కోహ్లికి అంత ఈజీ కాదు!
కేప్టౌన్ :ప్రపంచ క్రికెట్ లో పరుగుల మెషీన్గా దూసుకుపోతున్న భారత కెప్టెన్ విరాట్ కోహ్లికి అసలు సిసలైన పరీక్ష ముందన్నదని అంటున్నాడు దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్. వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా పర్యటనకు రాబోతున్న టీమిండియా సారథికి కఠిన పరీక్ష తప్పదని స్మిత్ అభిప్రాయపడ్డాడు. తమ పిచ్ ల్లో కోహ్లి రాణించడం అంత ఈజీ కాదని, అదే అతని బ్యాటింగ్ లో సత్తాకు సవాల్ గా నిలుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు.
'టెస్టు క్రికెట్ లో టీమిండియా అదరగొడతుంది. భారత్ విజయాల్లో కెప్టెన్ కోహ్లి భాగస్వామ్యం అధికం. బ్యాట్ తో రాణిస్తూ జట్టుకు వరుస విజయాల్ని కోహ్లి అందిస్తున్నాడు. భారత్ తో శ్రీలంక, కరీబియర్ పిచ్ ల్లో కోహ్లి నేతృత్వంలోని టీమిండియా జైత్రయాత్రను కొనసాగిస్తుంది.అయితే దక్షిణాఫ్రికా గడ్డపై భారత్ రాణించడం అనుకున్నంత ఈజీ కాదు. శ్రీలంక, కరీబియన్లలో బంతి బ్యాట్ మీదకి స్లోగా వస్తుంది. సఫారీ పిచ్ లు అందుకు భిన్నం. ఈ నేపథ్యంలో మా గడ్డపై భారత జట్టు కఠినమైన సవాల్ ఎదుర్కోవడం ఖాయం'అని స్మిత్ తెలిపాడు.
ఇదిలా ఉంచితే, ఇటీవల దక్షిణాఫ్రికా వన్డే కెప్టెన్సీకి గుడ్ బై చెబుతూ ఏబీ డివిలియర్స్ తీసుకున్న నిర్ణయాన్ని స్మిత్ స్వాగతించాడు. అదే సమయంలో డు ప్లెసిస్ కు వన్డే సారథ్య బాధ్యతల్ని సైతం అప్పచెబితే బాగుంటుందన్న ఏబీ అభిప్రాయాన్ని స్మిత్ కూడా సమర్ధించాడు. టెస్టుల్లో, టీ 20ల్లో అద్భుతమైన విజయాల్ని సాధిస్తున్న డు ప్లెసిస్ కు వన్డే కెప్టెన్సీ బాధ్యతలు అప్పచెప్పడం ఎంతమాత్రం తప్పుకాదన్నాడు. మూడు ఫార్మాట్లకు ఒకే కెప్టెన్ ఉంటే మానసికంగా జట్టు పరిస్థితి కూడా మెరుగ్గా ఉంటుందని స్మిత్ పేర్కొన్నాడు.