విజయ విశ్వ సారథులు | Special story on world cup 2019 | Sakshi
Sakshi News home page

విజయ విశ్వ సారథులు

Published Sat, May 18 2019 12:35 AM | Last Updated on Sat, Jun 1 2019 6:34 PM

Special story on world cup 2019 - Sakshi

మరో 12 రోజుల్లో...  క్రికెట్‌ అంటే... జట్టుగా ఆడే   జెంటిల్మన్‌ ఆట. విజయమైనా, ఓటమైనా మైదానంలో దిగిన పదకొండు మంది క్రీడాకారులదే బాధ్యత. జగమెరిగిన ఈ సామెత దిగ్గజాలు సహా అందరూ చెప్పేదే! అయితే, ఇందులో కెప్టెన్‌ పాత్ర మరింత కీలకం. జట్టులోని వారంతా సమానమే అయినా... బృందాన్ని సమష్టిగా నడిపించడం, పరిస్థితులకు తగ్గట్లు వ్యూహాలు రచించడం, అప్పటికప్పుడు ఎత్తుగడలు వేయడం ద్వారా సారథిని   ప్రత్యేకమైన వాడిగా పరిగణిస్తారు. సాధారణ టోర్నమెంట్లలో ఎలా ఉన్నా ప్రపంచ కప్‌నకు వచ్చేసరికి కెప్టెన్లపై దృష్టి ఎక్కువగా ఉంటుంది. అత్యంత ప్రతిష్ఠాత్మకమైనది కావడంతో వారు తీసుకునే     నిర్ణయాలు చర్చ రేకెత్తిస్తాయి. ఇలా... తమదైన శైలిలో అడుగులు వేసి, దేశానికి ప్రపంచ కప్‌ అందించిన వారెవరో చూద్దామా?  

సాక్షి క్రీడా విభాగం : ఇప్పటి వరకు జరిగిన పదకొండు ప్రపంచ కప్‌లలో తొమ్మిది మంది కెప్టెన్లు టైటిల్‌ను సగర్వంగా పైకెత్తారు. క్లయివ్‌ లాయిడ్‌ (వెస్టిండీస్‌), రికీ పాంటింగ్‌ (ఆస్ట్రేలియా) రెండేసి సార్లు వరుసగా ఈ ఘనతను సాధించారు. వారి కృషిని తక్కువ చేయడం కాదు కాని, మేటి ఆటగాళ్లతో కూడిన జట్టుండటం ఈ ఇద్దరికీ కొంత కలిసొచ్చింది. మిగతా ఏడుగురూ క్లిష్ట పరిస్థితులకు ఎదురొడ్డినవారే. నాయకుడిగా నేనున్నానంటూ ముందుకొచ్చి, ఒత్తిడినంతా మీదేసుకుని అసలే మాత్రం అవకాశాలు లేని స్థితి నుంచి జట్టును చాంపియన్లుగా నిలిపిన వారు కొందరైతే, అత్యంత ఉత్కంఠను తట్టుకుని జగజ్జేతను చేసిన వారు మరికొందరు. చిత్రమేమంటే... వీరిలో కొందరు ఆ వెంటనే తప్పుకోగా, ఇంకొందరు తర్వాతి కప్‌ను అందించలేకపోయారు. 

కపిల్‌... విడవకుండా పట్టి 
స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఆటగాళ్ల ఎంపిక జట్టు జయాపజయాలను నిర్దేశిస్తుంది. 1983 కప్‌లో భారత దిగ్గజం కపిల్‌ దేవ్‌ ఇదే పని చేశాడు. ఇంగ్లండ్‌ వాతావరణానికి తగ్గట్టు బల్వీందర్‌ సంధు, రోజర్‌ బిన్నీ, కీర్తి ఆజాద్‌లతో బౌలింగ్‌ దళాన్ని, మదన్‌లాల్, మోహిందర్‌ అమర్‌నాథ్‌ వంటి ఆల్‌రౌండర్లతో బ్యాటింగ్‌ లోతు పెంచాడు. ఈ వ్యూహం... జింబాబ్వేతో మ్యాచ్‌లో 17 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన దశలో కపిల్‌ 175 పరుగుల మారథాన్‌ ఇన్నింగ్స్‌కు వెన్నెముకలా పనిచేసింది. కపిల్‌ స్ఫూర్తితో తర్వాత భారత్‌ రెట్టించి ఆడింది. లాయిడ్‌ కెప్టెన్సీకి తోడు విధ్వంసక రిచర్డ్స్‌ ఉన్న విండీస్‌ను ఫైనల్లో 43 పరుగుల తేడాతో మట్టికరిపించింది. తుది సమరంలో రిచర్డ్స్‌ క్యాచ్‌ను 40 గజాల వెనక్కి పరిగెత్తి మరీ కపిల్‌ అందుకున్న తీరు స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవడంలో మన జట్టుకు ఉత్ప్రేరకంగా పనిచేసింది. 

లాయిడ్‌...ఆ రెండు సందర్భాలు 
ధాటిగా బాదేసే బ్యాట్స్‌మెన్, బెంబేలెత్తించే పేసర్లతో 1975, 1979 కప్‌లు విండీస్‌ దాసోహమయ్యాయి. అయితే,  ప్రతిభావంతులంతా ఒకే చోట ఉన్నా ఇబ్బంది లేకుండా ఒక్కటిగా నడిపించాడు లాయిడ్‌. అతడి కెప్టెన్సీ సామర్థ్యం, స్ఫూర్తికి ఉదాహరణ 1975 ఫైనల్‌. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పేసర్లు లిల్లీ, థాంప్సన్‌ ధాటికి 50/3తో నిలిచిన విండీస్‌ను లాయిడ్‌ (85 బంతుల్లో 102) సెంచరీతో బయట పడేశాడు. 291 పరుగుల ఛేదనలో ప్రత్యర్థి దీటుగా బదులిస్తున్న సమయంలో పొదుపైన బౌలింగ్‌ (1/38)తో జట్టుకు కప్‌ అందించాడు. ఇక 1979 కప్‌లో లీగ్‌ మ్యాచ్‌లన్నీ గెలిచి సెమీస్‌ చేరిన విండీస్‌కు... 294 పరుగుల ఛేదనలో జహీర్‌ అబ్బాస్‌ (93) అద్భుత బ్యాటింగ్‌తో పాకిస్తాన్‌ సవాల్‌ విసిరింది. అయితే, విరామ సమయంలో లాయిడ్‌ మెదడుకు పదును పెట్టాడు. లెగ్‌ స్టంప్‌ లక్ష్యంగా బంతులేయించి అబ్బాస్‌ ఆట కట్టించాడు. అప్పటికి 176/1తో ఉన్న పాక్‌ తర్వాత 250కే ఆలౌటైంది. మళ్లీ లాయిడ్‌లాంటి    కెప్టెన్‌ దొరక్కపోవడమే విండీస్‌ చేసుకున్న దురదృష్టం.
 
క్లార్క్‌... పోరాడి 
గాయంతో ఇబ్బంది పడుతూనే 2015 కప్‌లో ఆడాడు ఆస్ట్రేలియా కెప్టెన్‌ మైకేల్‌ క్లార్క్‌. సొంతగడ్డపై 23 ఏళ్ల తర్వాత జరిగిన ఈ మెగా ఈవెంట్‌లో క్లార్క్‌ తొలుత పెద్దగా రాణించకున్నా జట్టులో సమష్టితత్వం దెబ్బతినకుండా చూశాడు. కీలకమైన నాకౌట్‌ దశలో ఫామ్‌లోకి వచ్చిన క్లార్క్‌ మంచి ఇన్నింగ్స్‌ ఆడాడు. క్వార్టర్స్‌లో పాకిస్తాన్‌ను, సెమీస్‌లో భారత్‌ను ఆసీస్‌ తేలిగ్గా ఓడించింది. ఫైనల్లో మరింత సాధికారికంగా ఆడి అద్భుతమైన ఫామ్‌లో ఉన్న న్యూజిలాండ్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో క్లార్క్‌ (74) టాప్‌ స్కోరర్‌ కావడం గమనార్హం. టోర్నీలో ఆసీస్‌... కివీస్‌ చేతిలో మాత్రమే అదీ లీగ్‌ దశలో ఓడింది.  

