హీరో.. విలన్‌.. గప్టిలే! | Life came full circle for Martin Guptill | Sakshi
Sakshi News home page

హీరో.. విలన్‌.. గప్టిలే!

Published Mon, Jul 15 2019 9:47 AM | Last Updated on Mon, Jul 15 2019 1:38 PM

Life came full circle for Martin Guptill - Sakshi

లండన్‌‌: మూడు రోజుల క్రితం జరిగిన సెమీఫైనల్‌ మ్యాచ్‌లో ఎంఎస్‌ ధోనీని రనౌట్‌ చేయడం ద్వారా పూర్తిగా మ్యాచ్‌ గతినే మార్చేశాడు కివీస్‌ ఆటగాడు మార్టిన్‌ గఫ్టిల్‌. ధోనీ క్రీజులో ఉన్నంతసేపూ మ్యాచ్‌ టీమిండియా గెలుస్తుందని అభిమానులు భావించారు. కానీ, మార్టిన్‌ గప్టిల్‌ విసిరిన బుల్లెట్‌ త్రోకు సీన్‌ అంతా మారిపోయింది. అతడి మెరుపు ఫీల్డింగ్‌కు ధోని రనౌట్‌గా వెనుదిరిగాడు. టీమిండియా ఓడిపోయింది. అయితే, ఇది ఇక్కడితో ముగియలేదు. సేమ్‌ సీన్‌ ఫైనల్‌ మ్యాచ్‌లోనూ పునరావృతమైంది. అదీ కూడా గఫ్టిల్‌కే. సెమీఫైనల్‌ మ్యాచ్‌లో రెండు పరుగు తీయబోయిన ధోనీ.. గఫ్టిల్‌ సూపర్‌ త్రోకు రన్నౌట్‌ అయ్యాడు. అదేవిధంగా ఫైనల్‌ మ్యాచ్‌లో సూపర్‌ ఓవర్‌ చివరి బంతికి రెండో పరుగు తీయబోయి గఫ్టిల్‌ రనౌట్‌గా వెనుదిరగడంతో విశ్వకప్‌ ఇంగ్లండ్‌ వశమైంది. ఆర్చర్‌ వేసిన సూపర్‌ ఓవర్‌ చివరి బంతిని బాదిన గఫ్టిల్‌ మొదటి పరుగును సురక్షితంగా పూర్తి చేశాడు. విజయం కోసం కావాల్సిన రెండో బంతి కోసం.. అతను ప్రయత్నించాడు. దీంతో ఫీల్డర్‌ నుంచి నేరుగా బంతిని అందుకున్న జోస్‌ బట్లర్‌ వికెట్లను గిరాటేశాడు. దీంతో గఫ్టిల్‌ రన్నౌట్‌ అయ్యాడు. ధోనీ రన్నౌట్‌ భారత్‌ ఫైనల్‌కు చేరకుండా అడ్డుకోగా.. గఫ్టిల్‌ రనౌట్‌ కివీస్‌ జట్టుకు వరల్డ్‌ కప్‌ను దూరం చేసింది. అంతేకాకుండా ఫైనల్‌ మ్యాచ్‌ చివరి ఓవర్‌లో అతను విసిరిన బంతి అనుకోకుండా స్టోక్స్‌ బ్యాటుకు తగిలి బౌండరీకి దూసుకుపోవడంతో ఇంగ్లండ్‌ జట్టుకు అదనంగా నాలుగు పరుగులు వచ్చాయి. ఇదీ కూడా ఇంగ్లండ్‌ విజయంలో కీలక పాత్ర పోషించింది.
(చదవండి: నమ్మశక్యం కానిరీతిలో.. మ్యాచ్‌లో కీలక మలుపు)

గప్టిల్‌ హీరో... విలన్‌...
న్యూజిలాండ్‌ను టోర్నీలో దెబ్బకొట్టింది ఓపెనింగ్‌ వైఫల్యమే. సీనియర్‌ మార్టిన్‌ గప్టిల్‌ ఏమాత్రం రాణించలేక విమర్శల పాలయ్యాడు. అయితే, సెమీఫైనల్లో టీమిండియా వెటరన్‌ ధోనిని అద్భుత త్రో ద్వారా రనౌట్‌ చేసి వాటికి కొంతవరకు సమాధానమిచ్చాడు. ఫైనల్లో మళ్లీ విమర్శల పాలయ్యే ప్రదర్శన చేశాడు. బ్యాటింగ్‌లో విఫలమైన అతడు... 50వ ఓవర్‌ నాలుగో బంతిని ఓవర్‌ త్రో చేసి ప్రత్యర్థికి నాలుగు పరుగులు సునాయాసంగా ఇచ్చాడు. ఇందులో గప్టిల్‌ పాత్ర పరోక్షమే అని, కివీస్‌ దురదృష్టమని అనుకుని సరిపెట్టుకున్నా... సూపర్‌ ఓవర్‌ చివరి బంతికి ప్రపంచ కప్‌ సాధించి పెట్టే రెండు పరుగులు చేయలేకపోయాడు. దీనిని తలుచుకునే ఏమో మ్యాచ్‌ అనంతరం గప్టిల్‌ కన్నీటి పర్యంతమయ్యాడు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement