ICC World Cup 2019 Special
-
ఆ విషయంలో ఇండియాదే పైచేయి.. కానీ!
క్రికెట్‌కు పుట్టినిల్లుగా భావించే ఇంగ్లండ్ జట్టు సుదీర్ఘ కల నెరవేరింది. ఆదివారం జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి ఇంగ్లండ్ జట్టు తొలిసారి విశ్వవిజేతగా ఆవిర్భవించింది. 44 ఏళ్ల వరల్డ్‌కప్ చరిత్రలో తొలిసారి టైటిల్‌ను సాధించింది. వరుసగా రెండోసారి ప్రపంచకప్ ఫైనల్‌కు చేరిన కివీస్ జట్టుకు మరోసారి నిరాశే మిగిలింది. సెమీస్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలై.. ఇంటిదారి పట్టిన భారత జట్టు కూడా ఫైనల్ ఫలితాల అనంతరం ఒకింత నిరాశ చెంది ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రపంచకప్‌లో అతి తక్కువ పరాజయాలు చవిచూసిన జట్టు భారత్ మాత్రమే. ఇంగ్లండ్ తొలిసారి వరల్డ్ కప్‌ను కైవసం చేసుకున్నప్పటికీ.. ఆ జట్టు ప్రస్తుత టోర్నమెంటులో మూడు పరాజయాలు చవిచూసింది. లీగ్ దశలో ఒక ఓటమితో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ఇండియా నాకౌట్ దశలో కివీస్ చేతిలో ఓడి.. ఫైనల్‌కు చేరకుండానే తన ప్రస్థానం ముగించిన సంగతి తెలిసిందే. ఈ ప్రపంచకప్‌లో ఈ రెండు పరాజయాలు మినహా కోహ్లి సేన ఏడు విజయాలు సాధించింది. ఇక, విశ్వవిజేతగా నిలిచిన ఇంగ్లండ్ జట్టు ఎనిమిది విజయాలు సాధించగా.. మూడు ఓటములు చవిచూసింది. ఆస్ట్రేలియా ఏడు విజయాలు, మూడు పరాజయాలు చవిచూడగా.. రన్నరప్‌గా నిలిచిన న్యూజిలాండ్ ఆరు విజయాలు, నాలుగు పరాజయాలు తన ఖాతాలో వేసుకుంది. పాకిస్థాన్ ఐదు విజయాలు, మూడు పరాజయాలు, శ్రీలంక మూడు విజయాలు, నాలుగు పరాజయాలు, దక్షిణాఫ్రికా మూడు విజయాలు, ఐదు పరాజయాలు, బంగ్లాదేశ్ మూడు విజయాలు, ఐదు పరాజయాలు నమోదుచేసుకోగా.. పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న వెస్టిండీస్ రెండు విజయాలు మాత్రమే సాధించి.. ఆరు పరాజయాలు మూటగట్టుకుంది. ఇక, అండర్‌డాగ్‌గా బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్థాన్ ఒక్క విజయాన్ని కూడా నమోదుచేయకుండా.. మొత్తం 9 పరాజయాలు మూటగట్టుకొని.. చిట్టచివరి స్థానంలో నిలిచింది. -
హీరో.. విలన్.. గప్టిలే!
లండన్: మూడు రోజుల క్రితం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో ఎంఎస్ ధోనీని రనౌట్ చేయడం ద్వారా పూర్తిగా మ్యాచ్ గతినే మార్చేశాడు కివీస్ ఆటగాడు మార్టిన్ గఫ్టిల్. ధోనీ క్రీజులో ఉన్నంతసేపూ మ్యాచ్ టీమిండియా గెలుస్తుందని అభిమానులు భావించారు. కానీ, మార్టిన్ గప్టిల్ విసిరిన బుల్లెట్ త్రోకు సీన్ అంతా మారిపోయింది. అతడి మెరుపు ఫీల్డింగ్‌కు ధోని రనౌట్‌గా వెనుదిరిగాడు. టీమిండియా ఓడిపోయింది. అయితే, ఇది ఇక్కడితో ముగియలేదు. సేమ్ సీన్ ఫైనల్ మ్యాచ్‌లోనూ పునరావృతమైంది. అదీ కూడా గఫ్టిల్కే. సెమీఫైనల్ మ్యాచ్‌లో రెండు పరుగు తీయబోయిన ధోనీ.. గఫ్టిల్ సూపర్ త్రోకు రన్నౌట్ అయ్యాడు. అదేవిధంగా ఫైనల్ మ్యాచ్‌లో సూపర్ ఓవర్ చివరి బంతికి రెండో పరుగు తీయబోయి గఫ్టిల్ రనౌట్‌గా వెనుదిరగడంతో విశ్వకప్ ఇంగ్లండ్ వశమైంది. ఆర్చర్ వేసిన సూపర్ ఓవర్ చివరి బంతిని బాదిన గఫ్టిల్ మొదటి పరుగును సురక్షితంగా పూర్తి చేశాడు. విజయం కోసం కావాల్సిన రెండో బంతి కోసం.. అతను ప్రయత్నించాడు. దీంతో ఫీల్డర్ నుంచి నేరుగా బంతిని అందుకున్న జోస్ బట్లర్ వికెట్లను గిరాటేశాడు. దీంతో గఫ్టిల్ రన్నౌట్ అయ్యాడు. ధోనీ రన్నౌట్ భారత్ ఫైనల్‌కు చేరకుండా అడ్డుకోగా.. గఫ్టిల్ రనౌట్ కివీస్ జట్టుకు వరల్డ్ కప్‌ను దూరం చేసింది. అంతేకాకుండా ఫైనల్ మ్యాచ్ చివరి ఓవర్లో అతను విసిరిన బంతి అనుకోకుండా స్టోక్స్ బ్యాటుకు తగిలి బౌండరీకి దూసుకుపోవడంతో ఇంగ్లండ్ జట్టుకు అదనంగా నాలుగు పరుగులు వచ్చాయి. ఇదీ కూడా ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర పోషించింది. (చదవండి: నమ్మశక్యం కానిరీతిలో.. మ్యాచ్‌లో కీలక మలుపు) గప్టిల్ హీరో... విలన్... న్యూజిలాండ్‌ను టోర్నీలో దెబ్బకొట్టింది ఓపెనింగ్ వైఫల్యమే. సీనియర్ మార్టిన్ గప్టిల్ ఏమాత్రం రాణించలేక విమర్శల పాలయ్యాడు. అయితే, సెమీఫైనల్లో టీమిండియా వెటరన్ ధోనిని అద్భుత త్రో ద్వారా రనౌట్ చేసి వాటికి కొంతవరకు సమాధానమిచ్చాడు. ఫైనల్లో మళ్లీ విమర్శల పాలయ్యే ప్రదర్శన చేశాడు. బ్యాటింగ్‌లో విఫలమైన అతడు... 50వ ఓవర్ నాలుగో బంతిని ఓవర్ త్రో చేసి ప్రత్యర్థికి నాలుగు పరుగులు సునాయాసంగా ఇచ్చాడు. ఇందులో గప్టిల్ పాత్ర పరోక్షమే అని, కివీస్ దురదృష్టమని అనుకుని సరిపెట్టుకున్నా... సూపర్ ఓవర్ చివరి బంతికి ప్రపంచ కప్ సాధించి పెట్టే రెండు పరుగులు చేయలేకపోయాడు. దీనిని తలుచుకునే ఏమో మ్యాచ్ అనంతరం గప్టిల్ కన్నీటి పర్యంతమయ్యాడు. -
నమ్మశక్యం కానిరీతిలో.. మ్యాచ్‌లో కీలక మలుపు
క్రికెట్ వరల్డ్ కప్ చరిత్రలోనే ఇంగ్లండ్-న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ ఒక అద్భుతంగా నిలిచిపోతుంది. ఒక అరుదైన ఘట్టానికి వేదికగా క్రికెట్ ప్రేమికుల హృదయాల్లో నిలిచి ఉంటుంది. విశ్వకప్ ఫైనల్ మ్యాచ్ టై కావడం.. సూపర్ ఓవర్‌కు వెళ్లడం.. సూపర్ కూడా టై కావడం ఇదే తొలిసారి. చివరి బంతి వరకు ఉత్కంఠ రేపుతూ.. చూసే ప్రేక్షకులను మునివేళ్ల మీద నిలబెట్టి.. ఎప్పుడేం జరుగుతుందోనన్న టెన్షన్‌కు గురిచేసిన ఫైనల్ మ్యాచ్.. ఆద్యంతం రోమాంఛితంగా సాగింది. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలా వీక్షకులకు సరికొత్త అనుభూతి ఇచ్చింది. నిజానికి ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్-న్యూజిలాండ్.. ఇరుజట్లు వీరోచితంగా పోరాడాయి. ప్రపంచకప్‌ను ఒడిసిపట్టేందుకు తమ శాయశక్తులు ఒడ్డాయి. సమ ఉజ్జీలుగా కనిపించిన ఇరుజట్లు చివరి బంతి వరకు సింహాల్లా పోరాడాయి. ఫలితం మ్యాచ్ టై కావడమే.. కాకుండా సూపర్ ఓవర్ కూడా టై అయింది. ఫైనల్ మ్యాచ్‌లో కివీస్ జట్టు వీరోచితంగా పోరాడినా.. ఆ జట్టుకు అదృష్టం కలిసిరాలేదని చెప్పాలి. ముఖ్యంగా 50 ఓవర్లో జరిగిన ఓ అరుదైన, అద్భుత ఘటన కివీస్ జట్టుకు విజయాన్ని దూరం చేసింది. చివరి ఓవర్లో ఇంగ్లండ్ విజయానికి 15 పరుగులు అవసరం. ఈ దశలో కివీస్ విజయానికి అడ్డుగోడలా ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ నిలబడ్డాడు. చివరి ఓవర్లో మొదటి రెండు బంతులు పరుగులేమీ రాలేదు. మూడో బంతిని స్టోక్స్ సిక్సర్‌గా మలిచాడు. మరో మూడు బంతుల్లో 9 పరుగులు చేయాల్సిన దశలో నాలుగో బంతికి ఓ అద్భుతం చోటుచేసుకొని.. మ్యాచ్‌ను మలుపు తిప్పింది. నాలుగో బంతిని డీప్‌లోకి తరలించిన స్టోక్స్.. రెండు పరుగులు తీశాడు. అయితే, రెండో పరుగు తీస్తున్న సమయంలో మార్టిన్ గఫ్టిల్ విసిరిన బంతి.. నేరుగా స్టోక్స్ బ్యాట్‌కు తగిలి.. బౌండరీ దిశగా దూసుకుపోయింది. నమ్మశక్యం కాని ఈ పరిణామంతో కివీస్ ఆటగాళ్లు షాక్ తిన్నారు. నిజానికి ఇందులో స్టోక్స్ ఉద్దేశపూర్వకంగా చేసిందేమీ లేదు. రెండో పరుగు తీస్తున్న సమయంలో అతను బంతిని చూడనేలేదు. కానీ గఫ్టిల్ విసిరిన బంతి నేరుగా వచ్చి స్టోక్స్ బ్యాటుకు తగిలింది. ఇలా ఈ బంతికి అనూహ్యంగా ఆరు పరుగులు వచ్చాయి. దీంతో ఇంగ్లండ్ చివరి రెండు బంతుల్లో మూడు పరుగులు చేస్తే విజయం వరించేది. కానీ, అయితే చివరి రెండు బంతుల్లో రెండు పరుగులు చేసి.. ఇద్దరు రన్నౌట్ కావడంతో ఇంగ్లండ్ 241 పరుగుల వద్ద నిలిచిపోయింది. మ్యాచ్ టై అయింది. ఆ తర్వాత సూపర్ ఓవర్ కూడా కావడం.. దీంతో ఎక్కువ బౌండరీలు సాధించిన ఇంగ్లండ్ జట్టును విశ్వవిజేతగా ప్రకటించడం తెలిసిందే. -
వరల్డ్ కప్పే చివరిది.. ధోనీ కూడా రిటైర్!
బర్మింగ్‌హామ్: వరల్డ్ కప్‌లో తనను ఎంపిక చేయకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురైన హైదరాబాదీ క్రికెటర్ అంబటి రాయుడు అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక, రాయుడి దారిలోనే భారత క్రికెట్ లెజెండ్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా క్రికెట్‌కు వీడ్కోలు పలికేందుకు సిద్ధమవుతున్నాడు. వరల్డ్ కప్ తర్వాత ధోనీ రిటైర్ అవుతాడని అందరూ ఊహించని విషయమే. ఇందులో రహస్యమేమీ లేదు. కానీ, వరల్డ్ కప్ మ్యాచ్‌లు ముగిసిన వెంటనే ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకబోతున్నట్టు తెలుస్తోంది. అంటే, వరల్డ్ కప్ తర్వాత ధోనీ ఇక టీమిండియా నీలిరంగు జెర్సీలో కనిపించకపోవచ్చు. ప్రస్తుత ప్రపంచకప్‌లో భారత్ ఫైనల్‌కు అర్హత సాధిస్తే.. ఈ నెల 14న లార్డ్స్ మైదానంలో జరగబోయే ఫైనల్ మ్యాచ్ ధోనీకి చివరి మ్యాచ్ కానుంది. ఈ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తే.. ధోనీకి ఇంతకంటే ఘనమైన వీడ్కోలు మరొకటి ఉండబోదు. ఒకవేళ అన్ని కలిసొస్తే.. వరల్డ్ కప్ విజయంతో అంతర్జాతీయ క్రికెట్ నుంచి ధోనీ వైదొలగాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే తన రిటైర్మెంట్ గురించి బీసీసీఐ అధికారులకు ధోనీ సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. ‘ధోనీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో ఎవరూ చెప్పలేం. కానీ, వరల్డ్ కప్ తర్వాత ఆయన భారత జట్టులో కొనసాగే అవకాశం లేదు. అనూహ్యంగా మూడు ఫార్మెట్లలోనూ కెప్టెన్సీకి ధోనీ గుడ్‌బై చెప్పాడు. ఈ నేపథ్యంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనేది ఊహించలేం’ అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుత సెలక్షన్ కమిటీ పదవీకాలం ఈ ఏడాది అక్టోబర్‌తో ముగుస్తుంది. ఆ స్థానంలో వచ్చే కొత్త సెలక్షన్ కమిటీ దృష్టి అంతా వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరగబోయే టీ20 వరల్డ్ కప్ మీద ఉంటుంది. కొత్త సెలక్షన్ కమిటీ జట్టులో గణనీయమైన మార్పులు తీసుకురావచ్చు. ఈ మార్పుల్లో యువ క్రీడాకారులకు పెద్ద పీట ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇక, టీమిండియా వరల్డ్ కప్ సెమీఫైనల్‌కు అర్హత సాధించిన ప్రస్తుత తరుణంలో ధోనీ రిటైర్మెంట్ వంటి సున్నితమైన విషయాలపై స్పందించడానికి బీసీసీఐ ముందుకురావడం లేదు. ఈ వరల్డ్ కప్‌లో ధోనీ ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌లు ఆడి.. 93కుపైగా స్ట్రైక్ రేట్‌తో 223 పరుగులు చేశాడు. అయితే, కీలక సమయాల్లో భారీ షాట్లు ఆడకపోవడం, స్లో బ్యాటింగ్ చేస్తుండటంతో ధోనీ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. మ్యాచ్ ఫినిషర్‌గా గొప్ప పేరున్న ధోనీ.. ఇలా నెమ్మదించడంతో ఎన్నో విమర్శలు ఎదురవుతున్నాయి. ధాటిగా ఆడాలన్న కసి ధోనీలో లేదని, వయస్సు మీద పడిందని అంటున్నారు. ధోనీని విమర్శించి.. తప్పుబట్టిన వారిలో సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్ వంటి భారత మాజీ క్రికెటర్లు కూడా ఉన్నారు. ఈ విమర్శలు ఎలా ఉన్నా.. ధోనీని తక్కువ చేసి చూసేందుకు బీసీసీఐ ఇష్టపడటం లేదు. భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన ధోనీ.. ‘బీ లవ్డ్ కెప్టెన్’గా క్రికెట్ ప్రేమికుల హృదయాల్లో నిలిచిపోయాడు. ఐసీసీ టోర్నమెంట్లన్నింటినీ గెలుపొందిన ఏకైక భారత కెప్టెన్‌గా ధోనీ ఘనతను సొంతం చేసుకున్నాడు. భారత్ క్రికెట్‌కు ధోనీ అందించిన విజయాలు, జరిపిన కృషి ఎనలేనిది. భారత క్రికెటర్లందరూ ధోనీని పొగిడినవారే. ఇక, ప్రస్తుత వరల్డ్ కప్‌లో ధోనీ విఫలమైనా.. జట్టు సెమీస్‌కు చేరడం.. అతనికి రక్షణగా నిలిచిందని, భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి ఉండదు కాబట్టి.. ధోనీ ఒక నిర్ణయం అనివార్యంగా తీసుకోవాల్సిందేనని ఓ మాజీ క్రికెటర్ అభిప్రాయపడ్డారు. -
క్రికెట్ చరిత్రలోనే అదో అద్భుతం!
క్రికెట్ చరిత్రలోనే అదో అద్భుత ఇన్నింగ్స్.. బహుషా యావత్ క్రికెట్ ప్రపంచాన్ని నేడు భారత్ శాసిస్తోందంటే అది ఆ ఇన్నింగ్స్ చలవే. మనదేశంలో క్రికెట్ ఓ ఆటగా కాకుండా మతంలా మారడానికి బీజం పడింది అక్కడే. ఆ మ్యాచ్‌కు ప్రత్యక్ష ప్రసారం లేదు.. ఆఖరికి రేడియోలో కామెంట్రీ కూడా రాలేదు. ఆ మ్యాచ్ జరిగి కూడా 36 ఏళ్లు అవుతోంది. కానీ అందరి మదిలో ఇప్పటికి కదలాడుతూనే ఉంది. చిత్తుగా ఓడాల్సిన జట్టును ఆ ఇన్నింగ్సే విశ్వవిజేతగా నిలిపింది. ఇలా అభిమానులకు ఓ మధురానుభూతిగా మిగిలిపోయిన ఆ అద్భుత ఇన్నింగ్స్ సంగతేంటో తెలుసుకుందాం! అది జూన్ 18, 1983 భారత్-జింబాంబ్వే ప్రపంచకప్ మ్యాచ్. భారత కెప్టెన్ కపిల్ దేవ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ప్రపంచకప్ రేసులో భారత్ నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్. బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఖాతా తెరవకుండానే ఓపెనర్ సునీల్ గావాస్కర్ వికెట్ కోల్పోయింది. 6 పరుగులనంతరం మరో ఓపెనర్ శ్రీకాంత్ డకౌట్. అదే స్కోర్ వద్ద అమర్నాథ్(5) కూడా పెవిలియన్ బాట పట్టాడు. మరో 11 పరుగుల వ్యవధిలో టాపార్డర్ అంతా ప్యాకప్. భారత్ స్కోర్ 17/5. దీంతో ప్రపచంకప్ పోరులో మరోసారి భారత్ కథ ముగిసిందని, భారత ఆటగాళ్లతో సహా అందరూ అనుకున్నారు. ఆర్గనైజర్స్ అయితే మరో మ్యాచ్ నిర్వహించవచ్చని టాస్ ఏర్పాట్లకు సిద్ధమయ్యారు. కానీ ఒకే ఒక్కడు మాత్రం చివరి బంతి వరకు పోరాడాలనుకున్నాడు. ఏదిఏమైనా తన సారథ్యంలోనే భారత్‌ను విశ్వవిజేతగా నిలపాలనుకున్నాడు. మరోవైపు వికెట్లు కోల్పోతున్నా.. చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో పోరాడాడు. బంతిని బ్యాట్‌కు తగిలించడానికే ఇబ్బంది పడ్డ పిచ్‌లో అలవోక షాట్స్‌తో ఆకట్టుకున్నాడు. జింబాంబ్వే కెప్టెన్ డంకన్ ఫ్లెచర్ ఎన్ని వ్యూహాలు రచించినా.. కొత్త బంతితో బౌలర్లను మార్చినా కపిల్ చూడచక్కని షాట్స్‌తో అదరగొట్టాడు. సహజసిద్ధమైన ఆటతో కవర్ డ్రైవ్స్, ట్రేడ్‌మార్క్ కట్స్‌తో ఔరా అనిపించాడు. మదన్‌లాల్(17)తో కలిసి 8వ వికెట్‌కు కీలక 62 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. సయ్యద్ కిర్మాణీ కీలకం.. కపిల్ ఇన్నింగ్స్‌లో వికెట్ కీపర్ సయ్యద్ కిర్మాణీ(56 బంతుల్లో 26 నాటౌట్) పాత్ర కీలకం. అతను స్ట్రైక్ రొటేట్ చేస్తూ కపిల్‌కు అండగా నిలవడంతో తొమ్మిదో వికెట్‌కు 126 పరుగుల రికార్డు భాగస్వామ్యం నమోదైంది. దీంతో భారత్ 8 వికెట్లు కోల్పోయి 266 పరుగులు చేసింది. ‘మదన్‌లాల్ వికెట్ అనంతరం క్రీజులోకి వచ్చిన నేను కపిల్‌ను సహజ సిద్ధంగా ఆడమని చెప్పాను. మనం 60 ఓవర్లు ఆడుతున్నాం. నాశక్తి మేరకు నేను పోరాడుతా.’ అని కపిల్‌తో అన్నట్లు కిర్మాణీ నాటి రోజులను ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నాడు. 72 బంతుల్లో భారత్ తరఫున తొలి ప్రపంచకప్ సెంచరీ సాధించిన కపిల్.. వెంటనే కొత్త బ్యాట్ తీసుకురావాలని గ్యాలరీలోని ఆటగాళ్లకు సూచించాడు. అప్పటికీ అతను సెంచరీ పూర్తి కాలేదనుకున్నాడు. స్కేర్వ్ ఆఫ్ ది వికెట్ మీదుగా ఎక్కువ బౌండరీలు బాదిన కపిల్.. సిక్సర్లను మాత్రం లాంగాన్ దిశగా కొట్టాడు. స్ట్రైట్‌డ్రైవ్ బౌండరీలు కూడా బాదాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 138 బంతుల్లో 16 ఫోర్లు.. 6 సిక్స్‌లతో 175 పరుగులతో నాటౌట్‌గా నిలిచి చరిత్రసృష్టించాడు. సువర్ణాక్షరాలతో తన పేరును లిఖించుకున్నాడు. 267 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాంబ్వే సైతం భారత్ పడిన కష్టాలనే ఎదుర్కొంది. 113 పరుగులకే 6 వికెట్లు కోల్పోగా.. ఆ జట్టు ఆల్‌రౌండర్ కెవిన్ కుర్రాన్ (73) ఒంటరి పోరాటం చేశాడు. అతనికి మధన్‌లాల్ అడ్డుకట్ట వేయగా.. రిటర్న్ క్యాచ్‌తో చివరి వికెట్‌ను కపిల్ పడగొట్టడంతో జింబాంబ్వే పోరాటం ముగిసింది. భారత్ ఓడాల్సిన మ్యాచ్‌లో 31 పరుగులతో విజయం సాధించింది. అనంతరం ఆస్ట్రేలియాతో చివరి లీగ్ మ్యాచ్‌ను 118 పరుగులతో గెలిచిన కపిల్‌సేన సగర్వంగా సెమీస్‌లోకి అడుగుపెట్టింది. ఇంగ్లండ్‌పై 6 వికెట్లతో గెలిచి ఫైనల్లో వెస్టిండీస్‌ను మట్టికరిపించి విశ్వవిజేతగా నిలిచింది. ఇంగ్లండ్ వేదికగా జరిగిన ఈ ప్రపంచకప్‌లో పెద్దగా అంచనాలు లేకుండానే బరిలోకి దిగిన కపిల్‌సేన టైటిల్‌తో తిరిగొచ్చి భారత్‌లో క్రికెట్‌ను ఓ మతంలా మార్చింది. కలిసొచ్చిన అదృష్టం.. కపిల్‌దేవ్ అద్భుత ఇన్నింగ్స్‌కు అదృష్టం కూడా తోడైంది. 90 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కపిల్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను గ్రాంట్ ప్యాటర్సన్ వదిలేశాడు. భారీ షాట్స్ ఆడే ప్రయత్నంలో చాల బంతులు ఫీల్డింగ్ లేని ప్రదేశాల్లో పడ్డాయి. ఇక కపిల్ సాధించిన అత్యధిక పరుగుల రికార్డును ఆ మరుసటి ఏడాదే వెస్టిండీస్ దిగ్గజం వీవీ రిచ్చర్డ్స్ అధిగమించాడు. ఇంగ్లండతో జరిగిన మ్యాచ్‌లో 189 పరుగులతో నాటౌట్‌గా నిలిచి ఈ ఘనతను అందుకున్నాడు. సయ్యద్ కిర్మాణీతో కపిల్ 9వ వికెట్‌కు నెలకొల్పిన భాగస్వామ్యపు రికార్డు 27 ఏళ్ల వరకు చెక్కుచెదరకుండా ఉంది. 2010లో శ్రీలంక ఆటగాళ్లు ఏంజేలో మాథ్యూస్-లసిత్ మలింగాలు ఆస్ట్రేలియాపై 136 పరుగుల భాగస్వామ్యంతో ఈ రికార్డును అధిగమించారు. సిగ్గుతో మొహం చూపించలేకపోయాం.. కపిల్ ఇన్నింగ్స్‌పై ఆనాటి ఓపెనర్ సునీల్ గావస్కర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఆ మ్యాచ్‌లో 17 పరుగులకే 5 వికెట్లు కోల్పోయాం. నిజంగా కపిల్ ఇన్నింగ్స్ గొప్పతనం ఏమిటో మాటల్లో చెబితే ఎవరికీ అర్థం కాదు. టాపార్డర్ బ్యాట్స్‌మెన్ బంతికి బ్యాట్‌కు తగిలించలేకపోయిన చోట అతను అదే బంతిని మైదానం నలుదిశలా బాదాడు. 60 ఓవర్ల మ్యాచ్ కావడం వల్ల మొదటి ఇన్నింగ్స్ ముగియడానికి ముందే మాకు లంచ్ బ్రేక్ ఉండేది. కపిల్ లంచ్‌కు వచ్చాక అతని సీటుపై ఒక జ్యూస్ గ్లాస్ మినహా అటు డ్రెస్సింగ్ రూమ్‌లో కానీ, లంచ్ రూమ్‌లో కానీ ఒక్కరూ లేరు. నిజంగా చెప్పాలంటే సిగ్గుతో మేమంతా అతనికి మొహాలు చూపించలేక దాక్కున్నాం! ఎలా బ్యాటింగ్ చేయాలో అతను చేసి చూపించాడు. ఆ తర్వాతే మాలో నమ్మకం పెరిగి టైటిల్ గెలిచే వరకు వెళ్లగలిగాం’ అని సన్నీ చెప్పాడు. కపిల్ అద్భుత ఇన్నింగ్స్ లేకుంటే నాడు భారత్ ప్రపచంకప్ గెలిచేది కాదు.. నేడు మనదేశంలో క్రికెట్‌కు ఇంత ఆదరణ ఉండేది కాదు. ఏది ఏమైనా.. కపిల్.. భారత క్రికెట్లో నీది చెరపలేని చరిత్ర.. చెరిగిపోని యాత్ర.. మరెవరిని ఊహించలేని పాత్ర.. -శివ ఉప్పల, సాక్షి వెబ్‌డెస్క్ -
ప్రపంచకప్‌లో సందడంతా వీరిదే!
