భారీస్కోరు దిశగా దక్షిణాఫ్రికా
కాన్పూర్: ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా ఆదివారం ఇక్కడ గ్రీన్ పార్క్ స్టేడియంలో టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డేలో దక్షిణాఫ్రికా భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. 40 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్లను కోల్పోయిన దక్షిణాఫ్రికా 194 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సఫారీలు ఆదిలో కాస్త దూకుడును కనబరిచినా ఆపై కీలక వికెట్లను చేజార్చుకోవడంతో నెమ్మదిగా బ్యాటింగ్ కొనసాగించారు. అనంతరం మధ్య ఓవర్లలో మరోసారి దూకుడును పెంచిన సఫారీలు టీమిండిచా బౌలింగ్ పై ఎదురుదాడికి దిగుతూ స్కోరును పెంచే యత్నం చేస్తున్నారు.
ప్రస్తుతం కెప్టెన్ ఏబీ డివిలియర్స్ (45), డేవిడ్ మిల్లర్(13) క్రీజ్ లో ఉండటంతో దక్షిణాఫ్రికా భారీ స్కోరును నమోదు చేసే అవకాశం ఉంది. అంతకుముందు డు ప్లెసిస్(62; 77 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీ చేసి మూడో వికెట్ గా పెవిలియన్ కు చేరాడు. ఓపెనర్లు డీ కాక్(29), హషీమ్ ఆమ్లా (37) ఫర్వాలేదనిపించారు. టీమిండియా బౌలర్లలో ఉమేష్ యాదవ్, అమిత్ మిశ్రా, అశ్విన్ లకు తలో వికెట్ లభించింది.