జట్టులో లెక్కకు మిక్కిలి స్టార్లు... మ్యాచ్ ఫలితాన్ని మార్చేసే ఆటగాళ్లు... తడబడినా ఎదురీదగలిగేంత స్థైర్యం... నిలదొక్కుకుని గెలవగల బలగం... ...ఇదీ ముంబై ఇండియన్స్ పరిచయంజట్టును నడిపించేదే ఓ దిగ్గజం... ప్రతికూలత ఎదురైనా వెరవని వైనం... ఉన్న వనరులతోనే గెలవగల నేర్పు... సమష్టి ఆటతీరుకు పెట్టింది పేరు... ...ఇదీ చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్థానం
సాక్షి క్రీడా విభాగం : ఐపీఎల్ పది సీజన్లలో ఐదుసార్లు విజేతలు ముంబై ఇండియన్స్ (3), చెన్నై సూపర్‌కింగ్స్ (2) జట్లే. అంటే, మొత్తం టైటిళ్లలో సగం ఈ రెండింటి వద్దే ఉన్నట్లు. దీంతోపాటు ముంబై ఒకసారి, చెన్నై నాలుగుసార్లు రన్నరప్‌గా నిలిచాయి. గణాంకాలు చూస్తేనే తెలిసిపోతుంది ఈ రెండు ఫ్రాంచైజీలు ఎంత బలమైనవో! క్రమంగా ఊపందుకుని కప్‌ను ఎగరేసుకుపోవడం ముంబై తీరైతే, అడ్డంకులను అధిగమిస్తూ, నిలకడైన ఆటతో టైటిల్ కొట్టేయడం చెన్నై లక్షణం. ఈ ఏడాది రోహిత్ శర్మ నేతృత్వంలోని ముంబై డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలో దిగుతుండగా, రెండేళ్ల నిషేధం తొలగిన చెన్నై మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలో పూర్వ వైభవం పొందాలని ఆశిస్తోంది. మరి వీటి బలాబలాలేమిటో, బలహీనతలేమిటో చూద్దాం...!
క్రమంగా... బలంగా...
తొలి రెండు సీజన్లు లీగ్ దశలో నిష్క్రమణ, తర్వాత మూడేళ్లలో ఒకసారి రన్నరప్, రెండుసార్లు ప్లే ఆఫ్స్, చివరి ఐదేళ్లలో మూడుసార్లు చాంపియన్. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ ప్రయాణాన్ని ఇలా మూడు దశలుగా చెప్పుకోవాలి. ఒక దశలో స్టార్లు ఎక్కువై, ఆటగాళ్లు తక్కువై ఫలితాల పరంగా ఈ జట్టు పూర్తిగా నిరాశపరిచింది. కానీ, రోహిత్ చేతికి పగ్గాలు వచ్చాక పరిస్థితి మారింది. 2013లో కొన్ని మ్యాచ్‌లకు కెప్టెన్సీ చేసిన ఈ హిట్‌మ్యాన్... తర్వాతి ఏడాది నుంచి పూర్తిస్థాయి సారథిగా జట్టును నడిపిస్తున్నాడు. ముఖ్యంగా 2015, 2017లలో టైటిల్ గెలవడంలో రోహిత్‌దే ముఖ్య పాత్ర. వేలంలోనూ మంచి ఆటగాళ్లను ఎంచుకుని ఈసారి సైతం భారీ అంచనాలతోనే రంగంలోకి వస్తోంది. అయితే... రోహిత్ కాక చెప్పుకోదగ్గ బ్యాట్స్‌మెన్ ఎవిన్ లూయీస్, డుమిని, సౌరభ్ తివారీ మాత్రమే కావడంతో బ్యాటింగ్ భారమంతా కెప్టెన్‌పైనే పడేలా కనిపిస్తోంది. హార్దిక్, కృనాల్ పాండ్యా, పొలార్డ్ వంటి ఆల్‌రౌండర్లు, బుమ్రా, కమిన్స్, ముస్తాఫిజుర్ వంటి పేసర్లు ఉండటం భరోసానిస్తోంది.
ఇదీ జట్టు: రోహిత్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, సౌరభ్ తివారీ, సూర్యకుమార్, సిద్దేశ్ లాడ్, శరద్‌లాంబా, తజిందర్ దిల్లాన్, మయాంక్ మార్కండే, అనుకూల్ రాయ్, ఇషాన్ కిషన్, తారే, బుమ్రా, రాహుల్ చహర్, మొహిసిన్ ఖాన్, నిధీశ్, ప్రదీప్ సాంగ్వాన్ (స్వదేశీ), డుమిని, లూయీస్, కట్టింగ్, ధనంజయ, పొలార్డ్, బెహ్రన్‌డార్ఫ్, కమిన్స్, ముస్తాఫిజుర్, మెక్లీనగన్ (విదేశీ).
ఘన పునరాగమనం కోసం...
ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్టంటే చెన్నై సూపర్ కింగ్సే. 2008 నుంచి 2015 వరకు ఎనిమిది సీజన్లలో రెండుసార్లు విజేతగా నిలిచిందీ జట్టు. నాలుగుసార్లు రన్నరప్‌తో సరిపెట్టుకోగా, రెండుసార్లు సెమీఫైనల్స్‌కు చేరింది. పరిస్థితులకు తగ్గట్లు జట్టు సభ్యులను వాడుకునే ధోని నాయకత్వ ప్రతిభ, రైనా మెరుపులకు మిగతా ఆటగాళ్ల సహకారం తోడవడంతో లీగ్‌లో చెన్నై ఎప్పుడూ పేలవ ప్రదర్శన చేయలేదు. ఉన్న వనరులతోనే ఫలితం రాబట్టగలడం ధోని శైలి కాబట్టి ఈసారి కూడా పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదు. అయితే... టి20 స్థాయికి తగిన ఓపెనర్లు లేకపోవడం లోటు. వాట్సన్ మునుపటి స్థాయిలో ఆడట్లేదు. దీంతో బిల్లింగ్స్, విజయ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశం ఉంది. డు ప్లెసిస్, జాదవ్, రైనా, రాయుడు, ధోనిలతో బ్యాటింగ్ ఆర్డర్ బలంగా ఉంది. బ్రావో, ఇన్‌గిడి, శార్దుల్ పేస్ బాధ్యతలు మో స్తారు. రెండేళ్ల నిషేధంతో జట్టు స్వరూపం కొంత మారినా... మహి నాయకత్వ పటిమ, స్థానిక అభిమానుల మద్దతు చెన్నైకి పెద్ద బలం. దీంతో ఎప్పటిలానే ఈ ఫ్రాంచైజీ కనీసం సెమీస్‌కు చేరగలదని చెప్పొచ్చు.
ఇదీ జట్టు
ధోని (కెప్టెన్), రైనా, మురళీ విజయ్, హర్భజన్, జాదవ్, రాయుడు, ధ్రువ్ షోరే, జడేజా, కరణ్ శర్మ, క్షితిజ్ శర్మ, నారాయణ్ జగదీశన్, కేఎం ఆసిఫ్, చైతన్య బిష్ణోయ్, దీపక్ చహర్, మోను కుమార్, కనిష్క్ సేథ్, శార్దుల్ ఠాకూర్ (స్వదేశీ). డు ప్లెసిస్, బ్రావో, వాట్సన్, బిల్లింగ్స్, ఇన్‌గిడి, తాహిర్, మార్క్ వుడ్ (విదేశీ).
Comments
Please login to add a commentAdd a comment