కప్పులు 11... విజేతలు ఐదే! | World Cup 2019 special article | Sakshi
Sakshi News home page

కప్పులు 11... విజేతలు ఐదే!

Published Wed, May 15 2019 12:26 AM | Last Updated on Sat, Jun 1 2019 6:22 PM

World Cup 2019  special article - Sakshi

‘ప్రపంచ’ విజేత... ఈ మాట వింటుంటేనే మహా గొప్పగా అనిపిస్తుంది. ఇక అదే పేరుతో పిలుస్తుంటే ఇంకెంత ఘనంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆడేవి 10 దేశాలపైనే అయినా క్రికెట్‌లో ఇలాంటి ఖ్యాతి దక్కిన దేశాలు ఐదే. మిగతా వాటిలో మూడు మినహా మరే జట్టుకూ కప్‌ను అందుకునేంత స్థాయి లేదనేది వాస్తవం. అయితే, కప్‌ నెగ్గిన ఐదింటిలోనూ ఒక్క జట్టుది ఏకఛత్రాధిపత్యం. రెండు దేశాలు ఓ పదేళ్లు ట్రోఫీని తమ దగ్గర ఉంచుకున్నాయి. మిగతా వాటిలో ఓ జట్టు నాలుగేళ్లు సంపూర్తిగా, మరోటి సాంకేతికంగా తక్కువ వ్యవధితో జగజ్జేతగా ఉన్నాయి. అసలు ఏ జట్టు ఎంత కాలం కప్‌ను అట్టిపెట్టుకున్నాయో ఓసారి చూస్తే...  

తొలినాళ్లలో వెస్టిండీస్, ఆ తర్వాత ఆస్ట్రేలియా ‘ప్రపంచ కప్‌ విజేత’ హోదాకు పర్యాయపదంగా నిలిచాయి. ఈ రెండు జట్లు అంతగా తమ ముద్ర చాటాయి. 44 ఏళ్ల టోర్నీ చరిత్రలో ఆసీస్‌ ఏకంగా 20 ఏళ్లు (వరుసగా 12 ఏళ్లు), వెస్టిండీస్‌ వరుసగా ఎనిమిదేళ్లు వరల్డ్‌ చాంపియన్లుగా పిలిపించుకున్నాయి. భారత్‌ రెండు వేర్వేరు దఫాల్లో, పాకిస్తాన్‌ ఒకసారి జగజ్జేతగా ఉన్నాయి. శ్రీలంక అతి తక్కువగా మూడేళ్ల మూడు నెలల కాలం పాటు మాత్రమే హోదాను అనుభవించింది. ఇందులో మరో ప్రత్యేకతేమంటే... ఇద్దరు కెప్టెన్లు క్లైవ్‌ లాయిడ్‌ (వెస్టిండీస్‌), రికీ పాంటింగ్‌ (ఆస్ట్రేలియా) తమ జట్లను రెండుసార్లు విజేతలుగా నిలిపి, మరోసారి విఫలమయ్యారు.     

ఆసీస్‌దే  అగ్రాధిపత్యం
అలెన్‌ బోర్డర్‌ సారథ్యంలో తొలిసారి 1987లో  చాంపియన్‌ అయిన తర్వాత ఆస్ట్రేలియా ఆటతీరు అంతకంతకూ రాటుదేలుతూ పోయింది. మొదటిసారి నిర్ణీత 4 ఏళ్ల వ్యవధి కంటే నాలుగు నెలలుగా అధికంగా జగజ్జేత హోదాలో కొనసాగిన ఆసీస్‌... ఆ తర్వాత ఏడేళ్లు దానికి దూరమైంది. 1999 నుంచి మాత్రం మరే జట్టుకూ అవకాశం ఇవ్వకుండా పుష్కర కాలం రాజ్యమేలింది. ఈ క్రమంలో వరుస గా ఆసియా దేశాలు పాక్, భారత్, లంకలను ఓడిస్తూ, వెస్టిండీస్‌కు త్రుటిలో చేజారిన ‘కప్‌ల హ్యాట్రిక్‌’నూ కొట్టేసింది. మధ్యలో (2011–15) నాలుగేళ్లు విరామం వచ్చినా, తర్వాత సొంతం చేసుకుంది. 1992లో సొంతగడ్డపై  జరిగిన ప్రపంచ కప్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా లీగ్‌ దశలోనే వెనుది రిగింది. అయితే 2015లో రెండోసారి ఆతిథ్యంలో క్లార్క్‌ నాయకత్వంలో ఆస్ట్రేలియా ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. భారత్‌ తర్వాత స్వదేశంలో వరల్డ్‌ కప్‌ నెగ్గిన రెండో జట్టుగా ఆసీస్‌ నిలిచింది. ఓవరాల్‌గా 20 ఏళ్లు ప్రపంచ కప్‌ కంగారూ దేశం వద్దే ఉంది.
 

