ఆసీస్‌ సిక్సర్‌ కొడుతుందా? | Australia has chosen a strong team with the aim of winning the World Cup for the sixth time | Sakshi
Sakshi News home page

ఆసీస్‌ సిక్సర్‌ కొడుతుందా?

Published Sat, May 25 2019 2:58 AM | Last Updated on Sat, Jun 1 2019 6:42 PM

Australia has chosen a strong team with the aim of winning the World Cup for the sixth time - Sakshi

విశ్వ విజేతగా నిలిచిన తర్వాత గత నాలుగేళ్లలో ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టు అనేక ఒడిదుడుకులకు లోనైంది. అసలు కొంత కాలం పాటు వన్డేలకు ఎలాంటి జట్టును ఎంపిక చేయాలో కూడా అర్థం కానంత అనిశ్చితి, గందరగోళం నెలకొన్నాయి. చాంపియన్స్‌ ట్రోఫీ జరిగిన 2017 జూన్‌ నుంచి 2019 మార్చి వరకు కంగారూ టీమ్‌ 26 ఆడితే 4 మ్యాచ్‌లే గెలవగలిగింది! దీనికి తోడు ట్యాంపరింగ్‌ వివాదం కారణంగా వార్నర్, స్మిత్‌లపై ఏడాది నిషేధంతో టీమ్‌ సమతూకం పూర్తిగా దెబ్బ తింది.

అయితే భారత గడ్డపై వన్డే సిరీస్‌ విజయం వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. సరిగ్గా ప్రపంచ కప్‌కు ముందు పాకిస్తాన్‌ను క్లీన్‌స్వీప్‌ చేయడంతో జట్టులో కొత్త ఉత్సాహం వచ్చింది. ఇప్పుడు ఇదే జోరులో ఫించ్‌ సేన వరల్డ్‌ కప్‌ వేదికపై తమ బలం ప్రదర్శించేందుకు సిద్ధమైంది. టీమ్‌ బలంగానే కనిపిస్తున్నా ఎక్కువ మంది దానిని ప్రస్తుతానికి ఫేవరెట్‌గానైతే చూడటం లేదు. ప్రస్తుతం ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానంలో ఉన్న ఆసీస్‌ అంచనాలకు భిన్నంగా తమ అసలు సత్తాను ప్రదర్శించగలదా! 

బలాలు
సుదీర్ఘ కాలం పాటు క్రికెట్‌ ప్రపంచాన్ని శాసించిన ఆస్ట్రేలియా ఆరోసారి ప్రపంచ కప్‌ గెలిచే లక్ష్యంతో బలమైన జట్టునే ఎంపిక చేసింది. సరిగ్గా చెప్పాలంటే వారికి వన్డేలకు సరైన టీమ్‌ లభించింది. వార్నర్, ఫించ్‌ రూపంలో ఇద్దరు విధ్వంసకర ఓపెనర్లు జట్టులో ఉన్నారు. వీరు ఆరంభంలో చెలరేగితే ఆసీస్‌కు మంచి పునాది లభిస్తుంది. మ్యాక్స్‌వెల్, స్టొయినిస్‌ ఇదే ఊపును చివర్లో కొనసాగించగల సమర్థులు. వీరందరి మధ్య వారధిగా అసలైన వన్డే ఆటను ప్రదర్శించగల నైపుణ్యం స్టీవ్‌ స్మిత్‌ సొంతం.

పునరాగమనం తర్వాత వరుసగా మూడు వార్మప్‌ మ్యాచ్‌లలో మూడు అర్ధసెంచరీలు చేసిన అతను టచ్‌లోకి వచ్చినట్లే కనిపించాడు. తుది జట్టులో ఉంటే షాన్‌ మార్‌ష, ఖాజా కూడా పరిస్థితులకు తగినట్లుగా రాణించగలరు. బౌలింగ్‌లో స్టార్క్, కమిన్స్‌ ఎలాంటి ప్రత్యర్థులనైనా కుప్పకూల్చగలరు. ముఖ్యంగా ఇంగ్లండ్‌ పరిస్థితులు స్వింగ్‌కు కొంత అనుకూలించినా వీరికి తిరుగుండదు. ఈ వరల్డ్‌ కప్‌లో లెగ్‌ స్పిన్‌ ప్రభావం చూపిస్తుందని భావిస్తున్న నేపథ్యంలో ఆడమ్‌ జంపా కూడా ప్రభావం చూపించవచ్చు. 

అన్నింటికి మంచి ఒక మెగా ఈవెంట్‌లో ఎలా ఆడాలో, ఒత్తిడిని సమర్థంగా ఎలా ఎదుర్కోవాలో ఆస్ట్రేలియన్లకు తెలిసినట్లుగా మరే జట్టుకు తెలీదు. అప్పటి వరకు ఎలాంటి రికార్డు ఉన్నా... వరల్డ్‌ కప్‌కు వచ్చేసరికి ఈ మానసిక దృఢత్వం వల్లే వారు సవాల్‌ విసరగలరు. ఇదే కంగారూలను అందరికంటే ప్రత్యేకంగా నిలబెడుతుంది. పైగా ఇంగ్లండ్‌లో ఆడిన అనుభవం జట్టులో చాలా మందికి ఉండటం కూడా కలిసొచ్చే అంశం. మూడు వరల్డ్‌ కప్‌ విజయాలలో భాగమైన రికీ పాంటింగ్‌ సహాయక సిబ్బందిలో ఉండటం జట్టు వ్యూహాలపరంగా బలమైన అంశం.
 
బలహీనతలు
నిషేధం తర్వాత వార్నర్, స్మిత్‌ ఆడుతున్న తొలి టోర్నీ (ఐపీఎల్‌ను మినహాయిస్తే) ఇదే. సహజంగానే వారిపై కొంత ఒత్తిడి ఉంటుంది. అంతే కాకుండా ఇంగ్లండ్‌లో ప్రేక్షకుల నుంచి వెక్కిరింతలు, హేళనకు కూడా వారు సిద్ధం కావాల్సిందే. ఇలాంటి స్థితిలో వారు తమలోని 100 శాతం ఆటను ప్రదర్శించగలరా అనేది ప్రశ్నార్ధకం. ఐపీఎల్‌ కూడా ఆడని మ్యాక్స్‌వెల్‌ వన్డేలు ఆడి ఏడాది దాటింది. అతను ఒక్కసారిగా ఫామ్‌లోకి రాకపోతే కష్టం. బౌలింగ్‌లో స్టార్క్, కమిన్స్‌ కాకుండా ఇతర బౌలర్లకు అనుభవం చాలా తక్కువ. ఇది వరల్డ్‌ కప్‌లో వారిపై ఒత్తిడి పెంచవచ్చు.

రెండో స్పిన్నర్‌గా చోటు దక్కించుకున్న లయన్‌ వన్డే సామర్థ్యం అంతంత మాత్రమే. స్టార్క్‌ కూడా వరుస గాయాల కారణంగా ఏడాదిన్నరగా వన్డేలు ఆడలేదు. పైగా గత ప్రపంచ కప్‌లో ఆసీస్‌ గడ్డపై భారీ, బౌన్సీ మైదానాల్లో ఆసీస్‌ పేసర్లు షార్ట్‌ బంతులను సమర్థంగా ఉపయోగించి ఫలితం సాధించారు. ఇంగ్లండ్‌లోని చిన్న మైదానాల్లో బంతిని నియంత్రించడం అంత సులువు కాదు. ఇది బలహీనతగా మారితే స్టార్క్, కమిన్స్‌ భారీగా పరుగులు ఇచ్చే ప్రమాదముంది. స్పిన్‌ను సమర్థంగా ఆడలేని బలహీనత కూడా ఆసీస్‌ను దెబ్బ తీయవచ్చు. 

గత రికార్డు
వరల్డ్‌ కప్‌ చరిత్రలో మరే జట్టుకు లేని అద్భుతమైన రికార్డు ఆస్ట్రేలియా సొంతం. 11 సార్లు ప్రపంచకప్‌ జరిగితే ఏకంగా ఐదు సార్లు (1987, 1999, 2003, 2007, 2015) విశ్వ విజేతగా నిలిచింది. మరో రెండుసార్లు (1975, 1996) ఫైనల్లో పరాజయం పాలైంది. 1987 ప్రపంచ కప్‌కు ముందు కూడా వరుస పరాజయాలు, భారత గడ్డపై స్పిన్‌ను ఆడలేని బలహీనత వల్లే ఆసీస్‌ను ఎవరూ పట్టించుకోలేదు. కానీ చివరకు బోర్డర్‌ సేనదే విజయమైంది. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా... వాటిని అధిగమించగల సత్తా ఉన్న ఆస్ట్రేలియా మరోసారి అలాంటి అద్భుతం చేసినా ఆశ్చర్యం లేదు.  

స్పిన్‌తోనే గెలుపోటములు...
ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా స్పిన్‌ను ఎంత సమర్థంగా ఎదుర్కొంటుందో, జట్టు స్పిన్నర్లు ఎంత బాగా బౌలింగ్‌ చేస్తారో అనే దానిపైనే మా విజయావకాశాలు ఆధార పడి ఉన్నాయి. గత 12–18 నెలలుగా మాకు ఇదే ప్రధాన లోపంగా ఉంది. ఇప్పుడు స్పిన్‌ను ఆడటంలో మా మిడిలార్డర్‌ కొంత మెరుగైందనే చెప్పవచ్చు. ముఖ్యంగా వార్నర్, స్నిత్‌ వచ్చాక సమస్య తగ్గినట్లు కనిపిస్తోంది. బౌలింగ్‌లో చూస్తే జంపా బాగానే రాణిస్తుండగా, లయన్, మ్యాక్స్‌వెల్‌ కూడా పర్వాలేదు. మొత్తంగా జట్టుపై స్పిన్‌ ప్రభావం చూపించడం ఖాయం.
– రికీ పాంటింగ్, ఆస్ట్రేలియా అసిస్టెంట్‌ కోచ్‌   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement