ అయ్యాడు. ఆఖరి బంతికి భువనేశ్వర్ కుమార్ ఒక పరుగు మాత్రమే రాబట్టడంతో దక్షిణాఫ్రికా గెలుపు అనివార్యమైంది.
అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా దూకుడుగా ఆడింది. ఓపెనర్లు డీ కాక్(29), హషీమ్ ఆమ్లా(37) ఫర్వాలేదనిపించినా.. డు ప్లెసిస్(62) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అనంతరం కెప్టెన్ ఏబీ డివిలియర్స్ తనదైన శైలిలో రెచ్చిపోయాడు. డివిలియర్స్ (104; 73 బంతుల్లో 5ఫోర్లు, 6 సిక్స్ లు)) అజేయ సెంచరీతో పాటు బెహర్దియాన్(35 నాటౌట్;19 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించడంతో సఫారీలు నిర్ణీత ఓవరల్లో ఐదు వికెట్లు కోల్పోయి 303 పరుగులు చేశారు. ట్వంటీ 20 సిరీస్ హీరో డుమిని(15), డేవిడ్ మిల్లర్(13) లు నిరాశపరిచారు. 40 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్లను కోల్పోయి 194 పరుగులు చేసిన దక్షిణాఫ్రికా ఆపై దూకుడుగా ఆడింది. చివరి పది ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయిన దక్షిణాఫ్రికా 109 పరుగులు చేసింది.
నిరాశపరిచిన టీమిండియా బౌలింగ్
ట్వంటీ 20 సిరీస్ తరహాలోనే టీమిండియా బౌలింగ్ మరోసారి నిరాశపరిచింది. పూర్తి కోటా వేసిన భువనేశ్వర్ కుమార్, ఉమేష్ యాదవ్ లు ఆకట్టుకోలేదు. 71 పరుగులను సమర్పించుకున్నఉమేష్ రెండు వికెట్లు మాత్రమే తీయగా, భువనేశ్వర్ 67 పరుగులిచ్చి వికెట్ కూడా తీయలేదు. ఇక స్టువర్ట్ బిన్నీ దక్షిణాఫ్రికా ఆటగాళ్లను ఏమాత్రం ఇబ్బందుకు గురిచేయలేదు. ఎనిమిది ఓవర్ల వేసిన బిన్నీ 63 పరుగులిచ్చాడు. ఇక స్పిన్నర్లు కాస్తలో కాస్త మెరుగనిపించారు. రవిచంద్రన్ అశ్విన్ 4.4 ఓవర్లలో వికెట్ తీసి 14 పరుగులివ్వగా, అమిత్ మిశ్రా 10 ఓవర్లలో రెండు వికెట్లు తీసి 47 పరుగులిచ్చాడు.పార్ట్ టైం బౌలర్ సురేష్ రైనా ఏడు ఓవర్లలో 37 పరుగులిచ్చాడు.
వన్డే జట్టులోకి హర్భజన్
టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తొలి వన్డేలో గాయపడటంతో తుది జట్టులో మరో ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కు స్థానం కల్పించారు. అశ్విన్ తన ఐదో ఓవర్ ను వేస్తున్న సమయంలో గాయపడ్డాడు. దీంతో హర్భజన్ ను వన్డే జాబితాలో స్థానం కల్పించారు.