
తాహిర్ తడాఖా...
ఐదు వికెట్లు తీసిన స్పిన్నర్
టి20 మ్యాచ్‌లో కివీస్‌పై దక్షిణాఫ్రికా విజయం
ఆక్లాండ్: లెగ్‌స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ (5/24) తన అద్భుత బౌలింగ్‌తో న్యూజి లాండ్ జట్టును వణికించాడు. దీంతో శుక్రవారం జరిగిన ఏకైక టి20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 78 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ప్రొటీస్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 185 పరుగులు సాధించింది. 15 పరుగులకే వికెట్ కోల్పోయినా... ఓపెనర్ ఆమ్లా (43 బంతుల్లో 62; 9 ఫోర్లు, 1 సిక్స్), డు ప్లెసిస్ (25 బంతుల్లో 36; 1 ఫోర్, 3 సిక్సర్లు) చెలరేగారు. దీంతో రెండో వికెట్‌కు వీరి మధ్య 87 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. డుమిని (16 బంతుల్లో 29; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) చివర్లో వేగంగా ఆడాడు. బౌల్ట్, గ్రాండ్‌హోమ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కివీస్ 14.5 ఓవర్లలోనే 107 పరుగులకు కుప్పకూలింది.
తాహిర్‌కు తోడు పేసర్ ఫెలుక్‌వాయో (3/19), మోరిస్ (2/10) రెచ్చిపోవడంతో ఆతిథ్య జట్టు వరుస విరామాల్లో వికెట్లను కోల్పోయింది. బ్రూస్ (33; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా... సౌతీ ఆఖర్లో 6 బంతుల్లోనే మూడు సిక్సర్ల సహాయంతో 20 పరుగులు చేయడంతో ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఈ ప్రదర్శనతో తాహిర్ అంతర్జాతీయ టి20ల్లో అజంతా మెండిస్ (26 మ్యాచ్‌ల్లో) తర్వాత తక్కువ (31) మ్యాచ్‌ల్లో 50 వికెట్లు పూర్తి చేసుకున్న బౌలర్‌గా నిలిచాడు. 19 నుంచి ఈ రెండు జట్ల మధ్య ఐదు వన్డేల సిరీస్ ప్రారంభమవుతుంది.