హైదరాబాద్: టెలివిజన్ కార్యక్రమాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది వ్యాఖ్యాతే(యాంకర్). కార్యక్రమం చూసే ప్రేక్షకుల దృష్టి ముందుగా వచ్చే యాంకర్‌పైనే ఉంటుంది. కొందరు మాటలు, పంచ్‌లతో ఆకట్టుకుంటే.. మరికొందరు తమ అందంతో ఆకర్షిస్తారు. అలా అందంతో మాటలతో క్రికెట్ అభిమానులను కట్టిపడేస్తున్నారు ప్రపంచకప్ యాంకర్లు. ప్రస్తుతం ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ క్రికెట్ ప్రపంచకప్‌లో ఐదుగురు యాంకర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. వారి వివరాలు ఏంటో తెలుసుకుందాం.. మయంతి లాంగర్ క్రికెట్, ఫుట్‌బాల్ అభిమానులకు తెగ నచ్చిన మోస్ట్ ఫేవరేబుల్ యాంకర్ మయంతి లాంగర్. 1985 ఫిబ్రవరి 8న ఢిల్లీలో జన్మించిన మయంతి స్థానిక హిందూ కాలేజీలో గ్యాడ్యూయేషన్ పూర్తి చేసింది. కాలేజీలో నిర్వహించే కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించేది. దీంతో పీజీ చేస్తుండగానే జీ స్పోర్ట్స్‌లో యాంకర్‌గా అవకాశం వచ్చింది. తన పెర్ ఫార్మెన్స్ చాలా మందికి నచ్చడంతో ఆమె కెరీర్ తారా జువ్వలా దూసుకుపోయింది. 2010లో ఫిఫా ప్రపంచకప్‌కి తొలిసారి వాఖ్యాతగా వ్యవహరించింది. అక్కడ విజయవంతం కావడంతో 2010లో ప్రతిష్టాత్మకమైన కామన్వెల్త్ క్రీడలకు టీవీ ప్రెజెంటర్‌గా చేసింది. ఇక అప్పటినుంచి ఐపీఎల్, ప్రపంచకప్‌లకు వ్యాఖ్యాతగా కొనసాగుతోంది. ఐపీఎల్లో బెస్ట్ యాంకర్‌గా తనదైన ముద్ర వేసుకుంది. మ్యాచ్‌కు ముందు జరిగే విశ్లేషణలను చాలా మంది మయంతి కోసమే చూస్తారంటే అతిశయోక్తి కాదు. 2013లో క్రికెటర్ స్టువార్ట్ బిన్నిని వివాహం చేసుకుంది. ఈ మధ్య ఎక్కువగా అమె వస్త్రధారణతో ట్రోలింగ్స్‌కు గురవతున్నారు. అయితే అవేమి పట్టించుకోకుండా మంచి వ్యాఖ్యాతగా రాణిస్తుంది. ప్రపంచకప్‌లో ప్రధాన యాంకర్‌గా వ్యవహిరస్తోంది. సంజన గణేశన్ పుణెకు చెందిన సంజన గణేశన్ అనతికాలంలోనే టీవీ ప్రెజెంటర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇంజనీరింగ్‌లో గోల్డ్‌మెడల్ సాధించిన సంజన గణేశన్‌కు మోడలింగ్‌పై అమితాసక్తి ఉండేది. దీంతో సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలేసి మోడిలింగ్ వైపు అడుగులు వేసింది. 2014లో మిస్ ఇండియా ఫైనలిస్టుగా నిలిచిన గణేశన్.. అనంతరం వ్యాఖ్యాతగా మారారు. స్టార్‌లో యాంకర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ప్రపంచకప్‌లో టీమిండియా మ్యాచ్‌లకు సంబంధించిన సమాచారాన్ని క్రికెట్ అభిమానులతో పంచుకోనుంది. రిధిమ పాఠక్ టీమిండియా సారథి విరాట్ కోహ్లి ఇంటర్వ్యూతో వార్తల్లో నిలిచింది రిధిమ పాఠక్. చెన్నైలో పుట్టినప్పటికీ ఎడ్యుకేషన్ మొత్తం పుణెలో కొనసాగింది. ఇంజనీరింగ్ పూర్తి చేసిన రిధిమ మోడలింగ్‌పై ఆసక్తి ఉండటంతో 2012లో మోడల్‌గా అనంతరం వ్యాఖ్యాతగా మారారు. క్రికెట్ కంటే ముందు బాస్కెట్ బాల్ పోటీలకు యాంకరింగ్ చేసిన తొలి భారతీయురాలిగా గుర్తింపు పొందారు. ప్రొఫెషనల్ వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్. అభిజీత్ చౌదరీ దర్శకత్వంలో సినిమా హీరోయిన్గా నటించింది. ప్రస్తుతం ప్రపంచకప్‌లో భారత్ మ్యాచ్‌లకు సంబంధించిన సమాచారాన్ని క్రికెట్ అభిమానులతో పంచుకోనుంది. పేయ జన్నతుల్ 2007లో మిస్ బంగ్లాదేశ్‌గా ఎన్నికైన ఈ భామ అనతికాలంలోనే ఎన్నో పేరుప్రఖ్యాతలను సంపాదించుకుంది. 2008 నుంచి పూర్తిగా మోడలింగ్ రంగానికే పరిమితమై పలు సినిమాల్లో నటించింది. అంతేకాకుండా 2013లో మిస్ ఇండియా ప్రిన్సెస్ ఇంటర్నేషనల్ అవార్డును కైవసం చేసుకుంది. అనంతరం యాంకరింగ్‌గా మారిన జన్నతుల్.. కొద్దికాలంలోనే స్టార్డమ్ సంపాదించుకుంది. బంగ్లాదేశ్ టీ20 లీగ్‌కు వ్యాఖ్యాతగా పనిచేసింది. ఇక బంగ్లా క్రికెటర్లతో కలిసి ఎన్నో ప్రకటనల్లో నటించింది. బంగ్లాదేశ్‌లోని గాజీ టీవీలో ప్రపంచకప్ అప్ డేట్స్ ఇవ్వనుంది. జైనబ్ అబ్బాస్ పాకిస్తాన్లో పాపులర్ స్పోర్ట్స్ స్టార్ జైనబ్ అబ్బాస్. సోషల్ మీడియాలో చాలా ఆక్టీవ్‌గా ఉంటుంది. ఈ మధ్యే పాక్ స్టార్ బ్యాట్స్‌మన్ బాబర్ అజామ్ ఆగ్రహానికి గురైంది. పాకిస్తాన్ టీ20 లీగ్‌కు వ్యాఖ్యాతగా పనిచేసి క్రికెట్ ఫ్యాన్స్‌ను అలరించింది. ప్రపంచకప్‌లో పాకిస్తాన్ మ్యాచ్‌లకు సంబంధించిన సమాచారాన్ని క్రికెట్ అభిమానులకు అందిస్తుంది. -
వీరి ఆట... మెరుపుల తోట
ప్రపంచ కప్ అంటేనే ఆయా జట్ల స్టార్ల సంగమం. తమ ఆటతో అదరగొట్టి... ఇమేజ్ను అమాంతం పెంచుకుని... దిగ్గజాలుగా పిలిపించుకునేందుకు వారికి ఇది ఓ అవకాశం. ఆనాటి కపిల్, ఇమ్రాన్ నుంచి మొన్నటి రణతుంగ, పాంటింగ్, నిన్నటి ధోని, క్లార్క్ వరకు ఇలా ఎదిగినవారే. ద్వైపాక్షిక సిరీస్‌లలో రాణించినా, ముక్కోణపు టోర్నీల్లో అదరగొట్టినా, బహుళ దేశాల చాంపియన్‌షిప్‌లలో చెలరేగినా రాని పేరును ఈ కప్ ద్వారా కూడగట్టుకోవచ్చు. పనిలోపనిగా తమ దేశ హీరోలుగా చరిత్రలో నిలిచిపోవచ్చు. నాలుగేళ్లకోసారి వచ్చే ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాబోయే కప్‌లో తమ జట్ల భాగ్య రేఖను మార్చి రారాజుగా నిలిచేదెవరో మరి? విశ్వ సమ రంలో భారత్‌ను మూడోసారి విజేతగా నిలపాలని విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా... ఇంగ్లండ్‌కు తొలి కప్ అందించి చరిత్రకెక్కాలని జాస్ బట్లర్, బెన్ స్టోక్స్... దక్షిణాఫ్రికా కల ఈసారైనా నెరవేర్చాలని డికాక్, డు ప్లెసిస్... ఆస్ట్రేలియా పట్టు మరింత బిగించాలని స్మిత్, వార్నర్... ఇలా చెప్పుకొంటూ పోతే ప్రపంచ కప్‌లో తమ ముద్ర బలంగా వేసేందుకు ప్రతి జట్టు నుంచి ఇద్దరు, ముగ్గురు స్టార్లు తహతహలాడుతున్నారు. వీరిలో కొందరికి ఇప్పటికే కప్‌లో ఆడిన అనుభవం ఉండగా మరికొందరు తొలిసారి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. దేశాలవారీగా పరిశీలిస్తే... భారత్: ఈ త్రయంపై ఎన్నో ఆశలు బ్యాటింగ్‌లో కోహ్లి, బౌలింగ్‌లో బుమ్రా, ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాండ్యా... మూడు విభాగాలకు మూల స్తంభాలైన వీరిపైనే ఈ కప్‌లో భారత్ భారమంతా వేసింది. కుర్రాడిగా ఉన్నప్పుడు కప్ గెలిచిన జట్టులో భాగస్వామి అయిన కోహ్లి కెప్టెన్‌గానూ ఆ ఘనత సాధించాలని ఉవ్విళ్లూరుతున్నాడు. కెప్టెన్‌కు హార్దిక్ హిట్టింగ్ తోడైతే స్కోరు పైపైకి వెళ్తుంది. ఐదో బౌలర్‌గానూ ఇతడు ఓ చేయి వేస్తాడు. తర్వాత 140 కి.మీ. పైగా వేగం, పదునైన పేస్‌తో బుమ్రా ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ పని పడతాడు. తొలిసారి ప్రపంచ కప్ ఆడబోతున్న వీరిద్దరూ ఇటీవల ఐపీఎల్లో అదరగొట్టారు. ఇంగ్లండ్: కల నెరవేరుస్తారని... ఎన్నోసార్లు అందినట్లే అంది చేజారిన కప్‌పై ఆతిథ్య ఇంగ్లండ్ ఈసారి చాలా ఆశలే పెట్టుకుంది. జట్టంతా బలంగా ఉన్నా... ముఖ్యంగా ఓపెనర్ జేసన్ రాయ్, కీపర్ బట్లర్, ఆల్‌రౌండర్ స్టోక్స్ ఈ కల నెరవేరుస్తారని భావిస్తోంది. రాయ్, బట్లర్ విధ్వంసక బ్యాటింగ్‌కు పెట్టింది పేరు. సెంచరీల మీద సెంచరీలు బాదుతూ అద్భుతమైన ఫామ్‌లోనూ ఉన్నారు. పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్‌గా స్టోక్స్ పాత్ర మరింత కీలకం. సొంతగడ్డ అనుకూలతను సద్వినియోగం చేసుకుంటూ వీరు రెచ్చిపోతే... ఇంగ్లండ్ జగజ్జేత కావడం ఖాయం . ఆస్ట్రేలియా: మచ్చ చెరిపేసుకోవాలని బాల్ ట్యాంపరింగ్‌తో వ్యక్తిగతంగా, ఆటపరంగా చాలా నష్టపోయారు వార్నర్, స్మిత్. సీనియర్లు ఫించ్, ఖాజా, మార్‡్ష, జూనియర్లు హ్యాండ్స్కోంబ్, టర్నర్ల మధ్య జట్టులో చోటు నిలబెట్టుకోవడానికి, ట్యాంపరింగ్ మచ్చను చెరిపేసుకోవడానికి వీరికిది సువర్ణావకాశం. దూకుడుగా ఆడే వార్నర్ ఐపీఎల్‌తో ఫామ్‌ను చాటుకోగా, స్థిరంగా రాణించే స్మిత్ కివీస్‌తో సన్నాహక మ్యాచ్‌ల్లో ఆకట్టుకున్నాడు. పేస్ గుర్రం కమిన్స్ ఈ కప్‌లో గమనించదగ్గ ఆటగాడు. స్వింగ్‌తో పాటు వేగంతో అతడు భారత పర్యటనలో మెరిశాడు. న్యూజిలాండ్: వీరి తరం అవుతుందా? కప్ గెలిచేంత స్థాయి లేకున్నా... గట్టి పోటీ ఇచ్చే జట్టు న్యూజిలాండ్. అలాంటి కివీస్‌కు ఏ పిచ్‌పైనైనా పరుగులు సాధించే కెప్టెన్ విలియమ్సన్, రాస్ టేలర్ పెద్ద దిక్కు. ఫామ్ కొంత కలవరపరుస్తున్నా, ప్రపంచ స్థాయి బ్యాట్స్‌మెన్ అయిన వారికి అదేమంత ఇబ్బంది కాబోదు. ఈ ఇద్దరు ఎంత బాధ్యతగా ఆడితే కివీస్ అంత బలంగా ఉంటుంది. పేసర్ ట్రెంట్ బౌల్ట్ కూడా సత్తా ఉన్నవాడే. ఎడంచేతి వాటం కావడంతో అతడిని ఆచితూచి ఆడాల్సి ఉంటుంది. దక్షిణాఫ్రికా: ఈ నలుగురు ప్రపంచ కప్‌లో దురదృష్టం వెంటాడే దక్షిణాఫ్రికా పెద్ద స్టార్లంటూ ఎవరూ లేకుండా ఈసారి బరిలో దిగుతోంది. ఆమ్లా, తాహిర్, మిల్లర్ వంటివారున్నా... కెప్టెన్ డు ప్లెసిస్, బ్యాట్స్‌మన్ డికాక్, పేసర్లు స్టెయిన్, రబడల పైనే ఎక్కువ అంచనాలున్నాయి. ఐపీఎల్లో అదరగొట్టిన డికాక్, డు ప్లెసిస్ ఫామ్ చాటుకున్నారు. గాయం బెడద లేకుంటే.... వేగం, కచ్చితమైన యార్కర్లు వేసే రబడను ఎదుర్కొనడం ప్రత్యర్థులకు సవాలే. ఐపీఎల్ లీగ్ దశ వరకే 25 వికెట్లు పడగొట్టాడు ఈ యువ బౌలర్. మిగతా జట్టు నుంచి ప్రోత్సాహం ఉంటే ఈ నలుగురు దక్షిణాఫ్రికాను మెరుగైన స్థితిలో నిలపగలరు. పాకిస్తాన్: నవతరం ప్రతాపం ఎంత అద్భుతంగా ఆడగలదో అంత అధ్వానమైన ప్రదర్శనా చేయగలదు పాక్. కాబట్టి ప్రపంచ కప్ సాధించలేదని కూడా చెప్పలేం. ఈ ప్రయాణంలో విజయవంతం కావాలంటే ఓపెనర్ ఫఖర్ జమాన్, బాబర్ ఆజమ్, పేసర్ ఆమిర్ విశేషంగా రాణించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఇంగ్లండ్ వాతావరణానికి అలవాటైన జమాన్, ఆజమ్ భారీగా పరుగులు సాధిస్తూ ఆత్మవిశ్వాసం కూడగట్టుకుంటున్నారు. తొలుత జట్టులో చోటివ్వకున్నా... ఆమిర్ లేని తమ బౌలింగ్ ఎంత పేలవమో గుర్తించిన పాక్ తక్షణమే పిలిపించింది. ఇదే అతడి ప్రత్యేకత ఏమిటో చెబుతోంది. ఇంగ్లండ్ పిచ్‌లపై ఆమిర్ స్వింగ్ ప్రతాపం 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కళ్లకు కట్టింది. శ్రీలంక: ఎవరో ఒకరు.. మాజీ చాంపియన్, రెండుసార్లు వరుసగా ఫైనల్ చేరిన ఘనత ఉన్న శ్రీలంక... తమ కాబోయే స్టార్‌ను ఈ ప్రపంచ కప్‌లో వెతుక్కోనుంది. అనుభవజ్ఞులైన ఆటగాళ్లున్నా ఎవరి ఫామ్ మీద నమ్మకం లేని పరిస్థితి. మంచి ఫామ్‌లో ఉంటే మాజీ కెప్టెన్, నాణ్యమైన ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్ గురించి ఇక్కడ చెప్పుకోనే వీలుండేది. యువ బ్యాట్స్‌మన్ కుశాల్ మెండిస్ కాస్తోకూస్తో ఆశలు రేకెత్తిస్తున్నాడు. ప్రధాన పేసర్ లసిత్ మలింగ, పెరీరా ద్వయం తిసారా, కుశాల్లపై నమ్మకం పెట్టుకోవచ్చు. పేలనున్న అఫ్గాన్స్... టి20 లీగ్‌లలో అదరగొడుతున్న అఫ్గానిస్తాన్ కుర్రాళ్లకు ఈ ప్రపంచ కప్ ఓ సువర్ణావకాశం. ముఖ్యంగా తాము ప్రపంచ శ్రేణి బౌలర్లమని చాటుకునేందుకు రషీద్ ఖాన్, ముజీబుర్ రెహ్మాన్లకు. ధాటిగా ఆడే వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ మొహమ్మద్ షెహజాద్ ఎంతవరకు మెరుస్తాడో చూడాలి. రౌండ్ రాబిన్ లీగ్ కాబట్టి... అఫ్గాన్ నుంచి కనీసం ఒకరైనా పరుగులు లేదా వికెట్ల గణాంకాల పట్టికలోకి ఎక్కే వీలుంది. విండీస్: స్వర్ణయుగానికి ప్రయత్నం ఏ రోజైనా విరుచుకుపడే క్రిస్ గేల్, ఆఖర్లో ఊడ్చిపెట్టేసే ఆండ్రీ రసెల్, దూకుడైన యువ హెట్‌మైర్... ఈ ముగ్గురు బ్యాట్స్‌మెన్ పైనే వెస్టిండీస్ ప్రపంచ కప్ ప్రస్థానం ఆధారపడి ఉంది. చివరి ప్రపంచ కప్ ఆడుతున్న గేల్ పట్టుదలతో నిలిస్తే ప్రత్యర్థులకు వణుకే. ఇటీవల ఇంగ్లండ్‌తో సిరీస్ గేల్‌లో ఇంకా వన్డేలు ఆడగల సత్తా ఉందని చాటింది. రసెల్... గత కప్‌లో కొంత మెరిసినా అదంతగా వెలుగులోకి రాలేదు. ఈసారి మరింత రాటుదేలిన అతడు ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాడో చూడాలి. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న హెట్‌మైర్‌కు ఈ కప్ సువర్ణావకాశం. ఎంతైనా బౌలింగ్ బలం తోడైతేనే వీరి మెరుపులకు అర్థం ఉంటుంది. బంగ్లాదేశ్: భళా అనిపించేదెవరో! సౌమ్య సర్కార్, తమీమ్ ఇక్బాల్, షకీబుల్ హసన్... ఇలా జట్టులో పలు ప్రపంచ కప్‌లు ఆడిన వారున్నా, ఇంతవరకు ఎవరూ పెద్ద స్టార్ కాలేకపోయారు. ఈసారి యువ బ్యాట్స్‌మెన్ షబ్బీర్ రెహ్మాన్, మొసద్దిక్ హుస్సేన్‌లపై ఓ కన్నేసి ఉంచొచ్చు. సీనియర్ల దన్నుతో వీరు రాణించే వీలుంది. గాడిన పడితే... పేసర్ ముస్తాఫిజుర్ ప్రమాదకారి అనడంలో సందేహం లేదు. -
పూర్వ వైభవం కోసం...
ప్రపంచ క్రికెట్‌ను ఏలిన జట్టు... క్రికెట్ ప్రత్యర్థుల్ని వణికించిన జట్టు... తొలి మూడు ప్రపంచ కప్‌లను శాసించిన జట్టు... విండీస్, విండీస్, విండీస్!నిజం. వెస్టిండీస్‌తో ఆటంటేనే హడలెత్తే రోజుల నుంచి వెస్టిండీస్‌పై విజయం తేలికే అనే రోజులొచ్చాయి. గతమైన ఘనం నుంచి బలహీనమైన భవిష్యత్తులోకి పడిపోయిన జట్టు కరీబియన్ జట్టు. డబుల్ ‘చాంపియన్’ నుంచి చాంపియన్‌షిప్ బాట మరిచిన జట్టుగా తయారైంది. ఈసారైతే క్వాలిఫయింగ్తో మెగా ఈవెంట్లోకి అడుగుపెట్టింది. పడుతూ... నానాటికి పడిపోతూ... దిగజారుతూ వస్తోన్న ఈ జట్టు ఈ ప్రపంచకప్‌లో ఏమేరకు రాణిస్తుందో చూడాలి. సాక్షి క్రీడావిభాగం: ప్రపంచ క్రికెట్లోనే ‘ఫైవ్ స్టార్’ రేటింగ్ ఉన్న జట్టు వెస్టిండీస్. కానీ ఇది గతం! 1970, 80 దశకాల్లో టెస్టు, వన్డే ఫార్మాట్లలో ఆటనే శాసించిన ఈ జట్టు క్రమంగా ప్రాభవం కోల్పోయింది. మొదట్లో చాంపియన్ (1975, 1979) అయ్యాక 1983లో రన్నరప్‌గా నిలిచాకా... చాన్నాళ్ల తర్వాత ఒకసారి సెమీస్ (1996), రెండుసార్లు క్వార్టర్స్ (2011, 2015) మినహా లీగ్ దశ జట్టుగా మిగిలిపోయింది. ఇప్పుడైతే టి20ల పుణ్యమాని భారీ హిట్టర్లతో కళకళలాడుతోంది. బ్యాటింగ్ మజాను పంచుతోంది. అయితే 50 ఓవర్ల ఆట వేరు... టి20 మెరుపులు వేరు. ఈ నేపథ్యంలో మెరుపులను మేళవిస్తూనే జట్టు సమతూకంతో వన్డే ప్రపంచకప్‌లో రాణించాలని గంపెడాశలతో మెగా ఈవెంట్‌కు సిద్ధమైంది. దిశ మారితే దశ కూడా... క్రమంగా అధఃపాతాళానికి పడిపోయిన వెస్టిండీస్ గత రెండు టోర్నీల్లో మాత్రం ఆకట్టుకుంది. లీగ్ దశను దాటి క్వార్టర్స్ దిశను చూపెట్టింది. ఇప్పుడు ఫార్మాట్ మారింది. అన్నీ జట్లు అందరితో ఆడాల్సిన ఈవెంట్ ఇది. హిట్టర్లున్న బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో కాస్త కష్టపడితే తప్పకుండా ప్రభావం చూపగలదు. ముఖ్యంగా గేల్‌తో పాటు నికోలస్ పూరన్, షై హోప్, హెట్‌మైర్‌లు కాసేపు క్రీజులో కుదురుకుంటే పరుగుల వరద ఖాయం. బౌలింగ్‌లో కెప్టెన్ హోల్డర్, గాబ్రియెల్, నర్స్, రోచ్‌లు తమ స్థాయికితగ్గ ప్రదర్శన కనబరిస్తే ప్రత్యర్థి జట్టును ఇబ్బంది పెట్టవచ్చు. ఆల్‌రౌండర్ల రూపంలో రసెల్, బ్రాత్‌వైట్‌లు జట్టుకు అదనపు బలం. ఇటీవలి వన్డే రికార్డును పరిశీలిస్తే గత చివరి పది వన్డేల్లో వెస్టిండీస్ నాలుగు మ్యాచ్‌లు నెగ్గింది. ఐదింట ఓడగా... ఒక మ్యాచ్ రద్దయింది. రసెల్... ఓ మిసైల్... ఈ ఐపీఎల్ చూసిన వారెవరైనా గేల్+గేల్= రసెల్ అనే అంటారు. అంతలా రెచ్చిపోయాడీ కరీబియన్ ఆల్‌రౌండర్. బౌండరీల్ని కాదు చుక్కల్ని తాకే సిక్స్ల్నే మంచినీళ్ల ప్రాయంగా బాదేశాడు. అలవోకగా సిక్సర్ల అర్ధసెంచరీ (52)ని మించేశాడు. టోర్నీ ఆసాంతం మెరుగ్గా ఆడాడు. లీగ్‌లో ‘మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్’గా నిలిచాడు. ఈ నేపథ్యంలో మెగా ఈవెంట్లో 31 ఏళ్ల ఈ బ్యా ట్స్మన్పై కన్నేయొచ్చు. విండీస్ ఇన్నింగ్స్ మొదలైతే క్రికెట్ ప్రేక్షకులు తప్పకుండా అతని బ్యాటింగ్ చూస్తారు. అంతలా తన విధ్వంసంతో అందరినీ ఆ‘కట్టి’పడేశాడీ బ్యాట్స్‌మన్. తనదైన రోజున ఎంతటి కఠిన ప్రత్యర్థి ఎదురైనా బలికావాల్సిందే. తన ఫామ్‌ను, సిక్సర్ల సునామీని ప్రపంచకప్‌లోనూ కొనసాగిస్తే విండీస్ దూసుకెళ్లడం ఖాయం ఆఖరి ఆటకు గేల్ రెడీ... క్రిస్ గేల్ అంటేనే సుడిగాలి ఇన్నింగ్స్‌లకు పెట్టింది పేరు. అతనిప్పుడు ప్రపంచకప్‌తో ఆఖరి ఆటకు సిద్ధమయ్యాడు. 39 ఏళ్ల ఈ డాషింగ్ ఓపెనర్ ఈ మెగా ఈవెంట్ తర్వాత వన్డే క్రికెట్‌కు బైబై చెబుతున్నట్లు ప్రకటించాడు. ఈ నేపథ్యంలో అతను తన బ్యాట్‌తో ఆఖరి ‘షో’ చూపించేందుకు సిద్ధంగా ఉన్నాడు. ప్రపంచకప్‌లో విజయంతో రిటైరైతే తన కెరీర్‌కు అంతకు మించిన ముగింపు ఏముంటుం దనే ఆశతో ఉన్నాడు. పైగా అగ్గికి ఆజ్యం తోడైనట్లు రసెల్ కూడా సుడి‘గేల్’కు జతకలిస్తే ప్రత్యర్థి జట్లు విలవిలలాడాల్సిందే. గేల్ లక్ష్యం కూడా తన జట్టుకు ప్రపంచకప్‌ను అందించడమే కావడంతో ఇంగ్లండ్‌లో భారీ సిక్సర్ల విందును ఆశించవచ్చు. ఐపీఎల్లో గేల్ మొత్తంగా విఫలమేమీ కాలేదు. ఈ ఫామ్‌ను కొన సాగిస్తే అతను వరల్డ్‌కప్‌లో విజయవంతమవుతాడు. ప్రపంచకప్‌లో విండీస్ దిగ్గజం లారా (1,225) చేసిన పరుగుల్ని గేల్ (944) అధిగమించే అవకాశముంది. -
సర్ఫరాజ్... ఇమ్రాన్ కాగలడా!
సరిగ్గా రెండేళ్ల క్రితం ఇదే ఇంగ్లండ్ గడ్డపై చాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచిన తర్వాత పాకిస్తాన్ జట్టు 38 వన్డేలు ఆడితే 15 గెలిచింది. ఇందులో జింబాబ్వే, హాంకాంగ్, అఫ్గానిస్తాన్, బలహీన శ్రీలంకలపైనే 12 వచ్చాయి. అదే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, భారత్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాలాంటి పెద్ద జట్లతో తలపడినప్పుడు 23 మ్యాచ్‌లలో ఓడిపోయి 3 మ్యాచ్‌లు మాత్రమే గెలవగలిగింది. వరుసగా 11 వన్డేల్లో పరాజయం తర్వాత ఇప్పుడు పాక్ ప్రపంచ కప్ బరిలోకి దిగుతోంది. మొదటి ప్రాక్టీస్ మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ చేతిలో కూడా చావుదెబ్బ తింది. ఈ గణాంకాలు చూస్తే ఏ జట్టయినా పాకిస్తాన్‌ను తేలిగ్గా తీసుకునే పరిస్థితి! కానీ అలా ఎవరైనా భావిస్తే అది స్వయంకృతాపరాధమే అవుతుంది. ఎందుకంటే విజయపు అంచుల నుంచి ఓటమి వైపు వెళ్లినా... ఒక శాతం కూడా విజయావకాశం లేని చోట అనూహ్యంగా ఎగసి విజేతగా నిలవడం పాకిస్తాన్‌కే చెల్లు. 1992 టోర్నీ సహా ఇది గతంలో ఎన్నోసార్లు నిరూపితమైంది. ఇప్పుడు కూడా వరల్డ్ కప్‌లో ఆ జట్టు మరోసారి అలాంటి సంచలనాన్నే ఆశిస్తోంది. కాబట్టి ప్రతీ జట్టు జాగ్రత్త పడాల్సిందే. 1992 తరహా ఫార్మాట్లో జరుగుతున్న ఈ టోర్నీలో తామే గెలుస్తామని భావిస్తున్న అభిమానుల కోరిక నెరవేరుతుందా! తీవ్ర పోటీ ఉన్న ప్రపంచ కప్ పోరులో పాక్ నిలిచేదెక్కడ? బలాలు గతంలో ఎప్పుడు పాకిస్తాన్ గురించి ప్రస్తావించినా ఆ జట్టు బౌలింగ్ బలంపైనే ఎక్కువగా చర్చ జరిగేది. అయితే ఇటీవల టీమ్ బ్యాటింగ్ కూడా ఎంతో మెరుగుపడింది. ముఖ్యంగా టాప్–3పైనే టీమ్ ఆశలు పెట్టుకుంది. వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించిన ఏకైక పాకిస్తాన్ ఆటగాడైన ఫఖర్ జమాన్, సుమారు 60 సగటుతో నిలకడగా రాణిస్తున్న ఇమామ్ ఉల్ హఖ్ ఓపెనర్లుగా జట్టుకు కీలకం కానున్నారు. మూడో స్థానంలో ఇప్పటికే ‘పాక్ కోహ్లి’గా ప్రశంసలు అందుకుంటున్న బాబర్ ఆజమ్ రికార్డు అద్భుతంగా ఉంది. మిడిలార్డర్లో అనుభవజ్ఞులైన హఫీజ్, షోయబ్ మాలిక్ స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కొని ఇన్నింగ్స్‌ను నడిపించగలరు. హారీస్ సొహైల్ మరో కీలక ఆటగాడు కాగా ఆసిఫ్ అలీకి మంచి హిట్టింగ్ సామర్థ్యం ఉంది. బౌలింగ్‌లో ‘చాంపియన్స్ ట్రోఫీ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ హసన్ అలీతో పాటు మొహమ్మద్ ఆమిర్‌ను జట్టు నమ్ముకుంది. లెగ్ స్పిన్నర్ షాదాబ్ ఖాన్‌పై పాక్ ఆశలు పెట్టుకోగా... కుర్ర పేసర్లు షాహిన్ ఆఫ్రిది, హస్నయిన్ సంచలనాలు చేయగలరని జట్టు ఆశిస్తోంది. మ్యాచ్‌లు ఓడినా ఇటీవల ఇంగ్లండ్‌తో సిరీస్‌లో వరుస వన్డేల్లో 358, 340 పరుగులు చేయడం జట్టు బ్యాటింగ్ బృందంలో ఆత్మవిశ్వాసం పెంచింది. బలహీనతలు పాక్‌కు కవచకుండలాల్లాంటి బలహీనతలు నిలకడలేమి, ఘోరమైన ఫీల్డింగ్, ఒత్తిడిలో అనూహ్యంగా కుప్పకూలిపోయే లక్షణం ఒక్కసారిగా జట్టును బలహీనంగా మారుస్తున్నాయి. ఈతరం వన్డే క్రికెట్లో సాధారణంగా మారిపోయిన ‘పవర్ హిట్టింగ్’ పాక్ టీమ్‌లో అస్సలు కనిపించడం లేదు. 2017 చాంపియన్స్ ట్రోఫీ నుంచే తీసుకుంటే ఈ ప్రపంచ కప్‌లో పోటీ పడుతున్న జట్లలో (బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ మినహా) బౌండరీల రూపంలో అతి తక్కు వ పరుగులు (8.33 శాతం) చేసిన జట్టు పాకిస్తాన్. కెప్టెన్ సర్ఫరాజ్ బ్యాటింగ్ వైఫల్యం తరచూ జట్టును దెబ్బ తీస్తోంది. రెండు దశాబ్దాల కెరీర్ ఉన్న షోయబ్ మాలిక్ కూడా ఇటీవల కీలక సమయాల్లో చాలా సార్లు చేతులెత్తేశాడు. ఈసారి అనూహ్యంగా పేస్ బౌలర్ల ఎంపిక వివాదాస్పదంగా మారి జట్టును గందరగోళంలో పడేసింది. జునైద్ ఖాన్‌ను తీసేసి రెండేళ్ల క్రితం చివరి వన్డే ఆడిన, ఇంగ్లండ్‌లో ఘోరమైన రికార్డు ఉన్న వహాబ్ రియాజ్‌ను ఎంపిక చేయడం, సుదీర్ఘ కాలంగా విఫలమవుతున్నా ఆమిర్పైనే నమ్మకముంచడం తీవ్ర విమర్శలకు దారి తీశాయి. ఆఫ్రిది, హస్నయిన్ మెరుగ్గానే కనిపిస్తున్నా... వరల్డ్ కప్‌లాంటి మెగా టోర్నీలో వారి అనుభవలేమి సమస్యగా మారవచ్చు. మొత్తంగా గతంతో పోలిస్తే ఈసారి పాక్ బౌలింగ్ బలహీనంగానే కనిపిస్తోంది. పైగా హసన్ అలీ పేలవ ఫామ్‌లో ఉన్నాడు. దాదాపు 350 పరుగుల స్కోరు కూడా నిలబెట్టుకోకపోతుండటం దీనిని మరోసారి రుజువు చేసింది. గత రికార్డు... ప్రతిష్టాత్మక కప్‌ను గెలుచుకున్న జట్లలో పాకిస్తాన్ కూడా ఒకటి. 1992లో ఇమ్రాన్ సారథ్యంలో పాక్ విశ్వవిజేతగా నిలిచింది. 1999లో ఫైనల్ కూడా చేరింది. మరో నాలుగు సందర్భాల్లో (1979, 1983, 1987, 2011)లలో సెమీఫైనల్ చేరిన రికార్డు ఉంది. గత ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా చేతిలో క్వార్టర్ ఫైనల్లో ఓడి వెనుదిరిగింది. -
ఇంగ్లండ్... ఇప్పుడైనా!
జెంటిల్మన్ క్రీడకు పుట్టిల్లు...వన్డే ప్రపంచ కప్ పురుడు పోసుకున్న నేల.. క్రికెట్ మక్కా ‘లార్డ్స్’ మైదానం కొలువైనదీ అక్కడే! అయినా, ఇంగ్లండ్‌కు ప్రపంచ కప్ తీరని కలే! మూడుసార్లు ఫైనల్ వరకు వచ్చినా కిరీటం అందినట్టే అంది చేజారింది. ఇదంతా గతం. ఇప్పుడు మాత్రం దుర్బేధ్య బ్యాటింగ్ లైనప్, అందుకుతగ్గ బౌలింగ్ బలగం, నాణ్యమైన ఆల్ రౌండర్లతో ఆతిథ్య దేశం అత్యంత బలంగా ఉంది.ప్రత్యర్థులకు దడ పుట్టించే ఆటతో ఎన్నడూ లేనంత ధీమాగా బరిలో దిగుతోంది. ఇయాన్ మోర్గాన్ సారథ్యంలోని ఈ జట్టుకు ‘విపరీతమైన అంచనాల ఒత్తిడి’ ప్రధాన ముప్పు. ఆ ఒక్కదాన్నీ అధిగమిస్తే చిరకాల వాంఛ నెరవేరినట్లే! సాక్షి క్రీడా విభాగం: వన్డేల్లో నంబర్‌వన్, హాట్ ఫేవరెట్, ఆతిథ్యం... బహుశా ఇన్ని సానుకూలతలతో ఇంగ్లండ్ ఎప్పుడూ ప్రపంచ కప్ బరిలో దిగి ఉండకపోవచ్చు. చుట్టూ సానుకూల వాతావరణంలో మోర్గాన్ సేన ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. వన్డేల్లో నమోదైన చివరి 400పైగా స్కోర్లలో నాలుగు ఇంగ్లండ్వే అంటేనే ఆ జట్టు భీకర ఫామ్‌ను అర్థం చేసుకోవచ్చు. విధ్వంసక బ్యాట్స్‌మన్ అలెక్స్ హేల్స్ దూరమైనా... ఒక్క శాతం కూడా బలహీనపడ్డట్లు కనిపించకపోవడమే ఆతిథ్య దేశం ఎంత పటిష్టంగా ఉందో తెలుపుతోంది. అయితే, దీని వెనుక నాలుగేళ్ల సంస్కరణల కృషి ఉంది. గత కప్‌లో దారుణ వైఫల్యంతో గ్రూప్ దశలోనే వెనుదిరగడం వారి కళ్లు తెరిపించింది. కొందరు ఆటగాళ్లనూ నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టి... ఆద్యంతం దూకుడు కనబరిచేవారిని ఎంచుకోవడం మంచి ఫలితాన్నిచ్చింది. ఈ ప్రయోగాలన్నీ విజయవంతమైనట్లు ద్వైపాక్షిక సిరీస్‌ల ద్వారా తే లింది. మరి ప్రపంచకప్‌లో ఏమౌతుందో చూడాలి. ఆతిథ్యం ఐదోసారి... ప్రపంచ కప్‌కు అత్యధికంగా ఐదోసారి ఆతిథ్యం ఇస్తోంది ఇంగ్లండ్. ఇక్కడే జరిగిన 1975 కప్‌లో సెమీస్‌కు, 1979లో ఫైనల్‌కు, 1983లో సెమీస్‌కు చేరింది. తర్వాతి రెండు కప్‌ల (1987, 1992)లో రన్నరప్‌గా నిలిచింది. మెగా టోర్నీలో ఇక్కడి నుంచి జట్టు ప్రదర్శన పడిపోయింది. భారత్ ఆతిథ్యమిచ్చిన 1996 కప్‌లో క్వార్టర్స్ వరకు చేరగలిగినా... సొంతగడ్డపై జరిగిన 1999 కప్‌లో గ్రూప్ దశ కూడా దాటలేదు. 2003లో గ్రూప్, 2007లో సూపర్–8, 2011లో క్వార్టర్స్, 2015లో గ్రూప్ దశతోనే సరిపెట్టుకుంది. బలాలు జేసన్ రాయ్, బెయిర్‌స్టో, జో రూట్ల టాపార్డర్... కెప్టెన్ మోర్గాన్, జాస్ బట్లర్, పేస్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌తో కూడిన బ్యాటింగ్ లైనపే ఇంగ్లండ్ బలం. స్పిన్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగల సమర్థుడు. జట్టు గెలిచిన కొన్ని సిరీస్‌లను చూస్తే... భారత్‌పై రూట్, బెయిర్‌స్టో, శ్రీలంకపై మోర్గాన్, బట్లర్ ఇలా ఇద్దరేసి బ్యాట్స్‌మెన్ కీలక పాత్ర పోషించారు. మిగతావారు విజయానికి కావాల్సిన ముగింపు ఇచ్చారు. రాయ్, బెయిర్‌స్టో విధ్వంసక ఆరంభాన్నిస్తే... రూట్, మోర్గాన్ మధ్య ఓవర్లలో ఇన్నింగ్స్‌ను నడిపిస్తారు. తర్వాత సంగతిని ఫటాఫట్ షాట్లతో బట్లర్ చూసుకుంటాడు. రెండేళ్లుగా బీభత్సమైన ఫామ్‌లో ఉన్న అతడు ఇటీవల పాకిస్తాన్‌తో సిరీస్‌లో 50 బంతుల్లోనే సెంచరీ బాదాడు. ఫిబ్రవరిలో వెస్టిండీస్‌పై 77 బంతుల్లో 150 మార్క్‌ను అందుకున్నాడు. బౌండరీలతో చకచకా పరుగులు రాబడుతూ సెంచరీలపై సెంచరీలతో బెయిర్‌స్టో ఏడాదిన్నరగా నిలకడకు మారుపేరుగా నిలుస్తున్నాడు. తాజాగా ఐపీఎల్‌లోనూ రాణించాడు. రషీద్, అలీలతో స్పిన్ వైవిధ్యంగా కనిపిస్తోంది. నిరుడు తమ దేశంలో పర్యటించిన ఆస్ట్రేలియా, భారత్‌లకు వీరి నుంచే పెద్ద సవాలు ఎదురైంది. ముఖ్యంగా రషీద్... లంక, వెస్టిండీస్‌లోనూ వికెట్లు తీశాడు. గత కప్‌నకు ముందు అనూహ్యంగా పగ్గాలు చేపట్టిన మోర్గాన్... ఈసారి సారథిగా, బ్యాట్స్‌మన్‌గా పరిణతి సాధించాడు. వీరందరి తోడుగా భారీ లక్ష్యాలను విధిస్తున్న ఇంగ్లండ్, అంతే తేలిగ్గా పెద్ద స్కోర్లనూ ఛేదిస్తోంది. బలహీనతలు నిఖార్సైన పేసర్ లేకపోవడం ఇంగ్లండ్ లోటు. క్రిస్ వోక్స్, మార్క్ వుడ్ ప్రత్యర్థులను కట్టిపడేసేంత స్థాయి ఉన్నవారు కాదు. అందుకే మంచి లయతో బంతులేసే జోఫ్రా ఆర్చర్‌ను తీసుకున్నారు. స్టోక్స్ బౌలింగ్ కూడా ప్రభావవం తంగా లేదు. దీనికితోడు గాయాల బెడద. కెప్టెన్ మోర్గాన్ వేలికి దెబ్బ తగలడంతో ఆస్ట్రేలియాతో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడలేదు. ఇదే మ్యాచ్‌లో వుడ్ ఎడమ కాలు ఇబ్బంది పెట్టడంతో స్కానింగ్‌కు వెళ్లాడు. సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన ఆర్చర్ ఆ వెంటనే బంతిని ఆపే యత్నంలో తడబడి మైదానం వీడాడు. ఎడంచేతి స్పిన్నర్ లియామ్ డాసన్ వేలి గాయం, రషీద్ భుజం నొప్పి, వోక్స్ మోకాలి సమస్యలు సైతం జట్టును కలవరపెట్టేవే. బహుళ దేశాల ప్రతిష్ఠాత్మక టోర్నీలో ఒత్తిడి పెద్ద శత్రువు. ఈ ప్రభావం సొంత గడ్డపై ఇంగ్లండ్‌కు మరింత ఎక్కువ. రెండేళ్ల క్రితం తమ దగ్గరే వన్డే ఫార్మాట్లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో దాదాపు ఇదే జట్టు ఆడినా ఫైనల్ చేరడంలో విఫలమైన సంగతి గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. -
గెలిచేవెన్ని... ఓడించేదెవర్ని!
అఫ్గానిస్తాన్ వరల్డ్‌కప్‌లో ఆడింది...ఆకట్టుకుంది... తక్కువే! కానీ కాలం కలిసొచ్చిన రోజు మాజీ ప్రపంచకప్ చాంపియన్‌నైనా ఓడించగలదని వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో నిరూపించింది. ఇక ఈ టోర్నీలో ఎవర్ని ఓడిస్తుందో చూడాలి. క్రికెట్లో అఫ్గానిస్తాన్ పసికూనే! జట్టు ప్రభావం కూడా తక్కువే. ఇక ప్రపంచకప్ విషయానికొస్తే... ఒకే ఒక్క మెగా ఈవెంట్ ఆడింది. గత 2015 టోర్నీతో వన్డే వరల్డ్‌కప్‌లో భాగమైంది. రెండేళ్ల క్రితమే శాశ్వత సభ్యదేశంగా టెస్టు హోదా పొందిన ఈ అఫ్గాన్ జట్టులో ప్రతిభగల ఆటగాళ్లు ఉన్నారు. బౌలింగే ప్రధాన ఆయుధం. ఐపీఎల్ పుణ్యమాని రషీద్ ఖాన్ భారత క్రికెట్ అభిమానులకు బాగా పరిచయమయ్యాడు. బ్యాటింగ్‌లో నిలకడ లేకపోయినా బౌలింగ్‌తో ప్రత్యర్థుల్ని వణికించే వనరులున్న జట్టిది. అలనాటి జగజ్జేత అయిన వెస్టిండీస్‌ను కంగుతినిపించిన రికార్డు ఈ జట్టుకు ఉంది. జట్టులోని బలాబలాల గురించి చెప్పుకుంటే ముందు వరుసలో ఉండేది బౌలింగే! రషీద్ ఖాన్ మాయాజాలం ఇదివరకే వార్తల్లోకెక్కింది. ముజీబుర్ రహ్మాన్ కూడా వైవిధ్యమున్న స్పిన్నర్. సీమర్ హమీద్ హసన్, కెప్టెన్ గుల్బదిన్ నైబ్‌లు ప్రధాన బౌలర్లు. ముందుగా తమ బ్యాట్స్‌మెన్ 200 పైచిలుకు స్కోరు చేస్తే ప్రత్యర్థి చేజింగ్‌ను ఇబ్బంది పెట్టగల బౌలర్లే వాళ్లంతా. అయితే ప్రత్యర్థి జట్టే ముందుగా బ్యాటింగ్ చేస్తే మాత్రం అంత ‘పవర్ఫుల్’ కాదు. బ్యాటింగ్‌లో మొహమ్మద్ షహజాద్ తురుపుముక్క. ఈ ఓవర్‌వెయిట్ బ్యాట్స్‌మన్‌కు ధాటిగా ఆడే సత్తా ఉంది. క్రీజులో పాతుకుపోతే ప్రభావవంతమైన ఇన్నింగ్స్ ఆడగలడు. ఆల్‌రౌండర్ నబీ కూడా భారీషాట్లతో అలరించే బ్యాట్స్‌మెన్. లంకను గెలవొచ్చు... అరంగేట్రం చేసిన గత ప్రపంచకప్‌లో అఫ్గానిస్తాన్... స్కాట్లాండ్ను ఓడించి ఖాతా తెరిచింది. ఆరు మ్యాచ్‌లాడి మిగతా ఐదింటా ఓడింది. ఇప్పుడు మాత్రం తొమ్మిది మ్యాచ్‌లు ఆడేందుకు తహతహలాడుతున్న ఈ జట్టు... శ్రీలంక, బంగ్లాదేశ్, విండీస్‌లను ఓడించినా ఆశ్చర్యం లేదు. ఇక అంతకుమించి ఆశిస్తే మాత్రం అది అత్యాశే అవుతుంది. ఆ మూడు మినహా ఏ జట్టు ఎవరికీ తీసిపోని విధంగా ప్రపంచకప్‌కు సిద్ధమై వచ్చాయి. అందరినీ ఎదుర్కొనే అనుభవం... కచ్చితంగా గెలుస్తుందని గానీ, అందరి చేతిలో ఓడుతుందని గానీ చెప్పడం కష్టమే అయినా... భిన్నమైన ఫార్మాట్లో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్ అఫ్గాన్‌కు మంచి అనుభవాన్నిచ్చే టోర్నీగా నిలిచిపోతుంది. అదెలా అంటారా... ఇక్కడ బరిలో ఉన్న అన్ని జట్లతో ఢీకొనే భాగ్యం కల్పిస్తుంది ఈ టోర్నీ. కాబట్టి కూన... కూనతో కాకుండా హేమాహేమీలతో తలపడవచ్చు. నిప్పులు చెరిగే ప్రచండ బౌలర్లను ఎదుర్కోవచ్చు మరోవైపు గ్రేటెస్ట్ బ్యాట్స్‌మెన్‌కు తమ బౌలింగ్ రుచి చూపించవచ్చు. మొత్తానికి గెలవలేకపోయినా... గెలుపును మించే సంబరాన్ని చేసుకోవచ్చు కదా! అఫ్గానిస్తాన్ జట్టు గుల్బదిన్ నైబ్ (కెప్టెన్), హజ్రతుల్లా, షహజద్, దౌలత్ జద్రాన్, రహ్మత్ షా, అస్గర్, హష్మతుల్లా షాహిది, సమీయుల్లా షిన్వారి, నూర్ అలీ జద్రాన్, ఆఫ్తాబ్ ఆలమ్, హమీద్ హసన్, రషీద్ ఖాన్, ముజీబుర్ రహ్మాన్, మొహమ్మద్ నబీ. -
ఆసీస్ సిక్సర్ కొడుతుందా?
విశ్వ విజేతగా నిలిచిన తర్వాత గత నాలుగేళ్లలో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు అనేక ఒడిదుడుకులకు లోనైంది. అసలు కొంత కాలం పాటు వన్డేలకు ఎలాంటి జట్టును ఎంపిక చేయాలో కూడా అర్థం కానంత అనిశ్చితి, గందరగోళం నెలకొన్నాయి. చాంపియన్స్ ట్రోఫీ జరిగిన 2017 జూన్ నుంచి 2019 మార్చి వరకు కంగారూ టీమ్ 26 ఆడితే 4 మ్యాచ్‌లే గెలవగలిగింది! దీనికి తోడు ట్యాంపరింగ్ వివాదం కారణంగా వార్నర్, స్మిత్‌లపై ఏడాది నిషేధంతో టీమ్ సమతూకం పూర్తిగా దెబ్బ తింది. అయితే భారత గడ్డపై వన్డే సిరీస్ విజయం వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. సరిగ్గా ప్రపంచ కప్‌కు ముందు పాకిస్తాన్‌ను క్లీన్‌స్వీప్ చేయడంతో జట్టులో కొత్త ఉత్సాహం వచ్చింది. ఇప్పుడు ఇదే జోరులో ఫించ్ సేన వరల్డ్ కప్ వేదికపై తమ బలం ప్రదర్శించేందుకు సిద్ధమైంది. టీమ్ బలంగానే కనిపిస్తున్నా ఎక్కువ మంది దానిని ప్రస్తుతానికి ఫేవరెట్గానైతే చూడటం లేదు. ప్రస్తుతం ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానంలో ఉన్న ఆసీస్ అంచనాలకు భిన్నంగా తమ అసలు సత్తాను ప్రదర్శించగలదా! బలాలు సుదీర్ఘ కాలం పాటు క్రికెట్ ప్రపంచాన్ని శాసించిన ఆస్ట్రేలియా ఆరోసారి ప్రపంచ కప్ గెలిచే లక్ష్యంతో బలమైన జట్టునే ఎంపిక చేసింది. సరిగ్గా చెప్పాలంటే వారికి వన్డేలకు సరైన టీమ్ లభించింది. వార్నర్, ఫించ్ రూపంలో ఇద్దరు విధ్వంసకర ఓపెనర్లు జట్టులో ఉన్నారు. వీరు ఆరంభంలో చెలరేగితే ఆసీస్‌కు మంచి పునాది లభిస్తుంది. మ్యాక్స్‌వెల్, స్టొయినిస్ ఇదే ఊపును చివర్లో కొనసాగించగల సమర్థులు. వీరందరి మధ్య వారధిగా అసలైన వన్డే ఆటను ప్రదర్శించగల నైపుణ్యం స్టీవ్ స్మిత్ సొంతం. పునరాగమనం తర్వాత వరుసగా మూడు వార్మప్ మ్యాచ్‌లలో మూడు అర్ధసెంచరీలు చేసిన అతను టచ్‌లోకి వచ్చినట్లే కనిపించాడు. తుది జట్టులో ఉంటే షాన్ మార్ష, ఖాజా కూడా పరిస్థితులకు తగినట్లుగా రాణించగలరు. బౌలింగ్‌లో స్టార్క్, కమిన్స్ ఎలాంటి ప్రత్యర్థులనైనా కుప్పకూల్చగలరు. ముఖ్యంగా ఇంగ్లండ్ పరిస్థితులు స్వింగ్‌కు కొంత అనుకూలించినా వీరికి తిరుగుండదు. ఈ వరల్డ్ కప్‌లో లెగ్ స్పిన్ ప్రభావం చూపిస్తుందని భావిస్తున్న నేపథ్యంలో ఆడమ్ జంపా కూడా ప్రభావం చూపించవచ్చు. అన్నింటికి మంచి ఒక మెగా ఈవెంట్లో ఎలా ఆడాలో, ఒత్తిడిని సమర్థంగా ఎలా ఎదుర్కోవాలో ఆస్ట్రేలియన్లకు తెలిసినట్లుగా మరే జట్టుకు తెలీదు. అప్పటి వరకు ఎలాంటి రికార్డు ఉన్నా... వరల్డ్ కప్‌కు వచ్చేసరికి ఈ మానసిక దృఢత్వం వల్లే వారు సవాల్ విసరగలరు. ఇదే కంగారూలను అందరికంటే ప్రత్యేకంగా నిలబెడుతుంది. పైగా ఇంగ్లండ్‌లో ఆడిన అనుభవం జట్టులో చాలా మందికి ఉండటం కూడా కలిసొచ్చే అంశం. మూడు వరల్డ్ కప్ విజయాలలో భాగమైన రికీ పాంటింగ్ సహాయక సిబ్బందిలో ఉండటం జట్టు వ్యూహాలపరంగా బలమైన అంశం. బలహీనతలు నిషేధం తర్వాత వార్నర్, స్మిత్ ఆడుతున్న తొలి టోర్నీ (ఐపీఎల్‌ను మినహాయిస్తే) ఇదే. సహజంగానే వారిపై కొంత ఒత్తిడి ఉంటుంది. అంతే కాకుండా ఇంగ్లండ్‌లో ప్రేక్షకుల నుంచి వెక్కిరింతలు, హేళనకు కూడా వారు సిద్ధం కావాల్సిందే. ఇలాంటి స్థితిలో వారు తమలోని 100 శాతం ఆటను ప్రదర్శించగలరా అనేది ప్రశ్నార్ధకం. ఐపీఎల్ కూడా ఆడని మ్యాక్స్‌వెల్ వన్డేలు ఆడి ఏడాది దాటింది. అతను ఒక్కసారిగా ఫామ్‌లోకి రాకపోతే కష్టం. బౌలింగ్‌లో స్టార్క్, కమిన్స్ కాకుండా ఇతర బౌలర్లకు అనుభవం చాలా తక్కువ. ఇది వరల్డ్ కప్‌లో వారిపై ఒత్తిడి పెంచవచ్చు. రెండో స్పిన్నర్‌గా చోటు దక్కించుకున్న లయన్ వన్డే సామర్థ్యం అంతంత మాత్రమే. స్టార్క్ కూడా వరుస గాయాల కారణంగా ఏడాదిన్నరగా వన్డేలు ఆడలేదు. పైగా గత ప్రపంచ కప్‌లో ఆసీస్ గడ్డపై భారీ, బౌన్సీ మైదానాల్లో ఆసీస్ పేసర్లు షార్ట్ బంతులను సమర్థంగా ఉపయోగించి ఫలితం సాధించారు. ఇంగ్లండ్‌లోని చిన్న మైదానాల్లో బంతిని నియంత్రించడం అంత సులువు కాదు. ఇది బలహీనతగా మారితే స్టార్క్, కమిన్స్ భారీగా పరుగులు ఇచ్చే ప్రమాదముంది. స్పిన్‌ను సమర్థంగా ఆడలేని బలహీనత కూడా ఆసీస్‌ను దెబ్బ తీయవచ్చు. గత రికార్డు వరల్డ్ కప్ చరిత్రలో మరే జట్టుకు లేని అద్భుతమైన రికార్డు ఆస్ట్రేలియా సొంతం. 11 సార్లు ప్రపంచకప్ జరిగితే ఏకంగా ఐదు సార్లు (1987, 1999, 2003, 2007, 2015) విశ్వ విజేతగా నిలిచింది. మరో రెండుసార్లు (1975, 1996) ఫైనల్లో పరాజయం పాలైంది. 1987 ప్రపంచ కప్‌కు ముందు కూడా వరుస పరాజయాలు, భారత గడ్డపై స్పిన్‌ను ఆడలేని బలహీనత వల్లే ఆసీస్‌ను ఎవరూ పట్టించుకోలేదు. కానీ చివరకు బోర్డర్ సేనదే విజయమైంది. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా... వాటిని అధిగమించగల సత్తా ఉన్న ఆస్ట్రేలియా మరోసారి అలాంటి అద్భుతం చేసినా ఆశ్చర్యం లేదు. స్పిన్‌తోనే గెలుపోటములు... ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా స్పిన్‌ను ఎంత సమర్థంగా ఎదుర్కొంటుందో, జట్టు స్పిన్నర్లు ఎంత బాగా బౌలింగ్ చేస్తారో అనే దానిపైనే మా విజయావకాశాలు ఆధార పడి ఉన్నాయి. గత 12–18 నెలలుగా మాకు ఇదే ప్రధాన లోపంగా ఉంది. ఇప్పుడు స్పిన్‌ను ఆడటంలో మా మిడిలార్డర్ కొంత మెరుగైందనే చెప్పవచ్చు. ముఖ్యంగా వార్నర్, స్నిత్ వచ్చాక సమస్య తగ్గినట్లు కనిపిస్తోంది. బౌలింగ్‌లో చూస్తే జంపా బాగానే రాణిస్తుండగా, లయన్, మ్యాక్స్‌వెల్ కూడా పర్వాలేదు. మొత్తంగా జట్టుపై స్పిన్ ప్రభావం చూపించడం ఖాయం. – రికీ పాంటింగ్, ఆస్ట్రేలియా అసిస్టెంట్ కోచ్ -
బంగ్లాదేశ్ ఎంత వరకు?
గత ప్రపంచ కప్‌లో భారత్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ గుర్తుందా? రోహిత్ శర్మ ఔటైన బంతిని నోబాల్‌గా తప్పుగా ప్రకటించారని, దాని వల్లే తాము మ్యాచ్ ఓడామని ఆ దేశ క్రికెటర్లు, అభిమానులు చిందులేశారు. భారత్‌లాంటి టీమ్‌పై ఒక్క గెలుపు కోసం వారంతా నానా యాగీ చేశారు. ఆ మ్యాచ్ వారిని చాలా కాలం వెంటాడింది. అయితే ఆ ప్రపంచ కప్ తర్వాత నాలుగేళ్లలో బంగ్లాదేశ్ జట్టు అన్ని విధాలుగా చాలా మారింది. పెద్ద జట్లపై వరుస విజయాలు సాధించలేకపోతున్నా... గతంలోలాగా ఏదో ఒక సంచలనంతో సరి పెట్టి సంతోషపడే టీమ్ మాత్రం ఇప్పుడు కాదిది. 2018లో వన్డేల్లో విజయాలు, పరాజయాల నిష్పత్తి చూస్తే భారత్ తర్వాత అత్యంత విజయవంతమైన టీమ్ బంగ్లాదేశ్. అంతకు ముందు ఏడాది చాంపియన్స్ ట్రోఫీలో సెమీఫైనల్ వరకు చేరిన ఈ జట్టు అనంతరం ఆసియా కప్‌లో ఫైనల్‌కు వెళ్లి త్రుటిలో చివరి బంతికి విజయాన్ని కోల్పోయింది. అనుభవజ్ఞులు, సీనియర్లతో సమతూకంగా ఉన్న బంగ్లాను ఇప్పటికీ ఎవరైనా ‘బేబీ’లుగా వ్యవహరిస్తే గట్టి షాక్ తప్పదు. బలాలు బంగ్లాదేశ్ వరల్డ్ కప్ చరిత్ర చూస్తే ఈసారి ఎంపిక చేసిన జట్టే బలంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఇదే ఇంగ్లండ్‌లో 2017 చాంపియన్స్ ట్రోఫీలో సెమీస్ చేరిన టీమ్‌లో ఆ జట్టు ఎక్కువగా మార్పులు చేయలేదు. వారిపైనే నమ్మకముంచి కొనసాగించడంతో ఫలితాలు దక్కాయి. కెప్టెన్ మొర్తజా, తమీమ్, షకీబ్, ముష్ఫికర్, మహ్ముదుల్లా జట్టుకు మూల స్థంభాలు. తమీమ్ ఓపెనర్‌గా అద్భుత ఆరంభం ఇవ్వగలడు. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో వరల్డ్ నంబర్‌వన్ ఆల్‌రౌండర్‌గా నిలిచిన షకీబ్ జట్టుకు అత్యంత కీలకం. ముష్ఫికర్ ఆట కూడా ఎంతో మెరుగవగా... ఈ టోర్నీ తర్వాత ఆటకు గుడ్‌బై చెప్పనున్న మొర్తజా టోర్నీని చిరస్మరణీయం చేసుకోవాలని భావిస్తున్నాడు. బౌలింగ్‌లో యువ ముస్తఫిజుర్ అతి పెద్ద బలం. ఇక్కడి వాతావరణంలో అతని స్వింగ్, కటర్లు ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు పరీక్ష పెట్టగలవు. పరిస్థితులకు అలవాటు పడేందుకు ముందే వచ్చి ముక్కోణపు టోర్నీలో ఆడిన బంగ్లాదేశ్ తమ వన్డే చరిత్రలో తొలి సారి ఒక టోర్నీని కూడా గెలుచుకోవడం విశేషం. ఇది జట్టు తాజా ఫామ్‌ను చూపిస్తోంది. ఈ టోర్నీతో మొసద్దిక్ హుస్సేన్ ఫామ్‌లోకి రావడం జట్టుకు సానుకూలాంశం. లెఫ్టార్మ్ స్పిన్నర్ మెహదీ హసన్ ప్రభావం చూపించగలడు. బలహీనతలు ఆటపరంగా ఎంత మెరుగ్గా ఉన్నా, కొన్ని అద్భుత వ్యక్తిగత ప్రదర్శనలు ఉన్నా... బంగ్లాదేశ్‌ను ఎవరూ వరల్డ్ కప్ ఫేవరెట్‌గా పరిగణించరు. వరుసగా పెద్ద జట్లపై విజయాలు సాధించిన రికార్డు లేకపోవడమే అందుకు కారణం. మెగా టోర్నీలో ఎన్నో ఆశలతో బరిలోకి దిగడం, ఆ తర్వాత కీలక మ్యాచ్‌లో ఒత్తిడిలో చిత్తు కావడం ఆ జట్టుకున్న అవలక్షణం. అత్యుత్తమ ఆటగాళ్లు, అనుభవం ఉన్నా సరే... అవసరమైన స్థితిలో దానిని ప్రదర్శించడంలో జట్టు విఫలమవుతోంది. ఇన్నేళ్ల తర్వాత కూడా జట్టు రికార్డు పేలవంగా ఉండటమే అందుకు ఉదాహరణ. ముఖ్యంగా కీలక సమయాల్లో ప్రధాన ఆటగాళ్లు తరచుగా విఫలమయ్యారు. తమీమ్, ముష్ఫికర్లలో నిలకడ లేకపోగా... రూబెల్ బౌలింగ్‌ను నమ్మలేం. కెరీర్ చివర్లో మొర్తజా బౌలింగ్‌లో పదును కనిపించడం లేదు. సరిగ్గా చెప్పాలంటే షకీబ్, ముస్తఫిజుర్ మినహా మరే బౌలర్‌ను నమ్మలేని పరిస్థితి. వీరిద్దరు రాణించినా మిగతావారు చేతులెత్తేస్తే మ్యాచ్ చేజారటం ఖాయం. సుదీర్ఘ కాలం సాగే తాజా ఫార్మాట్లో సర్కార్, లిటన్ దాస్ నిలకడగా రాణించకపోతే కష్టం. గత రికార్డు: 1999 నుంచి బంగ్లాదేశ్ ప్రతీ ప్రపంచ కప్‌లో ఆడింది. 2015లో ఇంగ్లండ్‌పై విజయంతో క్వార్టర్ ఫైనల్ (నాకౌట్ దశ)కు చేరడం మినహా ప్రతీ సారి గ్రూప్ దశకే పరిమితమైంది. 2007లో భారత్‌పై సాధించిన సంచలన విజయంతో తర్వాతి రౌండ్ సూపర్ ఎయిట్స్‌కు అర్హత సాధించగలిగింది. ఈసారి మెరుగైన ర్యాంకింగ్‌తో వెస్టిండీస్‌ను వెనక్కి తోసి నేరుగా టోర్నీకి అర్హత పొందింది. ఓవరాల్‌గా 33 వరల్డ్ కప్ మ్యాచ్‌లలో 11 గెలిచి 20 ఓడింది. మరో 2 రద్దయ్యాయి. జట్టు వివరాలు మష్రఫె మొర్తజా (కెప్టెన్), అబూ జాయెద్, లిటన్ దాస్, మహ్ముదుల్లా, మెహదీ హసన్, మొహమ్మద్ మిథున్, సైఫుద్దీన్, మొసద్దిక్ హుస్సేన్, ముష్ఫికర్ రహీమ్, ముస్తఫిజుర్ రహమాన్, రూబెల్ హుస్సేన్, షబ్బీర్ రహమాన్, షకీబ్ అల్ హసన్, సౌమ్య సర్కార్, తమీమ్ ఇక్బాల్. -
శ్రీలంకకు సవాల్!
దిముత్ కరుణరత్నే... కెరీర్లో 17 వన్డేలు మాత్రమే ఆడితే 2015లో జరిగిన వరల్డ్ కప్‌లో లంక తరఫున చివరిసారిగా బరిలోకి దిగాడు. అతను ఇప్పుడు శ్రీలంక జట్టుకు ప్రపంచ కప్‌లో కెప్టెన్. లంక జట్టులో నాయకత్వ లోటు ఎలా ఉందో చెప్పేందుకు ఇది పెద్ద ఉదాహరణ. వరుసగా ఎనిమిది వన్డేలు ఓడిన లంక ప్రస్తుతం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో 9వ స్థానంలో ఉంది. 2016 జూన్ తర్వాత ఆ జట్టు ఒక్క వన్డే ద్వైపాక్షిక సిరీస్ కూడా నెగ్గలేదు. 2017 నుంచి చూస్తే ఆ జట్టు 41 వన్డేలు ఓడి, 11 మాత్రమే గెలవగలిగింది. ఆటగాళ్లు, కోచ్‌కు మధ్య విభేదాలు, బోర్డులో సమస్యలు, వివాదాలు... వరల్డ్ కప్‌కు ముందు మాజీ చాంపియన్ శ్రీలంక తాజా పరిస్థితి ఇది. ఇన్ని ప్రతికూలతల మధ్య లంక మరోసారి విశ్వ సమరానికి సిద్ధమైంది. ఇద్దరు దిగ్గజ క్రికెటర్లు మహేల జయవర్ధనే, కుమార సంగక్కర ఉచ్ఛస్థితిలో ఉన్నప్పుడు కూడా రెండో పర్యాయం విశ్వ విజేత కాలేకపోయిన ద్వీప దేశం ఇప్పుడు యువ ఆటగాళ్లతో ఎలాంటి ఫలితాలు సాధిస్తుందో చూడాలి. మరో 7 రోజుల్లో... బలాలు: ఆటపరంగా, అనుభవం పరంగా చూస్తే లసిత్ మలింగ శ్రీలంకకు పెద్ద దిక్కు. 322 వన్డే వికెట్లు తీసిన ఈ సీనియర్... ఇంగ్లండ్ గడ్డపై ఒక్క స్పెల్‌తో ఫలితాన్ని ప్రభావితం చేయగల నేర్పరి. 2007, 2011 వరల్డ్ కప్ ఫైనల్స్‌లో ఆడిన మలింగ తన చివరి టోర్నీలో సత్తా చాటాలని పట్టుదలగా ఉన్నాడు. మిడిలార్డర్లో మాజీ కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ లంకకు వెన్నెముకలాంటివాడు. 203 వన్డేల అనుభవం ఉన్న మాథ్యూస్‌కు తన బ్యాటింగ్‌తో జట్టును గెలిపించగల సత్తా ఉంది. గాయంతో చాలా కాలంగా బౌలింగ్‌కు దూరమైన తర్వాత అతని బ్యాటింగ్ మరింత బలంగా తయారైంది. కుశాల్ పెరీరా వేగంగా ఆడటంలో నేర్పరి కాగా... వన్డేల్లో వందకు పైగా స్ట్రయిక్ రేట్ ఉన్న తిసారా పెరీరా దూకుడు లోయర్ ఆర్డర్లో లంకకు అదనపు బలం కాగలదు. అనూహ్యంగా కెప్టెన్సీ అవకాశం దక్కించుకున్న కరుణరత్నే ఇప్పుడు వన్డేలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ఇటీవల లంక దేశవాళీ మ్యాచ్‌ల్లో ఆడి పరుగుల వరద పారించాడు. చెప్పుకోదగ్గ అనుభవం లేకపోయినా తనను తాను నిరూపించుకునే పట్టుదలతో ఉన్న కరుణరత్నే టాపార్డర్‌లో రాణిస్తే లంక విజయావకాశాలు మెరుగవుతాయి. బలహీనతలు: ఫలానా బ్యాట్స్‌మన్ అంటే ప్రత్యర్థి జట్లకు కొంత ఆందోళన... అతని కోసం ప్రత్యేకంగా వ్యూహాలు రచించాల్సి ఉంది! ఇలా చెప్పుకోగలిగే అవకాశం ఉన్న, ఒంటి చేత్తో విధ్వంసం సృష్టించగల ఒక్కడంటే ఒక్క ఆటగాడు కూడా శ్రీలంక టీమ్‌లో లేడు. ఇటీవలి లంక ప్రదర్శనకు, ఇతర జట్లు లంకను సీరియస్‌గా తీసుకోకపోవడానికి కూడా ప్రధాన కారణం ఇదే. ట్రెండ్ మారిన నేటి వన్డేల్లో ఇది పెద్ద బలహీనత కాగలదు. ఆల్రౌండర్లను పక్కన పెడితే 15 మంది సభ్యుల జట్టులో నలుగురు మాత్రమే రెగ్యులర్ బ్యాట్స్‌మెన్ ఉన్నారంటే ఆశ్చర్యం కలుగుతుంది. తిసారా మినహా ఇతర ఆల్‌రౌండర్ల ప్రదర్శన ఇప్పటి వరకు అంతంత మాత్రమే. ఇక మలింగ తప్ప లంక బౌలింగ్ కూడా బలహీనంగా కనిపిస్తోంది. రెగ్యులర్ స్పిన్నర్ ఒక్కరు కూడా టీమ్‌లో లేరు. లెగ్‌స్పిన్నర్ జీవన్ మెండిస్ కూడా వన్డే ఆడి నాలుగేళ్లయింది! ఈ నేపథ్యంలో లంకకు అంత సులువు కాదు. జట్టు వివరాలు దిముత్ కరుణరత్నే (కెప్టెన్), ధనంజయ డిసిల్వా, నువాన్ ప్రదీప్, అవిష్క ఫెర్నాండో, సురంగ లక్మల్, లసిత్ మలింగ, ఏంజెలో మాథ్యూస్, కుశాల్ మెండిస్, జీవన్ మెండిస్, కుశాల్ పెరీరా, తిసారా పెరీరా, మిలింద సిరివర్ధన, లహిరు తిరిమన్నె, ఇసురు ఉడాన, జెఫ్రే వాండర్సే. -
గెలుపు సంబరాలతో సెలవు ప్రకటించిన ఇందిర..!
న్యూఢిల్లీ : సరిగ్గా ముప్పయ్‌ఆరేళ్ల క్రితం ఓ అద్భుతం ఆవిష్కృతమైంది. అంచనాల్లేకుండా బరిలోకి దిగిన కపిల్‌దేవ్ సారథ్యంలోని టీమిండియా ఇంగ్లండ్ గడ్డపై 1983 ప్రపంచకప్ సాధించింది. దిగ్గజ ఆటగాళ్లున్న వెస్టిండీస్ అప్పటికే రెండు సార్లు విశ్వవిజేత నిలిచి మాంచి జోష్‌లో ఉండగా.. ఫైనల్లో ఆ జట్టును ధీటుగా ఎదుర్కొన్న టీమిండియా 43 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత ఆటగాళ్ల కృషికి నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఫిదా అయ్యారు. ఫైనల్లో మనదేశం విజయం సాధించిందని తెలియడంతో.. క్రికెట్లో భారత్ విశ్వవిజేతగా అవతరించిన (25 జూన్, 1983) మరుసటి రోజున దేశంలో సెలవు దినంగా ప్రకటించారు. వివిఎన్ రిచర్డ్స్ ఔట్.. లార్డ్స్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచి విండీస్ కెప్టెన్ క్లైవ్ లాయిడ్ టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. విండీస్ బౌలర్ల ధాటికి భారత ఆటగాళ్లు కేవలం 183 పరుగులు మాత్రమే చేసి చేతులెత్తేశారు. చేజింగ్‌కు దిగిన విండీస్‌ను భీకర ఫామ్‌లో ఉన్న వివిఎన్ రిచర్డ్స్ గెలుపుదిశగా తీసుకెళ్తున్న తరుణంలో మదన్‌లాల్ అతన్ని ఔట్ చేసి భారత శిబిరంలో ఆశలు రేపాడు. కపిల్‌దేవ్, మదన్‌లాల్, అమర్నాథ్ అద్భుత బౌలింగ్‌తో విండీస్ 140 పరుగులకే చాపచుట్టేసింది. భారత శిగన ప్రపంచకప్ చేరింది. స్వదేశానికి చేరుకున్న టీమిండియా ఆటగాళ్లకు రివార్డులిచ్చేందుకు కూడా బీసీసీఐ వద్ద డబ్బులు లేకపోవడం గమనార్హం. పెద్ద మనసుతో దిగ్గజ గాయని లతా మంగేష్కర్ వారికి ఆపన్నహస్తం అందించారు. మ్యూజిక్ కన్సర్ట్ నిర్వహించగా వచ్చిన రెండు లక్షల రూపాల్ని వారికి రివార్డుగా ఇచ్చి సత్కరించారు. -
కివీస్ కప్ కొట్టేదెప్పుడు!
