
ఈస్ట్ లండన్ (దక్షిణాఫ్రికా): ఇంగ్లండ్ గెలవాల్సిన మ్యాచ్ ఇది. చేతిలో 5 వికెట్లున్న ఇంగ్లండ్ ఆఖరి 6 బంతుల్లో 7 పరుగులు చేస్తే సరిపోతుంది. దక్షిణాఫ్రికాకు ఓటమి ఖాయమైన వేళ... సఫారీ పేసర్ లుంగి ఇన్‌గిడి (3/30) అద్భుతమే చేశాడు. అంతకుముందు 2 ఓవర్ల స్పెల్‌లో 25 పరుగులిచ్చిన ఈ పేసర్ ఆఖరి ఓవర్లో ఐదు పరుగులిచ్చి కరన్ (2), మొయిన్ అలీ (5)లను ఔట్ చేశాడు. అదే ఓవర్ ఆఖరి బంతికి రషీద్ రెండో పరుగు తీయబోయి రనౌటయ్యాడు. దీంతో అనూహ్యంగా తొలి టి20లో దక్షిణాఫ్రికా జట్టు పరుగు తేడాతో ఇంగ్లండ్‌పై గెలిచింది.
బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్లకు 177 పరుగులు చేసింది. టాపార్డర్ బ్యాట్స్‌మెన్ బవుమా (27 బంతుల్లో 43; 5 ఫోర్లు), డికాక్ (15 బంతుల్లో 31; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), వాన్ డెర్ డసెన్ (26 బంతుల్లో 31; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. తర్వాత ఇంగ్లండ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 176 పరుగులు చేడి ఓడింది. ఓపెనర్ జేసన్ రాయ్ (38 బంతుల్లో 70; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), కెప్టెన్ మోర్గాన్ (34 బంతుల్లో 52; 7 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడటంతో గెలుపుబాట పట్టింది. చివరి 12 బంతుల్లో 23 పరుగులు చేయాల్సిన తరుణంలో 19వ ఓవర్‌ను మోర్గాన్ 4, 4, 6తో చితకబాదాడు. 16 పరుగులు వచ్చాయి కానీ ఆఖరి బంతికి మోర్గాన్ అవుట్ కావడంతో కథ మారింది.
Comments
Please login to add a commentAdd a comment