పాంటింగ్‌... గట్టోడే 
స్టీవ్‌ వా వన్డేల నుంచి వైదొలగడంతో కెప్టెన్సీ దక్కిన పాంటింగ్‌... కప్‌ను ఎంతవరకు నిలబెడతాడో అన్న అనుమానాలుండేవి. అయితే వాటిని పటాపంచలు చేస్తూ ఆస్ట్రేలియాను వరుసగా రెండుసార్లు విజేతగా నిలిపాడు. ఈ క్రమంలో విమర్శలెదురైనా తన దూకుడుతో ఎక్కడా జోరు తగ్గకుండా చూశాడు. 2003లో వరుసగా 11 మ్యాచ్‌లలో గెలిపించాడు. ఫైనల్లో అతడి ఇన్నింగ్స్‌ (121 బంతుల్లో 140) అయితే భారత్‌ అభిమానులకు చాలా రోజులు నిద్ర లేని రాత్రులు మిగిల్చింది. ఆసీస్‌ 2007లోనూ ఈ జైత్రయాత్ర కొనసాగించి వరుసగా 12 మ్యాచ్‌ల్లో గెలిచింది. అచ్చం లాయిడ్‌లాగే ఈ రెండు టోర్నీల్లో మేటి ఆటగాళ్లున్న జట్టును ఒక్కతాటిపై నడిపిన పాంటింగ్‌ స్వయంగా బ్యాట్‌తోనూ రాణించాడు. వరుసగా 415, 539 పరుగులు చేశాడు. 

‘స్టీల్‌’ వా.... 
జట్టులో తీవ్ర పోటీని తట్టుకుని అంతకుముందే మార్క్‌ టేలర్‌ నుంచి స్టీవ్‌ వా సారథ్య బాధ్యతలు అందుకున్నాడు. దీంతో 1999 ప్రపంచ కప్‌ సమయానికి తానేంటో నిరూపించుకోవాల్సిన పరిస్థితి స్టీవ్‌ వాది. కానీ, కప్‌ ప్రారంభంలోనే పాక్, కివీస్‌ చేతిలో ఓటములు. దక్షిణాఫ్రికాపై సూపర్‌ సిక్స్‌ దశ మ్యాచ్‌లో 272 పరుగుల ఛేదనలో 48 పరుగులకే 3 వికెట్ల పతనం. ఈ దశలో స్టీవ్‌ వా మొక్కవోని ధైర్యంతో 110 బంతుల్లో 120 పరుగులు చేసి జట్టును గట్టెక్కించాడు. సెమీస్‌లో ఇదే ప్రత్యర్థిపై మొండిగా నిలిచి అర్ధ సెంచరీ (56) చేశాడు. 213 పరుగులే చేసినా దానిని కాపాడుకోవడంలో స్టీవ్‌ స్ఫూర్తితో ఆసీస్‌ తెగువ కనబర్చింది. చివరకు మ్యాచ్‌ టై కావడం, సూపర్‌ సిక్స్‌ ఫలితంతో ఫైనల్‌కెళ్లడం కప్‌ కొట్టేయడం చకచకా జరిగిపోయాయి. 

బోర్డర్‌... గట్టు దాటించాడు 
కీలక ఆటగాళ్ల రిటైరయ్యారు. కుర్రాళ్లింకా కుదురుకోలేదు. 1980లలో ఆస్ట్రేలియా పరిస్థితిది. జట్టు మేటిగా ఎదగాలంటే పెద్ద మలుపులాంటి విజయం కావాలి. ఇలాంటి దశలో 1987 ప్రపంచ కప్‌ అందించి అలెన్‌ బోర్డర్‌ మార్గనిర్దేశం చేశాడు. ఆతిథ్య దేశం, డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ను తొలి మ్యాచ్‌లో ఒక్క పరుగు తేడాతో ఓడించిన ఆసీస్‌... అదే ఆత్మవిశ్వాసంతో నాలుగు లీగ్‌ మ్యాచ్‌లూ గెలిచి సెమీస్‌ చేరింది. సహ ఆతిథ్య దేశం పాకిస్తాన్‌ను లాహోర్‌లో జరిగిన సెమీస్‌లో 18 పరుగులతో ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. తుది సమరంలో మైక్‌ గ్యాటింగ్‌ మెరుపులతో 254 పరుగుల ఛేదనను ఇంగ్లండ్‌ సులువుగా పూర్తి చేసేలా కనిపించింది. ఈ సమయంలో పార్ట్‌టైమ్‌ బౌలరైన బోర్డర్‌ బంతిని అందుకుని సాహసానికి దిగాడు. అత్యుత్సాహానికి పోయిన గ్యాటింగ్‌ రివర్స్‌ స్వీప్‌నకు యత్నించి బోల్తా పడ్డాడు. తర్వాత తేరుకోని ఇంగ్లండ్‌ లక్ష్యానికి 7 పరుగుల దూరంలో ఆగిపోయింది. ఈ విజయం ప్రపంచ క్రికెట్‌లో ఆస్ట్రేలియా ఆధిపత్యానికి పునాది వేసింది. 

