...తలా పిడికెడు!
ఆట ఏదైనా గెలుపోటములు సహజం. ఆడేవాళ్లయినా, చూసేవాళ్లయినా ఆటను ఆస్వాదించాలి. ప్రత్యర్థులు బాగా ఆడితే అభినందించాలి. కానీ దక్షిణాఫ్రికాతో రెండో టి20 సందర్భంగా కటక్‌లో ప్రేక్షకులు విజ్ఞత మరచిపోయారు. భారత జట్టు పేలవ ఆటతీరుకు నిరసనగా మైదానంలోకి బాటిళ్లు విసిరి పరువు తీశారు. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆసక్తిగా చూస్తున్న సిరీస్ కావడం వల్ల ఈ సంఘటనపై చాలా ఎక్కువగానే చర్చ జరిగింది. వాస్తవానికి మనం ఈ సిరీస్‌ను గాంధీ మహాత్ముడి పేరుతో నిర్వహిస్తున్నాం.
అహింస ఆయుధంగా దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన స్ఫూర్తి ప్రదాత పేరుతో జరుగుతున్న మ్యాచ్‌లో ఇలాంటి సంఘటన జరగడం నిజంగా దురదృష్టకరం. మైదానంలో ప్రేక్షకులు బాటిళ్లు విసరడం ఇప్పుడు కొత్తేం కాదు. గతంలో 1996 ప్రపంచకప్ సెమీఫైనల్ సందర్భంగా ఈడెన్ గార్డెన్స్‌లో ప్రేక్షకులు చేసిన గొడవ ఇప్పటికీ ప్రతి ప్రపంచకప్ సమయంలో గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. ఇలాంటి సంఘటనలు ప్రపంచ వ్యాప్తంగా అడపాదడపా జరుగుతూనే ఉన్నా... భారత ఉపఖండంలో కాస్త ఎక్కువగా కనిపిస్తుంటాయి. భారత్, పాక్, శ్రీలంక, బంగ్లాదేశ్... నాలుగు దేశాల్లోనూ క్రికెట్‌ను ఓ మతంలా ఆరాధిస్తుంటారు.
అందుకే గెలిస్తే నెత్తిన పెట్టుకుంటారు. ఓడినప్పుడు ఇళ్లపై రాళ్లు వేస్తుంటారు. పలు సందర్భాల్లో ఇలా జరిగినా ఈసారి శాంతి దూతలు గాంధీ-మండేలా సిరీస్ సందర్భంగా ఈ సంఘటన జరిగింది. బాటిళ్లు విసిరిన వారిలో ఈ సిరీస్‌కు ఉన్న పేరు, ప్రాముఖ్యత గురించి ఆలోచించే విజ్ఞత లేకపోయింది. దీనిపై క్రికెట్ ప్రపంచం అంతా ఆగ్రహం వ్యక్తం చేసింది. పలువురు మాజీ క్రికెటర్లు ప్రేక్షకుల ప్రవర్తనపై విరుచుకుపడ్డారు. గవాస్కర్ అయితే రెండేళ్ల పాటు కటక్‌లో అంతర్జాతీయ మ్యాచ్ నిర్వహించకూడదని డిమాండ్ చేస్తున్నారు.
అలాగే ఒడిశా క్రికెట్ సంఘానికి నిధులూ ఆపేయాలని అంటున్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని పూర్తిగా లైట్‌గా తీసుకుంది ధోని ఒక్కడే. ‘ప్రేక్షకులు కోపంతో బాటిళ్లు విసరరు. మొదట ఒకటి నుంచి పది బాటిళ్లు మాత్రమే కోపంతో వేస్తారు. ఆ తర్వాత మిగిలిన వాళ్లు సరదా కోసం వీరిని అనుసరిస్తారు. గతంలో మేం ఓ మ్యాచ్‌లో తొందరగా గెలిచినప్పుడూ ఇలా బాటిళ్లు విసిరారు. కాబట్టి ఇలాంటి సంఘటనకు ప్రాధాన్యత ఇవ్వడం అనవసరం. అయితే ఆటగాళ్ల భద్రత విషయంలో మాత్రం రాజీ పడకూడదు’ అని ధోని చెప్పాడు.నిజానికి ప్రేక్షకులు ఇలా ప్రవర్తించడాన్ని ఇంకో కోణంలోనూ చూడాలి. మన దగ్గర క్రికెట్ మ్యాచ్ ప్రత్యక్షంగా చూడటం ఓ ప్రహసనం. ఒక అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతుందంటే టిక్కెట్ కొనడం దగ్గరి నుంచి మ్యాచ్ చూసి ఇంటికి రావడం వరకూ అడుగడుగునా ప్రతిదీ ఓ గండమే.
టిక్కెట్ కోసం లైన్లలో గంటలకొద్దీ నిలబడాలి. తొక్కిసలాట జరగొచ్చు... లాఠీలు విరగొచ్చు... అయినా అభిమానం చెక్కుచెదరదు. ఇక ఏడు గంటలకు మ్యాచ్ అంటే ట్రాఫిక్‌ను అధిగమించడానికి ఐదు గంటల ముందే బయల్దేరాలి. మూడు గంటల పాటు లైన్లలో నిలుచోవాలి. పలుచోట్ల తనిఖీలు. సెల్‌ఫోన్ తెచ్చినందుకు వెనక్కు వెళ్లిన ప్రేక్షకుల సంఖ్య వేలల్లో ఉంటుంది. ఇక కొద్దిగా జనం పెరిగారంటే అక్కడా లాఠీచార్జిలు. నిజంగా క్రికెట్ చూడటానికి ఇంత కష్టపడాలా? ఇంత కష్టపడి మైదానంలోకి వచ్చి గొంతు చించుకుని అరుస్తూ తమ హీరోలను ప్రత్యక్షంగా చూడాలని ఆశిస్తే... మైదానంలో దోపిడి. నీళ్ల దగ్గరి నుంచి ఆహారం వరకు ప్రతీదీ దోపిడియే. అయినా అభిమానం చెక్కు చెదరదు. తీరా ఎంతో ఆశించి వస్తే కనీసం పోరాడకుండా తమ జట్టు చేతులెత్తేస్తే ఆక్రోశం రాక మానదు. అయితే దీనిని అధిగమించే విజ్ఞత అందరిలోనూ ఉండదు.
ప్రేక్షకుల ప్రవర్తననూ ఎవరూ సమర్ధించాల్సిన పని లేదు. కానీ ఇలాంటి సంఘటనలు పదే పదే ఎందుకు ఎదురవుతున్నాయో తెలుసుకోవాలి. ఆటను ఆస్వాదించే వాతావరణం స్టేడియాల్లో ఉంటోందా? ఇంగ్లండ్, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో కుటుంబాలతో కలిసి వెళ్లి సరదాగా మ్యాచ్ చూస్తూ ఓ పిక్నిక్ తరహాలో ఎంజాయ్ చేస్తారు. ప్రత్యర్థి బాగా ఆడినా అభినందిస్తారు. అందుకే ప్రేక్షకుల ముందు కంచెలు ఉండవు. నిజానికి అలాంటి వాతావరణం మన దగ్గర కల్పించలేకపోతున్నాం. క్రికెట్ మ్యాచ్ కోసం అభిమానులు అష్టకష్టాలు పడాల్సిన పరిస్థితిని ముందు మార్చాలి. తప్పు ప్రేక్షకుల వైపు నుంచే కాదు... అన్ని వైపుల నుంచీ ఉంది. మ్యాచ్‌ల నిర్వహణ సరిగా చేయలేని బోర్డుల దగ్గరి నుంచి... మైదానంలో నిలబడి ప్రేక్షకులను గమనించకుండా క్రికెట్ చూసే పోలీసుల వరకు... అందరిదీ తప్పే.
- సాక్షి క్రీడా విభాగం