
కేప్‌టౌన్: పాకిస్తాన్‌తో జరుగుతోన్న మూడు టెస్టుల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే దక్షిణాఫ్రికా 2–0తో కైవసం చేసుకుంది. ఆ జట్టు రెండో టెస్టులో 9 వికెట్ల తేడాతో నెగ్గింది. 41 పరుగుల లక్ష్యంతో ఆదివారం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సఫారీలు 9.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 43 పరుగులు చేసి విజయం సాధించారు. డీన్ ఎల్గర్ (24 నాటౌట్; 4 ఫోర్లు), డు ప్లెసిస్ (3 నాటౌట్) లాంఛనం పూర్తి చేశారు. ఓపెనర్ డి బ్రుయెన్ (4)ను అబ్బాస్ ఔట్ చేయగా... ఆమ్లా రెండు పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. సొంతగడ్డపై దక్షిణాఫ్రికాకిది వరుసగా ఏడో సిరీస్ విజయం కావడం విశేషం. మూడో టెస్టు శుక్రవారం నుంచి జొహన్నెస్‌బర్గ్‌లో ప్రారంభం కానుంది.
డు ప్లెసిస్ సస్పెన్షన్...
ఈ మ్యాచ్‌లో ‘స్లో ఓవర్ రేట్’ కారణంగా దక్షిణాఫ్రికా కెప్టెన్ డు ప్లెసిస్‌పై ఐసీసీ ఓ టెస్టు మ్యాచ్ నిషేధం విధించింది. దీంతో పాటు సారథి మ్యాచ్ ఫీజులో 20 శాతం, జట్టు సభ్యుల ఫీజులో 10 శాతం కోత పెట్టింది.