నిలకడగా ఆడే బ్యాట్స్‌మెన్... వైవిధ్యం మేళవించిన పేసర్లు... నాణ్యమైన ఆల్ రౌండర్లు... ఇలాంటి ‘ఒక మంచి జట్టు’ లక్షణాలన్నీ కలగలిసినది న్యూజిలాండ్. పరిస్థితులను ఆకళింపు చేసుకుంటూ ఒత్తిడిని తట్టుకోగలదు. ప్రపంచ కప్‌లో చక్కటి రికార్డు దీని సొంతం. మొత్తం 11 కప్‌లలో ఆరుసార్లు సెమీఫైనల్, ఒకసారి ఫైనల్ చేరిన గణాంకాలే దీనికి నిదర్శనం. అయితే పెద్ద మ్యాచ్‌ల్లో చేతులెత్తేయడం జట్టు ప్రధాన బలహీనత. ఈసారైనా దానిని అధిగమించి కివీస్ కప్ కొడుతుందో లేదో వేచి చూడాలి. సాక్షి క్రీడా విభాగం: చిన్న జట్లతో పోలిస్తే పెద్దదిగా, పెద్ద జట్లతో చూస్తే చిన్నదిగా కనిపిస్తుంది న్యూజిలాండ్. నాణ్యమైన వనరులున్న టీంలపై విజయాలు సాధించడం కివీస్‌కు శక్తికి మించిన పనే అవుతుంది. ఉదాహరణకు... ఈ ప్రపంచ కప్‌లో పాల్గొంటున్న ఐదు (శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, వెస్టిండీస్, అఫ్గానిస్గాన్) జట్లతో న్యూజిలాండ్ గత నాలుగేళ్లలో 28 వన్డేలు ఆడింది. వీటిలో 24 మ్యాచ్‌లు గెలిచింది. అయితే, ఇవన్నీ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఆ జట్టు కంటే కింద ఉన్నవే. ఇదే సమయంలో మిగతా టాప్ జట్ల (భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా)తో జరిగిన 40 మ్యాచ్‌ల్లో 25 ఓడింది. ఇది ఒక విధంగా ఆ జట్టు స్థాయిని చెబుతోంది. బలాలు ఒత్తిడిని తట్టుకోగల అనుభవం, దూకుడును చూపగల యువతరం కలగలిసిన నిండైన బృందం. ఆల్‌రౌండర్లతో కూడిన లోతైన బ్యాటింగ్ ఆర్డర్ జట్టు సొంతం. ఓపెనర్లలో మార్టిన్ గప్టిల్ విధ్వంసక ఆటగాడు. 2015 ప్రపంచ కప్‌లో డబుల్ సెంచరీ చేశాడు. నికోల్స్ దూకుడుగా పరుగులు సాధిస్తాడు. కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఎలాంటి పిచ్‌పైనైనా, ఏ పరిస్థితుల్లోనైనా నిలదొక్కుకోగలడు. చాప కింద నీరులా పరుగులు చేస్తూనే, ప్రశాంతంగా సారథ్య బాధ్యతలు నిర్వహించే విలియమ్సన్ జట్టును సమర్థంగా నడిపించగలడు. రాస్ టేలర్, లాథమ్, కొలిన్ మున్రో మిడిలార్డర్‌ను మోయగలరు. గ్రాండ్‌హోమ్, నీషమ్ పేస్ ఆల్‌రౌండర్లు కాగా, స్పిన్నర్ సాన్‌ట్నర్ బ్యాట్‌తోనూ మెరుగ్గా రాణించగలడు. సాన్‌ట్నర్, ఇష్ సోధిల స్పిన్ ద్వయం ప్రత్యర్థిని కట్టడి చేస్తుంది. అనుభవజ్ఞులైన పేసర్లు బౌల్ట్, సౌతీ. ముఖ్యంగా ఇంగ్లండ్ వాతావరణంలో బౌల్ట్ స్వింగ్ రాబడితే ప్రత్యర్థులకు కష్టకాలమే. బలహీతనలు ►విలియమ్సన్ ఫామ్ కోల్పోవడం ఇబ్బందికరం. ఇటీవల అతడి నుంచి చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ లేవు. ► గప్టిల్ బ్యాటింగ్‌లో దూకుడుతో పాటు లోపాలూ ఎక్కువే. నాణ్యమైన బౌలింగ్‌ను ఎదుర్కొనడంలో ఇబ్బంది పడతాడు. ఓపెనింగ్‌లో ఇతడికి తోడుగా మున్రో, నికోల్స్‌లో ఎవరిని దింపాలనేది ఇంకా సందిగ్ధమే. ► విలియమ్సన్, రాస్ టేలర్ త్వరగా ఔటైతే ఇన్నింగ్స్ తడబడుతుంది. ఈ ప్రభావం స్కోరుపై పడుతుంది. ► సౌతీకి పరుగులు ఎక్కువగా ఇచ్చే బలహీనత ఉంది. ప్రపంచ కప్‌లో పూర్తిగా బ్యాటింగ్ పిచ్‌లు ఎదురవనున్న నేపథ్యంలో ఇది ప్రతికూల అంశమే. ► మిగతా ఇద్దరు పేసర్లు లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ కొత్తవారు. గత రికార్డు ►సహ ఆతిథ్యం ఇచ్చిన 2015 ప్రపంచ కప్‌లో ఫైనల్ చేరడం ఇప్పటివరకు అతి పెద్ద ఘనత. ►అప్పటి సారథి మెకల్లమ్ తొలుతే ఔటవడంతో గత కప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో తడబడింది. ►1975, 79, 92, 99, 2007, 2011లలో సెమీఫైనల్ వరకు వచ్చింది. ►మార్టిన్ క్రో దూకుడైన బ్యాటింగ్, అద్భుత వ్యూహాలతో 1992 ప్రపంచ కప్‌లో భీకరంగా కనిపించిన న్యూజిలాండ్... పాకిస్తాన్ ధాటికి తలవంచింది. ప్రపంచ కప్‌లో ప్రదర్శన ►ఆడిన మ్యాచ్‌లు - 79 ►గెలిచినవి - 48 ►ఓడినవి - 30 ►రద్దు - 1 ►అత్యధిక స్కోరు - 393 ►అత్యల్ప స్కోరు - 112 ►ఫైనల్ - 2015 ►సెమీఫైనల్స్ - 1975, 1979, 1992, 1999, 2007, 2011 -
సమరానికి ‘సఫారీ’ సిద్ధం!
అదృష్టానికి, దురదృష్టానికి మధ్య అంతరంఎంత ఉంటుందో దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టును అడిగితే తెలుస్తుంది. మైదానంలో వాన నీళ్లకి, కన్నీళ్లకి మధ్య పెద్దగాతేడా ఉండదని వారికి మాత్రమే తెలిసిన విషాదం.ప్రతీసారి గంపెడుఆశలతో బరిలోకి దిగడం, ఆ తర్వాత గుండె పగిలేలా రోదించడం సఫారీ ఆటగాళ్లందరికీఅనుభవమే.ఒకటా, రెండా ఎన్ని సార్లు ‘ప్రొటీస్’ బాధ ప్రపంచంబాధగా మారిపోయింది. ఏడు ప్రపంచ కప్‌లలో బరిలోకి దిగి ఒక్కసారిమినహా ప్రతీ సారి లీగ్ దశను దాటగలిగినాదక్షిణాఫ్రికాకు వరల్డ్ కప్ విజయం మాత్రంసుదూర స్వప్నంగానే మిగిలిపోయింది. అత్యుత్తమ జట్లలో ఒకటిగా అంచనాలతో బరిలోకిదిగడం, ఆ తర్వాత ఒక అనూహ్య క్షణాన నిష్క్రమించడం ఆ జట్టుగా అలవాటుగా మారిపోయింది. ఎందరో దిగ్గజాలు కప్ కల నెరవేరకుండానే ఆటకు గుడ్‌బై చెప్పారు. ఈ నేపథ్యంలో మరోసారి తమ సత్తా చాటేందుకు సిద్ధమైన సఫారీ టీమ్ ఏ మేరకురాణిస్తుందనే ఆసక్తికరం. బలాలు... ►వన్డే ఫార్మాట్‌కు తగిన ఆటగాళ్లతో జట్టు సమతూకంగా ఉంది. గత రెండు ప్రపంచ కప్‌లలో ఆడిన అనుభవం ఉన్న క్రికెటర్లతో పాటు ఇటీవల నిలకడగా రాణిస్తున్న యువ ప్లేయర్లు కూడా జట్టులో ఉన్నారు. ►ఓపెనర్‌గా ఒకవైపు డి కాక్ దూకుడుగా ఆడగల సత్తా ఉంటే, మరో ఎండ్‌లో హషీం ఆమ్లా ప్రశాంతంగా బ్యాటింగ్ చేయగలడు. ఆ తర్వాత ఇన్నింగ్స్‌ను డు ప్లెసిస్ సమర్థవంతంగా నడిపించగలడు. మిడిలార్డర్లో డుమిని అనుభవం కూడా జట్టుకు పనికొస్తుంది. విధ్వంసక ఆటగాడు మిల్లర్ చివర్లో చెలరేగిపోగల సమర్థుడు. ►మోరిస్, ఫెలుక్వాయో, ప్రిటోరియస్ రూపంలో సమర్థులైన పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు జట్టులో ఉన్నారు. స్టెయిన్, రబడ, ఇన్గిడివంటి సూపర్ ఫాస్ట్ బౌలర్లతో పాటు వయసు పెరిగిన కొద్దీ విలువ పెంచుకుంటున్న తాహిర్‌లాంటి స్పిన్నర్‌తో జట్టు పటిష్టంగా కనిపిస్తోంది. ►ఐపీఎల్లో టాప్–2 బౌలర్లుగా నిలిచిన తాహిర్, రబడ జోరు మీదున్నారు. ఈ బృందానికి ప్రపంచంలో ఏ జట్టునైనా చిత్తు చేసే సామర్థ్యం ఉంది. ►డు ప్లెసిస్ నాయకత్వం కూడా కీలక సమయాల్లో సఫారీకి అదనపు బలం కాగలదు. గత ఏడాది కాలంలో సొంతగడ్డపై ఆడిన 13 వన్డేల్లో 11 గెలిచింది. పైగా ఆస్ట్రేలియా గడ్డపై 2–1తో సిరీస్ నెగ్గింది. బలహీనతలు ►జట్టులో అత్యంత అనుభవజ్ఞుడైన ఆమ్లా ఫామ్ ఆ జట్టును ప్రధానంగా ఆందోళన పరుస్తున్న అంశం. ఒక దశలో పరుగుల ప్రవాహంలో కోహ్లితో పోటీ పడినా... ఇటీవలి ప్రదర్శన చాలా ఘోరంగా ఉంది. గత రెండేళ్లలో అతను వన్డేల్లో ఒకే ఒక సెంచరీ చేశాడు. ఫామ్ కోసం తంటాలు పడుతూ దేశవాళీ టి20ల్లో ఆడిన అతను 8 మ్యాచ్‌లలో ఒకే సారి 20కి పైగా పరుగులు చేశాడు. ఆమ్లా కీలక సమయంలో ఫామ్‌లోకి రాకుంటే దక్షిణాఫ్రికాకు సమస్యలే. ►ప్రత్యామ్యాయ ఓపెనర్‌గా మర్క్రమ్ ఉన్నా అతనికి పెద్దగా అనుభవం లేదు. డుమిని జాతీయ జట్టు తరఫున చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడి చాలా కాలమైంది. ►అయితే ప్రదర్శనకంటే కూడా ఆటగాళ్ల గాయాలు సఫారీని ఆందోళన పరుస్తున్నాయి. ప్రధాన పేసర్ రబడ వెన్ను నొప్పితో ఇబ్బంది పడుతుండగా... వెటరన్ స్టెయిన్ భుజం గాయం తిరగబెట్టింది. ఐపీఎల్లో రెండు మ్యాచ్‌లకే పరిమితమై అతను స్వదేశం చేరాడు. పైగా వరుస గాయాల తర్వాత వన్డేల్లో స్టెయిన్ ప్రభావం అంతంత మాత్రంగానే మారింది. ►మరోవైపు 18 వన్డేలే ఆడిన ఇన్‌గిడి తన తొలి ప్రపంచ కప్‌లో ఎలా ఆడతాడనేది ఆసక్తికరం. తాహిర్పై జట్టు ఎంతో నమ్మకముంచగా... రెండో స్పిన్నర్‌గా ఉన్న షమ్సీకి చెప్పుకోదగ్గ రికార్డు లేదు. మెగా టోర్నీకి ముందు అనూహ్యంగా డివిలియర్స్ రిటైర్మెంట్ ప్రకటించడం కూడా ఆ జట్టును కొంత బలహీనంగా మార్చింది. గత రికార్డు ►నిషేధం ముగిసిన అనంతరం 1992 నుంచి దక్షిణాఫ్రికా అన్ని ప్రపంచ కప్ టోర్నీలు (మొత్తం 7) ఆడింది. ఒక్కసారి కూడా ఫైనల్ వరకు వెళ్లలేకపోయింది. ►1992, 1999, 2007, 2015లలో సెమీఫైనల్ చేరింది. 1996, 2011లలో కూడా నాకౌట్ దశకు (క్వార్టర్ ఫైనల్) చేరింది. –ఒక్క 2003లో సొంతగడ్డపైనే జరిగిన టోర్నీలో అనూహ్యంగా విఫలమై గ్రూప్ దశకే పరిమితమైంది. ►న్యూజిలాండ్‌తో జరిగిన 2015 ప్రపంచ కప్ సెమీఫైనల్లో చివరి 2 బంతుల్లో 5 పరుగులు కావాల్సిన స్థితిలో స్టెయిన్ బౌలింగ్‌లో ఇలియట్ సిక్సర్ బాదడంతో సఫారీ జట్టు కన్నీళ్లపర్యంతమైంది. సూపర్‌మ్యాన్ ఆలోచనలు లేవు గత ప్రపంచ కప్‌లలో మా జట్టు ప్రత్యేకంగా ఉండాలని భావించాం. ఎప్పుడు ఆడే తరహాలో కాకుండా ఏదైనా ప్రత్యేకంగా కనిపించాలని పదే పదే ప్రయత్నించాం. ఒక ఆటగాడు 50 బంతుల్లో సెంచరీ చేయడంవల్లో, ఒకరు 20 పరుగులకు 7 వికెట్లు తీయడంవల్లో వరల్డ్ కప్ గెలవలేం. ఎంత అవసరమో అది మాత్రం చేయకుండా వేరేవాటిపై దృష్టి పెట్టాం. గతంలోలాగా సూపర్‌మ్యాన్ తరహా పనులు చేయదల్చుకోలేదు. ఫలితంగా ప్రపంచకప్‌లలో మా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వలేకపోయాం. సరిగ్గా చెప్పాలంటే అవసరానికి మించి మాపై ఒత్తిడి పెంచుకున్నాం. ఈసారి అలాంటిది జరగనివ్వం. ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఆడి క్రికెట్‌ను ఆస్వాదించే ప్రయత్నం చేస్తాం. గత కొంత కాలంగా మానసికంగా దృఢంగా ఉండే అంశంపై కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. –దక్షిణాఫ్రికా కెప్టెన్ డు ప్లెసిస్ జట్టు వివరాలు ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), హషీం ఆమ్లా, క్వింటన్ డి కాక్, జేపీ డుమిని, ఇమ్రాన్ తాహిర్, ఎయిడెన్ మర్క్రమ్, డేవిడ్ మిల్లర్, క్రిస్ మోరిస్, లుంగి ఇన్‌గిడి, ఫెలుక్వాయో, డ్వెయిన్ ప్రిటోరియస్, కగిసో రబడ, తబ్రేజ్ షమ్సీ, డేల్ స్టెయిన్, వాన్ డర్ డసెన్. -
ప్రపంచకప్‌లో ఆఖరి ఆట!
కెరీర్లో ఒక్కసారైనా ప్రపంచ కప్ ఆడాలనేది ప్రతీ క్రికెటర్ కల. సచిన్ లాంటి దిగ్గజాలు ఆరు ప్రపంచ కప్‌లు ఆడగలిగితే సుదీర్ఘ కాలం కెరీర్ ఉండీ ఒక్క టోర్నీ కూడా ఆడే అవకాశం దక్కనివారు ఎందరో. అయితే కెరీర్ చివరి దశకు వచ్చిన సమయంలో ‘ఈ ఒక్కసారి’ అంటూ వరల్డ్ కప్ కోసం సర్వశక్తులు ఒడ్డి సిద్ధమయ్యే క్రికెటర్ల జాబితా కూడా పెద్దదే. ఆటగాళ్ల ఆలోచన, బోర్డు ప్రణాళికల్లో కూడా ఆయా సీనియర్లు, వారి అనుభవానికి ఒక ఆఖరి అవకాశం ఇచ్చి సగౌరవంగా పంపించాలనే భావన కనిపిస్తుంది. అందుకే సహజంగానే ప్రతీ ప్రపంచ కప్ తర్వాత ఎందరో స్టార్ల కెరీర్లకు ఫుల్‌స్టాప్‌పడుతుంది. కొందరు విజయంతో సంతృప్తికరంగా గుడ్‌బై చెబితే, మరికొందరు నిరాశాజనకంగా ఆటను ముగించాల్సి వస్తుంది. ఈసారి వన్డే వరల్డ్ కప్ తర్వాత కూడా చాలా మంది ఆట నుంచి నిష్క్రమించేందుకు సిద్ధమవుతుండగా... మరికొందరు కెరీర్‌ను కొనసాగించినా వచ్చే ప్రపంచ కప్ వరకు మాత్రం మైదానంలో ఉండటం దాదాపు అసాధ్యం. అలాంటి క్రికెటర్ల జాబితాను చూస్తే... క్రిస్ గేల్ (వెస్టిండీస్) కొత్త మిలీనియం ప్రారంభానికి ముందు వన్డేల్లో అరంగేట్రం చేసి ఇప్పటికీ కొనసాగుతున్న అతి కొద్ది ఆటగాళ్లలో గేల్ ఒకడు. విధ్వంసక ఆటగాడిగా గుర్తింపు ఉన్నా, పలు రికార్డులు తన పేరిట ఉన్నా వన్డే వరల్డ్ కప్ విజయంలో మాత్రం అతను భాగం కాలేకపోయాడు. మధ్యలో కొంత కాలం టి20ల హోరులో జాతీయ జట్టుకు దూరంగా ఉండిపోయిన అతను ఇప్పుడు మళ్లీ తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. విండీస్‌పై పెద్దగా అంచనాలు లేని సమయంలో గేల్ రాక జట్టులో కొత్త ఉత్సాహం నింపింది. కప్ గెలిపించగలడో లేదో కానీ ఇటీవలి ఫామ్ ప్రకారం చూస్తే వరల్డ్ కప్‌లో గేల్ మెరుపులు ఖాయం. 2003 నుంచి నాలుగు ప్రపంచ కప్‌లు ఆడిన గేల్ 26 మ్యాచ్‌లలో 37.76 సగటుతో 944 పరుగులు చేశాడు. 2 సెంచరీలు, 4 అర్ధసెంచరీలు ఉన్నాయి. గత ప్రపంచ కప్‌లో డబుల్ సెంచరీ బాదాడు. మహేంద్ర సింగ్ ధోని (భారత్) నాలుగున్నరేళ్ల క్రితమే టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించినా... పరిమిత ఓవర్ల క్రికెట్లో ధోని ముద్ర కొనసాగింది. అయితే గత కొంత కాలంగా వరుస వైఫల్యాలు, అనంతరం అతని ఆటపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కానీ వరల్డ్ కప్‌లాంటి మెగా ఈవెంట్లో ధోని అనుభవం, వ్యూహాలు జట్టుకు ఎంత అవసరమో గుర్తించి సెలక్టర్లు అతనిపై నమ్మకముంచారు. ఎలాగైనా వరల్డ్ కప్ వరకైతే కొనసాగించాలని భావించారు. కెప్టెన్ కోహ్లి పదే పదే మద్దతుగా నిలవడం కూడా కలిసొచ్చింది. భారత్ గెలవాలంటే ధోనిలాంటి సీనియర్ పాత్ర కూడా కీలకం కానుంది. అయితే పరోక్షంగా బోర్డు వర్గాల వ్యాఖ్యల్లో కూడా ధోనికిదే చివరి టోర్నీ అని చాలా సార్లు వినిపించింది కాబట్టి ఇకపై రిషభ్ పంత్‌లాంటి యువ ఆటగాడు వేచి చూస్తున్న తరుణంలో టోర్నీ ఫలితం ఎలా ఉన్నా, 38 ఏళ్ల ధోని ఎలా ఆడినా అతనికి ఇదే ఆఖరి ఆట కావచ్చు. రికార్డు: రెండు సార్లు కెప్టెన్‌గా వ్యవహరించిన ధోని ఒకసారి జట్టును జగజ్జేతగా నిలపడంతో పాటు మరోసారి సెమీస్ చేర్చాడు. అతనికి ఇది వరుసగా నాలుగో ప్రపంచ కప్. 20 వరల్డ్ కప్ మ్యాచ్‌లలో 42.25 సగటుతో 507 పరుగులు చేశాడు. 3 అర్ధ సెంచరీలు ఉన్నాయి. మొర్తజా (బంగ్లాదేశ్) బంగ్లాదేశ్ జట్టు ఇన్నేళ్లుగా ఎక్కడో ఒక చోట సంచలనానికి కారణమౌతోందంటే అందుకు పునాది వేసిన వారిలో మొర్తజా ఒకడు. తన వన్డే కెరీర్లో ఎక్కువ భాగం కెప్టెన్‌గా వ్యవహరించిన మొర్తజా సమర్థంగా టీమ్‌ను నడిపించాడు. 2007 వరల్డ్ కప్‌లో భారత్ పతనానికి కారణమై ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచిన క్షణాన్ని ఎవరూ మరచిపోలేరు. గత ప్రపంచకప్‌లో అతని సారథ్యంలోనే ఇంగ్లండ్‌ను వెనక్కి తోసి బంగ్లాదేశ్ క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. ఈ ఏడాది ఆరంభంలో పార్లమెంట్ సభ్యుడిగా కూడా ఎంపికైన అతను వరల్డ్ కప్ తర్వాత ఆటకు గుడ్‌బై చెప్పనున్నాడు. తన చివరి టోర్నీలో బంగ్లాకు గొప్ప విజయాలు అందించాలని అతను కోరుకుంటున్నాడు. గాయంతో 2011 ప్రపంచ కప్‌కు దూరమైన అతను 2003నుంచి 3 వరల్డ్ కప్‌లలో కలిపి 16 మ్యాచ్‌లలో 36.05 సగటుతో 18 వికెట్లు పడగొట్టాడు. మలింగ (శ్రీలంక) మూడు ప్రపంచ కప్‌లు... వరుసగా రెండు ఫైనల్స్‌లో పరాజయం. వన్డే ప్రపంచ కప్‌ను అందుకోలేని లంక అగ్రశ్రేణి క్రికెటర్లలో మలింగ ఒకడు. గాయాలతో 2016 మొత్తం ఆటకు దూరమై, ఆ తర్వాత కూడా అప్పుడప్పుడు మాత్రమే మ్యాచ్‌లు ఆడుతూ వచ్చిన పేసర్ ‘స్లింగ’ ఇప్పుడు మరోసారి ప్రపంచ కప్ వేదికపై నిలబడ్డాడు. ఇటీవల ఐపీఎల్‌తో తన బౌలింగ్‌లో జోరు తగ్గలేదని చూపించిన అతను... ఈసారి మరింత బలహీనంగా కనిపిస్తున్న శ్రీలంకకు ఏమాత్రం ఉపయోగపడగలడో చూడాలి. ఈ మెగా టోర్నీ తర్వాత అతను పూర్తిగా టి20 లీగ్‌లకే పరిమితమయ్యే అవకాశం ఉంది. గత మూడు ప్రపంచ కప్‌లు ఆడిన మలింగ 22 మ్యాచ్‌లలో 21.11 సగటుతో 21 వికెట్లు పడగొట్టాడు. షోయబ్ మాలిక్ (పాకిస్తాన్) సుదీర్ఘ కాలంగా పరిమిత ఓవర్ల క్రికెట్లో పాక్ కీలక ఆటగాళ్లలో మాలిక్ ఒకడు. ఇతను కూడా 1999లోనే వన్డేల్లోకి అడుగు పెట్టాడు. అయితే వేర్వేరు కారణాలతో ఒకే ఒక్క ప్రపంచ కప్ (2007) ఆడగలిగాడు. 3 మ్యాచ్‌లలో కలిపి 92 పరుగులు మాత్రమే చేశాడు. ఈసారి అతని అనుభవంపై పాక్ అంచనాలు పెట్టుకుంది. మిడిలార్డర్లో జట్టును నడిపించగలడని నమ్ముతోంది. వరల్డ్ కప్ తర్వాత మాలిక్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పే అవకాశం ఉంది. తన 20 ఏళ్ల అంతర్జాతీయ వన్డే క్రికెట్ కెరీర్లో మాలిక్ 283 మ్యాచ్‌లు ఆడి 7522 పరుగులు చేశాడు. ఇందులో తొమ్మిది సెంచరీలు, 44 అర్ధ సెంచరీలు ఉన్నాయి. సఫారీల కల నెరవేరేనా! ఒకసారి కాదు...రెండు సార్లు కాదు... ప్రతీ ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా గెలుపు ఆశలు ఏదో కారణంతో కుప్పకూలిపోవడం రొటీన్‌గా మారిపోయింది. 1992 నుంచి అన్ని ప్రపంచ కప్‌లలో గెలుపు అవకాశాలు కనిపిస్తూ చివరకు ఓడి ‘చోకర్స్’గా సఫారీ జట్టు ముద్ర వేసుకుంది. 2015 సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓడి గుండె బద్దలైన క్షణాన సఫారీ జట్టు ఆటగాళ్లంతా చిన్నపిల్లల్లా రోదించారు. నాటి టీమ్‌లో భాగంగా ఉండి ఇప్పుడు ‘ఆఖరిసారి’ తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఐదుగురు ఆటగాళ్లు సిద్ధమయ్యారు. వీరందరికీ ఇదే ఆఖరి ప్రపంచకప్ కానుంది. వీరందరికంటే ముందే నా వల్ల కాదు బాబోయ్, ప్రపంచ కప్ లేకపోయినా నాకేమీ లోటు లేదంటూ ఏబీ డివిలియర్స్ అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించగా... డు ప్లెసిస్, ఆమ్లా, డుమిని, స్టెయిన్, ఇమ్రాన్ తాహిర్ మరోసారి పోరాడబోతున్నారు (వీరంతా 2011, 2015లలో జరిగిన రెండు ప్రపంచ కప్‌లు ఆడారు). ఈసారైనా వీరి కల నెరవేరుతుందో వేచి చూడాలి. డు ప్లెసిస్: 14 మ్యాచ్‌లలో 53.90 సగటుతో 539 పరుగులు చేశాడు. 1 సెంచరీ, 4 అర్ధసెంచరీలు ఉన్నాయి. హషీం ఆమ్లా: 15 మ్యాచ్‌లలో 42.60 సగటుతో 639 పరుగులు చేశాడు. 2 సెంచరీలు, 3 అర్ధసెంచరీలు ఉన్నాయి. జేపీ డుమిని: 13 మ్యాచ్‌లలో 43.11 సగటుతో 388 పరుగులు చేశాడు. 1 సెంచరీ, 1 అర్ధసెంచరీ ఉన్నాయి. డేల్ స్టెయిన్: 14 మ్యాచ్‌లలో 23.39 సగటుతో 23 వికెట్లు పడగొట్టాడు. ఇమ్రాన్ తాహిర్: 13 మ్యాచ్‌లలో 16.31 సగటుతో 29 వికెట్లు పడగొట్టాడు. -
విజయ విశ్వ సారథులు
మరో 12 రోజుల్లో... క్రికెట్ అంటే... జట్టుగా ఆడే జెంటిల్మన్ ఆట. విజయమైనా, ఓటమైనా మైదానంలో దిగిన పదకొండు మంది క్రీడాకారులదే బాధ్యత. జగమెరిగిన ఈ సామెత దిగ్గజాలు సహా అందరూ చెప్పేదే! అయితే, ఇందులో కెప్టెన్ పాత్ర మరింత కీలకం. జట్టులోని వారంతా సమానమే అయినా... బృందాన్ని సమష్టిగా నడిపించడం, పరిస్థితులకు తగ్గట్లు వ్యూహాలు రచించడం, అప్పటికప్పుడు ఎత్తుగడలు వేయడం ద్వారా సారథిని ప్రత్యేకమైన వాడిగా పరిగణిస్తారు. సాధారణ టోర్నమెంట్లలో ఎలా ఉన్నా ప్రపంచ కప్‌నకు వచ్చేసరికి కెప్టెన్లపై దృష్టి ఎక్కువగా ఉంటుంది. అత్యంత ప్రతిష్ఠాత్మకమైనది కావడంతో వారు తీసుకునే నిర్ణయాలు చర్చ రేకెత్తిస్తాయి. ఇలా... తమదైన శైలిలో అడుగులు వేసి, దేశానికి ప్రపంచ కప్ అందించిన వారెవరో చూద్దామా? సాక్షి క్రీడా విభాగం : ఇప్పటి వరకు జరిగిన పదకొండు ప్రపంచ కప్‌లలో తొమ్మిది మంది కెప్టెన్లు టైటిల్‌ను సగర్వంగా పైకెత్తారు. క్లయివ్ లాయిడ్ (వెస్టిండీస్), రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) రెండేసి సార్లు వరుసగా ఈ ఘనతను సాధించారు. వారి కృషిని తక్కువ చేయడం కాదు కాని, మేటి ఆటగాళ్లతో కూడిన జట్టుండటం ఈ ఇద్దరికీ కొంత కలిసొచ్చింది. మిగతా ఏడుగురూ క్లిష్ట పరిస్థితులకు ఎదురొడ్డినవారే. నాయకుడిగా నేనున్నానంటూ ముందుకొచ్చి, ఒత్తిడినంతా మీదేసుకుని అసలే మాత్రం అవకాశాలు లేని స్థితి నుంచి జట్టును చాంపియన్లుగా నిలిపిన వారు కొందరైతే, అత్యంత ఉత్కంఠను తట్టుకుని జగజ్జేతను చేసిన వారు మరికొందరు. చిత్రమేమంటే... వీరిలో కొందరు ఆ వెంటనే తప్పుకోగా, ఇంకొందరు తర్వాతి కప్‌ను అందించలేకపోయారు. కపిల్... విడవకుండా పట్టి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఆటగాళ్ల ఎంపిక జట్టు జయాపజయాలను నిర్దేశిస్తుంది. 1983 కప్‌లో భారత దిగ్గజం కపిల్ దేవ్ ఇదే పని చేశాడు. ఇంగ్లండ్ వాతావరణానికి తగ్గట్టు బల్వీందర్ సంధు, రోజర్ బిన్నీ, కీర్తి ఆజాద్‌లతో బౌలింగ్ దళాన్ని, మదన్‌లాల్, మోహిందర్ అమర్నాథ్ వంటి ఆల్‌రౌండర్లతో బ్యాటింగ్ లోతు పెంచాడు. ఈ వ్యూహం... జింబాబ్వేతో మ్యాచ్‌లో 17 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన దశలో కపిల్ 175 పరుగుల మారథాన్ ఇన్నింగ్స్‌కు వెన్నెముకలా పనిచేసింది. కపిల్ స్ఫూర్తితో తర్వాత భారత్ రెట్టించి ఆడింది. లాయిడ్ కెప్టెన్సీకి తోడు విధ్వంసక రిచర్డ్స్ ఉన్న విండీస్‌ను ఫైనల్లో 43 పరుగుల తేడాతో మట్టికరిపించింది. తుది సమరంలో రిచర్డ్స్ క్యాచ్‌ను 40 గజాల వెనక్కి పరిగెత్తి మరీ కపిల్ అందుకున్న తీరు స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవడంలో మన జట్టుకు ఉత్ప్రేరకంగా పనిచేసింది. లాయిడ్...ఆ రెండు సందర్భాలు ధాటిగా బాదేసే బ్యాట్స్‌మెన్, బెంబేలెత్తించే పేసర్లతో 1975, 1979 కప్‌లు విండీస్ దాసోహమయ్యాయి. అయితే, ప్రతిభావంతులంతా ఒకే చోట ఉన్నా ఇబ్బంది లేకుండా ఒక్కటిగా నడిపించాడు లాయిడ్. అతడి కెప్టెన్సీ సామర్థ్యం, స్ఫూర్తికి ఉదాహరణ 1975 ఫైనల్. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పేసర్లు లిల్లీ, థాంప్సన్ ధాటికి 50/3తో నిలిచిన విండీస్‌ను లాయిడ్ (85 బంతుల్లో 102) సెంచరీతో బయట పడేశాడు. 291 పరుగుల ఛేదనలో ప్రత్యర్థి దీటుగా బదులిస్తున్న సమయంలో పొదుపైన బౌలింగ్ (1/38)తో జట్టుకు కప్ అందించాడు. ఇక 1979 కప్‌లో లీగ్ మ్యాచ్‌లన్నీ గెలిచి సెమీస్ చేరిన విండీస్‌కు... 294 పరుగుల ఛేదనలో జహీర్ అబ్బాస్ (93) అద్భుత బ్యాటింగ్‌తో పాకిస్తాన్ సవాల్ విసిరింది. అయితే, విరామ సమయంలో లాయిడ్ మెదడుకు పదును పెట్టాడు. లెగ్ స్టంప్ లక్ష్యంగా బంతులేయించి అబ్బాస్ ఆట కట్టించాడు. అప్పటికి 176/1తో ఉన్న పాక్ తర్వాత 250కే ఆలౌటైంది. మళ్లీ లాయిడ్లాంటి కెప్టెన్ దొరక్కపోవడమే విండీస్ చేసుకున్న దురదృష్టం. క్లార్క్... పోరాడి గాయంతో ఇబ్బంది పడుతూనే 2015 కప్‌లో ఆడాడు ఆస్ట్రేలియా కెప్టెన్ మైకేల్ క్లార్క్. సొంతగడ్డపై 23 ఏళ్ల తర్వాత జరిగిన ఈ మెగా ఈవెంట్లో క్లార్క్ తొలుత పెద్దగా రాణించకున్నా జట్టులో సమష్టితత్వం దెబ్బతినకుండా చూశాడు. కీలకమైన నాకౌట్ దశలో ఫామ్‌లోకి వచ్చిన క్లార్క్ మంచి ఇన్నింగ్స్ ఆడాడు. క్వార్టర్స్‌లో పాకిస్తాన్‌ను, సెమీస్‌లో భారత్‌ను ఆసీస్ తేలిగ్గా ఓడించింది. ఫైనల్లో మరింత సాధికారికంగా ఆడి అద్భుతమైన ఫామ్‌లో ఉన్న న్యూజిలాండ్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో క్లార్క్ (74) టాప్ స్కోరర్ కావడం గమనార్హం. టోర్నీలో ఆసీస్... కివీస్ చేతిలో మాత్రమే అదీ లీగ్ దశలో ఓడింది. పాంటింగ్... గట్టోడే స్టీవ్ వా వన్డేల నుంచి వైదొలగడంతో కెప్టెన్సీ దక్కిన పాంటింగ్... కప్‌ను ఎంతవరకు నిలబెడతాడో అన్న అనుమానాలుండేవి. అయితే వాటిని పటాపంచలు చేస్తూ ఆస్ట్రేలియాను వరుసగా రెండుసార్లు విజేతగా నిలిపాడు. ఈ క్రమంలో విమర్శలెదురైనా తన దూకుడుతో ఎక్కడా జోరు తగ్గకుండా చూశాడు. 2003లో వరుసగా 11 మ్యాచ్‌లలో గెలిపించాడు. ఫైనల్లో అతడి ఇన్నింగ్స్ (121 బంతుల్లో 140) అయితే భారత్ అభిమానులకు చాలా రోజులు నిద్ర లేని రాత్రులు మిగిల్చింది. ఆసీస్ 2007లోనూ ఈ జైత్రయాత్ర కొనసాగించి వరుసగా 12 మ్యాచ్‌ల్లో గెలిచింది. అచ్చం లాయిడ్లాగే ఈ రెండు టోర్నీల్లో మేటి ఆటగాళ్లున్న జట్టును ఒక్కతాటిపై నడిపిన పాంటింగ్ స్వయంగా బ్యాట్‌తోనూ రాణించాడు. వరుసగా 415, 539 పరుగులు చేశాడు. ‘స్టీల్’ వా.... జట్టులో తీవ్ర పోటీని తట్టుకుని అంతకుముందే మార్క్ టేలర్ నుంచి స్టీవ్ వా సారథ్య బాధ్యతలు అందుకున్నాడు. దీంతో 1999 ప్రపంచ కప్ సమయానికి తానేంటో నిరూపించుకోవాల్సిన పరిస్థితి స్టీవ్ వాది. కానీ, కప్ ప్రారంభంలోనే పాక్, కివీస్ చేతిలో ఓటములు. దక్షిణాఫ్రికాపై సూపర్ సిక్స్ దశ మ్యాచ్‌లో 272 పరుగుల ఛేదనలో 48 పరుగులకే 3 వికెట్ల పతనం. ఈ దశలో స్టీవ్ వా మొక్కవోని ధైర్యంతో 110 బంతుల్లో 120 పరుగులు చేసి జట్టును గట్టెక్కించాడు. సెమీస్‌లో ఇదే ప్రత్యర్థిపై మొండిగా నిలిచి అర్ధ సెంచరీ (56) చేశాడు. 213 పరుగులే చేసినా దానిని కాపాడుకోవడంలో స్టీవ్ స్ఫూర్తితో ఆసీస్ తెగువ కనబర్చింది. చివరకు మ్యాచ్ టై కావడం, సూపర్ సిక్స్ ఫలితంతో ఫైనల్కెళ్లడం కప్ కొట్టేయడం చకచకా జరిగిపోయాయి. బోర్డర్... గట్టు దాటించాడు కీలక ఆటగాళ్ల రిటైరయ్యారు. కుర్రాళ్లింకా కుదురుకోలేదు. 1980లలో ఆస్ట్రేలియా పరిస్థితిది. జట్టు మేటిగా ఎదగాలంటే పెద్ద మలుపులాంటి విజయం కావాలి. ఇలాంటి దశలో 1987 ప్రపంచ కప్ అందించి అలెన్ బోర్డర్ మార్గనిర్దేశం చేశాడు. ఆతిథ్య దేశం, డిఫెండింగ్ చాంపియన్ భారత్‌ను తొలి మ్యాచ్‌లో ఒక్క పరుగు తేడాతో ఓడించిన ఆసీస్... అదే ఆత్మవిశ్వాసంతో నాలుగు లీగ్ మ్యాచ్‌లూ గెలిచి సెమీస్ చేరింది. సహ ఆతిథ్య దేశం పాకిస్తాన్‌ను లాహోర్‌లో జరిగిన సెమీస్‌లో 18 పరుగులతో ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. తుది సమరంలో మైక్ గ్యాటింగ్ మెరుపులతో 254 పరుగుల ఛేదనను ఇంగ్లండ్ సులువుగా పూర్తి చేసేలా కనిపించింది. ఈ సమయంలో పార్ట్‌టైమ్ బౌలరైన బోర్డర్ బంతిని అందుకుని సాహసానికి దిగాడు. అత్యుత్సాహానికి పోయిన గ్యాటింగ్ రివర్స్ స్వీప్‌నకు యత్నించి బోల్తా పడ్డాడు. తర్వాత తేరుకోని ఇంగ్లండ్ లక్ష్యానికి 7 పరుగుల దూరంలో ఆగిపోయింది. ఈ విజయం ప్రపంచ క్రికెట్లో ఆస్ట్రేలియా ఆధిపత్యానికి పునాది వేసింది. ఇమ్రాన్... మాయ చేశాడు ఓ మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో పరాజయం. మరోదాంట్లో చిరకాల ప్రత్యర్థి భారత్ చేతిలో ఓటమి. ఇంకో దాంట్లో 74 పరుగులకే ఆలౌట్. ఇదీ 1992 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ పరిస్థితి. ఇలా దాదాపు ఇంటి దారిలో ఉన్న జట్టుకు ఇమ్రాన్ ఖాన్ నాయకత్వ లక్షణాలతో ఊపిరి పోశాడు. ‘మనం దెబ్బతిన్న పులులం’ అనే నినాదం రాసి ఉన్న టీ షర్టును ధరించి స్ఫూర్తి రగిల్చాడు. ఫలితం... హాట్ ఫేవరెట్ న్యూజిలాండ్‌ను లీగ్ దశలో, సెమీస్‌లో వరుసగా ఓడించి ఫైనల్ చేరింది. ఆఖరి పోరులో వన్‌డౌన్‌లో వచ్చి 72 పరుగుల విలువైన ఇన్నింగ్స్ ఆడటం, సీనియర్లు సలీమ్ మాలిక్, ఇజాజ్ అహ్మద్‌ల కంటే కుర్రాడు ఇంజమాముల్ హక్, ఆల్‌రౌండర్ అక్రమ్‌లను ముందుగా బ్యాటింగ్‌కు దింపడం వంటివన్నీ ఇమ్రాన్ ఆత్మస్థయిర్యానికి నిదర్శనాలు. ఈ కప్‌లో అతడు పరిచయం చేసిన ఇంజమామ్ తర్వాత మేటి బ్యాట్స్‌మన్‌గా ఎదిగాడు. అర్జున... గర్జన కీలక బౌలర్ మురళీధరన్ శైలిపై ఆరోపణలు. దేశంలో అంతర్యుద్ధ పరిస్థితులు. ఆతిథ్యం ఇస్తున్నా, వారి దేశంలో ఆడబోమంటూ ప్రత్యర్థుల బహిష్కరణలు. అప్పుడప్పుడే ఎదుగుతున్న జట్టును మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురిచేసే యత్నాలు. ఈ స్థితిలో శ్రీలంకను అర్జున రణతుంగ అమేయంగా తీర్చిదిద్దాడు. మొదట జయసూర్య, కలువితరణ విధ్వంసక ఇన్నింగ్స్ ఆడేలా పురికొల్పాడు. ఆనక అరవింద డిసిల్వా, రోషన్ మహనామాతో కలిసి బ్యాటింగ్‌లో గోడ కట్టాడు. చమిందా వాస్, మురళీధరన్ బౌలింగ్ పదును రణతుంగ కెప్టెన్సీకి జత కలిసి లంకను చాంపియన్ చేశాయి. మురళీధరన్ విషయంలో ఏ ఆస్ట్రేలియాలోనైతే తమకు అవమానం జరిగిందో అదే ఆస్ట్రేలియాపై ఫైనల్లో గెలిచి ప్రతీకారం ఘనంగా తీర్చుకుంది. 1996 ప్రపంచకప్ విజయం తర్వాత లంక చాన్నాళ్లు పటిష్ఠ జట్టుగా కొనసాగింది. ‘మహి’మ చూపాడు... అప్పటికే భారత్ ప్రపంచ కప్ గెలిచి 28 ఏళ్లయింది. మళ్లీ ఎప్పుడా? అని అభిమానుల ఎదురుచూపులు. పైగా అంతకుముందటి కప్‌లో దారుణ పరాభవాన్ని దిగమింగి ఉన్నారు. 2011 ఈవెంట్‌ను ఘనంగా ప్రారంభించినా దక్షిణాఫ్రికాతో ఓటమి, ఇంగ్లండ్‌తో మ్యాచ్ ‘టై’ కావడంతో లోలోన అనుమానాలు. కానీ, ధోని తనను తాను, జట్టును నమ్మాడు. బ్యాటింగ్‌ను బలోపేతం చేస్తూ, ఐదో బౌలర్‌గా యువరాజ్‌కు పూర్తి స్వేచ్ఛనిచ్చాడు. కోహ్లిలాంటి కుర్రాడిపై భరోసా ఉంచాడు. శ్రీలంకపై ఫైనల్లో మూడు వికెట్లు కోల్పోయి మరో 160 పరుగుల చేయాల్సిన వేళ... ప్రత్యర్థి స్పిన్నర్లను సమర్థంగా ఆడగలనని నమ్మి ధోని బ్యాటింగ్‌కు దిగాడు. 71 బంతుల్లో 91 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో కప్ అందించాడు. ‘175’ గురించి సన్నీ ఏమన్నాడంటే.. 1983 వరల్డ్ కప్‌లో టన్‌బ్రిడ్జ్‌వెల్స్‌లో జింబాబ్వేపై కపిల్ దేవ్ ఆడిన 175 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. చిత్తుగా ఓడాల్సిన ఆ మ్యాచ్‌లో విజయం సాధించిన భారత్ చివరకు విశ్వ విజేతగా కూడా నిలిచింది. జట్టులో సభ్యుడైన సునీల్ గావస్కర్ దీని ప్రత్యేకత గురించి చెబుతూ... ‘ఆ మ్యాచ్‌లో 17 పరుగులకే 5 వికెట్లు కోల్పో యాం. నిజంగా కపిల్ ఇన్నింగ్స్ గొప్పతనం ఏమిటో మాటల్లో చెబితే ఎవరికీ అర్థం కాదు. టాపార్డర్ బ్యాట్స్‌మెన్ బంతికి బ్యాట్‌కు తగిలించలేకపోయిన చోట అతను అదే బంతిని మైదానం నలుదిశలా బాదాడు. 60 ఓవర్ల మ్యాచ్ కావడం వల్ల మొదటి ఇన్నింగ్స్ ముగియడానికి ముందే మాకు లంచ్ బ్రేక్ ఉండేది. కపిల్ లంచ్‌కు వచ్చాక అతని సీటుపై ఒక జ్యూస్ గ్లాస్ మినహా అటు డ్రెస్సింగ్ రూమ్‌లో కానీ, లంచ్ రూమ్‌లో కానీ ఒక్కరూ లేరు. నిజంగా చెప్పాలంటే సిగ్గుతో మేమంతా అతనికి మొహాలు చూపించలేక దాక్కున్నాం! ఎలా బ్యాటింగ్ చేయాలో అతను చేసి చూపించాడు. ఆ తర్వాతే మాలో నమ్మకం పెరిగి టైటిల్ గెలిచే వరకు వెళ్లగలిగాం’ అని సన్నీ చెప్పాడు. వాల్సన్ విలాపం 1983లో విజేతగా నిలిచిన భారత జట్టులో సునీల్ వాల్సన్ పేరు ప్రత్యేకం. 14 మంది సభ్యుల టీమ్‌లో 13 మంది కనీసం 2 మ్యాచ్‌లైనా ఆడగా, వాల్సన్‌కు మాత్రం ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడే అవకాశం రాలేదు. ఎడంచేతి వాటం మీడియం పేసర్ అయిన వాల్సన్ మైదానంలోకి దిగకపోయినా విన్నింగ్ టీమ్ సభ్యుడిగా చరిత్రలో నిలిచిపోయాడు. అయితే ఆశ్చర్యకరమైన విశేషం ఏమిటంటే వాల్సన్‌కు వరల్డ్ కప్‌లోనే కాదు... అంతకుముందు, ఆ తర్వాతా ఒక్క వన్డే ఆడే అవకాశం రాలేదు. సరిగ్గా చెప్పాలంటే అతను భారత్ తరఫున ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ (టెస్టులు సహా) కూడా ఆడలేకపోయాడు. వరల్డ్ కప్ చరిత్రలో ఇలాంటి క్రికెటర్ వాల్సన్ ఒక్కడే కావడం విశేషం. పదేళ్ల ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరీర్లో ఢిల్లీ, రైల్వేస్ జట్ల తరఫున ఆడి అతను 212 వికెట్లు పడగొట్టాడు. -
ఐపీఎల్లో ‘వరల్డ్‌కప్’ ఆటగాళ్లు.. ప్చ్!
క్రికెట్ అభిమానుల్ని 51 రోజులపాటు ఉర్రూతలూగించిన ఐపీఎల్ 2019 సీజన్ ముగిసింది. ఉప్పల్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆఖరి బంతి వరకూ పోరాడిన ముంబై ఇండియన్స్ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. దీంతో రోహిత్ సేన ఖాతాలో నాలుగో ఐపీఎల్ టైటిల్ చేరింది. ఇక ఫైనల్ మ్యాచ్‌లో గాయం కూడా లెక్క చేయకుండా పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడిన షేన్ వాట్సన్‌కు సీఎస్కే అభిమానులు ఫిదా అయ్యారు. ఐపీఎల్ సమరం ముగిసింది మరి నెక్ట్స్ ఏంటి? అంటే ఇంకేంటి ప్రపంచకప్ కదా అంటున్నారు టీమిండియా ఆటగాళ్లు, అభిమానులు. అయితే ప్రపంచకప్‌లో పాల్గొనబోయే టీమిండియా ఎంపిక పట్ల మాజీ క్రికెటర్లు పెదవి విరుస్తున్నారు. యువ సంచలనం రిషభ్ పంత్, సీనియర్ ఆటగాడు అంబటి రాయుడు, మరో స్పెషలిస్టు పేసర్‌ను తీసుకోకోపోవడంపై సెలక్షన్ విధానాన్ని బహిరంగంగానే విమర్శిస్తున్నారు. అయితే మే 30 నుంచి ప్రారంభమయ్యే విశ్వసమరానికి ముందు జరిగిన ఐపీఎల్లో వరల్డ్‌కప్‌కు ఎంపికైన భారత జట్టు సభ్యుల ప్రదర్శన ఎలా ఉందో ఓ లుక్ వేద్దాం. కోహ్లి, రోహిత్.. ప్చ్ కనీసం ఈ సారయినా.. అనే నినాదంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్‌లోకి అడుగుపెట్టింది. ముఖ్యంగా విరాట్ కోహ్లి ఈ సీజన్‌ను సవాల్‌గా తీసుకున్నాడు. అందుకోసం మానసికంగా, శారీరకంగా సిద్దమయ్యాడు. అయితే సీజన్ మారినా ఆర్సీబీ తలరాత మారలేదు. అయితే గత సీజన్లతో పోలిస్తే ఈసారి కోహ్లి తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ సారి కాస్త పరుగుల ప్రవాహం తగ్గింది. 14 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి 33.14 సగటుతో 464 పరుగులు సాధించాడు. ఇందులో రెండు అర్దసెంచరీలు, ఓ సెంచరీ ఉన్నాయి. రోహిత్ శర్మ తన జట్టుకయితే నాలుగోసారి టైటిల్ అందిచాడు కానీ.. బ్యాట్స్‌మన్‌గా మాత్రం విఫలమాయ్యడు. ఈ సీజన్లో రోహిత్ మెరుపులు మెరవలేదు. ఇక గాయం కారణంగా ఓ మ్యాచ్‌కు దూరమై భయపెట్టించాడు. ఇక ఈ సీజన్లో రోహిత్ 15 మ్యాచ్‌ల్లో 28.92 సగటుతో 405 పరుగులు మాత్రమే చేశాడు. తాజా ఐపీఎల్లో జెర్సీ మార్చి బరిలోకి దిగిన శిఖర్ ధావన్ పర్వాలేదనిపించాడు. గబ్బర్ నుంచి అభిమానులు అశించిన ప్రదర్శన ఇచ్చాడు. కానీ జట్టుకు అవసరమైన దశలో విఫలమవడం అందరినీ విస్మయానికి గురి చేసింది. ఇక ఈ సీజన్లో 16 మ్యాచ్‌లు ఆడిన ధావన్ ఐదు హాఫ్ సెంచరీలతో 521 పరుగులు సాధించాడు. ఇక విదేశీ పిచ్‌లపై ముఖ్యంగా ఇంగ్లండ్ గడ్డపై రాణించే ధావన్‌పై అందరి చూపు ఉంది. మరి ఏ మేరకు రాణిస్తాడో చూడాలి. రాహుల్ రాజసం.. ధోని ధనాధన్ ఈ సీజన్లో కేఎల్ రాహుల్ చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తర్వాత అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా, స్టైలీష్ ప్లేయర్‌గా రాహుల్ నిలిచాడు. ఇక ఈ సీజన్లో 14 మ్యాచ్‌లు ఆడిన రాహుల్ 593 పరుగులు సాధించాడు. ఇందులో ఆరు అర్దసెంచరీలు, ఓ సెంచరీ ఉన్నాయి. అయితే నిలకడలేమి రాహుల్‌కు ప్రధాన సమస్య. అది అధిగమిస్తే ప్రపంచకప్‌లో స్టార్ బ్యాట్స్‌మెన్ అవడం ఖాయం వయసు కేవలం సంఖ్య మాత్రమేనని.. వయసుతో ఆటలో మార్పురాదని ఎంఎస్ ధోని ఈ సీజన్లో నిరూపించాడు. డాడీ ఆర్మీ అంటూ ఎగతాళి చేసినవారికి బ్యాట్‌తో సమాధానమిచ్చాడు. ఇక బెస్ట్ ఫినిషర్‌గా గుర్తింపు పొందిన ఈ జార్ఖండ్ డైనమెట్ 15 మ్యాచ్‌ల్లో 416 పరుగులు సాధించి సీఎస్కే విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ఈ సీజన్లో ధోని సగటు 83.80గా ఉండటం విశేషం. ఇక ధోనికిదే చివరి ప్రపంచకప్ కావడంతో టీమిండియాకు మరోసారి కప్ అందిస్తాడని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నాడు. లక్కీ ప్లేయర్స్ టీమిండియాలో వారు రావడం, ఉండటంలో అదృష్టమనేది కీలకపాత్ర. ముఖ్యంగా కేదార్ జాదవ్ టీమిండియా లక్కీప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. అతడున్న చాలా మ్యాచ్‌లు టీమిండియా గెలిచింది. అయితే తాజా ఐపీఎల్ సీజన్లో జాదవ్ తీవ్రంగా నిరాశపరిచాడు. తను ఆడిన 14 మ్యాచ్‌ల్లో కేవలం 162 పరుగులు మాత్రమే సాధించగలిగాడు. ఇక కింగ్స్ పంజాబ్‌తో మ్యాచ్ సందర్భంగా గాయపడి ప్లేఆఫ్స్‌కు దూరమయ్యాడు. ప్రస్తుతం ప్రపంచకప్‌లో ఆడేది కూడా అనుమానంగా ఉంది. అయితే గాయం నుంచి కోలుకున్నా ఏ మేరకు రాణిస్తాడో చూడాలి. అనుభవమనే ఏకైక కారణంతో ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు దినేశ్ కార్తీక్. లేకుంటే యువ సంచలనం రిషభ్ పంత్‌కు చోటు దక్కేది. ఐపీఎల్ సీజన్ 12ను ఘనంగా ఆరంభించి చివరికి ప్లేఆఫ్స్‌కు కూడా చేరలేదు కోల్‌కతా నైట్‌రైడర్స్. ఇక సారథిగా ఈ సీజన్లో విఫలమైన కార్తీక్ ఆటగాడిగా కూడా తీవ్రంగా నిరాశపరిచాడు. అతడాడిన 14 మ్యాచ్‌ల్లో కేవలం 253 పరుగులు మాత్రమే సాధించగలిగాడు. జట్టుకు అవసరమైన సమయంలో కార్తీక్ విఫలమయ్యాడని విమర్శలు వచ్చాయి. అతి తక్కువ కాలంలోనే భారత జట్టులో స్థానం సంపాదించుకున్న లక్కీ ప్లేయర్ విజయ్ శంకర్. ఆల్‌రౌండర్ కోటాలో ప్లేస్ ఫిక్స్ చేసుకున్న విజయ్ శంకర్ ఈ సీజన్లో పెద్దగా మెరవలేకపోయాడు. 15 మ్యాచుల్లో 20.33 సగటుతో కేవలం 244 పరుగులు సాధించాడు విజయ్ శంకర్. ఆల్‌రౌండ్ షో ఓకే.. వివాదాలతోనే కాదు ఆటతోనూ హైలెట్‌గా నిలిచాడు హార్దిక్ పాండ్యా. ముంబై ఇండియన్స్ టైటిల్ గెలవడంలో పాండ్యా పాత్ర మరవలేనిది. తన ఆల్‌రౌండ్ షోతో ముంబైకి ఘనవిజయాలందించాడు. ఇక ఈ సీజన్లో 16 మ్యాచుల్లో 44.86 సగటుతో 402 పరుగులు చేసిన పాండ్యా.. బౌలింగ్‌లో 14 వికెట్లు పడగొట్టాడు. సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఈ సీజన్లో మామూలు ప్రదర్శనతోనే సరిపెట్టుకున్నాడు. బౌలింగ్‌లో 15 వికెట్లు తీసిన జడేజా, బ్యాటింగ్‌లో కేవలం 106 పరుగులు మాత్రమే చేశాడు. బంతి తిప్పలేకపోయారు.. మణికట్టు స్పిన్నర్లుగా గుర్తింపు పోందిన కుల్దీప్ యాదవ్, చహల్‌లు ఈ సీజన్లో నిరాశపరిచారు. ముఖ్యంగా కుల్దీప్ వికెట్ల విషయం పక్కకు పెడితే ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. బెంగళూరుపై చెత్త ప్రదర్శనతో ఏకంగా జట్టులో స్థానాన్ని కోల్పోయాడు. ఇక చహల్ ఆర్సీబీ బౌలింగ్ భారాన్ని మోశాడు. 14 మ్యాచ్‌లు ఆడిన చహల్ 18 వికెట్లు తీయగా.. 9 మ్యాచ్‌లు ఆడిన కుల్దీప్ కేవలం నాలుగు వికెట్లే తీసి విఫలమయ్యాడు. ఇక ఇదే సీజన్లో సీఎస్కే స్సిన్నర్ ఇమ్రాన్ తాహీర్ అత్యధిక వికెట్లతో పర్పుల్ క్యాప్ సొంతం చేసుకోగా.. మన స్పిన్నర్లు రాణించకపోవడం విడ్డూరం. బుమ్ బుమ్ బుమ్రా.. డెత్ ఓవర్ స్పెషలిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న జస్ప్రిత్ బుమ్రా మరోసారి ఈ సీజన్లో తన మాయాజాలాన్ని ప్రదర్శించాడు. కీలకసమయాలలో వికెట్లు పడగొట్టి, పరుగులు కట్టడిచేసి ముంబైకి అనేక విజయాలను అందించాడు. ఈ సీజన్లో 16 మ్యాచ్‌లు ఆడిన ఈ స్టార్ పేసర్ 19 వికెట్లు పడగొట్టాడు. ఇక ప్రపంచకప్‌లో బౌలింగ్ విభాగానికి నాయకత్వ వహించే బుమ్రా రాణింపు పైనే టీమిండియా విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఇక కింగ్స్ ఎలెవన్ తరుపున బరిలో దిగిన స్టార్ బౌలర్ మహ్మద్ షమీ 14మ్యాచుల్లో 19 వికెట్లు తీశాడు. పొదుపుగా బౌలింగ్ చేసే షమీ ఈ సారి 8.68 రన్‌రేట్‌తో పరుగులు సమర్పించుకోవడం విశేషం. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున బరిలో దిగిన భువనేశ్వర్, కొన్ని మ్యాచులకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. మొత్తంగా 15 మ్యాచుల్లో 13 వికెట్లు మాత్రమే తీసిన భువనేశ్వర్ కుమార్, కీలక సమయంలో ఫెయిల్ అవ్వడం టీమిండియాను కలవరబెట్టే అంశం. -
బీసీసీఐకి అంబానీ షరతు
తొలి మూడు ప్రపంచ కప్‌లు ఇంగ్లండ్‌లో నిర్వహించిన తర్వాత దానిని ఆసియా ఖండానికి తరలించడం అంత సులువుగా జరగలేదు. 1987లో భారత్, పాకిస్తాన్ సంయుక్తంగా ‘రిలయన్స్ వరల్డ్ కప్’కు ఆతిథ్యమిచ్చాయి. ఐసీసీలో మాట నెగ్గేందుకు అసోసియేట్ దేశాలకు భారీ మొత్తాన్ని ఆఫర్ చేయాల్సి వచ్చింది. రెండు దేశాల క్రికెట్ పరిపాలకులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల మధ్య పలుమార్లు చర్చోపచర్చలు సాగాయి. నిర్వహణ కోసం ఇండియా పాకిస్తాన్ జాయింట్ మేనేజ్మెంట్ కమిటీ (ఐపీజేఎంసీ) ఏర్పాటు చేశారు. అంతా జరిగాక స్పాన్స ర్షిప్ కోసం ప్రయత్నిస్తే లండన్‌లో స్థిరపడిన ఒక భారతీయ వ్యాపారి ముందుకు వచ్చాడు. అయితే ప్రధాని రాజీవ్ గాంధీకి ఇది నచ్చలేదు. భారత్‌లో జరిగే టోర్నీకి మళ్లీ విదేశీ వ్యక్తి టైటిల్ స్పాన్సర్ కావడం ఏమిటని ఆయన అసహనం వ్యక్తం చేశారు. దాంతో చివరకు ఐఎస్ బింద్రా, అప్పటి కేంద్ర మంత్రి ఎన్‌కేపీ సాల్వే కలిసి రిలయన్స్ అధినేత ధీరూభాయ్ అంబానీని ఒప్పించారు. డబ్బు గురించి కాకుండా తన ముందు ఒక షరతు విధించి అంబానీ స్పాన్సర్‌షిప్‌పై సంతకం చేశారని బింద్రా వెల్లడించారు. ‘ప్రపంచకప్‌కు ముందు భారత్, పాకిస్తాన్ మధ్య ఒక ఎగ్జిబిషన్ మ్యాచ్ జరగబోతోంది కదా. దేశవ్యాప్తంగా టీవీలో ఆ మ్యాచ్ ప్రత్యక్షంగా ప్రసారమవుతుంది. ఆ మ్యాచ్ జరిగే సమయంలో ప్రధానమంత్రి పక్కనే నాకు సీటు ఏర్పాటు చేయాలనేది నా షరతు’ అని అంబానీ తన మనసులో మాట చెప్పారు. ఐపీజేఎంసీ కాస్తా రిలయన్స్ కప్ ఆర్గనైజింగ్ కమిటీగా పేరు మార్చుకుంది. 1987 వరల్డ్ కప్ టైటిల్ స్పాన్సర్షిప్ కోసం నాడు రిలయన్స్ సంస్థ రూ. 9 కోట్లు చెల్లించింది! -
ఈ దేశాలూ ఆడాయోచ్!
ఇప్పుడంటే... ఒకటీ, రెండు పేర్లు అటు ఇటయినా ప్రపంచకప్ ఆడే దేశాలేవంటే చకచకా చెప్పగలుతున్నాం. ఇవన్నీ కొంతకాలంగా స్థిరంగా పోటీ క్రికెట్లో భాగస్వాములవడమే దీనికి కారణం. కానీ, మొదట్లో పెద్దగా తెలియని దేశాలూ కప్‌లో పాల్గొన్నాయి. కొంత ఆశ్చర్యంగా ఉన్నా నాలుగైదు దేశాలు కలిపి ఆడిన సందర్భాలూ ఉన్నాయి. తర్వాతి కాలంలో వీటిలో చాలా వరకు కనుమరుగవడం... క్రికెట్‌ను ‘విశ్వవ్యాప్త క్రీడ’ అనేందుకు వెనుకాముందు ఆలోచించేలా చేసింది. మారిన కొత్త నిబంధనలతో వరల్డ్ కప్‌ను ఐసీసీ పది జట్లకే పరిమితం చేయడంతో మంచి ప్రతిభ ఉన్నా ఐర్లాండ్, స్కాట్లాండ్లాంటి జట్లు దురదృష్టవశాత్తూ 2019 టోర్నీకి దూరమయ్యాయి. గతంలో ప్రపంచకప్‌లో పాల్గొని, నేడు దూరమైన లేదా గుర్తింపులో లేని జట్లేంటో చూద్దామా...? తూర్పు ఆఫ్రికా జాతి వివక్ష కారణంగా క్రికెట్లో దక్షిణాఫ్రికా ప్రాతినిధ్యంపై నిషేధం ఉన్న కాలంలో... 1975లో జరిగిన తొలి ప్రపంచ కప్‌లో శ్రీలంకతో కలిపి ఆహ్వానిత దేశ హోదాలో పాల్గొంది తూర్పు ఆఫ్రికా జట్టు. చీకటి ఖండంలోని ఇరుగు పొరుగు దేశాలైన ఉగాండా, టాంజానియా, కెన్యా, జాంబియా ఆటగాళ్లు ఇందులో సభ్యు లు. లీగ్ దశలో న్యూజిలాండ్, భారత్, ఇంగ్లండ్‌లపై పరాజయం పాలై తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టిందీ జట్టు. తర్వాత ఒక్కసారి కూడా అర్హత సాధించలేక పోయింది. 1987తో ఉనికే మాయమైంది. ఈ జట్టులో పలువురు భారత సంతతి ఆటగాళ్లుండటం విశేషం. ఐర్లాండ్ జింబాబ్వేతో మ్యాచ్‌ను టై చేసి, పాకిస్తాన్‌ను 3 వికెట్లతో ఓడించి అరంగేట్రం (2007)లోనే సూపర్ 8కు చేరింది. ఈ రౌండ్లో బంగ్లాదేశ్‌నూ మట్టికరిపించింది. 2011లో ఇంగ్లండ్‌పైన సంచలన విజయం సాధించిన ఈ జట్టు నెదర్లాండ్స్నూ ఓడించింది. 2015లో కూడా జింబాబ్వే, యూఏఈలపై నెగ్గడంతో పాటు వెస్టిండీస్‌ను కూడా చిత్తు చేయడం విశేషం. ఈసారి క్వాలిఫై కావడంలో విఫలమైంది. కెనడా వైశాల్యపరంగా రెండో అతి పెద్ద దేశమైన కెనడా 1979 కప్‌లోనే తళుక్కుమంది. ఆ ఏడాది ఐసీసీ ట్రోఫీ రన్నరప్‌గా కప్ బెర్తు దక్కించుకుంది. మూడు వరుస ఓటములతో లీగ్ దశలోనే బయటికెళ్లిపోయింది. మళ్లీ 2003లో అసోసియేట్ సభ్య దేశ హోదాలో ప్రవేశించడంతో పాటు బంగ్లాదేశ్‌పై 60 పరుగుల తేడాతో విజయాన్నీ సాధించింది. 2007లో మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడింది. భారత్‌లో జరిగిన 2011 కప్‌లో కెన్యాపై 5 వికెట్లతో గెలిచింది. 2015లో అర్హత పొందలేకపోయింది. కెన్యా ప్రపంచ కప్‌లో కొంత చెప్పుకోదగ్గ చరిత్రే కెన్యాది. 1975లో పాల్గొన్న తూర్పు ఆఫ్రికా జట్టులో ఈ దేశ ఆటగాళ్లున్నారు. ఆ తర్వాత తొలిసారిగా సొంత జట్టుతో 1996 కప్‌లో పాల్గొని వెస్టిండీస్‌పై 73 పరుగులతో గెలిచి సంచలనం సృష్టించింది. 1999లో ఐదుకు ఐదు మ్యాచ్‌ల్లో ఓడింది. 2003లో సహ ఆతిథ్యంలో కెనడా, శ్రీలంక, బంగ్లాదేశ్‌లపై నెగ్గింది. న్యూజిలాండ్ వాకోవర్ ఇచ్చింది. సూపర్ సిక్స్‌లో జింబాబ్వేను ఓడించి సెమీస్‌కు వెళ్లింది. భారత్ చేతిలో 91 పరుగులతో ఓడినా సంతృప్తిగా టోర్నీని ముగించింది. 2007లో కెనడాపై నెగ్గినా, 2011లో పరాజయం పాలైంది. 2015, 2019లో అర్హత సాధించలేదు. యూఏఈ 1987 వరకు ఐసీసీలో సభ్యదేశం కాదు. 1996లో మొదటిసారి పాల్గొంది. ఐసీసీ సభ్య దేశాల మధ్య జరిగిన తొలి ప్రపంచ కప్ మ్యాచ్‌గా రికార్డులకెక్కిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై 7 వికెట్లతో గెలిచింది. 2011 వరకు క్వాలిఫై కాలేదు. 2015లో గ్రూప్ దశలో ఆరు మ్యాచ్‌లూ ఓడింది. నెదర్లాండ్స్ 1996లో అరంగేట్రం చేసింది. 1999లో విఫలమైనా తర్వాత మూడు కప్‌లకూ అర్హత సాధించింది. 2003లో నమీబియాపై, 2007లో స్కాట్లాండ్పై విజయాలు సాధించింది. 2011లోనూ పాల్గొన్నా రిక్తహస్తాలతో వెనుదిరిగింది. మళ్లీ కప్‌లో కనిపించలేదు. నమీబియా ఒకే ఒక్కసారి (2003లో) ప్రాతినిధ్యం వహిం చింది. ఆరు మ్యాచ్‌ల్లోనూ ఓడింది. ఈ టోర్నీలో సచిన్ (152) సహాయంతో భారత్ 181 పరుగుల తేడాతో నమీబియాను ఓడించగా.. గ్లెన్మెక్గ్రాత్ వన్డేల్లో తన అత్యుత్తమ ప్రదర్శన (7/15) నమీబియా పైనే నమోదు చేశాడు. జాన్బెరీ బర్గర్ నమీబియా తరఫున అర్ధ సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. స్కాట్లాండ్ క్వాలిఫై రౌండ్లు జరిగిన సందర్భంగా ఐసీసీ సభ్య దేశం కాకపోవడంతో 1996 కప్‌లో ఆడలేకపోయింది. ఒక దఫా తప్పించి మరో దఫా అన్నట్లు 1999, 2007, 2015 కప్‌లకు అర్హత పొందింది. 14 మ్యాచ్‌లు ఆడినా ఒక్కటీ గెలవలేకపోయింది. ఈ సారి అర్హత సాధించలేదు. బెర్ముడా 2007లో మాత్రమే కనిపించింది. మళ్లీ ప్రపంచ కప్ ఆడే అవకాశం దక్కలేదు. ఈ టోర్నీలో ఆడిన మూడు మ్యాచుల్లో ఓడింది. భారత్ తొలిసారి వన్డేల్లో 400 పరుగులు దాటింది బెర్ముడాపైనే. ఈ మ్యాచ్‌లో ఉతప్ప ఇచ్చిన క్యాచ్‌ను బెర్ముడా ఆటగాడు లెవెరాక్ స్లిప్‌లో అద్భుతంగా అందుకున్న తీరు అందరికీ గుర్తుండిపోయింది. -
ఆ కప్పు ... ఓ కను విప్పు
జట్టులో నలుగురు దిగ్గజాలు...తోడుగా ఊపుమీదున్న కుర్రాళ్లు...రన్నరప్ హోదాతో బరిలోకి... హాట్ ఫేవరెట్‌గా పరిగణన......ఇదీ 2007 వన్డే ప్రపంచ కప్‌నకు ముందు టీమిండియాపై అంచనాలు. కప్ వచ్చి ఒళ్లో వాలడమే మిగిలిందన్నంత ఊహాగానాలు. కానీ, జరిగింది పూర్తిగా భిన్నం. కలలోనూ అనుకోని విధంగా పరాభవం. విదేశీ గడ్డపై ఆటగాళ్లంతా ఖిన్నులవగా, స్వదేశంలో అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మొత్తానికి నాటి ప్రపంచ కప్ భారత క్రికెట్ చరిత్రలో ఓ చేదు జ్ఞాపకం. పొరపాటుగానైనా మరచిపోలేని గుణపాఠం. ఇంతకూ నాడేం జరిగిందంటే...? సాక్షి క్రీడా విభాగం అందానికి, ఆస్వాదించడానికి వెస్టిండీస్ దీవులు ఎంతటి పేరుగాంచాయో... అక్కడ జరిగిన ఏకైక ప్రపంచ కప్ భారత్‌కు అంతటి పీడకలను మిగిల్చింది. టైటిల్ కొట్టేస్తారన్నంత జోరులో ఆ దేశం వెళ్లిన రాహుల్ ద్రవిడ్ బృందం... అప్పటి పసి కూన బంగ్లాదేశ్ చేతిలో తొలి మ్యాచ్‌లో అనూహ్య ఓటమితో ఒక్కసారిగా ఆత్మరక్షణలో పడిపోయింది. అనామక బెర్ముడాపై భారీ విజయంతో ఆశలు రేపినా, కీలక సమయంలో శ్రీలంక చేతిలో ఓడి తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. దీంతో ఓ పెద్ద సౌధం కళ్లముందే కుప్పకూలినట్లైంది. లంకపై పరాజయం ఖాయమవుతుండగా డగౌట్లో కెప్టెన్ ద్రవిడ్ హావభావాలు మారిపోసాగాయి. ఆటగాళ్లంతా ఏడుపు ఒక్కటే తక్కువన్నట్లు కనిపించారు. ఫలితం తేలాక ద్రవిడ్ ముఖం రక్తపు చుక్క కూడా లేనట్లయింది. ఇక పెద్దఎత్తున విమర్శలు, ఆగ్రహావేశాలు సరేసరి. అయితే, ఈ దారుణ పరాజయం... దేశంలో క్రికెట్ వ్యవస్థ గాడిన పడేలా మేల్కొలొపి మనకు ఓ విధంగా మేలే చేసింది. ఈ జట్టు ఎలా ఓడింది? టాపార్డర్‌లో గంగూలీ, ఉతప్ప, సెహ్వాగ్, మిడిలార్డర్లో సచిన్, ద్రవిడ్, ఆ తర్వాత యువరాజ్, ధోని, బౌలింగ్‌లో పేసర్లు జహీర్ ఖాన్, అగార్కర్, స్పిన్నర్లు హర్భజన్, కుంబ్లే. ఇలాంటి కూర్పున్న జట్టు తడబడుతుందని ఎవరూ ఊహించి ఉండరు. ఓడుతుందని అసలే భావించరు. అలసత్వం, ఏమరపాటు, నిర్లిప్తత ఏదైనా కానీ, గ్రూప్ ‘బి’లో బంగ్లాతో తొలి మ్యాచ్‌లోనే దెబ్బ పడింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 49.3 ఓవర్లలో 191 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ గంగూలీ (129 బంతుల్లో 66; 4 ఫోర్లు) నింపాదిగా ఆడగా, యువరాజ్ (58 బంతుల్లో 47; 3 ఫోర్లు, 1 సిక్స్) నయమనిపించాడు. మష్రఫె మొర్తజా (4/38), అబ్దుర్ రజాక్ (3/38), మొహమ్మద్ రఫీఖ్ (3/35) ధాటికి ఉతప్ప (9), సచిన్ (7), సెహ్వాగ్ (2), ద్రవిడ్ (14) ధోని (0) విఫలమయ్యారు. బంగ్లాను బౌలింగ్‌తో కట్టిపడేయొచ్చనుకుంటే.. అదీ వీలు కాలేదు. ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ (53 బంతుల్లో 51; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుకు ముష్ఫికర్ రహీమ్ (107 బంతుల్లో 56 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), షకిబుల్ హసన్ (86 బంతుల్లో 53; 5 ఫోర్లు, సిక్స్) అర్ధసెంచరీలు తోడవడంతో బంగ్లా 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 9 బంతులుండగానే గెలిచేసింది. స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో తేలికైన రెండు, క్లిష్టమైన రెండు క్యాచ్‌లు జారవిడవడం భారత్‌కు ప్రతికూలంగా మారింది. బెర్ముడాను బెంబేలెత్తించినా... బంగ్లా దెబ్బతో నెట్ రన్‌రేట్‌ను మెరుగుపర్చుకుంటూ ప్రత్యర్థులపై గెలవాల్సిన స్థితిలో బెర్ముడాపై భారత్ జూలు విదిల్చింది. టాస్ గెలిచిన బెర్ముడా బౌలింగ్ ఎంచుకోవడమూ మనకు కలిసొచ్చింది. గంగూలీ (114 బంతుల్లో 89; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) గట్టి పునాది వేయగా సెహ్వాగ్ (87 బంతుల్లో 114; 17 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీతో శివమెత్తాడు. యువరాజ్ (46 బంతుల్లో 83; 3 ఫోర్లు, 7 సిక్స్‌లు), సచిన్ (29 బంతుల్లో 57 నాటౌట్, 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) కదంతొక్కారు. దీంతో భారత్ ఐదు వికెట్లకు 413 పరుగుల భారీ స్కోరు చేసింది. మన జట్టు వన్డేల్లో 400 పైగా పరుగులు చేయడం ఇదే తొలిసారి. బెర్ముడా 43.1 ఓవర్లలో 156కే పరిమితమైంది. 257 పరుగుల భారీ విజయం భారత్ సొంతమైంది. లంక దెబ్బకొట్టింది గెలిస్తేనే సూపర్ 8 దశకు వెళ్లే స్థితిలో గ్రూప్‌లో చివరిదైన మూడో మ్యాచ్‌లో టీమిండియాకు శ్రీలంక ఝలక్ ఇచ్చింది. టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. తరంగా (90 బంతుల్లో 64; 6 ఫోర్లు), చమర సిల్వ (68 బంతుల్లో 59; 5 ఫోర్లు) అర్ధసెంచరీలు చేయగా, దిల్షాన్ (38), ఆర్నాల్డ్ (19), వాస్ (19) మెరుపులతో లంక నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. మోస్తరు లక్ష్యమే అయినా భారత్ ఛేదించలేకపోయింది. ఓపెనర్లు ఉతప్ప (18), గంగూలీ(7) విఫలమవగా సచిన్ (0), ధోని (0) ఖాతా తెరవలేకపోయారు. సెహ్వాగ్ (46 బంతుల్లో 48; 5 ఫోర్లు, సిక్స్), కెప్టెన్ ద్రవిడ్ (82 బంతుల్లో 60; 6 ఫోర్లు) పోరాటం సరిపోలేదు. యువరాజ్ (6) రనౌట్ అవకాశాలను దెబ్బతీసింది. దీంతో 43.3 ఓవర్లలో 185 పరుగులకే ఆలౌటైంది. 69 పరుగుల తేడాతో ఓడి ఇంటిముఖం పట్టింది. పాక్‌కూ తప్పలేదు ఇదే టోర్నీ గ్రూప్ ‘డి’లో ఆతిథ్య వెస్టిండీస్, ఐర్లాండ్ చేతిలో ఓడిన దాయాది పాకిస్తాన్ కూడా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఐర్లాండ్‌పై ఓటమి అనంతరం ఆ జట్టు కోచ్ బాబ్ వూమర్ అనుమానాస్పద మరణం తీవ్ర వివాదాస్పదమైంది. ఈ దెబ్బకు ఫార్మాటే మారింది 16 జట్లు 4 గ్రూప్‌లుగా లీగ్ దశలో తలపడిన 2007 కప్ పేలవంగా సాగిన తీరుతో తదుపరి ప్రపంచ కప్ ఫార్మాటే మారిపోయింది. భారత్ ఆతిథ్యమిచ్చిన 2011 కప్‌లో 14 జట్లను ఏడు చొప్పున రెండు గ్రూప్‌లుగా విభజించి ఆడించారు. పెద్ద జట్లు దురదృష్టవశాత్తు ఒక మ్యాచ్‌లో ఓడినా వాటి అవకాశాలు దెబ్బతినకుండా ఉండేలా ఈ ఏర్పాటు చేశారు. ►అగ్రశ్రేణి జట్లయిన భారత్, పాక్ లేకపోవడంతో మొత్తం టోర్నీనే కళ తప్పింది. భారీ నష్టాలతో ప్రసారకర్తలు లబోదిబోమన్నారు. దీంతోపాటు ప్రపంచ కప్ ప్రారంభ తేదీ (మార్చి 11) నాటికి సైతం మైదానాలు సిద్ధం కాకపోవడం, టిక్కెట్ల ధరలు భారీగా ఉండటం ఇలా పలు అంశాలు విండీస్ బోర్డు వైఫల్యాన్ని ఎత్తిచూపాయి. ఇక శ్రీలంక– ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ ప్రహసనంగా మారి కప్‌కే అప్రతిష్ఠ తెచ్చిపెట్టింది. వర్షం అడ్డంకితో 38 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో గిల్‌క్రిస్ట్ (146) సునామీ ఇన్నింగ్స్‌తో ఆసీస్ 281 పరుగులు చేసింది. లంక ఇన్నింగ్స్ సందర్భంగా మళ్లీ వర్షం కురవడంతో లక్ష్యాన్ని 36 ఓవర్లలో 269గా మార్చారు. 33వ ఓవర్ ముగిసేసరికి లంక ఈ లక్ష్యానికి 63 పరుగుల దూరంలో ఉంది. అయితే, వెలుతురు లేదంటూ అంపైర్లు మ్యాచ్ నిలిపివేశారు. ఈలోగా ఆసీస్ ఆటగాళ్లు విజయ సంబరాలు మొదలుపెట్టేశారు. అంతరాయం వర్షం కారణంగా తలెత్తలేదు కాబట్టి మిగిలిన మూడు ఓవర్లను తర్వాతి రోజు ఆడిస్తామని అంపైర్లు పేర్కొన్నారు. లంక కెప్టెన్ జయవర్ధనే మాత్రం ఆ అవసరం లేదని అప్పుడే ఆడేస్తామని చెప్పాడు. ఆసీస్ కెప్టెన్ పాంటింగ్... స్పిన్నర్లతో బౌలింగ్‌కు అంగీకరించాడు. పూర్తి చీకటిలో సాగిన ఈ మూడు ఓవర్లలో లంక 9 పరుగులే చేసింది. 53 పరుగులతో ఆసీస్ గెలిచింది. -
కప్పులు 11... విజేతలు ఐదే!
‘ప్రపంచ’ విజేత... ఈ మాట వింటుంటేనే మహా గొప్పగా అనిపిస్తుంది. ఇక అదే పేరుతో పిలుస్తుంటే ఇంకెంత ఘనంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆడేవి 10 దేశాలపైనే అయినా క్రికెట్లో ఇలాంటి ఖ్యాతి దక్కిన దేశాలు ఐదే. మిగతా వాటిలో మూడు మినహా మరే జట్టుకూ కప్‌ను అందుకునేంత స్థాయి లేదనేది వాస్తవం. అయితే, కప్ నెగ్గిన ఐదింటిలోనూ ఒక్క జట్టుది ఏకఛత్రాధిపత్యం. రెండు దేశాలు ఓ పదేళ్లు ట్రోఫీని తమ దగ్గర ఉంచుకున్నాయి. మిగతా వాటిలో ఓ జట్టు నాలుగేళ్లు సంపూర్తిగా, మరోటి సాంకేతికంగా తక్కువ వ్యవధితో జగజ్జేతగా ఉన్నాయి. అసలు ఏ జట్టు ఎంత కాలం కప్‌ను అట్టిపెట్టుకున్నాయో ఓసారి చూస్తే... తొలినాళ్లలో వెస్టిండీస్, ఆ తర్వాత ఆస్ట్రేలియా ‘ప్రపంచ కప్ విజేత’ హోదాకు పర్యాయపదంగా నిలిచాయి. ఈ రెండు జట్లు అంతగా తమ ముద్ర చాటాయి. 44 ఏళ్ల టోర్నీ చరిత్రలో ఆసీస్ ఏకంగా 20 ఏళ్లు (వరుసగా 12 ఏళ్లు), వెస్టిండీస్ వరుసగా ఎనిమిదేళ్లు వరల్డ్ చాంపియన్లుగా పిలిపించుకున్నాయి. భారత్ రెండు వేర్వేరు దఫాల్లో, పాకిస్తాన్ ఒకసారి జగజ్జేతగా ఉన్నాయి. శ్రీలంక అతి తక్కువగా మూడేళ్ల మూడు నెలల కాలం పాటు మాత్రమే హోదాను అనుభవించింది. ఇందులో మరో ప్రత్యేకతేమంటే... ఇద్దరు కెప్టెన్లు క్లైవ్ లాయిడ్ (వెస్టిండీస్), రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) తమ జట్లను రెండుసార్లు విజేతలుగా నిలిపి, మరోసారి విఫలమయ్యారు. ఆసీస్‌దే అగ్రాధిపత్యం అలెన్ బోర్డర్ సారథ్యంలో తొలిసారి 1987లో చాంపియన్ అయిన తర్వాత ఆస్ట్రేలియా ఆటతీరు అంతకంతకూ రాటుదేలుతూ పోయింది. మొదటిసారి నిర్ణీత 4 ఏళ్ల వ్యవధి కంటే నాలుగు నెలలుగా అధికంగా జగజ్జేత హోదాలో కొనసాగిన ఆసీస్... ఆ తర్వాత ఏడేళ్లు దానికి దూరమైంది. 1999 నుంచి మాత్రం మరే జట్టుకూ అవకాశం ఇవ్వకుండా పుష్కర కాలం రాజ్యమేలింది. ఈ క్రమంలో వరుస గా ఆసియా దేశాలు పాక్, భారత్, లంకలను ఓడిస్తూ, వెస్టిండీస్‌కు త్రుటిలో చేజారిన ‘కప్‌ల హ్యాట్రిక్’నూ కొట్టేసింది. మధ్యలో (2011–15) నాలుగేళ్లు విరామం వచ్చినా, తర్వాత సొంతం చేసుకుంది. 1992లో సొంతగడ్డపై జరిగిన ప్రపంచ కప్‌లో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా లీగ్ దశలోనే వెనుది రిగింది. అయితే 2015లో రెండోసారి ఆతిథ్యంలో క్లార్క్ నాయకత్వంలో ఆస్ట్రేలియా ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. భారత్ తర్వాత స్వదేశంలో వరల్డ్ కప్ నెగ్గిన రెండో జట్టుగా ఆసీస్ నిలిచింది. ఓవరాల్‌గా 20 ఏళ్లు ప్రపంచ కప్ కంగారూ దేశం వద్దే ఉంది. భారత్ 28 ఏళ్ల తర్వాత సంచలనాత్మక రీతిలో అది కూడా విదేశంలో 1983లో కప్ గెలిచిన టీమిండియా... కపిల్ నాయకత్వంలో 1987లో, అజహరుద్దీన్ కెప్టెన్సీలో 1996లలో ఆతిథ్య సానుకూలతలోనూ దానిని నిలబెట్టుకోలేకపోయింది. అనంతరం 28 ఏళ్ల సుదీర్ఘ కాలం నిరీక్షించింది. 2011లో ధోని సారథ్యంలో కోరిక మరోసారి నెరవేరింది. అయితే 2015లో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమితో మన చాంపియన్ హోదాకు తెరపడింది. 32 ఏళ్ల (1983–2015) వ్యవధిలో వరల్డ్ కప్ కిరీటం భారత్ వద్ద ఎనిమిదేళ్లు ఉంది. పాక్... అప్పుడెప్పుడో! రౌండ్ రాబిన్ ఫార్మాట్‌కు చివరిదైన 1992 కప్‌ను గెల్చుకున్నది పాకిస్తాన్. మళ్లీ ఇప్పటివరకు అందుకోలేకపోయింది. సహ ఆతిథ్యంతో పాటు డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలో దిగి 1996లో సెమీస్‌కూ చేరలేకపోయింది. 1999లో ఫైనల్‌కు వెళ్లినా ఆస్ట్రేలియాకు తేలిగ్గా తలొంచింది. 2011లో భారత్, బంగ్లాదేశ్, శ్రీలంక ఆతిథ్యంలో నిర్వహించిన కప్‌లో సెమీస్‌కు రావడం తప్ప 2003, 2007, 2015లలో దారుణ ప్రదర్శనే. పాక్ కప్ విజేత హోదాకు దూరమై 23 ఏళ్లు అవుతోంది. లంక... అతి తక్కువ కాలం అంచనాలకు అందకుండా అదరగొట్టి 1996లో తొలిసారిగా కప్ నెగ్గింది శ్రీలంక. దీంతో ట్రోఫీ వరుసగా తొమ్మిదేళ్లు (1992–99) ఆసియా దేశాల వద్దే ఉన్నట్లైంది. అయితే, 1999, 2003లలో పేలవ ప్రదర్శనతో లంక స్థాయి పడిపోయింది. అనూహ్యంగా పుంజుకొని 2007, 2011లో వరుసగా ఫైనల్‌కు చేరినా చాంపియన్ కాలేకపోయింది. విశేషమేమంటే... ‘ప్రపంచ చాంపియన్’ హోదాలో అతి తక్కువ కాలం (3 ఏళ్ల 3 నెలలు) ఉన్న జట్టు లంకే. ఆ స్థాయి కోల్పోయి కూడా 20 ఏళ్లవుతోంది. ఆ ఎనిమిదేళ్లు కరిభీకరం 1975–1983 మధ్య జరిగిన మూడు కప్‌లూ వెస్టిండీస్ ఆధిపత్యానికి ప్రతిరూపం అన్నట్లు సాగాయి. లాయిడ్ సారథ్యంలో 1975 జూన్ 21 నుంచి 1983 జూన్ 25 వరకు ఎనిమిదేళ్ల పాటు చాంపియన్ హోదాను అనుభవించిన వెస్టిండీస్... మూడో సారీ అతడి కెప్టెన్సీలోనే గెలిచే ఊపులో కనిపించింది. కానీ, కపిల్ నేతృత్వంలోని టీమిండియా దెబ్బకొట్టాక మరి కోలుకోలేకపోయింది. సరికదా, అప్పటి నుంచి ఏనాడూ ఫేవరెట్‌గా బరిలో దిగలేదు. కనీసం సంచలనాలు సృష్టించే అండర్ డాగ్గానూ కనిపించలేదు. 1996లో మినహా, స్వదేశంలో జరిగిన 2007 కప్‌లోనూ సెమీ ఫైనల్‌కు చేరలేకపోయింది. మొత్తానికి విండీస్ వన్డే ఫార్మాట్లో ప్రపంచ విజేత స్థాయికి దూరమై 36 ఏళ్లయింది. ఇంకెన్నాళ్లో నిరీక్షణ! క్రికెట్‌తో పాటు ప్రపంచ కప్ పుట్టిల్లు ఇంగ్లండ్. నాలుగుసార్లు ఆతిథ్యం (1975, 79, 83, 99), మూడుసార్లు (1979, 87, 92) ఫైనల్‌కు వెళ్లినా ఆ దేశ జట్టుకు మాత్రం కప్ అందని ద్రాక్షే. ప్రస్తుతం మినహా... ఇంగ్లిష్ బృందం కప్‌నకు ప్రధాన పోటీదారుగా ఉన్న సందర్భాలు తక్కువే. ప్రపంచ కప్‌లకు దురదృష్టాన్ని నెత్తిన పెట్టుకెళ్లే జట్టు దృక్షిణాఫ్రికా. 1992 నుంచి పెద్ద జట్టుగా, కప్ గెలిచే జట్టుగా బరిలో దిగుతున్నా ఒక్కసారీ దగ్గరకు రాలేకపోయింది. ప్రకృతితో పాటు స్వయంకృతాపరాధాలు సఫారీలను దెబ్బతీశాయి. కివీస్‌ను ‘సెమీస్ జట్టు’ అనడం సముచితం. ఇప్పటివరకు ఏకంగా 6 సార్లు (1975, 79, 92, 99, 2007, 2011) సెమీస్ చేరింది న్యూజిలాండ్. సహ ఆతిథ్యంలో 2015లో తొలిసారి ఫైనల్‌కు వెళ్లింది. కానీ, అంత పెద్ద టోర్నీ తుది సమరంలో తడబడి ఆస్ట్రేలియాకు కప్‌ను చేజార్చుకుంది. కప్పు కప్పుకో పేరు ఇప్పుడంటే ‘ఐసీసీ ప్రపంచ కప్’గా పిలుస్తున్నారు కానీ, 1996 వరకు ఈ కప్‌కు ముందు ఒక్కో పేరు ఉండేది. ఆతిథ్యం ఇస్తున్న దేశాల్లోని బడా కంపెనీలు స్పాన్సర్షిప్ చేస్తూ... పనిలో పనిగా ప్రచారానికీ కలిసొచ్చేలా తమ సంస్థల పేర్లు తగిలించి ట్రోఫీలనూ రూపొందించేవి. ఇంగ్లండ్ ఆతిథ్యమిచ్చిన 1975, 1979, 1983 టోర్నీలను ఆ దేశంలో ఆర్థిక సేవలు–జీవిత బీమా రంగంలో ప్రఖ్యాతిగాంచిన ప్రుడెన్షియల్ సంస్థ ప్రాయోజితం చేసింది. దీంతో తొలి మూడు కప్‌లను ‘ప్రుడెన్షియల్ కప్’లుగా వ్యవహరిం చారు. అనంతరం భారత్ వేదికగా జరిగిన 1987లో కప్‌కు రిలయన్స్ సంస్థ స్పాన్సర్‌గా వ్యవహరించింది. ప్రపంచ కప్‌తో రిలయన్స్ ఒక్కసారిగా పేరు ప్రఖ్యాతులు పోగేసుకుంది. ఆస్ట్రేలియా ఆతిథ్యమిచ్చిన 1992 కప్‌ను ‘బెన్సన్ అండ్ హెడ్జెస్ వరల్డ్ కప్’గా, భారత్ వేదికైన 1996 కప్‌ను ‘విల్స్ వరల్డ్ కప్’గా పిలిచారు. విల్స్... ఇండియా టొబాకో కంపెనీ లిమిటెడ్ (ఐటీసీ) సంస్థకు చెందిన ఓ బ్రాండ్. అయితే, టోర్నీని తాము నిర్వహిస్తూ, వేరేవరి పేరుకో ప్రాచుర్యం కల్పించడం ఎందుకని భావించి 1999 నుంచి ఐసీసీ మేల్కొంది. అప్పటి నుంచి ఎంత పెద్ద స్పాన్సర్ ఉన్నా... పేరు మాత్రం ‘ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్’గానే స్థిరపడింది. అదేవిధంగా 99లోనే ప్రత్యేకంగా రూపొందించిన ట్రోఫీనే ఇప్పుడు కొనసాగుతోంది. –సాక్షి క్రీడా విభాగం -
వరల్డ్ కప్ : భారత్ ‘తీన్’మార్ మోగిస్తుందా?
మొన్నటివరకు సంప్రదాయ టెస్టుల సొగసును చవిచూశాం నిన్నటివరకు ధనాధన్ టి20ల మజాను ఆస్వాదించాం ఇప్పుడిక... రెండింటి వారధి వన్డేలను ఆహ్వానిద్దాం క్రికెట్ పుట్టింట్లో ప్రపంచ కప్‌ను చూసొద్దాం...! 10 జట్లు పాల్గొనే 46 రోజుల మహా సంగ్రామంలో ఈ తరానికి కొత్తనిపించే రౌండ్ రాబిన్ ఫార్మాట్లో ప్రతి ప్రత్యర్థితో ఒకసారైనా తలపడే సుదీర్ఘ పద్ధతిలో మహా సంగ్రామాన్ని కనులారా వీక్షిద్దాం...! వేడివేడి వార్తలు వండే ఇంగ్లిష్ మీడియా మనసు దోచే అందమైన మైదానాలు వసతులకు లోటు లేని ఆతిథ్యం మధ్య క్రికెట్ పెద్ద పండుగను జరుపుకొందాం...! ఆస్ట్రేలియా ‘ఆరే’స్తుందా? భారత్‘తీన్’మార్ మోగిస్తుందా? పాకిస్తాన్, శ్రీలంక మళ్లీ కప్పందుకుంటాయా? వెస్టిండీస్ నాటి వైభవాన్ని చాటుతుందా? దక్షిణాఫ్రికా దురదృష్టం ఇప్పుడైనా వీడుతుందా? ఇంగ్లండ్ చిరకాల కోరిక నెరవేరుతుందా? న్యూజిలాండ్ ఎంతవరకు నెగ్గుకొస్తుంది? బంగ్లాదేశ్ ఎవరిని దెబ్బకొడుతుంది? అఫ్గానిస్తాన్ పయనం ఎందాక? ఒక్కో జట్టు భాగ్య చక్రం ఎలా ఉంది? వాటి బలాలేంటి? బలహీనతలేంటి? ఎవరెవరికి ఎలాంటి అడ్డంకులున్నాయి? ఆఖరికి విఖ్యాత లార్డ్స్‌లో విజేతగా నిలిచేదెవరు? ... ప్రపంచ కప్ ప్రత్యేక కథనాలు నేటి నుంచి కప్‌లలో ఈ ‘కప్పు’ వేరయా! ఆడేది తక్కువ దేశాలైనా... ఆదరణలో ఒలిం పిక్స్, ఫుట్బాల్లకు ఏమాత్రం తగ్గనిది క్రికెట్ వన్డే ప్రపంచ కప్. అభిమానులంతా ఎదురుచూస్తున్న అలాంటి మెగా టోర్నీకి దాని జన్మస్థానమైన ఇంగ్లండ్‌లో ఈ నెల 30న తెరలేవనుంది. జూలై 14 వరకు 46 రోజుల పాటు సాగే క్రీడా సంబరంలో 10 జట్లు పాల్గొననున్నాయి. గతంలో ఇంగ్లండ్ 1975, 1979, 1983, 1999లలో వన్డే వరల్డ్ కప్‌కు ఆతిథ్యమిచ్చింది. సరిగ్గా 20 ఏళ్ల తర్వాత మరోసారి వేదికగా మారింది. ఫార్మాట్ మారింది గురూ... 44 ఏళ్ల ప్రస్థానంలో 1975–1987 మధ్య జరిగిన నాలుగు కప్‌లలో జట్లను ‘గ్రూప్’లుగా విభజించి మ్యాచ్‌లు నిర్వహించారు. 1992లో మాత్రం రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతి పాటించారు. మళ్లీ 1996 నుంచి 2015 వరకు ఆరు కప్‌లలో గ్రూప్ ఫార్ములాకే మొగ్గారు. అనేక చిన్న జట్లకూ అవకాశం కల్పించారు. ఈసారి మాత్రం రాశి తక్కువైనా, వాసి పెంచాలనే ఉద్దేశంతో పోటీని 10 జట్లకే పరిమితం చేశారు. 1992 నాటి రౌండ్ రాబిన్ ఫార్మాట్ తీసుకొచ్చారు. ఫలితంగా ప్రతి జట్టు 9 మ్యాచ్‌లు చొప్పున ఆడాల్సి ఉంటుంది. పాయింట్ల పట్టికలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. ఈసారి వంద కోట్లపైనే వీక్షకులు పుట్టింది ఇంగ్లండ్‌లో అయినా ఇప్పుడు క్రికెట్ అంటే భారత్. భారత్ అంటే క్రికెట్. బీసీసీఐని ప్రపంచంలోనే ధనిక బోర్డును చేసిన మన ప్రేక్షకులు... వీక్షణలోనూ రికార్డులు బద్దలుకొడుతున్నారు. 2015 వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా ఆడిన సెమీఫైనల్ వరకు పరిగణనలోకి తీసుకుంటే ప్రసారకర్త స్టార్ స్పోర్ట్స్ లెక్కల ప్రకారం 63.50 కోట్ల మంది భారతీయులు టీవీల్లో వీక్షించారు. ఈసారి వంద కోట్ల మార్కును తాకుతుందని అంచనా. ఆ రెండుసార్లు ముందుగానే! ఆదరణ, ఆకర్షణ తగ్గకూడదనే ఉద్దేశంతో సాధారణంగా ప్రపంచ స్థాయి ఈవెంట్లు ఏవైనా నాలుగేళ్లకోసారి నిర్వహిస్తుంటారు. ఇందుకు క్రికెట్ కూడా మినహాయింపేం కాదు. అయితే, రెండుసార్లు మాత్రం ప్రపంచ కప్ ‘వ్యవధి’ మారింది. ఈ రెండూ ఒకే దశాబ్దంలో జరగడం మరో విశేషం. సంవత్సరాల వారీగా చూసినా, తేదీల ప్రకారం లెక్కించినా తొలి నాలుగు కప్‌లు (1975, 79, 83, 87) నాలుగేళ్ల నిబంధన ప్రకారమే నడిచాయి. కానీ, ఆస్ట్రేలియా ఆతిథ్యమిచ్చిన 1992 కప్, ఇంగ్లండ్ చివరిసారిగా వేదికగా నిలిచిన 1999 కప్ షెడ్యూల్ తప్పాయి. ఎందుకంటే...? భారత్.. పాకిస్తాన్‌తో కలిసి తొలిసారిగా 1987లో ప్రపంచ సమరానికి ఆతిథ్యమిచ్చింది. ఆ ఏడాది అక్టోబర్ 8 నుంచి నవంబర్ 8 మధ్య టోర్నీ జరిగింది. ఆస్ట్రేలియా మొదటిసారి విజేతగా నిలిచిందీ ఇప్పుడే. అనంతరం ఆ దేశం న్యూజిలాండ్‌తో కలిసి కప్ నిర్వహించింది. ఏడాది ప్రకారం చూస్తే 1991 అక్టోబరు– నవంబరు మధ్యనే కప్ జరగాలి. కానీ, ఈ సమయంలో తమ దేశాల్లో వాతావరణం క్రికెట్‌కు అనుకూలం కాదని చెప్పాయి. దీంతో ఐసీసీ ఈవెంట్‌ను 1992 ఫిబ్రవరి 22 నుంచి మార్చి 25 మధ్య ఏర్పాటు చేసింది. అంటే, నిర్ణీత గడువు కంటే అదనంగా నాలుగు నెలల కాలం పొడిగించారు. దేశమేదైనా... ప్రతి నాలుగో వేసవి కాలంలో కప్ నిర్వహణ జరగాలనే సంప్రదాయాన్నీ దీనికి కారణంగా చూపుతారు. ఇక రెండోసారి 1999లో అనుకున్న దానికంటే ముందుగానే ప్రపంచ కప్ జరిగింది. 1996లో భారత్ ఫిబ్రవరి14–మార్చి 17 మధ్య ఆతిథ్యం ఇచ్చిన తర్వాత మరుసటి కప్ 2000లో జరగాలి. అయితే, 92లో పొడిగించిన సమయాన్ని కవర్ చేస్తూ 1999 మే 14–జూన్ 20 మధ్యనే నిర్వహించారు. ఈసారి మరీ తక్కువ కాలానికే (3 ఏళ్ల 3 నెలలు) కప్ ప్రేక్షకులను పలకరించింది. –సాక్షి క్రీడావిభాగం