ఇమ్రాన్‌... మాయ చేశాడు 
ఓ మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో పరాజయం. మరోదాంట్లో చిరకాల ప్రత్యర్థి భారత్‌ చేతిలో ఓటమి. ఇంకో దాంట్లో 74 పరుగులకే ఆలౌట్‌. ఇదీ 1992 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్‌ పరిస్థితి. ఇలా దాదాపు ఇంటి దారిలో ఉన్న జట్టుకు ఇమ్రాన్‌ ఖాన్‌ నాయకత్వ లక్షణాలతో ఊపిరి పోశాడు. ‘మనం దెబ్బతిన్న పులులం’ అనే నినాదం రాసి ఉన్న టీ షర్టును ధరించి స్ఫూర్తి రగిల్చాడు. ఫలితం... హాట్‌ ఫేవరెట్‌ న్యూజిలాండ్‌ను లీగ్‌ దశలో, సెమీస్‌లో వరుసగా ఓడించి ఫైనల్‌ చేరింది. ఆఖరి పోరులో వన్‌డౌన్‌లో వచ్చి 72 పరుగుల విలువైన ఇన్నింగ్స్‌ ఆడటం, సీనియర్లు సలీమ్‌ మాలిక్, ఇజాజ్‌ అహ్మద్‌ల కంటే కుర్రాడు ఇంజమాముల్‌ హక్, ఆల్‌రౌండర్‌ అక్రమ్‌లను ముందుగా బ్యాటింగ్‌కు దింపడం వంటివన్నీ ఇమ్రాన్‌ ఆత్మస్థయిర్యానికి నిదర్శనాలు. ఈ కప్‌లో అతడు పరిచయం చేసిన ఇంజమామ్‌ తర్వాత మేటి బ్యాట్స్‌మన్‌గా ఎదిగాడు. 

అర్జున... గర్జన 
కీలక బౌలర్‌ మురళీధరన్‌ శైలిపై ఆరోపణలు. దేశంలో అంతర్యుద్ధ పరిస్థితులు. ఆతిథ్యం ఇస్తున్నా, వారి దేశంలో ఆడబోమంటూ ప్రత్యర్థుల బహిష్కరణలు. అప్పుడప్పుడే ఎదుగుతున్న జట్టును మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురిచేసే యత్నాలు. ఈ స్థితిలో శ్రీలంకను అర్జున రణతుంగ అమేయంగా తీర్చిదిద్దాడు. మొదట జయసూర్య, కలువితరణ విధ్వంసక ఇన్నింగ్స్‌ ఆడేలా పురికొల్పాడు. ఆనక అరవింద డిసిల్వా, రోషన్‌ మహనామాతో కలిసి బ్యాటింగ్‌లో గోడ కట్టాడు. చమిందా వాస్, మురళీధరన్‌ బౌలింగ్‌ పదును రణతుంగ కెప్టెన్సీకి జత కలిసి లంకను చాంపియన్‌ చేశాయి. మురళీధరన్‌ విషయంలో ఏ ఆస్ట్రేలియాలోనైతే తమకు అవమానం జరిగిందో అదే ఆస్ట్రేలియాపై ఫైనల్లో గెలిచి ప్రతీకారం ఘనంగా తీర్చుకుంది. 1996 ప్రపంచకప్‌ విజయం తర్వాత లంక చాన్నాళ్లు పటిష్ఠ జట్టుగా కొనసాగింది. 

‘మహి’మ చూపాడు... 
అప్పటికే భారత్‌ ప్రపంచ కప్‌ గెలిచి 28 ఏళ్లయింది. మళ్లీ ఎప్పుడా? అని అభిమానుల ఎదురుచూపులు. పైగా అంతకుముందటి కప్‌లో దారుణ పరాభవాన్ని దిగమింగి ఉన్నారు. 2011 ఈవెంట్‌ను ఘనంగా ప్రారంభించినా దక్షిణాఫ్రికాతో ఓటమి, ఇంగ్లండ్‌తో మ్యాచ్‌ ‘టై’ కావడంతో లోలోన అనుమానాలు. కానీ, ధోని తనను తాను, జట్టును నమ్మాడు. బ్యాటింగ్‌ను బలోపేతం చేస్తూ, ఐదో బౌలర్‌గా యువరాజ్‌కు పూర్తి స్వేచ్ఛనిచ్చాడు. కోహ్లిలాంటి కుర్రాడిపై భరోసా ఉంచాడు. శ్రీలంకపై ఫైనల్లో మూడు వికెట్లు కోల్పోయి మరో 160 పరుగుల చేయాల్సిన వేళ... ప్రత్యర్థి స్పిన్నర్లను సమర్థంగా ఆడగలనని నమ్మి ధోని బ్యాటింగ్‌కు దిగాడు. 71 బంతుల్లో 91 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో కప్‌ అందించాడు. 