భారత్‌ 28 ఏళ్ల తర్వాత 
సంచలనాత్మక రీతిలో అది కూడా విదేశంలో 1983లో కప్‌ గెలిచిన టీమిండియా... కపిల్‌ నాయకత్వంలో 1987లో, అజహరుద్దీన్‌ కెప్టెన్సీలో 1996లలో ఆతిథ్య సానుకూలతలోనూ దానిని నిలబెట్టుకోలేకపోయింది. అనంతరం 28 ఏళ్ల సుదీర్ఘ కాలం నిరీక్షించింది. 2011లో ధోని సారథ్యంలో కోరిక మరోసారి నెరవేరింది. అయితే 2015లో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమితో మన చాంపియన్‌ హోదాకు తెరపడింది. 32 ఏళ్ల (1983–2015) వ్యవధిలో వరల్డ్‌ కప్‌ కిరీటం భారత్‌ వద్ద ఎనిమిదేళ్లు ఉంది. 

పాక్‌... అప్పుడెప్పుడో! 
రౌండ్‌ రాబిన్‌ ఫార్మాట్‌కు చివరిదైన 1992 కప్‌ను గెల్చుకున్నది పాకిస్తాన్‌. మళ్లీ ఇప్పటివరకు అందుకోలేకపోయింది. సహ ఆతిథ్యంతో పాటు డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలో దిగి 1996లో సెమీస్‌కూ చేరలేకపోయింది. 1999లో ఫైనల్‌కు వెళ్లినా ఆస్ట్రేలియాకు తేలిగ్గా తలొంచింది. 2011లో భారత్, బంగ్లాదేశ్, శ్రీలంక ఆతిథ్యంలో నిర్వహించిన కప్‌లో సెమీస్‌కు రావడం తప్ప 2003, 2007, 2015లలో దారుణ ప్రదర్శనే. పాక్‌ కప్‌ విజేత హోదాకు దూరమై 23 ఏళ్లు అవుతోంది. 

లంక... అతి తక్కువ కాలం 
అంచనాలకు అందకుండా అదరగొట్టి 1996లో తొలిసారిగా కప్‌ నెగ్గింది శ్రీలంక. దీంతో ట్రోఫీ వరుసగా తొమ్మిదేళ్లు (1992–99) ఆసియా దేశాల వద్దే ఉన్నట్లైంది. అయితే, 1999, 2003లలో పేలవ ప్రదర్శనతో లంక స్థాయి పడిపోయింది. అనూహ్యంగా పుంజుకొని 2007, 2011లో వరుసగా ఫైనల్‌కు చేరినా చాంపియన్‌ కాలేకపోయింది. విశేషమేమంటే... ‘ప్రపంచ చాంపియన్‌’ హోదాలో అతి తక్కువ కాలం (3 ఏళ్ల 3 నెలలు) ఉన్న జట్టు లంకే. ఆ స్థాయి కోల్పోయి కూడా 20 ఏళ్లవుతోంది. 

ఆ ఎనిమిదేళ్లు కరిభీకరం
1975–1983 మధ్య జరిగిన మూడు కప్‌లూ వెస్టిండీస్‌ ఆధిపత్యానికి ప్రతిరూపం అన్నట్లు సాగాయి. లాయిడ్‌ సారథ్యంలో 1975 జూన్‌ 21 నుంచి 1983 జూన్‌ 25 వరకు ఎనిమిదేళ్ల పాటు చాంపియన్‌ హోదాను అనుభవించిన వెస్టిండీస్‌... మూడో సారీ అతడి కెప్టెన్సీలోనే గెలిచే ఊపులో కనిపించింది. కానీ, కపిల్‌ నేతృత్వంలోని టీమిండియా దెబ్బకొట్టాక మరి కోలుకోలేకపోయింది. సరికదా, అప్పటి నుంచి ఏనాడూ ఫేవరెట్‌గా బరిలో దిగలేదు. కనీసం సంచలనాలు సృష్టించే అండర్‌ డాగ్‌గానూ కనిపించలేదు. 1996లో మినహా, స్వదేశంలో జరిగిన 2007 కప్‌లోనూ సెమీ ఫైనల్‌కు చేరలేకపోయింది. మొత్తానికి విండీస్‌ వన్డే ఫార్మాట్‌లో ప్రపంచ విజేత స్థాయికి దూరమై 36 ఏళ్లయింది. 

ఇంకెన్నాళ్లో నిరీక్షణ! 
క్రికెట్‌తో పాటు ప్రపంచ కప్‌ పుట్టిల్లు ఇంగ్లండ్‌. నాలుగుసార్లు ఆతిథ్యం (1975, 79, 83, 99), మూడుసార్లు (1979, 87, 92) ఫైనల్‌కు వెళ్లినా ఆ దేశ జట్టుకు మాత్రం కప్‌ అందని ద్రాక్షే. ప్రస్తుతం మినహా... ఇంగ్లిష్‌ బృందం కప్‌నకు ప్రధాన పోటీదారుగా ఉన్న సందర్భాలు తక్కువే.  ప్రపంచ కప్‌లకు దురదృష్టాన్ని నెత్తిన పెట్టుకెళ్లే జట్టు దృక్షిణాఫ్రికా. 1992 నుంచి పెద్ద జట్టుగా, కప్‌ గెలిచే జట్టుగా బరిలో దిగుతున్నా ఒక్కసారీ దగ్గరకు రాలేకపోయింది. ప్రకృతితో పాటు స్వయంకృతాపరాధాలు సఫారీలను దెబ్బతీశాయి. కివీస్‌ను ‘సెమీస్‌ జట్టు’ అనడం సముచితం. ఇప్పటివరకు ఏకంగా 6 సార్లు (1975, 79, 92, 99, 2007, 2011) సెమీస్‌ చేరింది న్యూజిలాండ్‌. సహ ఆతిథ్యంలో 2015లో తొలిసారి ఫైనల్‌కు వెళ్లింది. కానీ, అంత పెద్ద టోర్నీ తుది సమరంలో తడబడి ఆస్ట్రేలియాకు కప్‌ను చేజార్చుకుంది. 

కప్పు కప్పుకో పేరు
ఇప్పుడంటే ‘ఐసీసీ ప్రపంచ కప్‌’గా పిలుస్తున్నారు కానీ, 1996 వరకు ఈ కప్‌కు ముందు ఒక్కో పేరు ఉండేది. ఆతిథ్యం ఇస్తున్న దేశాల్లోని బడా కంపెనీలు స్పాన్సర్‌షిప్‌ చేస్తూ... పనిలో పనిగా ప్రచారానికీ కలిసొచ్చేలా తమ సంస్థల పేర్లు తగిలించి ట్రోఫీలనూ రూపొందించేవి. ఇంగ్లండ్‌ ఆతిథ్యమిచ్చిన 1975, 1979, 1983 టోర్నీలను ఆ దేశంలో ఆర్థిక సేవలు–జీవిత బీమా రంగంలో ప్రఖ్యాతిగాంచిన ప్రుడెన్షియల్‌ సంస్థ ప్రాయోజితం చేసింది. దీంతో తొలి మూడు కప్‌లను ‘ప్రుడెన్షియల్‌ కప్‌’లుగా వ్యవహరిం చారు. అనంతరం భారత్‌ వేదికగా జరిగిన 1987లో కప్‌కు రిలయన్స్‌ సంస్థ స్పాన్సర్‌గా వ్యవహరించింది. ప్రపంచ కప్‌తో రిలయన్స్‌ ఒక్కసారిగా పేరు ప్రఖ్యాతులు పోగేసుకుంది. ఆస్ట్రేలియా ఆతిథ్యమిచ్చిన 1992 కప్‌ను ‘బెన్సన్‌ అండ్‌ హెడ్జెస్‌ వరల్డ్‌ కప్‌’గా, భారత్‌ వేదికైన 1996 కప్‌ను ‘విల్స్‌ వరల్డ్‌ కప్‌’గా పిలిచారు. విల్స్‌... ఇండియా టొబాకో కంపెనీ లిమిటెడ్‌ (ఐటీసీ) సంస్థకు చెందిన ఓ బ్రాండ్‌. అయితే, టోర్నీని తాము నిర్వహిస్తూ, వేరేవరి పేరుకో ప్రాచుర్యం కల్పించడం ఎందుకని భావించి 1999 నుంచి ఐసీసీ మేల్కొంది. అప్పటి నుంచి ఎంత పెద్ద స్పాన్సర్‌ ఉన్నా... పేరు మాత్రం ‘ఐసీసీ క్రికెట్‌ వరల్డ్‌ కప్‌’గానే స్థిరపడింది. అదేవిధంగా 99లోనే ప్రత్యేకంగా రూపొందించిన ట్రోఫీనే ఇప్పుడు కొనసాగుతోంది.
–సాక్షి క్రీడా విభాగం  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement