ఫైల్ ఫోటో
ఢాకా: బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ) మరో సారి భారత్ వైపు మొగ్గు చూపింది. బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజిబూర్ రెహ్మాన్ శతజయంతి సందర్భంగా ఆసియా ఎలెవన్, ప్రపంచ ఎలెవన్ జట్ల మధ్య రెండు టీ20 మ్యాచ్‌లను మార్చిలో నిర్వహించాలని బీసీబీ భావిస్తోంది. దీనికి ఐసీసీ కూడా సానుకూలంగా స్పందించింది. అంతేకాకుండా మ్యాచ్ తేదీలను, ఆసియా ఎలెవన్ జట్టును తమకు పంపించాలని బీసీబీకి ఐసీసీ సూచించింది. అయితే ప్రస్తుత పరిస్థితలు దృష్ట్యా భారత్-పాకిస్తాన్ దేశాలకు చెందిన క్రికెటర్లు ఒకే జట్టులో ఉండటం సాధ్యమయ్యే విషయం కాదు కాబట్టి బీసీబీ కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ కంటే తమకు భారతే ముఖ్యమనే భావనలో బీసీబీ ఉన్నట్లు తెలుస్తుంది. బీసీసీఐ సంయుక్త కార్యదర్శి జయేశ్ జార్జ్ తాజా వ్యాఖ్యలతో ఇదే స్పష్టమవుతోంది.
‘బీసీసీఐకి అందిన సమాచారం ప్రకారం ఆసియా ఎలెవన్ జట్టులో పాకిస్తాన్ ఆటగాళ్లు లేరని తెలిసింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఇరు దేశాల ఆటగాళ్లు ఒకే జట్టులో ఆడే అవకాశం లేదు. అలా ఆడాల్సి వస్తే దీనిపై బీసీసీఐ ఉన్నతాధికారులు, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆసియా ఎలెవన్ జట్టులో భారత్ నుంచి ఐదుగురు క్రికెటర్లు పాల్గొంటారు. ఈ ఐదుగురిని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఎంపిక చేస్తారు’ అని జయేశ్ జార్జ్ వ్యాఖ్యానించారు. దీంతో పాక్ ఆటగాళ్లు ఆడితే తమ క్రికెటర్లను పంపమని బీసీసీఐ పరోక్షంగా తేల్చిచెప్పింది. ఇదే విషయాన్ని బీసీబీకి కూడా చెప్పడంతో ఆ దేశ బోర్డు బీసీసీఐ వైపే నిలిచింది.
పుల్వామా ఉగ్రదాడి అనంతరం భారత్-పాక్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థుతులు నెలకొన్న విషయం తెలిసిందే. ఇరుదేశాల మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. అంతేకాకుండా పాక్ నేతలు భారత్‌పై అక్కసు వెల్లగక్కుతూనే ఉన్నారు. తాజాగా స్వదేశంలో శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్ విజయవంతం కావడంతో పీసీబీ చైర్మన్ ఎహ్‌సాన్ మణి వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. రక్షణ పరంగా భారత్ కంటే పాక్ ఎంతో నయమని వ్యాఖ్యానించాడు. దీనిపై బీసీసీఐ కూడా గట్టిగానే బదులిచ్చింది. భారత అంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకుంటే సహించేది లేదని బీసీసీఐ తేల్చిచెప్పింది.
చదవండి:
‘భారత్ కంటే పాకిస్తాన్ ఎంతో నయం’
భారత్ సంగతి మీకెందుకు!
Comments
Please login to add a commentAdd a comment