‘175’ గురించి సన్నీ ఏమన్నాడంటే..
1983 వరల్డ్‌ కప్‌లో టన్‌బ్రిడ్జ్‌వెల్స్‌లో జింబాబ్వేపై కపిల్‌ దేవ్‌ ఆడిన 175 పరుగుల అద్భుత ఇన్నింగ్స్‌  గురించి ఎంత చెప్పినా తక్కువే. చిత్తుగా ఓడాల్సిన ఆ మ్యాచ్‌లో విజయం సాధించిన భారత్‌ చివరకు విశ్వ విజేతగా కూడా నిలిచింది. జట్టులో సభ్యుడైన సునీల్‌ గావస్కర్‌ దీని ప్రత్యేకత గురించి చెబుతూ... ‘ఆ మ్యాచ్‌లో 17 పరుగులకే 5 వికెట్లు కోల్పో యాం. నిజంగా కపిల్‌ ఇన్నింగ్స్‌ గొప్పతనం ఏమిటో మాటల్లో చెబితే ఎవరికీ అర్థం కాదు. టాపార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ బంతికి బ్యాట్‌కు తగిలించలేకపోయిన చోట అతను అదే బంతిని మైదానం నలుదిశలా బాదాడు. 60 ఓవర్ల మ్యాచ్‌ కావడం వల్ల మొదటి ఇన్నింగ్స్‌ ముగియడానికి ముందే మాకు లంచ్‌ బ్రేక్‌ ఉండేది. కపిల్‌ లంచ్‌కు వచ్చాక అతని సీటుపై ఒక జ్యూస్‌ గ్లాస్‌ మినహా అటు డ్రెస్సింగ్‌ రూమ్‌లో కానీ, లంచ్‌ రూమ్‌లో కానీ ఒక్కరూ లేరు. నిజంగా చెప్పాలంటే సిగ్గుతో మేమంతా అతనికి మొహాలు చూపించలేక దాక్కున్నాం! ఎలా బ్యాటింగ్‌ చేయాలో అతను చేసి చూపించాడు. ఆ తర్వాతే మాలో నమ్మకం పెరిగి టైటిల్‌ గెలిచే వరకు  వెళ్లగలిగాం’ అని సన్నీ చెప్పాడు.  

వాల్సన్‌ విలాపం 
1983లో విజేతగా నిలిచిన భారత జట్టులో సునీల్‌ వాల్సన్‌ పేరు ప్రత్యేకం. 14 మంది సభ్యుల టీమ్‌లో 13 మంది కనీసం 2 మ్యాచ్‌లైనా ఆడగా, వాల్సన్‌కు మాత్రం ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడే అవకాశం రాలేదు. ఎడంచేతి వాటం మీడియం పేసర్‌ అయిన వాల్సన్‌  మైదానంలోకి దిగకపోయినా విన్నింగ్‌ టీమ్‌ సభ్యుడిగా చరిత్రలో నిలిచిపోయాడు. అయితే ఆశ్చర్యకరమైన విశేషం ఏమిటంటే వాల్సన్‌కు వరల్డ్‌ కప్‌లోనే కాదు... అంతకుముందు, ఆ తర్వాతా ఒక్క వన్డే ఆడే అవకాశం రాలేదు. సరిగ్గా చెప్పాలంటే అతను భారత్‌ తరఫున ఒక్క అంతర్జాతీయ మ్యాచ్‌ (టెస్టులు సహా) కూడా ఆడలేకపోయాడు. వరల్డ్‌ కప్‌ చరిత్రలో ఇలాంటి క్రికెటర్‌ వాల్సన్‌ ఒక్కడే కావడం విశేషం. పదేళ్ల ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ కెరీర్‌లో ఢిల్లీ, రైల్వేస్‌ జట్ల తరఫున ఆడి అతను 212 వికెట్లు పడగొట్టాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement