
లండన్: ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా చివరి మ్యాచ్ ద్వారా అరంగేట్రం చేసిన తెలుగు కుర్రాడు హనుమ విహారి తొలి మ్యాచ్‌లోనే ఆకట్టుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ ఆరంభంలో కాస్త తడబడినా.. కుదురుకున్నాక స్వేచ్ఛగా ఆడాడు. చక్కటి డిఫెన్స్, టెక్నిక్‌తో ఇంగ్లండ్‌డ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. టెస్టు అరంగేట్రం మ్యాచ్‌లోనే విహారి(56; 124 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్) హాఫ్ సెంచరీ సాధించి.. ఇంగ్లండ్ గడ్డ మీద ఈ ఘనత సాధించిన ద్రవిడ్, గంగూలీల సరసన నిలిచాడు.
అరంగేట్రం చేయబోతున్న విషయం మ్యాచ్ ప్రారంభానికి ముందు రోజే తనకు తెలిసిందని విహారి తెలిపాడు. వెంటనే ఇండియా-ఏ కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు ఫోన్ కాల్ చేసి ఇదే విషయం చెప్పానన్నాడు. చాలాసేపు ద్రవిడ్‌తో మాట్లాడిన తనకు కొన్ని సలహాలు ఇచ్చాడని, అలా మాట్లాడటం వల్ల మ్యాచ్‌కు ముందు తనపై ఒత్తిడి తగ్గిందని విహారి తెలిపాడు.
‘నీకు నైపుణ్యం ఉంది, మంచి ఆలోచనా విధానం, టెంపర్‌మెంట్ ఉంది. బరిలో దిగి ఆటను ఆస్వాదించు’ అని ద్రవిడ్ చెప్పాడని విహారి తెలిపాడు. ఇండియా-ఏ తరఫున రాణించడంతోపాటు ద్రవిడ్ సూచనలు తనను మెరుగైన ఆటగాడిగా మార్చాయని హనుమ విహారి పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment