IND Vs SA 1st ODI: South Africa Beat India By 9 Runs - Sakshi
Sakshi News home page

India vs South Africa: సంజూ పోరాటం వృదా.. తొలి వన్డేలో భారత్‌ ఓటమి

Published Fri, Oct 7 2022 5:35 AM | Last Updated on Fri, Oct 7 2022 8:48 AM

India vs South Africa 1st ODI: South Africa wins first ODI against India by 9 runs - Sakshi

లక్నో: స్టార్లు లేని భారత జట్టు దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌ను ఓటమితో మొదలుపెట్టింది. గురువారం జరిగిన తొలి వన్డేలో టీమిండియా 9 పరుగుల తేడాతో సఫారీ టీమ్‌ చేతిలో పరాజయం చవిచూసింది. ఆఖరి ఓవర్లో 31 పరుగులు కావాల్సివుండగా, సామ్సన్‌ వరుసగా 6, 4, 4 బాది ఆశలు పెంచాడు. కానీ తర్వాత 0, 4, 1 రావడంతో ఓటమి తప్పలేదు. వర్షం కారణంగా మ్యాచ్‌ను 40 ఓవర్లకు కుదించారు. మొదట దక్షిణాఫ్రికా 40 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది.

‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ హెన్రిచ్‌ క్లాసెన్‌ (65 బంతుల్లో 74నాటౌట్‌; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), డేవిడ్‌ మిల్లర్‌ (63 బంతుల్లో 75 నాటౌట్‌; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీలతో రాణించారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 17.4 ఓవర్లలో అభేద్యంగా 139 పరుగులు జోడించారు. శార్దుల్‌ 2 వికెట్లు తీశారు. అనంతరం భారత్‌ 40 ఓవర్లలో 8 వికెట్లకు 240 పరుగులు చేసి ఓడింది. సంజు సామ్సన్‌ (63 బంతుల్లో 86 నాటౌట్‌; 9 ఫోర్లు, 3 సిక్సర్లు), శ్రేయస్‌ అయ్యర్‌ (37 బంతుల్లో 50; 8 ఫోర్లు) మెరిపించారు. ఇన్‌గిడి 3, రబడ 2 వికెట్లు పడగొట్టారు.  

చెలరేగిన మిల్లర్, క్లాసెన్‌
టాస్‌ నెగ్గిన టీమిండియా ఫీల్డింగ్‌ ఎంచుకోగా... బ్యాటింగ్‌కు దిగిన సఫారీ ఓపెనర్లు డికాక్‌ (54 బంతుల్లో 48; 5 ఫోర్లు), జేన్‌మన్‌ మలాన్‌ (42 బంతుల్లో 22; 3 ఫోర్లు) మంచి ఆరంభాన్నే ఇచ్చారు. 12 ఓవర్లలో వికెట్‌ కోల్పోకుండా 49 పరుగులు చేసిన దక్షిణాఫ్రికాను శార్దుల్‌ ఠాకూర్‌ తొలి దెబ్బ తీశాడు. శ్రేయస్‌ అయ్యర్‌కు క్యాచ్‌ ఇచ్చి మలాన్‌   నిష్క్రమించగా,  తర్వాత వచ్చిన బవుమా (8), మార్క్‌రమ్‌లను భారత బౌలర్లు క్రీజులో నిలువనీయలేదు. కెప్టెన్‌ బవుమాను శార్దుల్,  మార్క్‌రమ్‌ (0) స్పిన్నర్‌ కుల్దీప్‌ బౌల్డ్‌ చేశారు. 71 పరుగుల వద్ద మూడో వికెట్‌ కూలింది. అడపాదడపా బౌండరీలు కొడుతూ నింపాదిగా ఆడుతున్న డికాక్‌ జట్టు స్కోరు 100 దాటాక రవి బిష్ణోయ్‌ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు.

తర్వాత క్లాసెన్‌కు మిల్లర్‌ జతయ్యాడు. ఇద్దరు మొదట కుదురుగా ఆడారు. తర్వాత పరుగుల వేగం పెంచారు. ఆఖరి 10 ఓవర్లలో ధాటిగా ఆడారు. ఈ క్రమంలో ముందుగా మిల్లర్‌ 50 బంతుల్లో (4 ఫోర్లు, 1 సిక్స్‌), రెండు బంతుల వ్యవధిలో క్లాసెన్‌ 52 బంతుల్లో (4 ఫోర్లు, 1 సిక్స్‌) ఫిఫ్టీలు పూర్తి చేసుకున్నారు. దీంతో జట్టు స్కోరు  200 పరుగుల మైలురాయి దాటింది. ఇవన్నీ అవేశ్‌ ఖాన్‌ వేసిన 36వ ఓవర్లోనే జరిగాయి. ఆ ఓవర్లో 12 పరుగులు సమర్పించుకున్న అతని తదుపరి ఓవర్లో (38) మిల్లర్‌ 4, 6 బాదేయడంతో 16 పరుగులు వచ్చాయి. ఆఖరి 10 ఓవర్లలో ఈ జోడీ 85 పరుగులు జతచేసింది. అబేధ్యమైన ఐదో వికెట్‌కు మిల్లర్, క్లాసెన్‌ 139 పరుగులు జోడించారు. డెత్‌ ఓవర్లలో మిల్లర్‌ క్యాచ్‌ను గైక్వాడ్, క్లాసెన్‌ క్యాచ్‌ను సిరాజ్‌ నేలపాలు చేయడం కూడా స్కోరు పెరిగేందుకు దోహదం చేసింది.

మెరిపించిన శ్రేయస్, సామ్సన్‌
భారీ లక్ష్య ఛేదనకు దిగిన భారత టాపార్డర్‌ నిరాశపరిచింది. ఓపెనర్లు శుబ్‌మన్‌ గిల్‌ (3), శిఖర్‌ ధావన్‌ (4) సహా వన్‌డౌన్‌ బ్యాటర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (42 బంతుల్లో 19; 1 ఫోర్‌) వికెట్లను కోల్పోయింది. ఐపీఎల్‌లో దంచేసే గైక్వాడ్, ఇషాన్‌ కిషన్‌ (37 బంతుల్లో 20; 3 ఫోర్లు) నెమ్మదిగా ఆడటంతో టి20ల మైకంలో ఉన్న భారత ప్రేక్షకుల్ని వన్డే మ్యాచ్‌ చాలాసేపు బోర్‌ కొట్టించింది. 3, 4, 5 ఓవర్ల (మెయిడిన్‌)లో ఒక్క పరుగు రాలేదు. 18వ ఓవర్లో టీమిండియా స్కోరు 50 పరుగులు చేరిందంటే బ్యాటింగ్‌ ఎంత చప్పగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. 51 పరుగులకే 4 కీలక         వికెట్లను కోల్పోయిన దశలో శ్రేయస్‌ అయ్యర్,   సంజూ సామ్సన్‌ కాసేపు క్రికెట్‌ మజాను అందించారు. షమ్సీ వేసిన 19వ ఓవర్లో అయ్యర్‌ 4, సామ్సన్‌ సిక్సర్‌ బాదడంతో తొలిసారిగా ఒక ఓవర్లో 15 పరుగులొచ్చాయి. ముఖ్యంగా అయ్యర్‌ బౌండరీలతో అదరగొట్టాడు.

షమ్సీ 21వ ఓవర్లో ‘హ్యాట్రిక్‌’ ఫోర్లు కొట్టాడు. ఇన్‌గిడి బౌలింగ్‌కు దిగితే అతనికి తన బ్యాటింగ్‌ సత్తా చూపించాడు. దీంతో 22.3 ఓవర్లో భారత్‌ 100 చేరింది. అదే జోరుతో శ్రేయస్‌ 33 బంతుల్లో (8 ఫోర్లు) మెరుపు వేగంతో అర్ధసెంచరీ సాధించాడు. కానీ అదే స్కోరు వద్దే ఇన్‌గిడి అతన్ని బోల్తా కొట్టించాడు. తర్వాత శార్దుల్‌ ఠాకూర్‌ వచ్చాక సంజూ వేగం పెంచాడు. 31.1 ఓవర్లో జట్టు స్కోరు 150కి చేరింది. ఇంకా భారత్‌ విజయానికి 8.5 ఓవర్లలోనే 100 పరుగులు కావాలి. టి20లకు కూడా కష్టమయ్యే చేజింగ్‌ వన్డేల్లో అసాధ్యం! సామ్సన్, శార్దుల్‌ (31 బంతుల్లో 33; 5 ఫోర్లు)ధాటిగా ఆడినా కొండంత రన్‌రేట్‌ కరగలేదు. 49 బంతుల్లో (3 ఫోర్లు, 2 సిక్సర్లు)      సంజూ  అర్ధసెంచరీ సాధించాడు. శార్దుల్‌          అవుటయ్యా క స్వల్ప వ్యవధిలో కుల్దీప్‌ (0), అవేశ్‌ (3) వికెట్లను కోల్పోయింది. దీంతో ఓటమి ఖాయమైంది.

స్కోరు వివరాలు
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌: మలాన్‌ (సి) అయ్యర్‌ (బి) శార్దుల్‌ 22; డికాక్‌ (ఎల్బీ) (బి) బిష్ణోయ్‌ 48; బవుమా (బి) శార్దుల్‌ 8; మార్క్‌రమ్‌ (బి) కుల్దీప్‌ 0; క్లాసెన్‌ నాటౌట్‌ 74; మిల్లర్‌ నాటౌట్‌ 75; ఎక్స్‌ట్రాలు 22; మొత్తం (40 ఓవర్లలో 4 వికెట్లకు) 249.
వికెట్ల పతనం: 1–49, 2–70, 3–71, 4–110.
బౌలింగ్‌: సిరాజ్‌ 8–0–49–0, అవేశ్‌ 8–0–51–0, శార్దుల్‌ 8–1–35–2, రవి బిష్ణోయ్‌ 8–0–69–1, కుల్దీప్‌ 8–0–39–1.

భారత్‌ ఇన్నింగ్స్‌: ధావన్‌ (బి) పార్నెల్‌ 4; గిల్‌ (బి) రబడ 3; రుతురాజ్‌ (స్టంప్డ్‌) డికాక్‌ (బి) షమ్సీ 19; ఇషాన్‌ కిషన్‌ (సి) మలాన్‌ (బి) కేశవ్‌ 20; అయ్యర్‌ (సి) రబడ (బి) ఇన్‌గిడి 50; సామ్సన్‌ నాటౌట్‌ 86; శార్దుల్‌ (సి) కేశవ్‌ (బి) ఇన్‌గిడి 33; కుల్దీప్‌ (సి) బవుమా (బి) ఇన్‌గిడి 0; అవేశ్‌ (సి) బవుమా (బి) రబడ 3; బిష్ణోయ్‌ నాటౌట్‌ 4; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (40 ఓవర్లలో 8 వికెట్లకు)  
వికెట్ల పతనం: 1–8, 2–8, 3–48, 4–51, 5–118, 6–211, 7–211, 8–215.
బౌలింగ్‌: రబడ 8–2–36–2, పార్నెల్‌ 8–1–38–1, కేశవ్‌ 8–1–23–1, ఇన్‌గిడి 8–0–52–3, షమ్సీ 8–0–89–1.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement