మొన్నటివరకు సంప్రదాయ టెస్టుల సొగసును చవిచూశాం నిన్నటివరకు ధనాధన్ టి20ల మజాను ఆస్వాదించాం ఇప్పుడిక... రెండింటి వారధి వన్డేలను ఆహ్వానిద్దాం క్రికెట్ పుట్టింట్లో ప్రపంచ కప్‌ను చూసొద్దాం...! 10 జట్లు పాల్గొనే 46 రోజుల మహా సంగ్రామంలో ఈ తరానికి కొత్తనిపించే రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో ప్రతి ప్రత్యర్థితో ఒకసారైనా తలపడే సుదీర్ఘ పద్ధతిలో మహా సంగ్రామాన్ని కనులారా వీక్షిద్దాం...! వేడివేడి వార్తలు వండే ఇంగ్లిష్ మీడియా మనసు దోచే అందమైన మైదానాలు వసతులకు లోటు లేని ఆతిథ్యం మధ్య క్రికెట్ పెద్ద పండుగను జరుపుకొందాం...! ఆస్ట్రేలియా ‘ఆరే’స్తుందా? భారత్‘తీన్’మార్ మోగిస్తుందా? పాకిస్తాన్, శ్రీలంక మళ్లీ కప్పందుకుంటాయా? వెస్టిండీస్ నాటి వైభవాన్ని చాటుతుందా? దక్షిణాఫ్రికా దురదృష్టం ఇప్పుడైనా వీడుతుందా? ఇంగ్లండ్ చిరకాల కోరిక నెరవేరుతుందా? న్యూజిలాండ్ ఎంతవరకు నెగ్గుకొస్తుంది? బంగ్లాదేశ్ ఎవరిని దెబ్బకొడుతుంది? అఫ్గానిస్తాన్ పయనం ఎందాక? ఒక్కో జట్టు భాగ్య చక్రం ఎలా ఉంది? వాటి బలాలేంటి? బలహీనతలేంటి? ఎవరెవరికి ఎలాంటి అడ్డంకులున్నాయి? ఆఖరికి విఖ్యాత లార్డ్స్‌లో విజేతగా నిలిచేదెవరు? ... ప్రపంచ కప్ ప్రత్యేక కథనాలు నేటి నుంచి
కప్‌లలో ఈ ‘కప్పు’ వేరయా!
ఆడేది తక్కువ దేశాలైనా... ఆదరణలో ఒలిం పిక్స్, ఫుట్‌బాల్‌లకు ఏమాత్రం తగ్గనిది క్రికెట్ వన్డే ప్రపంచ కప్. అభిమానులంతా ఎదురుచూస్తున్న అలాంటి మెగా టోర్నీకి దాని జన్మస్థానమైన ఇంగ్లండ్‌లో ఈ నెల 30న తెరలేవనుంది. జూలై 14 వరకు 46 రోజుల పాటు సాగే క్రీడా సంబరంలో 10 జట్లు పాల్గొననున్నాయి. గతంలో ఇంగ్లండ్ 1975, 1979, 1983, 1999లలో వన్డే వరల్డ్ కప్‌కు ఆతిథ్యమిచ్చింది. సరిగ్గా 20 ఏళ్ల తర్వాత మరోసారి వేదికగా మారింది.
ఫార్మాట్ మారింది గురూ...
44 ఏళ్ల ప్రస్థానంలో 1975–1987 మధ్య జరిగిన నాలుగు కప్‌లలో జట్లను ‘గ్రూప్’లుగా విభజించి మ్యాచ్‌లు నిర్వహించారు. 1992లో మాత్రం రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతి పాటించారు. మళ్లీ 1996 నుంచి 2015 వరకు ఆరు కప్‌లలో గ్రూప్ ఫార్ములాకే మొగ్గారు. అనేక చిన్న జట్లకూ అవకాశం కల్పించారు. ఈసారి మాత్రం రాశి తక్కువైనా, వాసి పెంచాలనే ఉద్దేశంతో పోటీని 10 జట్లకే పరిమితం చేశారు. 1992 నాటి రౌండ్ రాబిన్ ఫార్మాట్ తీసుకొచ్చారు. ఫలితంగా ప్రతి జట్టు 9 మ్యాచ్‌లు చొప్పున ఆడాల్సి ఉంటుంది. పాయింట్ల పట్టికలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి.
ఈసారి వంద కోట్లపైనే వీక్షకులు
పుట్టింది ఇంగ్లండ్‌లో అయినా ఇప్పుడు క్రికెట్ అంటే భారత్. భారత్ అంటే క్రికెట్. బీసీసీఐని ప్రపంచంలోనే ధనిక బోర్డును చేసిన మన ప్రేక్షకులు... వీక్షణలోనూ రికార్డులు బద్దలుకొడుతున్నారు. 2015 వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా ఆడిన సెమీఫైనల్ వరకు పరిగణనలోకి తీసుకుంటే ప్రసారకర్త స్టార్ స్పోర్ట్స్ లెక్కల ప్రకారం 63.50 కోట్ల మంది భారతీయులు టీవీల్లో వీక్షించారు. ఈసారి వంద కోట్ల మార్కును తాకుతుందని అంచనా.
ఆ రెండుసార్లు ముందుగానే!
ఆదరణ, ఆకర్షణ తగ్గకూడదనే ఉద్దేశంతో సాధారణంగా ప్రపంచ స్థాయి ఈవెంట్లు ఏవైనా నాలుగేళ్లకోసారి నిర్వహిస్తుంటారు. ఇందుకు క్రికెట్ కూడా మినహాయింపేం కాదు. అయితే, రెండుసార్లు మాత్రం ప్రపంచ కప్ ‘వ్యవధి’ మారింది. ఈ రెండూ ఒకే దశాబ్దంలో జరగడం మరో విశేషం. సంవత్సరాల వారీగా చూసినా, తేదీల ప్రకారం లెక్కించినా తొలి నాలుగు కప్‌లు (1975, 79, 83, 87) నాలుగేళ్ల నిబంధన ప్రకారమే నడిచాయి. కానీ, ఆస్ట్రేలియా ఆతిథ్యమిచ్చిన 1992 కప్, ఇంగ్లండ్ చివరిసారిగా వేదికగా నిలిచిన 1999 కప్ షెడ్యూల్ తప్పాయి.
ఎందుకంటే...?
భారత్.. పాకిస్తాన్‌తో కలిసి తొలిసారిగా 1987లో ప్రపంచ సమరానికి ఆతిథ్యమిచ్చింది. ఆ ఏడాది అక్టోబర్ 8 నుంచి నవంబర్ 8 మధ్య టోర్నీ జరిగింది. ఆస్ట్రేలియా మొదటిసారి విజేతగా నిలిచిందీ ఇప్పుడే. అనంతరం ఆ దేశం న్యూజిలాండ్‌తో కలిసి కప్ నిర్వహించింది. ఏడాది ప్రకారం చూస్తే 1991 అక్టోబరు– నవంబరు మధ్యనే కప్ జరగాలి. కానీ, ఈ సమయంలో తమ దేశాల్లో వాతావరణం క్రికెట్‌కు అనుకూలం కాదని చెప్పాయి. దీంతో ఐసీసీ ఈవెంట్‌ను 1992 ఫిబ్రవరి 22 నుంచి మార్చి 25 మధ్య ఏర్పాటు చేసింది. అంటే, నిర్ణీత గడువు కంటే అదనంగా నాలుగు నెలల కాలం పొడిగించారు. దేశమేదైనా... ప్రతి నాలుగో వేసవి కాలంలో కప్ నిర్వహణ జరగాలనే సంప్రదాయాన్నీ దీనికి కారణంగా చూపుతారు. ఇక రెండోసారి 1999లో అనుకున్న దానికంటే ముందుగానే ప్రపంచ కప్ జరిగింది. 1996లో భారత్ ఫిబ్రవరి14–మార్చి 17 మధ్య ఆతిథ్యం ఇచ్చిన తర్వాత మరుసటి కప్ 2000లో జరగాలి. అయితే, 92లో పొడిగించిన సమయాన్ని కవర్ చేస్తూ 1999 మే 14–జూన్ 20 మధ్యనే నిర్వహించారు. ఈసారి మరీ తక్కువ కాలానికే (3 ఏళ్ల 3 నెలలు) కప్ ప్రేక్షకులను పలకరించింది.
–సాక్షి క్రీడావిభాగం
Comments
Please login to add a commentAdd a comment