
భారత్ తో తొలి టెస్టు:దక్షిణాఫ్రికా 28/2
మొహాలి: టీమిండియాతో జరుగుతున్న మొదటి టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా రెండు వికెట్లు కోల్పోయి 28 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా ఆటగాళ్లలో డియాన్ ఎల్గర్(13 బ్యాటింగ్), హషీమ్ ఆమ్లా(9 బ్యాటింగ్) క్రీజ్ లో ఉన్నారు. అంతకుముందు వేన్ జిల్(5), డు ప్లెసిస్(0) లు పెవిలియన్ కు చేరారు. టీమిండియా బౌలర్లలో రవి చంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలకు తలో వికెట్ లభించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా 201 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.
టీమిండియా ఆటగాళ్లలో ఓపెనర్ మురళీ విజయ్(75) మినహా ఎవరూ హాఫ్ సెంచరీ మార్కును చేరలేదు. ఆదిలోనే శిఖర్ ధవన్ పరుగులేమీ చేయకుండా పెవిలియన్ కు చేరగా, ఆ తరువాత చటేశ్వర పూజారా(31), కెప్టెన్ విరాట్ కోహ్లి(1), అజింక్యా రహానే(15), సాహా(0)లు వరుసగా విఫలమయ్యారు. కాగా, చివర్లో అజయ్ జడేజా(38), రవి చంద్రన్ అశ్విన్(20) కాసేపు దక్షిణాఫ్రికా బౌలర్లను ప్రతిఘటించారు. అయితే జట్టు స్కోరు 196 పరుగుల వద్ద జడేజా ఎనిమిదో వికెట్ గా పెవిలియన్ చేరడంతో మిగతా రెండు వికెట్లు ఐదు పరుగుల వ్యవధిలో నేలకూలాయి. టీమిండియా జట్టులో ఆరుగురు ఆటగాళ్లు సింగిల్ డిజిట్ కే పరిమితం కావడం గమనార్హం.