
ఆస్ట్రేలియా గడ్డపై భారత్ టెస్టు సిరీస్ విజయం... ఎన్నో ఏళ్లుగా సాధ్యం కాని ఈ కల ఇప్పుడే నెరవేరింది. కొత్త చరిత్రలో భాగమైన ప్రతీ ఒక్క ఆటగాడు తాము సాధించిన ఘనత పట్ల గర్వపడుతున్నారు. టీమిండియా జట్టు సభ్యుడిగా మన తెలుగువాడు గాదె హనుమ విహారి కూడా విజయానందంలో ఉన్నాడు. ఈ సిరీస్‌లో మూడు టెస్టులు ఆడిన అతను జట్టు అవసరాలకు అనుగుణంగా కీలక ప్రదర్శన చేశాడు. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో శుభారంభం తర్వాత తాజా పర్యటన అతని కెరీర్‌కు కొత్త ఊపును తెచ్చింది. టెస్టు జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా అతని స్థానాన్ని దాదాపు ఖాయం చేసింది. మున్ముందు మరిన్ని గొప్ప ఇన్నింగ్స్‌లు ఆడటమే లక్ష్యంగా పెట్టుకున్న విహారి... ఆస్ట్రేలియా సిరీస్ గురించి తన అనుభవాలను ‘సాక్షి’తోపంచుకున్నాడు.
సాక్షి, హైదరాబాద్ : ఓపెనర్‌గా అవకాశం రావడాన్ని సవాల్‌గానే స్వీకరించాను గానీ, ఆందోళన చెందలేదని భారత క్రికెటర్ హనుమ విహారి అన్నాడు. మెల్‌బోర్న్‌లో జరిగిన మూడో టెస్టులో ఓపెనింగ్ చేసిన విహారి, తొలి టెస్టు ఆడుతున్న మయాంక్‌తో కలిసి జట్టు భారీ స్కోరుకు పునాది వేశాడు. బ్యాటింగ్‌లో తాను మరిన్ని పరుగులు సాధిస్తే బాగుండేదన్న ఈ ఆంధ్ర క్రికెటర్... సిరీస్ గెలుపు మాత్రం చిరస్మరణీయంగా నిలిచిపోతుందని వ్యాఖ్యానించాడు. ఈ పర్యటనకు సంబంధించి అతను చెప్పిన విశేషాలు విహారి మాటల్లోనే...
ఆస్ట్రేలియాలో సిరీస్ విజయంపై...
ఒక్క మాటలో చెప్పాలంటే గర్వంగా అనిపిస్తోంది. సిరీస్ గెలుచుకున్న క్షణాలు నిజంగా అద్భుతం. ఆఖరి మ్యాచ్ ఫలితం నాలుగో రోజే దాదాపుగా ఖాయమైపోయింది కాబట్టి ఒక్కసారిగా భావోద్వేగానికి గురి కాలేదు. పైగా మెల్‌బోర్న్ టెస్టు గెలిచిన తర్వాత సిరీస్ సాధించగలమనే నమ్మకం మరింత పెరిగింది. ‘డ్రా’ కూడా సరిపోతుందని అందరికీ తెలుసు. కాబట్టి ఉత్సాహంగానే బరిలోకి దిగాం. మొత్తంగా ఇంతటి చారిత్రక ఘట్టంలో నేను కూడా భాగం కావడం చాలా సంతోషంగా ఉంది. గతంలో అండర్–19 స్థాయిలో ఆస్ట్రేలియాలో ఆడాను తప్ప సీనియర్ క్రికెటర్‌గా కాదు. ఇప్పుడు నా తొలి ఆసీస్ టూర్‌లోనే టీమిండియా గొప్ప ఘనత సాధించడం నిజంగా చిరస్మరణీయం.
సొంత బ్యాటింగ్ ప్రదర్శనపై...
కొంత నిరుత్సాహపడిన మాట వాస్తవం. అయితే ప్రతీది భారీ స్కోరు కోణంలోనే చూడలేం. మనం జట్టుకు ఏ రకంగా ఉపయోగపడ్డాం, విజయంలో మన భాగస్వామ్యం ఏమిటనేది కూడా కీలకం. అలా చూస్తే నేను టీమ్ అవసరాలకు అనుగుణంగా ఆడి నా పాత్రను పోషించాను. నిజానికి మంచి ఆరంభాలు లభించినా వాటిని పెద్ద స్కోర్లుగా మలచలేకపోయాను. అయితే సిడ్నీ టెస్టులో మంచి స్కోరు చేసే అవకాశం దురదృష్టవశాత్తూ పోయింది. నేను మంచి జోరు మీదున్నప్పుడు అనూహ్యంగా ఔట్ కావడం తీవ్ర నిరాశకు గురి చేసింది. ఇప్పుడు నేను అంపైర్ నిర్ణయాన్ని తప్పుపట్టను కానీ అలా జరగడం నా బ్యాడ్‌లక్ అంతే (రీప్లేలో విహారి నాటౌట్‌గా తేలింది). మున్ముందు మాత్రం కచ్చితంగా భారీ స్కోర్లు సాధిస్తాను.
ఓపెనింగ్‌కు సాహసించడంపై...
ఓపెనర్‌గా వెళ్లటానికి ఆందోళన చెందలేదు. ఆత్మవిశ్వాసంతోనే మైదానంలో అడుగు పెట్టాం. అటువైపు మయాంక్‌కు అదే తొలి టెస్టు కూడా. ‘ఎ’ జట్టు తరఫున కలిసి ఆడాం కాబట్టి మా మధ్య మంచి సమన్వయం ఉంది. టీమ్ మేనేజ్‌మెంట్‌కు నా డిఫెన్స్‌పై నమ్మకం కలిగింది. అందుకే నన్ను పంపించారు. ఆస్ట్రేలియాలాంటి కీలక సిరీస్‌లో టెస్టు మ్యాచ్ తుది జట్టులో అవకాశం లభించడమే గొప్ప. అలాంటి స్థితిలో నేను ఏ స్థానంలో ఆడాలనేదాని గురించి ఆలోచించడం అనవసరం. ఎక్కడ ఆడినా అదో మంచి అవకాశంగా భావించి సత్తా చాటడమే. తొలి రెండు టెస్టులలో మన జట్టుకు మంచి ఆరంభాలు లభించలేదు. ఈ నేపథ్యంలో దానిని సవాల్‌గా తీసుకొని సాధ్యమైనంత ఎక్కువ సేపు క్రీజ్‌లో ఉండి ప్రధాన పేసర్లను నిరోధించేందుకు ప్రయత్నించా. ఆ సమయంలో నేను ఎదుర్కొన్న 66 బంతులు సెంచరీతో సమానమని కోహ్లి చేసిన ప్రశంసను ఎలా మరచిపోగలను!
బౌలింగ్ గురించి...
సిరీస్‌లో ఐదు ఇన్నింగ్స్‌లలోనూ కలిపి 35 ఓవర్లు బౌలింగ్ చేశాను. బ్యాటింగ్‌తో పాటు నేను అదనంగా జట్టుకు ఉపయోగపడితే మంచిదే కదా. అందుకే బౌలింగ్‌పై కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాను. ప్రతీ రోజు బౌలింగ్‌ను కూడా మెరుగుపర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నా. పెర్త్ టెస్టులో కీలక సమయంలో రెండు ప్రధాన వికెట్లు దక్కడం నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. మూడో టెస్టు తర్వాత ‘విహారి చాలా చక్కగా బౌలింగ్ చేశాడు. అతని ఆఫ్‌స్పిన్ వల్ల జట్టులో అశ్విన్ లేని లోటు కనిపించలేదు. అతనికి ఎప్పుడు బంతినిచ్చినా వికెట్ తీసేలా కనిపించాడు’ అని కెప్టెన్ నా గురించి వ్యాఖ్యానించడం కూడా నాకు మరింత ఆనందాన్నివ్వడంతో పాటు బాధ్యతనూ పెంచింది.
వన్డే జట్టులో అవకాశాలపై...
దాని గురించి అతిగా ఆశ పడటం లేదు. అండర్–19 వరల్డ్ కప్ గెలిచి వచ్చాక నేను పెట్టుకున్న కొన్ని ఆశలు తలకిందులయ్యాయి కాబట్టి ఎక్కువగా ఆలోచించడం లేదు. ఇటీవల స్వదేశంలో విండీస్‌తో, ఆ తర్వాత అడిలైడ్ టెస్టులో చాన్స్ రానప్పుడు కొంత బాధ పడినా... సెలక్షన్ విషయంలో మనం చేసేదేం ఉండదు. వచ్చిన అవకాశాలను బాగా ఉపయోగించుకోవడమే. అదే విధంగా ఐపీఎల్‌లో కూడా కొంత విరామం తర్వాత (2015లో ఆఖరిసారి) తిరిగొస్తున్నాను. అయితే 21 ఏళ్ల వయసులో ఉన్నప్పటితో పోలిస్తే నా ఆలోచనా ధోరణి మారింది. ఆత్మవిశ్వాసం కూడా పెరిగింది. నేను ఇప్పుడు మూడు ఫార్మాట్‌లకు అనుగుణంగా ఎప్పటికప్పుడు నా ఆటను మార్చుకోగలను. ఇటీవల దానిని చేసి చూపించాను కూడా. పైగా ఇప్పుడు భారత జట్టు సభ్యుడనే గుర్తింపుతో మ్యాచ్‌లు ఆడబోతున్నాను కాబట్టి ఏం చేయాలో నాకు తెలుసు.